Hindu Dharma
-
ధర్మం పేరిట అధర్మాచరణ: ఆర్ఎస్ఎస్ చీఫ్
సాక్షి, హైదరాబాద్/మాదాపూర్: నేటి సమాజంలో ధర్మం పేరిట అధర్మాన్ని అనుసరిస్తున్నామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భాగవత్ అన్నారు. మనిషిలో స్వార్థం పెరిగి.. ధర్మానికి, అధర్మానికి అర్థంలో మార్పులు చేసుకుంటూ అనుసరించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన లోక్ మంథన్ ముగింపు వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ‘మానవుడు సంతోషం కోసం అన్వేషిస్తున్నాడు. మన పూర్వీకులు సంతోషం గురించి ఎంతో చక్కగా వివరించారు. ఇది ఎక్కడో దొరికే వస్తువు కాదు. సంతోషం అనేది మనలోనే దొరుకుతుంది. దాన్ని వదిలేసి వస్తు రూపంలో దొరికే సంతోషానికి సంబరపడిపోతున్నాడు. భారత్ సనాతన దేశం. రుషులు, మునిపుంగవుల ఆలోచనతో ఏర్పడిందే సనాతన ధర్మం. ఎన్నో ప్రాంతాలు పర్యటించి సాధించిన అనుభవాలతో శాస్త్రాలు, ధర్మాలు రాశారు. అలాంటి వాటిని అనుసంచాల్సిన మనం.. కేవలం అనుకూలమైనవాటిని ఆచరిస్తూ అదే ధర్మమార్గం అని భ్రమపడుతున్నాం. ప్రపంచంలోని అన్ని దేశాలు సాధించిన మంచిని మనం నేర్చుకోవాలి. జ్ఞానాన్ని ఆర్జించే ప్రక్రియ ఒక దగ్గర ఆగిపోకూడదు. మనమంతా సంస్కృతి, ధర్మంవైపు అడుగులు వేయాలి. కానీ వికృతి దిశగా వెళ్తూ సృష్టి ధర్మాన్ని విస్మరిస్తున్నాం. విజ్ఞానం ధర్మానికి వ్యతిరేకం కాదు. విజ్ఞానాన్ని ఉపయోగించే తీరులోనే ధర్మం నిలుస్తుంది. సనాతన ధర్మం మూలాల్లోకి వెళ్లి, దానిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది’అని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వనవాసి, నగరవాసి, గ్రామవాసి అందరూ భారతీయులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ముగిసిన ఉత్సవాలు లోక్‌మంథన్ భాగ్యగనర్–24 ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకొనే ఆవశ్యకతను వక్తలు వివరించారు. వివిధ రంగాలకు చెందిన కళాకారుల ప్రతిభను ప్రతిబింబించేలా 210 ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. శిల్పారామంలో మూడు వేదికల్లో 12 దేశాలకు చెందిన సుమారు వంద మంది ప్రముఖులు ఉపన్యాసాలు, బోధనలు అందించారు. సుమారు 1,500 మంది కళాకారులు వివిధ రకాల కళలను ప్రదర్శించారు. లోక్ మంథన్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఆహార ధాన్యాలు, ఔషధ మొక్కల స్టాల్స్, గిన్నిస్ రికార్డు అందుకున్న భారీ పెన్ను వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగింపు ఉత్సవాల్లో అభినయ కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో మహాన్ భారతోహం పేరుతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. నాలుగు రోజుల్లో సుమారు 2.10 లక్షల మందికిపైగా లోక్ మంథన్‌లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. -
అది నోరా తాటి మట్టా..
-
రామ్... భీమ్... యుగధర్మం!
బాలరాముని అయోధ్య మందిరం ఇప్పుడు అంతర్జాతీయ వార్తగా మారింది. ఇక వచ్చే వారం రోజులైతే నిజంగానే ‘‘అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామ మయం’’. ఏదో ఒక రూపంలో రామాయణ కావ్యం లేని వాఙ్మయం ఆసియా దేశాల్లో ఎక్కడా లేదు. భారతీయ సంతతి ప్రజలు నివాసముండని దేశాలు ఈ భూఖండంలో ఒకటో రెండో కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. రామా యణం భారతీయుల జీవన విధాన పారాయణంగా మారినందువల్ల ఆ సంప్రదాయాన్ని మనవాళ్లు దేశదేశాలకూ మోసుకొని వెళ్లారు. రామనామం పవర్ ఏమిటో బీజేపీ వాళ్లకు తెలిసినంతగా మరే రాజకీయ పార్టీకీ తెలియదు. మన దేశంలోని ఆబాల గోపా లాన్ని టెలివిజన్ ఛానెళ్ల ముందు కూర్చోబెట్టిన తొలి దృశ్య కావ్యం కూడా రామాయణమే. ఒక దశలో లోక్‌సభలో కేవలం రెండే సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ రామభక్తి రసాన్ని రణవ్యూహంగా మార్చుకున్న తర్వాతనే తొంభై సీట్లకు, మూడంకెలకు, ఆపై ప్రభుత్వ స్థాపన స్థాయికి ఎగబాకింది. ఇప్పుడు ప్రభుత్వంలో బలంగా స్థిరపడిపోయింది. పూర్వం రాజాధి రాజులు, చక్రవర్తులు బలంగా ఉన్నప్పుడే అశ్వమేధ యాగాలు చేసేవారట! శత్రు నిశ్శేషం చేసుకోవడం వాటి లక్ష్యం. ఇప్పుడు దేశంలో బీజేపీ బలంగానే ఉన్నది. అయినా రామాలయ ప్రతిష్ఠాపనను తన ప్రభుత్వ భుజాల మీదకే ఎత్తుకున్నది. అశ్వమేధయాగం స్థాయిలో ఈ మహా క్రతువుకు నడుం కట్టింది. ప్రతిష్ఠాపన యజ్ఞంలో ప్రధానమంత్రి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అందుకు అవసరమైన పదకొండు రోజుల అనుష్ఠానాన్ని కూడా ఆరంభించారు. దీని మీద రక రకాల అభ్యంతరాలు, అభిశంసనలు వస్తున్నాయి. శ్రీరామ చంద్రుడు భార్యావియోగ దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు వశిష్టాది రుషులంతా పూనిక వహించి ఆయన చేత అశ్వమేధం చేయిస్తారు. రాముడికో అనుమానం వస్తుంది. భార్యా విహీనుడైన తానెట్లా యాగం చేయగలనని ప్రశ్నిస్తాడు. భార్యా సమేతంగానే యజ్ఞ యాగాది క్రతువుల్లో పాల్గొనాలనేది నియమం. శ్రీరామునికి బావ గారైన రుష్యశృంగ మహాముని ఆయన సందేహాన్ని నివృత్తి చేస్తాడు. బంగారంతో భార్య విగ్రహాన్ని చేయించి పక్కన పెట్టుకొని యజ్ఞం పూర్తి చేయొచ్చని తరుణోపాయం చెబుతాడు. త్రేతాయుగంలోనే అవసరాన్ని బట్టి విరుగుడు మంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కలియుగం చివరి పాదంలో ఇప్పుడుండవా? కనుక ఆ విషయంలో మోదీపై అభ్యంతరాలు చెల్లవని శ్రీరామ వర్సెస్ అదర్స్ కేసులో రుష్యశృంగ న్యాయమూర్తి తీర్పు స్పష్టం చేస్తున్నది. శ్రీరామచంద్రమూర్తి ఒక మతానికి ప్రతీకా? ఇదొక చర్చనీయాంశం. ఈ దేశంలోని మెజారిటీ ప్రజల అభిమతాన్ని మెప్పించి లబ్ధి పొందడమే బీజేపీ ప్రభుత్వ రాజకీయ ఉద్దేశం కావచ్చు. కాదనడానికి ప్రాతిపదిక లేదు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దండయాత్రగానే రామ మంత్రాన్ని బీజేపీ జపించింది. హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే గత ఎన్నికల మేనిఫెస్టోలో ఆలయ నిర్మాణాన్ని ఆ పార్టీ చేర్చింది. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల వాకిట్లో సాక్షాత్తూ ప్రధానమంత్రి హస్తాల మీదుగా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగడం వెనుక రాజకీయ కారణాలే ఉంటాయి. కానీ, అది ఎన్నికల హామీయే కనుక నిలబెట్టుకుంటున్నామని బీజేపీ వాదిస్తున్నది. శ్రీరాముడు హిందూ మతానికి ప్రతీకగా భావిస్తే లౌకిక రాజ్యంలో ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకోవడం భావ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుంది. అసలు హిందూమతం అంటూ ఒకటున్నదా అనే ప్రశ్న కూడా తరచుగా వినిపిస్తున్నది. ఒక నిర్ధారిత పవిత్రగ్రంథం, ఒక ప్రవక్త లేని జీవన విధానాన్ని మతం అనవచ్చునా? బీజేపీ వాళ్లూ, సంఘ్ పరివార్ వాళ్లూ హిందూమతం అనే మాట కంటే హిందూ ధర్మం అనే మాటనే ఎక్కువగా వాడుతుంటారు. అందుకు కారణం విశ్వాసమైనా కావచ్చు, ఎత్తుగడైనా కావచ్చు. హిందూ ధర్మం అంటే ఏమిటి? అనేది ఇంకో ప్రశ్న. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ అంశంపై దేశంలో పెద్ద చర్చే జరిగింది. సనాతనమంటే శాశ్వతమనే అర్థమున్నది. ధర్మం శాశ్వ తంగా స్థిరంగా ఉంటుందా? కాలానుగుణంగా మారదా? యుగ ధర్మం అంటారు కదా! అంటే ఏమిటి? ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే అన్నాడు కృష్ణ భగ వానుడు. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని కాపాడేందుకు తాను అవతరిస్తానని భావం. అంటే యుగధర్మాన్ని కాపాడేందుకు అవతరించడమా లేక శాశ్వత ధర్మాన్ని రక్షించడానికి ప్రతి యుగంలో అవతరించడమా? ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని శ్రీరామచంద్రుడిని ప్రశంసిస్తారు. ధర్మానికి ఒక రూపం ఇస్తే అది రాముడిలా ఉంటుందనీ, రాముడు ధర్మ స్వరూపుడనే అర్థంలో! పైగా ఈ మాట అన్నది ఎవరో కాదు. శ్రీరాముని శత్రు శిబిరంలోని వాడైన మారీచుడు. శ్రీరాముడు వరాలిచ్చిన దేవుడు కాదు. ఆపద మొక్కులవాడూ కాదు. ఒక మనిషి. స్వయంగా కోరి కష్టాలను అనుభవించినవాడు. రుజు ప్రవర్తన కలిగినవాడు. తండ్రి మాటను తలదాల్చినవాడు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వాడు. ఒక్కరితోనే జీవన సాహచర్యమని నమ్మినవాడు, ఒక రాజుగా ప్రజాభిప్రాయాన్ని మన్నించినవాడు. శిష్టరక్షణకు దుష్టశిక్షణకు వెనుకాడనివాడు. ఈ రకంగా తన జీవితాన్ని ఒక పాఠంగా ఈ సమాజానికి అందించినవాడు కనుకనే ఆయనను ధర్మస్వరూపుడని కీర్తించారు. భారతీయులపై రామాయణ ప్రభావం మత విషయాల కంటే సాంస్కృతిక రంగంలోనే ఎక్కువ. సామాజిక కట్టుబాట్లపైన, నైతిక నియమాలపైన, మన సాహిత్యం, సంగీతం, కళలు, నాట్యంపైనా రామాయణం ముద్ర ఉన్నది. ధర్మం, కర్మ, జీవిత పరమార్థం వంటి అంశాలు మన తాత్వికతను పరిపుష్టం చేశాయి. మన పాత్రను సక్రమంగా ఎలా అర్థం చేసుకోవాలో రామాయణం చెబుతుంది. నమ్మిన మార్గంలో సవాళ్లు ఎదురైనా ఎలా ముందుకు వెళ్లాలో రామా యణం బోధిస్తుంది. లోతుగా పరిశీలిస్తే శ్రీరాముని పాత్ర భారతీయ సమాజంపై వేసిన ముద్ర మతపరమైనదిగా కనిపించదు. ధార్మికమైనది, సాంస్కృతిక పరమైనదిగానే కనిపిస్తుంది. కాకపోతే శ్రీరాముడికి బీజేపీ–సంఘ్‌పరివార్ కొంత రాజకీయం పులమడంతో ఈ కార్యక్రమం మీద మతం రంగు పడింది. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ఠ ఏమిటని మతపెద్దలే కొందరు పెదవి విరుస్తున్నారు. కొద్దిరోజుల్లో దివ్యమైన సందర్భం శ్రీరామనవమి ఉండగా ఎందుకీ తొందరపాటని విసుక్కుంటున్న వారు కూడా ఉన్నారు. శంకరాచార్యుల వంటి శైవ కూటమి పెద్దలు కార్యక్రమాన్ని అభిశంసిస్తున్నారు. లౌకిక వాదుల విమర్శలు సరేసరి! బీజేపీ, సంఘ్ పరివార్‌ల మూడు దశాబ్దాల కృషి అయోధ్య రామమందిరం. ఇన్నాళ్ల శ్రమను ఎన్నికల్లో గిట్టుబాటు చేసుకోకుండా ఎలా ఉంటాయి? శ్రీరాముడి ఆదర్శాలన్నీ త్రేతాయుగానికి సంబంధించినంత వరకు ధర్మబద్ధమే కావచ్చు. యుగాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతాయి. వేదవేదాంగాల వంటి శ్రుతులు చెప్పిన విషయాలు నిత్య సత్యాలనీ, మనుస్మృతి వంటి స్మృతులు పెట్టిన నియమాలు కాలాన్నిబట్టి మారుతాయనీ పండితులు చెబుతారు. శ్రీరాముడు చేసిన కొన్ని పనులు ఆ తర్వాతి యుగాలకు సమ్మతమయ్యేవి కావు. బహుశా ఆ కాలంలో కూడా అసమ్మతి గళాలున్నా రామాయణంలో వినిపించలేదేమో. వర్ణాశ్రమ ధర్మాన్ని ధిక్కరించి తపస్సు చేస్తున్న శూద్ర శంబూ కుని తలను శ్రీరాముడు తెగనరికాడు. ఒకే ఒక్కడి మాటకు ప్రజాభిప్రాయమనే ముద్రవేసి సీతమ్మను అడవులకు పంపించాడు. రావణుడి చెర నుంచి విడిపించినప్పుడు ఆమె శీల పరీక్షకు ఆదేశించాడు. ఇవన్నీ ఏ యుగంలోనూ ఆదర్శాలు కాబోవు. ప్రజా క్షేమం కోరే పరిపాలన, మాట తప్పని వ్యక్తిత్వం, సవాళ్లకు తలవంచకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం, ఏక పత్నీవ్రతం వంటి రామయ్య సుగుణాలు సర్వకాల సర్వా వస్థల్లోనూ ఆదర్శంగా నిలబడతాయి. అటువంటి ఆదర్శాలకు గుర్తుగా భవ్యమైన రామమందిరం రాజకీయాలకు అతీతంగా ప్రారంభమైతే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. అయో ధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సరిగ్గా మూడు రోజుల ముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో గొప్ప విగ్రహావిష్కరణ కార్య క్రమం జరగబోతున్నది. శ్రీరాముడు త్రేతాయుగ ధర్మానికి, కొన్ని శాశ్వత మానవీయ విలువలకు సంకేతమైతే, ఈ ప్రజా స్వామ్య యుగ ధర్మాన్ని క్రోడీకరించి, రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథ రచనకు నేతృత్వం వహించినవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన విగ్రహ ప్రతిష్ఠాపన ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగబోతున్నది. రామాలయం లేని ఊరు ఉండదనేది యాభయ్యేళ్ల కిందట తెలుగునాట తరుచుగా వినిపించిన నానుడి. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి, షిర్డీ సాయిబాబా, అయ్యప్ప స్వామి విజృంభించడంతో ఇప్పుడు ఆ నానుడి వినిపించడం లేదు. దళితులు, బలహీన వర్గాల ప్రజలు విద్యావంతులవుతున్నకొద్దీ డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలు కూడా ఊరూరా విస్తరించాయి. ఇప్పుడు ఆయన విగ్రహం లేని ఊరు తెలుగు నాటనే కాదు, దేశంలోనే ఎక్కడా లేదు. ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రతిష్ఠాత్మక ప్రదేశాల్లో కూడా అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు విజయవాడ నగరం నడిబొడ్డున పద్దెనిమిది ఎకరాల స్వరాజ్య మైదాన్‌లో ఆవిష్కృతం కాబో తున్న ‘స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ ఒక ఎత్తు. ప్రపంచంలో ఉన్న అన్ని అంబేడ్కర్ విగ్రహాల కంటే ఇది ఎత్తయినది. 80 అడుగుల పాదపీఠికపై 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నది. మొత్తం కలిపి 210 అడుగులు. ఆంధ్రప్రదేశ్‌లో పెత్తందారీ వర్గాలపై, ఆ వర్గాలు ఆధి పత్యం వహిస్తున్న వ్యవస్థలపై పేదల పక్షాన వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయపోరాటం చేస్తున్నది. ఆ పోరా టానికి నిరంతర స్ఫూర్తి జ్వలితరూపంగా ఈ విగ్రహం నిలబడబోతున్నది. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛా ప్రజాస్వామిక యుగధర్మాలు. ఈ ధర్మాలకు రాజ్యాంగ రచనలో పెద్దపీట వేయడమే కాదు, ప్రజాశ్రేణుల్లో వాటిపై అవగాహన కల్పించడంలోనూ ఆయన కృషి చేశారు. కులవ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా నిజమైన సమానత్వం సిద్ధించదని బోధించాడు. దేశ ప్రజలందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేకూర్చడం, భావ ప్రకటనా, ఆరాధనా స్వేచ్ఛలను ప్రసాదించడం, అందరికీ సమాన అవకాశాలు, సమాన గౌరవాలు కల్పించడమే ధ్యేయంగా రాజ్యాంగాన్ని అంబేడ్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ రూపొందించింది. ఆ రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయడానికి పూనుకోవడమే నేరంగా భావించిన ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వర్గం జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. యెల్లో మీడియా చానళ్లు రోజుకు 20 గంటల సమయాన్ని, పత్రికలు ముప్పావు భాగం స్థలాన్ని జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయ డానికి వినియోగిస్తున్నాయి. అవకాశవాద పొత్తులతో ప్రజా ప్రభుత్వాన్ని ఓడించడానికి కుట్రలు చేస్తున్నాయి. డబ్బులు వెద జల్లుతున్నాయ్. మీడియా–సోషల్ మీడియాల విషప్రచారాలు చాలవని వేలాదిమందిని దినవేతనంపై సమీకరించి వారి ద్వారా కూడళ్లలో విషప్రచారానికి పాల్పడుతున్నాయి. కానీ సమానత్వం ఈ యుగధర్మం. ధర్మంపై అధర్మం గెలవదు. యుగయుగాల సందేశం ఇదే! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్ కృషి
సాక్షి, అమరావతి: హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని ఆయన బలోపేతం చేశారన్నారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారని, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 వేల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న 1,401 దేవాలయాలకు దీని ద్వారా సాయం అందించేవారని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం 150 ఆలయాలను మాత్రమే ఈ కార్యక్రమంలోకి కొత్తగా తెచ్చారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.30 వేల వార్షికాదాయ పరిమితిని రూ.లక్షకు పెంచి, 2,978 దేవాలయాలకు అదనంగా లబ్ధి చేకూర్చామన్నారు. ప్రస్తుతం 4,750 దేవాలయాలకు ఈ కార్యక్రమం ద్వారా నిధులు సమకూరుస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఏటా రూ.28.50 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో 2,961 దేవాలయాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.ఈ దేవాలయాల నిర్వహణకు ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు. ♦ అర్చకులకు ఇచ్చే గౌరవ వేతనాల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయని వాటిని సరిచేయడంతో పాటు, అర్చకులు, పురోహితులకు దేవదాయ శాఖ నుంచి గుర్తింపు కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. ♦ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. వినుకొండలోని కొండపై దేవాలయం నిర్మాణంలో భాగంగా ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసిందన్నారు. ♦ రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా ధూపదీప నైవేద్యం కార్యక్రమం పరిధిలోకి రాకుండా మిగిలిపోయిన ఆలయాలు ఉంటే వాటికి ఈ కార్యక్రమాన్ని వర్తింపజేయాలని పొన్నూరు ఎమ్మెల్యే కె. రోశయ్య విజ్ఞప్తి చేశారు. ♦ విజనరీనని గొప్పలు చెప్పే చంద్రబాబు తాను సీఎంగా ఉండగా సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో దేవాలయాల అభివృద్ధికి చేసింది శూన్యమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి. మధుసూదన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ♦ అన్యాక్రాంతమైన దేవాలయాల భూములను పరిరక్షించాలని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. సర్వే నంబర్లు సబ్‌డివిజన్ కాకపోవడంతోనే ఆలస్యం సర్వే నంబర్ల సబ్ డివిజన్ కాకపోవడంతోనే నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు ఆలస్యమవుతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల రైతుల భూములు దేవదాయ భూములుగా నమోదైనట్టు పేర్కొన్నారు. ఐఎఫ్ఆర్, ఇనాం, ఆర్ఎస్ఆర్ వంటి భూములను క్షుణ్ణంగా పరిశీలించి నిషేధిత జాబితాను సవరిస్తామని చెప్పారు. రైతుల భూములను దేవదాయ భూములుగా నమోదు చేసిన అధికారులపై చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. మంత్రి వివరణను కందుకూరు ఎమ్మెల్యే ఎం.మహీదర్‌రెడ్డి ఆక్షేపించారు. చిన్న, సన్నకారు రైతుల భూములు రెవెన్యూ శాఖను అడిగే ఎండోమెంట్లో కలుపుకున్నారా? అని ప్రశ్నించారు. నిషేధిత జాబితా నుంచి తొలగించమంటే రెవెన్యూ శాఖను బాధ్యులను చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వం చేసిన పాపానికి ఎనిమిదేళ్లుగా రైతులు భూముల హక్కులు బదలాయించుకోలేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు అర్బన్ పరిధిలో 15 ఎకరాల దేవదాయ భూమి మాత్రమే ఉంటే.. 600 ఎకరాలకు పైగా రైతుల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలకు గురైన దేవదాయ భూములను పరిరక్షించకుండా.. రైతుల భూములను అన్యాయంగా నిషేధిత జాబితాలో చేరుస్తున్నారంటూ ఆరోపించారు. దీనికి మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందిస్తూ వీలైనంత త్వరగా నిషేధిత జాబితాను సవరిస్తామన్నారు. -
బాబూ పవనూ.. నీ తొక్కలో లెక్క తప్పింది చూస్కో!
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల గురించి పాపం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎక్కడాలేని బెంగ పట్టుకున్నట్లు ఉంది. ఈ క్రమంలో ఉన్నవీ లేనివీ జమ చేసి తప్పుడు లెక్కలు బయటకు తీస్తున్నాడు. శాంతి భద్రతల్లో బెస్ట్ ఆంధ్రప్రదేశ్ అంటూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన కితాబే ఆయనగారి కళ్లకు కనిపించడం లేదేమో!. పైగా మహిళలకు రక్షణలోనూ ఏపీ ఉత్తమ స్థానంలో ఉంది. నిజాల్ని విస్మరించి అసత్యాల ప్రచారంతో వా(నా)రాహిపై దూసుకుపోతున్న పవన్‌కి ఆలయాల ఘటనలకు సంబంధించి ఈ కింది సమాచారం అందితే బ్రేకులు వాటంతట అవే పడి బొక్కబోర్లా పడతాడేమో! నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. 2017లో పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కె. పెంటపాడు గ్రామంలో చారిత్రక శ్రీగోపాలస్వామి ఆలయ రథం దగ్ధమైంది. కానీ.. బాబు అప్పుడు ఇవి ఏమీ చేయలేదు. అప్పుడు బీజేపీ మంత్రి మాణిక్యాల రావు దేవాదాయ శాఖ మంత్రి ) 2018 జనవరిలో విజయవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయి. అమ్మవారి గర్భాలయంలో అర్ధరాత్రి ఒక అపరిచిత వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆలయ EO కి చెప్పి ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన కొడుకు లోకేష్ కోసం విజయవాడ కనకదుర్గ ఆలయంలో క్షుద్ర పూజలు జరిపించారని ప్రస్తుత సాక్షాత్తు ఆలయ ఈవో సామినాయుడు చెప్పారు చంద్రబాబు సీఎంగా ఉండగా దుర్గమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన ఖరీదైన చీరలు మాయం అయ్యాయి తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చాడు బాబు విజయవాడ లో 40 గుడులను కూల్చాడు సదావర్తి ఆలయ భూములను అప్పనంగా తనవారికి కట్టబెట్టాలని చూసాడు అయ్యప్ప మాలలు ధరించడం వలన రాష్ట్రానికి మద్యం ఆదాయం పడిపోయిందని అన్నాడు బాబు విజయవాడలో రూ.437 కోట్ల విలువ చేసే 14 ఎకరాల దుర్గగుడి భూములను సిద్ధార్థ విద్యాసంస్థలకు కేవలం రూ.21 లక్షలకు అప్పగించాడు ఆ సంస్థ ఏమైనా ఉచితంగా బోధిస్తోందా? దేవదాయ శాఖ మంత్రిగా బీజేపీ నేత మాణిక్యాలరావు ఉన్నప్పుడే చాలా చోట్ల దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి మంత్రాలయం భూములు వేలంలో అమ్మాలని బాబు హయాంలో 2018 జనవరిలో నాటి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మంత్రి ఆమోదించారు. రిసార్టుల కోసం దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేసాడు బాబు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో శివలింగం, దేవుళ్ల విగ్రహాల తొలగింపు (నంబర్ 14,2017) గోదావరి పుష్కారాల్లో సినీ దర్శకుడు బోయపాటి చౌదరి చెప్పాడని పబ్లిసిటీ పిచ్చి తో 29 మంది భక్తులను పొట్టన పెట్టుకున్నాడు.. బాబు హయాంలో 4 ఏళ్లలో జరిగినవి.. ఆలయాల ఘటనలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ (జనవరి 13, 2021) చేసిన ప్రకటన ఆధారంగా.. ఏడాది-ఘటనలు 2015-163 2016-207 2017-139 2018-123 2019-177 2020-143 2021-006 ఏపీలో హిందూ ధర్మాన్ని టార్గెట్ చేశాంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడాడు. చంద్రబాబు హయాంలో 400 ఆలయాలను కూల్చి వేస్తే పవన్ ఎక్కడున్నారు? ఆ లెక్కల గురించి ఒక్క మాటా మాట్లాడడా?.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అయ్యాక.. 2020 సెప్టెంబర్ వరకు 33 ఆలయాల్లో జరిగిన నేరాలకు సంబంధించి 27 కేసుల్లో నిందితులతోపాటు నేరాలకు పాల్పడిన 130 మందిని అరెస్టు చేశారు. అంతర్వేది రథం కాలిపోతే EO ను సస్పెండ్ చేసి సీబీఐ విచారణకు ఆదేశించారు . పైగా రూ. 13.5 కోట్లతో ‘అంతర్వేది’ అభివృద్ధి చేశారు. కాలి నడకన తిరుమల మెట్లెక్కి శ్రీవారిని దర్శించుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తే కఠినంగా శిక్షించండి అని ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి. చదవండి: ‘వృద్ధసైకో, పిల్లసైకో, ఇంకొక సైకో గంజాయి తాగి రోడ్డున పడ్డారు’ -
హైందవ ధర్మాన్ని విదేశాల్లో కూడా ప్రచారం చేయాలి : శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి
-
'హిందూ ధర్మాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా?'
బెంగాల్: కాళీమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. బీజేపీపై విమర్శలతో విరుచకుపడ్డారు. హిందూ ధర్మాన్ని ఆ పార్టీ ఏమైనా లీజుకు తీసుకుందా? అని ప్రశ్నించారు. ఏం చేయాలో కమలం పార్టీ ఇతరులకు ఎందుకు బోధిస్తోందని నిలదీశారు.. బెంగాలీ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తన ఎజెండాను, అభిప్రాయాలను బలవంతంగా ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఇతరులు దీన్ని ప్రతిఘటించి దేశం కోసం ఒక్కసారి మాట్లాడాలి' అని మహువా అన్నారు. బీజేపీ తన సొంత వెర్షన్ హిందూయిజాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపింపజేయాలని చూస్తోందని మహువా మెయిత్రా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని హిందువులు వందల ఏళ్లుగా సుస్థిరమైన ఆచారాలను పాటిస్తున్నారని గుర్తు చేశారు. కాళీమాతను ఇలానే పూజించాలని బీజేపీ చెప్పడమేంటన్నారు. శ్రీరాముడు, హనుమంతుడు కేవలం ఆ పార్టీకే చెందినవారు కాదన్నారు. హిందుత్వ రాజకీయాలను బలవంతంగా తమపై రుద్దాలని చూసిన బీజేపీని బెంగాల్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని మహువా అన్నారు. కాళీమాతను ఎలా పూజించాలో ఆ పార్టీ తనకు చెప్పొద్దని, 2000 ఏళ్లుగా తాము ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నామని అన్నారు. ►చదవండి: TMC Mahua Moitra: మాంసం తినే మద్యం తాగే దేవత -
ఈ ధర్మాన్ని పరిరక్షించే వారెవరు?
హిందూ ధర్మంపై, హిందువులపై ప్రస్తుతం బహుముఖ దాడులు కొనసాగుతున్నాయి. మతమార్పిడి కార్యక్రమాల వల్ల హిందూ సమా జంలోని నిరుపేద వర్గాలు మాత్రమే కాకుండా ఆర్థికంగా సంపన్నులైన ఆధిపత్య కులాల ప్రజలు కూడా మతం మార్చుకుంటున్నారు. హిందూ ధర్మంపై అవగాహన లోపమే మతమార్పిడికి ఒక కారణం. అనేక కారణాల వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మన సమాజంలో ఉనికిలో లేకుండా పోయింది. దీంతో మన ధర్మం గురించి పిల్లలకు బోధించే వారే లేకుండాపోయారు. ఇంట్లో కానీ, పాఠశాలల్లో కానీ, సమాజ జీవితంలో కానీ హిందూ ధర్మం గురించి యువతకు చెప్పేవారే లేరు. హిందువుల్లో పలురకాల భక్తులున్నారనిపిస్తుంది. చాలామంది తమ సొంత కోరికలను తీర్చుకోవడం కోసమే పూజలూ, ప్రార్థనలూ చేస్తారు. వీరికి హిందూ ధర్మం గురించి ఎవరూ చెప్పరు. పూజారులు చదివే మంత్రాల అర్థాలూ వీరికి తెలియవు. దేశంలోనూ, దేశం వెలుపలి నుంచి సేకరిస్తున్న భారీ నిధులతో క్రైస్తవులు పాఠశాలలు నడుపుతున్నారు. అయితే ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు నడుపుతున్న పాఠశాలల కంటే మెరుగైన క్రమశిక్షణ, ఆదేశాలను పాటించడం క్రిస్టి యన్ పాఠశాలల్లో అమలవుతుందని అందరికీ తెలుసు. అందుకే హిందూ తల్లితండ్రులు తమ పిల్లలను కూడా క్రిస్టియన్ సంస్థలు నడుపుతున్న పాఠశాలలకే పంపుతుం డటం కద్దు. హిందూమతంలోని వివిధ పీఠాధిపతులు తమ వంతుగా విద్యాసంస్థలను స్థాపించి హైందవ ధార్మిక అంశాలను సిలబస్‌లో, పాఠ్యేతర కార్యక్రమాల్లో తప్ప కుండా భాగం చేయాలి. ఇంట్లోనూ, పాఠశాలల్లోనూ, సమాజంలోనూ హిందూ ధర్మానికి సంబంధించి ఉపదేశించేవారే లేనప్పుడు మనం ఏం చేయాలి? క్రిస్టియన్, ఇస్లామిక్ మతాలే ఇక్కడ కూడా మనకు ఆదర్శం కావాలి. క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళతారు. ముస్లింలు శుక్రవారం మసీదుకు వెళతారు. ఈ రెండింటిలోనూ ప్రార్థనలు మాత్రమే చేయరు. తమ మతం గురించి ఉపదేశిస్తారు. మతానుయాయుల విధులను వివరిస్తారు. (చదవండి: కేంద్ర పథకాలకు మార్గదర్శి) హిందూ మతంలోని ప్రతిశాఖలోనూ హనుమాన్‌ని పూజిస్తారు కాబట్టి ప్రతి ఆదివారం భక్తులందరూ సమీపంలోని హనుమాన్ ఆలయానికి నిర్దిష్ట సమయంలో వెళ్లి పూజలు చేయాలి. అక్కడ వీరికి చర్చిలు, మసీదుల్లో మాదిరే, హిందూ ధర్మం గురించి ప్రవచనాలు, ప్రసంగాలు వినిపించాలి. భజనలు, ప్రసాదం పంపిణీ ఆ తర్వాతే చేయాలి. ఈ రకంగా మాత్రమే వేర్వేరు దేవతలను, మత శాఖలను పూజించే, పాటించే హిందూమత అనుయాయుల మధ్య సంఘీభావం ఏర్పడుతుంది. ఇది మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడుతుంది. ఆలయాల నిర్వహణ నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని మనం డిమాండ్ చేస్తున్నప్పుడు వాటిని ఎవరికి అప్పగించాలని ప్రభుత్వాలే అడుగుతున్నాయి. దీనికి సమాధానం సింపుల్. మసీదులు, చర్చిలు, గురుద్వారాలకు లాగానే భక్త బృందాలు, భక్తుల సొసైటీలు వీటిని నడపాలి. ఇంతకుమించి మహాధర్మాచార్య సభ ఉండితీరాలి. (చదవండి: సంగీత సరస్వతి... స్వర సామ్రాజ్ఞి) ఆలయాలపై ప్రభుత్వ యాజమాన్యాన్ని తప్పించి తగిన స్థాయి కలిగిన హిందూ విభాగాల సూచనలను స్వీకరించి పరమ ధర్మాచార్యులతో కమిటీని ఏర్పర్చాలి. హిందూ సంస్థాగత నిర్మాణానికి మనం సిక్కు గురుద్వారా చట్టాన్ని ప్రారంభ బిందువులా స్వీకరించవచ్చు. అందుకే ధర్మాచార్యులు పీఠాలు, మఠాలకు మాత్రమే పరిమితం కాకుండా విస్తృతంగా పర్యటనలు చేసి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి రాజకీయ పార్టీలను ప్రభావితం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ సంకల్పం లేనిదే మనం కోరు కుంటున్న మార్పు సాధ్యపడదు. (చదవండి: పరాయీకరణ దిశలో మేడారం జాతర) హిందూ మతం లేనిదే భారతదేశానికి భవిష్యత్తు లేదని, భారతీయ మూలాల్లో పాతుకుని ఉన్న హిందూ తత్వాన్ని తొలగిస్తే దేశమనే దొడ్డ వృక్షం పునాది నుంచి కూలిపోతుందని మేడమ్ అనీబిసెంట్ చేసిన హెచ్చరికను గుర్తుంచుకోవాలి. భారతమాత పుత్రులే ఆమె విశ్వాసాన్ని పుణికిపుచ్చుకోకపోతే దాన్ని ఎవరు పరిరక్షిస్తారు అని ఆమె ఆనాడు వేసిన ప్రశ్న ఈనాటికైనా మనకు కనువిప్పు కలిగించాలి. - డాక్టర్ టి. హనుమాన్ చౌదరి భారతీయ ధర్మ రక్షణ సమాఖ్య కన్వీనర్ -
టీటీడీ ధర్మ ప్రచారం భేష్
తిరుమల: టీటీడీ అనేక కొత్త కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్దఎత్తున ముందుకు తీసుకెళ్తోందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ప్రశంసించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆయనన్నారు. గురువారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించిన వెంకయ్యనాయుడు దంపతులు అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈఓ శ్రీవారి తీర్థప్రసాదాలను, క్యాలెండర్, డైరీ, కాఫీ టేబుల్ పుస్తకాన్ని వారికి అందజేశారు. అలాగే, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో తయారుచేసిన ల్యామినేటెడ్ ఫొటో, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, ఆరుషీట్ల క్యాలెండర్లను ఈఓ అందించి.. వాటి తయారీ, ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం, ఆలయం వెలుపల ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్త మానవాళికి ఆశీస్సులు ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకునేందుకు రావాలని, తద్వారా మిగిలిన భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం దక్కుతుందన్నారు. ఉపరాష్ట్రపతితో పాటు చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. వెంకయ్యనాయుడు, ఉషమ్మ దంపతుల మనుమరాలు సుష్మ, కిషన్ల వివాహం తిరుమలలో వైభవంగా జరిగింది. స్థానిక పుష్పగిరి మఠంలో నిర్వహించిన ఈ వివాహ వేడుకకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈఓ, ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి తదితరులు వివాహానికి హాజరయ్యారు. శ్రీవారి సేవలో గవర్నర్ అలాగే, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్, ఈఓ, అదనపు ఈఓ, సీవీఎస్ఓ ఆయన్ను సాదరంగా ఆహ్వానించగా, ఆర్చక బృందం ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్‌కు టీటీడీ చైర్మన్, ఈఓ తీర్థప్రసాదాలను అందజేశారు. -
పెళ్లి వేడుకలో వింత వేషధారణ
మంగళూరు: పెళ్లి వేడుకలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై మంగళూరుకు చెందిన ఓ ముస్లిం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు బంధువులపై కేసు నమోదైంది. బంట్వాల్ తాలూకా కొల్నాడు గ్రామంలో సాలెతూర్కు చెందిన అజీజ్ ఇంట్లో గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకకు బాషిత్ అనే వ్యక్తి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తులునాడు ప్రాంతంలో హిందువులు ఎక్కువగా ఆరాధించే కొరగజ్జా అనే దేవుడి మాదిరిగా బాషిత్ తదితరులు దుస్తులు వేసుకుని, ఆ దేవుడిని అవమానించేలా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను అతడి స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై బంట్వాల్ తాలూకా విట్లపడ్నూర్ గ్రామానికి చెందిన చేతన్ ఫిర్యాదు మేరకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు బంధువులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
శారదా పీఠం దానికే అంకితం
సాక్షి, ఢిల్లీ: ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసేందుకే శారదా పీఠం అంకితమని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. హిందూ దేవాలయాల భూముల ఆక్రమణకు, అన్య మత ప్రచారానికి వ్యతిరేకంగా శారదా పీఠం పోరాటం చేసిందని చెప్పారు. ఈ పోరాటంలో తాను అలిసిపోయానని, ఇక నుంచి శారద పీఠానికి ఉత్తరాధికారిగా స్వామి స్వాత్మనంద పని చేస్తారని వెల్లడించారు. హిందూధర్మ పరిరక్షణ కోసం అన్ని తరాలు పనిచేయాలనేది శారదాపీఠం సంకల్పమని ఆయన వ్యాఖ్యానించారు. -
హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం
నెల్లూరు(బృందావనం): సమాజంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు జిల్లాలోని ధర్మప్రచారక్‌లు తమ వంతు కార్యక్రమాలను నిర్వహించాలని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కో ఆర్డినేటర్ కోట సునీల్‌కుమార్ పేర్కొన్నారు. రంగనాయకులపేటలోని శ్రీదేవీ, భూదేవీ సమేత తల్పగిరి రంగనాథస్వామి దేవస్థాన ప్రాంగణంలో గల కల్యాణ మండపంలో శుక్రవారం జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ధర్మప్రచారక్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న 12 నెలల్లో టీటీడీ ఆధ్వర్యంలో తలపెట్టిన 'మనగుడి' కార్యక్రమంపై ఆయా హిందూ« ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పురాతనమైన హిందూధర్మాన్ని సంరక్షించేందుకు వివిధ ధార్మిక సంస్థల సమన్వయంతో కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్నామని వివరించారు. సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సభ్యుడు శ్యామ్‌ప్రసాద్, జిల్లా సమితి అధ్యక్షుడు నాగారెడ్డి హరికుమార్‌రెడ్డి, హిందూ ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, హెచ్‌డీపీటీ సభ్యులు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తపల్లి సాయివెంకటసుబ్రహ్మణ్యం, డాక్టర్ సునీల్‌కుమార్, భానుకిరణ్, తదితరులు పాల్గొన్నారు.