శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
తిరుమల: టీటీడీ అనేక కొత్త కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్దఎత్తున ముందుకు తీసుకెళ్తోందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ప్రశంసించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆయనన్నారు. గురువారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించిన వెంకయ్యనాయుడు దంపతులు అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈఓ శ్రీవారి తీర్థప్రసాదాలను, క్యాలెండర్, డైరీ, కాఫీ టేబుల్ పుస్తకాన్ని వారికి అందజేశారు. అలాగే, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో తయారుచేసిన ల్యామినేటెడ్ ఫొటో, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, ఆరుషీట్ల క్యాలెండర్లను ఈఓ అందించి.. వాటి తయారీ, ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం, ఆలయం వెలుపల ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్త మానవాళికి ఆశీస్సులు ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకునేందుకు రావాలని, తద్వారా మిగిలిన భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం దక్కుతుందన్నారు.
ఉపరాష్ట్రపతితో పాటు చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సీవీఎస్‌ఓ గోపినాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. వెంకయ్యనాయుడు, ఉషమ్మ దంపతుల మనుమరాలు సుష్మ, కిషన్ల వివాహం తిరుమలలో వైభవంగా జరిగింది. స్థానిక పుష్పగిరి మఠంలో నిర్వహించిన ఈ వివాహ వేడుకకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈఓ, ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి తదితరులు వివాహానికి హాజరయ్యారు.
శ్రీవారి సేవలో గవర్నర్
అలాగే, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్, ఈఓ, అదనపు ఈఓ, సీవీఎస్‌ఓ ఆయన్ను సాదరంగా ఆహ్వానించగా, ఆర్చక బృందం ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్‌కు టీటీడీ చైర్మన్, ఈఓ తీర్థప్రసాదాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment