న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు అయ్యాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశివ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిల్ వేశారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలని అన్నారు. చంద్రబాబు వేసిన సిట్‌తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెప్పే అవకాశం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించిన విషయం కనుక సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని చెప్పారు. ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన 10 ట్యాంకులలో నాలుగు ట్యాంకులు నాసిరకంగా ఉన్నాయని, ఈ నాలుగు ట్యాంకులలో వనస్పతి ఉందని మొదట టీటీడీ ఈవో చెప్పారని అన్నారు. ట్యాంకులు ముందుగానే ఒక సర్టిఫికెట్‌తో తిరుమలకు వస్తాయని, ఆ వచ్చిన ట్యాంకులను టీటీడీ 3 పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు.
చదవండి: లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణానికి భూమన సిద్ధం
‘ఆ పరీక్షల్లో సఫలమైన తర్వాతే ఆ టాంకర్ల నెయ్యిని ప్రసాదాలకు ఉపయోగిస్తారు. టెస్టుల్లో ఫెయిల్ అయితే వాటిని వెనక్కి పంపిస్తారు. కల్తీ జరిగిందని నిర్ధారించే ల్యాబ్స్ లేవని ఈవో చెప్పడం దుర్మార్గం. 2014-19 వరకు పరీక్ష కేంద్రాలకు హెడ్‌గా ఉన్న శర్మిస్ట.. టీటీడీకి కల్తీ పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని వెల్లడించారు. మే 15న మొదటి ట్యాంక్ పంపించారు. అప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నాసిరకం నాలుగు ట్యాంకర్ల నెయ్యి వెనక్కి పంపారు. అటువంటి సమయంలో లడ్డూలలో కల్తీ ఎలా జరిగిందని చెప్పారు.
భక్తుల మనోభావాలు గాయపరిస్తే మీకు ఒరిగేదేమిటి. రాజకీయ లాభం కోసం దేవుడిని కూడా ఉపయోగించడం సిగ్గుచేటు. రిజెక్ట్ చేసిన నాలుగు ట్యాంకర్లలో ఎస్ వాల్యూ తక్కువగా ఉందని ఈవో చెప్పారు. 2019 నుంచి ఆగస్టు 2023 వరకు వైవి సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నారు. వై వి సుబ్బారెడ్డి హయంలో ఈ టెండర్లను పిలవలేదు. ఏఆర్ ఫుడ్స్ అసలు బిడ్డరే కాదు. భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో ఏఆర్ ఫు డ్స్‌కు ఆర్డర్ ఇవ్వలేదు. సప్లై జరగలేదు.
టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఆర్డరు, సప్లై జరిగింది. ఎస్ వాల్యూ తగ్గిందని టీటీడీ ఈఓ నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. 319 రూపాయల కేజీ నెయ్యిలో 1, 450 రూపాయల యానిమల్ ఫ్యాట్ ఎలా కలుపుతారు? రాగి బిందెలో బంగారం కలుపుతారా ?కానీ రాజకీయ దురుద్దేశంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నారు.పంది కొవ్వు కలిపారని చెప్పడం అబద్ధం
Comments
Please login to add a commentAdd a comment