సిట్ విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకటే మాట చెప్పాలి
ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి
‘సిట్’లో రాష్ట్రం తరఫున మనకు అనుకూలమైన వారినే నియమిస్తా
అంతా వారు చూసుకుంటారు
టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల: తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయంటూ ‘కొవ్వు ప్రకటన’ చేసిన సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు షాకివ్వడంతో ఆయన వ్యూహం మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ను పక్కనపెట్టిన అత్యున్నత న్యాయస్థానం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల బృందానికి విచారణ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ బృందంలో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఇద్దరు, కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి ఒకరు ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కొత్త వ్యూహానికి తెరతీశారు. ఇందులో భాగంగా శుక్రవారం తిరుమలలో స్వామివారికి పట్టు వ్రస్తాలు సమర్పించిన సీఎం శనివారం టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిపై మన స్టాండ్ ఏమిటో మీకు తెలుసుకదా. సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకటే మాట మీద ఉండాలి.
ఎవరూ నా మాటకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అందరికీ ఈ మేరకు ట్రైనింగ్ ఇవ్వండి. ఆ బృందంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు అనుకూలమైనవారే ఉంటారు. ఆ ఇద్దరు అన్నీ చూసుకుంటారు’ అని ముఖ్య అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథిగృహంలో ఐదుగురు ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వీఐపీ సంస్కృతి తగ్గాలి..
తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. ఐదుగురు అధికారులతో సమావేశం ముగిశాక ఆయన దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతిఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు.
ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని సూచించారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలన్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని సూచించారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగానే టీటీడీ పనిచేయాలన్నారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించారు.
లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని, ఇది ఎల్లప్పుడూ కొనసాగాలని ఆదేశించారు. అలాగే తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలని ఆదేశించారు. కాగా తిరుమలలో చంద్రబాబు కేంద్రీకృత వకుళమాత వంటశాలను ప్రారంభించారు.
పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డు పక్కన నిర్మించిన అధునాతనమైన ఈ వంటశాలను సుమారు రూ.13.45 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. 37,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో దీన్ని నిర్మించారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కొత్త కేంద్రీకృత వంటశాలలో 1.20 లక్షల మంది యాత్రికులకు అన్నప్రసాదాలు అందిస్తారు.
సమావేశం కారణంగానే షెడ్యూల్‌లో మార్పులు..
వాస్తవానికి శనివారం ఉదయం 7.35 గంటలకు వకుళమాత వంటశాల ప్రారంభం తర్వాత సీఎం చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది. అయితే సీబీఐ నేతృత్వంలో ఏర్పాటు కానున్న సిట్ బృందం తిరుమలకు వచ్చి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఆయన టీటీడీ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారని చెబుతున్నారు.
టీటీడీ అధికారులు, మార్కెటింగ్ సిబ్బందిని సిట్ ఏమడుగుతుంది? ఏం సమాధానం చెప్పాలి? ఎలా స్పందించాలి? అనే విషయాలపై సీఎం చంద్రబాబు ముఖ్య అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఉన్నతాధికారులు సిబ్బందికి కూడా దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.
ఎమ్మెల్యే డిక్లరేషన్‌పై వివాదం
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ శుక్రవారం శ్రీవారి దర్శనం సందర్భంగా ఇచ్చిన డిక్లరేషన్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్వామి వారి దర్శనానికి వెళ్లే సమయంలో తాను క్రిస్టియన్‌ను అని, శ్రీవారిపై విశ్వాసం ఉందంటూ ఎమ్మెల్యే డిక్లరేషన్ ఇచ్చారు. క్రిస్టియానిటీ తీసుకుంటే.. ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని, బీసీ కేటగిరీలోకి వస్తారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ఈ లెక్కన ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన జీడీ నెల్లూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే థామస్‌పై అనర్హత వేటు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తనకు తానుగా తిరుమలలో క్రిస్టియన్‌గా డిక్లరేషన్ ఇచ్చాక ఎస్సీ రిజర్వేషన్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment