తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి | YS Jagan Mohan Reddy comments over Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి

Published Sat, Oct 5 2024 5:17 AM | Last Updated on Sat, Oct 5 2024 7:38 AM

YS Jagan Mohan Reddy comments over Chandrababu Naidu

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ 

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్‌ డ్రామా చేయొద్దని సుప్రీంకోర్టు అక్షింతలు 

శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని చెప్పింది 

సీఎం సొంతంగా వేసుకున్న ‘సిట్‌’ను రద్దు చేసింది 

సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు 

బాబుకు దేవుడంటే భయం, భక్తి.. రెండూ లేవు 

ఇప్పటికైనా తిరుమల శ్రీవారి పాదాల చెంత తప్పయిందని వేడుకోవాలి 

ఇంత జరిగినా మత విశ్వాసాలను దెబ్బ తీస్తూ అదే దుష్ప్రచారం 

వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ.. తినని భక్తులు.. కళ్లెదుటే ఆధారాలు కనిపిస్తున్నా ఆగని వక్రీకరణలు

ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించినా.. చంద్రబాబులో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆయనకు వ్యక్తిత్వం ఉంటే ముందు ప్రజలను క్షమాపణ కోరాలి. తర్వాత స్వామి వారిని వేడుకోవాలి. నిజానికి సుప్రీంకోర్టు ఎవరిని తప్పు పట్టింది? ఎవరు దేవుడి దగ్గర దోషిగా నిలబడాలి?  మన ఖర్మ ఏమిటంటే.. చంద్రబాబు  వంటి అన్యాయమైన నాయకుడు మనకున్నాడు. 

రాబోయే రోజుల్లో బాబు పాపం.. దేవుడి కోపం రాష్ట్ర ప్రజలపై  పడకూడదు. అది చంద్రబాబుకే పరిమితం కావాలి. ఆయన మాట్లాడింది పచ్చి అబద్ధం అని తెలిసినా ఆయన్ను మోస్తున్న కూటమికి, ఆ నాయకులకే దేవుడి కోపం పరిమితం కావాలని దేవుణ్ని వేడుకుంటున్నాను. ఇవన్నీ  వెలుగులోకి వచ్చాయంటే దేవుడి  దయతోనే. వేంకటేశ్వరస్వామే నడిపిస్తారు. ఆయనే వారికి మరిన్ని  మొట్టికాయలు వేస్తాడు.      – వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అంశంపై దాఖలైన వ్యాజ్యంపై శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో శుక్రవారం, సెపె్టంబరు 30న జరిగిన పరిణామాలను గమనిస్తే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని, రాజకీయ దుర్బుద్ధితో రెచ్చగొడుతున్నారనేది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే ఘాటైన వ్యాఖ్యలు చేసిందన్నారు. 

దేవుణ్ని రాజకీయాల్లోకి లాగొద్దని.. పొలిటికల్‌ డ్రామాలు చేయెద్దంటూ చంద్రబాబుకు మొట్టికాయులు వేసిందన్నారు. చంద్రబాబు స్వయంగా వేసుకున్న ‘సిట్‌’ను కూడా రద్దు చేసిందని చెప్పారు. సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు.. వారికి సహకారం అందించడానికి రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) నుంచి ఒక అధికారి సభ్యులుగా స్వతంత్ర దర్యాప్తు బృందం(సిట్‌)ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిందన్నారు. 

దేవుడంటే భయం, భక్తి ఉంటే తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని చంద్రబాబును వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. చేసిన తప్పుకు క్షమించాలని తిరుమల శ్రీవారి పాదాల చెంత వేడుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

చంద్రబాబుకు భయం, భక్తి లేవు  
తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను రాజకీయ దుర్బుద్ధితో.. కావాలని అబద్దాలు చెప్పి, జంతువుల కొవ్వు వాడి లడ్డూలు తయారు చేసి భక్తులకు ఇస్తే, వారవి తిన్నట్లు సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు. అలా ఆయన తిరుమల లడ్డూను, శ్రీవెంకటేశ్వరస్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను అపవిత్రం చేశారు. 

వీటన్నింటికీ సంబంధించి నేను సాక్ష్యాధారాలతో సహా చూపించాను. కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బ తీస్తూ, చంద్రబాబు ఎలా అబద్ధాలు చెప్పాడనేది చూస్తే.. చంద్రబాబు సీఎం అయ్యాక, తను నియమించుకున్న ఐఏఎస్‌ అధికారి, టీటీడీ ఈవో చంద్రబాబు ప్రకటనలకు విరుద్ధంగా స్వయంగా ప్రకటనలు చేశారు. 

చంద్రబాబు మామూలుగా మంచి వ్యక్తి అయితే, ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే, కొద్దో గొప్పో సిగ్గు పడాలి. తన మాటలకు వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు, దేవుడంటే భయం, భక్తి ఉన్న వారెవరైనా పశ్చాత్తాప పడతారు. ప్రజలకు క్షమాపణ చెబుతారు. కానీ చంద్రబాబుకు పశ్చాత్తాపం ఉండదు. ఆయనకు దేవుడంటే భయం, భక్తి రెండూ లేవు.

ప్రధానికి లేఖ.. ‘సుప్రీం’లో పిటిషన్‌  
ఒక అబద్ధానికి రెక్కలు కట్టి గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో అబద్ధాలు ఆడి, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాశస్త్యం, లడ్డూ విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు అన్న మాటలపై మేము ప్రధానికి లేఖ రాశాం. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాం. 

సుప్రీంకోర్టు సైతం ఈ కేసు వినేటప్పుడు.. కోర్టులో న్యాయమూర్తులు ఎలా స్పందించారో ఒకసారి గుర్తు చేసుకొండి (గత సోమవారం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా న్యాయమూర్తులు ఏమన్నారన్నది చదివి వినిపించారు). ఇవన్నీ నేషనల్‌ మీడియాలో రిపోర్ట్‌ అయ్యాయి. ఆ రోజు (గత నెల 30న) సుప్రీంకోర్టు ఇంకా చాలా చెప్పింది. (వాటిని ప్రస్తావిస్తూ.. ఆ కాపీ స్లైడ్లో చూపారు) సీఎం చంద్రబాబును ఆక్షేపిస్తూ, సుప్రీంకోర్టు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేసింది.  

తప్పులను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు  
ఎఫ్‌ఐఆర్‌ సెప్టెంబర్‌ 25న రిజిస్టర్‌ చేస్తే.. అంతకు ముందే సెప్టెంబరు 18న ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. సిట్‌ ఏర్పాటైంది సెప్టెంబరు 26న అయితే.. అంతకన్నా ముందే ఎలా ప్రకటన ఇచ్చారని సుప్రీంకోర్టు ప్రశి్నంచింది. సీఎం బహిరంగ వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తుందని చెప్పింది. ఇన్ని రకాలుగా చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. మళ్లీ ఇవాళ కూడా న్యాయస్థానం కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన తప్పును ఎత్తి చూపింది. 

చంద్రబాబు తాను స్వయంగా ఏర్పాటు చేసుకున్న సిట్‌ ను రద్దు చేస్తూ.. సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర అధికారులు సహాయ పడతారని చెబుతూ వీరికి తోడు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) నుంచి ఒకరు నియమితులవుతారని.. వీరందరూ లడ్డూకు సంబంధించిన విషయంపై నివే­దిక ఇస్తారని ఆదేశించింది. అయినా అన్ని సాక్ష్యాదారాలను ప్రజల ముందు ఉంచాం. సుప్రీంకోర్టుకూ అం­దజేశాం. రేపు విచారణలో ఇదే స్పష్టమవుతుంది.

గత నెల 30న సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలివి
»   కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినా, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు?  
»    ఆధారాలు లేకపోయినా సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడుతారు?  
»     ఒకవైపు విచారణ జరుగుతుండగా.. ఆ వ్యాఖ్యలతో సిట్‌ ప్రభావితం కాదా?  
» తమ నివేదిక తప్పు కావచ్చని స్వయంగా ఎన్‌డీడీబీ రిపోర్టులోనే రాశారు కదా?  
»   ఎన్‌డీడీబీ నివేదికపై సెకండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు దేశంలో ఎన్నో ల్యాబ్స్‌ ఉన్నాయి కదా?  
»  ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారిడీ ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్‌డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి ఎందుకు సెపె్టంబరులో మాట్లాడినట్లు? 
»  జూలైలోనే ఎందుకు మాట్లాడలేదు?  
»  మీడియాతో మాట్లాడ్డానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా?  
»  అసలు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దాని వల్ల సిట్‌ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా? 
»  సిట్‌ ఏర్పాటు చేసినా, ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారు? మీడియాతో ఎలా మాట్లాడతారు?  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement