లేదా విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటుచేయండి
వాస్తవాల నిగ్గు తేల్చండి
సీజే ధర్మాసనం ముందు వైవీ సుబ్బారెడ్డి తరఫున పొన్నవోలు ప్రస్తావన
వచ్చే బుధవారం విచారణ జరుపుతామన్న ధర్మాసనం
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీపై వాస్తవాలను తేల్చేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టును కోరారు. ఒకవేళ సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యం కాకపోతే, విచారణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. తద్వారా వాస్తవాల నిగ్గుతేల్చాలని కోరారు.
ఈ అభ్యర్థనతో తాము ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయనున్నా మని, దీనిపై విచారణ జరపాలని ఆయన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనాన్ని కోరారు. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి విషయంలోవాస్తవాలను తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని.. అందువల్ల నిజానిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు.
అందుకోసమే తాము ఈ వ్యాజ్యం దాఖలు చేస్తున్నామన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించినది కాబట్టి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సుధాకర్‌రెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తాము బుధవారమే విచారిస్తామని, ఈలోపు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.
నాపై విజిలెన్స్ విచారణను కొట్టేయండి: వైవీ
టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డానంటూ తనపై చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లను తనకు అందచేయకుండానే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ వివరణలు కోరడాన్ని సవాలు చేస్తూ ఎంపీ, టీటీడీ పూర్వ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
తనపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణను కొట్టేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు. టీటీడీ వ్యవహారాలపై విచారణ జరిపే పరిధి చట్ట ప్రకారం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు లేదన్నారు.
ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్, టీటీడీ ఈవోలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ విచారణ జరపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment