వైఎస్సార్‌సీపీని రాజకీయంగా దెబ్బతీయడానికే భక్తుల మనోభావాలతో చంద్రబాబు చెలగాటం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పక్కా ప్రణాళికతోనే జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూలు తయారుచేశారని ఆరోపించారా? వైఎస్సార్‌సీపీని రాజకీయంగా దెబ్బతీయడమే ఆ ప్రణాళిక లక్ష్యమా?
రాజకీయ స్వార్థం కోసం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని అభాసుపాలు చేసి.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే దుస్సాహసానికి ఒడిగట్టారా?
అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు శ్రీవారి భక్తులు, టీటీడీ అధికార వర్గాలు, రాజకీయ విశ్లేషకులు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓ శ్యామలరావు శుక్రవారం మీడియాతో వెల్లడించిన వివరాలతో పాటు ఆయన మాట మార్చిన వైనంతో సీఎం చంద్రబాబు కుట్ర బట్టబయలైందని వారు స్పష్టంచేస్తున్నారు.
టీటీడీ ఈఓగా బాధ్యతలు అప్పగిస్తూ కుట్ర..
టీటీడీ ఈఓగా శ్యామలరావును జూన్ 14న చంద్రబాబు నియమించారు. అదే రోజున సీఎంను తాను కలిసినట్లు తిరుమలలో శుక్రవారం ఈఓ మీడియాకు వెల్లడించారు. తిరుమలలో ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న ముడిసరుకుల్లో నాణ్యతలేదని.. జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని వాడుతున్నారని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే.. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక మూడో రోజే.. పైగా ల్యాబ్ రిపోర్టు రాకముందే భక్తుల మనోభావాలతో చెలగాటమాడి వైఎస్సార్‌సీపీని దెబ్బతీసే కుట్రకు చంద్రబాబు తెరతీసినట్లు స్పష్టమవుతోంది.
తొలుత వెజిటబుల్ ఫ్యాట్స్ కలిశాయంటూ..
నిజానికి.. నెయ్యి సరఫరాకు 2024, మార్చి 12న టీటీడీ టెండర్లు పిలిచింది. అదే ఏడాది మే 8న టెండరును టీటీడీ ఖరారు చేసి 15న టీటీడీ ఆర్డర్ ఇచ్చింది. నిబంధనల మేరకు సరఫరా సంస్థలు నెయ్యిని సరఫరా చేశాయి. ఇందులో జూలై 6న రెండు ట్యాంకర్లు.. జూలై 12న రెండు ట్యాంకర్ల నెయ్యి వచ్చింది. ఈ నెయ్యిని పరీక్షల కోసం ఎన్‌డీడీబీ (నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు) ల్యాబ్‌కు టీటీడీ పంపింది.
వాటికి సంబంధించిన పరీక్షల నివేదికలను జూలై 23న టీటీడీకి ఎన్‌డీడీబీ అందజేసింది. అదేరోజున తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఈఓ.. ఒక సంస్థ సరఫరా చేసిన రెండు ట్యాంకర్ల నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని తేలిందని వెల్లడించారు. ఆ రెండు ట్యాంకర్లను సరఫరా సంస్థకు తిప్పి పంపి.. కల్తీ చేసిన నెయ్యి పంపినందుకు బ్లాక్‌లిస్ట్‌లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు జారీచేశామని ఈఓ తెలిపారు.
కుట్ర అమలుకు తెరతీసిన చంద్రబాబు..
ఇదిలా ఉంటే.. కూటమి శాసనసభా పక్ష సమావేశం ఈనెల 18న మంగళగిరిలో సీఎం చంద్రబాబు నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ఆవు నెయ్యితో తయారుచేయాల్సిన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని ఉపయోగించారని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టించారంటూ జూన్ 14న రచించిన కుట్ర అమలుకు తెరతీశారు.
దీనికి కౌంటర్‌గా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యినే తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించామని.. ఆలయ పవిత్రతను కాపాడామని.. చంద్రబాబు వేసిన నిందకు ఆయన కట్టుబడి ఉన్నట్లయితే శ్రీవారి పాదాల చెంత ప్రమాణానికి సిద్ధమా అంటూ టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి బుధ, గురువారం రెండ్రోజులూ సవాల్ విసిరి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని.. భక్తులకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టంచేశారు. దీంతో.. ఎన్‌డీడీబీ పరీక్ష నివేదికలు గురువారం టీడీపీ కార్యాలయంలో విడుదల చేయించారు. ఆ నివేదికలో కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనని వెల్లడవడంతో తాను తీసుకున్న గోతిలో చంద్రబాబు బొక్కబోర్లాపడినట్లయింది.
ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడానికి..
మరోవైపు.. నిరాధారమైన ఆరోపణలతో తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసి.. తమ మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు, లోకేశ్‌లపై భక్తులు నిప్పులు చెరుగుతున్నారు. అలాగే, చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ హైకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమైంది. దీంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడానికి నెయ్యి వివాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈఓ శ్యామలరావును ఆదేశించారు.
ఈ క్రమంలోనే.. జూలై 23న వెల్లడించిన అంశాలకు భిన్నంగా శుక్రవారం తిరుమలలో ఈఓ మాట్లాడారు. వెజిటబుల్ ఫ్యాట్‌లతోపాటు జంతువుల కొవ్వు కూడా ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో కలిసినట్లు ఎన్‌డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని చెప్పారు. ఆ నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపామన్నారు. అంటే.. గతంలోనే కాదు ఇప్పుడు కూడా కల్తీ నెయ్యిని శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించలేదని ఆయన చెప్పకనే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment