చంద్రబాబూ.. నీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావా? | Ys Jagan mohan Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. నీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావా?

Published Sat, Sep 21 2024 3:26 AM | Last Updated on Sat, Sep 21 2024 8:37 AM

Ys Jagan mohan Reddy Fires On Chandrababu Naidu

నీ 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇంతలా దిగజారతావా?: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రాజకీయాల కోసం దేవుడినీ వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం ప్రపంచంలో నీ ఒక్కడికే ఉంది

ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని తిరుమల ఆలయానికి అపవిత్రత ఆపాదిస్తావా?

లడ్డూ తయారీ ప్రక్రియను దారుణంగా అభాసుపాలు చేస్తావా?

నెయ్యిపై రెండు నెలల క్రితం వచ్చిన నివేదికను ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేస్తావా?

రాజకీయంగా కొట్లాడాలనుకుంటే.. నాతో కొట్లాడు

రాజకీయ స్వార్థం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రధానికి, సీజేఐకి లేఖ రాస్తాం  

చంద్రబాబుకు దేవుడి మీద భక్తి ఎప్పుడూ లేదు.. ఉండదు. నేను రాసి చెబుతున్నా. దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన, హీన మనసు కలిగిన వ్యక్తి చంద్రబాబు. టీటీడీకి ఏదైనా చెడు జరిగిందంటే అది చంద్రబాబు హయాంలోనే జరుగు తుంది. మిగతా ఎవరి హయాంలోనూ జరగదు. ఎందుకంటే చంద్రబాబుకు దేవుడంటే భక్తీ లేదు.. భయమూ లేదు. 

‘రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ 5.. వీరంతా ఉన్మాదస్తులు.. ఉన్మాదంతో బాధపడుతున్నారు. రాజకీయంగా కొట్లాడాలనుకుంటే చెయ్‌.. బంగారంగా చెయ్‌.. మేమంతా ఆహ్వానిస్తాం. ప్రజలకు ఫలానా మంచి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చావ్‌. ఆ మంచి చేసి ప్రజల మన్ననలు పొందు. కానీ ఇవేం రాజకీయాలు..? ఒక అబద్ధాన్ని సృష్టించడం, దాన్ని అమ్మడం, ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బురద జల్లడం ఎంత వరకూ ధర్మం?– వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రతిష్టను దెబ్బ తీయడానికి తెగబడ్డారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఏ తప్పూ జరగకున్నా.. జరిగినట్లుగా అసత్య ప్రచారం చేస్తూ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయ ఖ్యాతిని బజారుకీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలనే దుర్మార్గమైన మనస్తత్వం ప్రపంచంలో ఒక్క చంద్రబాబుకే ఉంటుందని దుయ్యబట్టారు. 

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యిని వాడారంటూ దారుణమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత దారుణంగా మాట్లాడటం ధర్మమేనా? శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని నిలదీశారు. 

వంద రోజుల పాలన వైఫల్యాలపై.. సూపర్‌ సిక్స్‌తోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేస్తున్న మోసాలపై ప్రజలు అడుగడుగునా నిలదీస్తారనే భయంతో దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు దుర్మార్గమైన కుట్ర చేశారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించడం (డైవర్షన్‌ పాలిటిక్స్‌)లో భాగంగానే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారంటూ దారుణమైన ఆరోపణ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ కుట్రపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. తిరుమల పవిత్రతను అపహాస్యం చేసే దుస్సాహసానికి పాల్పడిన వారిని శిక్షించే వరకూ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే...  

నెయ్యి, ముడి సరుకుల సేకరణకు పక్కా వ్యవస్థ.. 
» తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాలు, లడ్డూ తయారీలో వినియోగించే నాణ్యమైన ఆవు నెయ్యి, ముడి సరుకులను సేకరించేందుకు టీటీడీలో గొప్ప వ్యవస్థ ఉంది.  

» టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కార్యక్రమం దశాబ్దాలుగా కొనసాగుతోంది. నెయ్యి సరఫరా కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్‌లైన్‌లో టెండర్లు పిలుస్తుంది. ఆ టెండర్లలో తక్కువ ధరకు  కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్టును టీటీడీ బోర్డు అప్పగిస్తుంది. ఇది టీటీడీలో సాధారణంగా జరిగే ప్రక్రియ. స్వామివారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి, ఇతర ముడిసరుకులను ఈ విధంగానే సేకరిస్తారు.  

»  టీటీడీకి నెయ్యిని ట్యాంకర్లలో సరఫరా చేస్తారు. అలా సరఫరా చేసిన ప్రతి ట్యాంకర్‌ నెయ్యి టెండర్‌లో పేర్కొన్న ప్రమాణాల మేరకు నాణ్యంగా ఉన్నట్లు సరఫరా సంస్థే ఎన్‌ఏబీఎల్‌ (నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు ఫర్‌ ల్యాబ్స్‌) ధ్రువీకరించిన సంస్థ నుంచి సర్టిఫికెట్‌ తేవాలి. ఆ సరి్టఫికెట్‌ ఆధారంగా ఆ ట్యాంకర్‌ నెయ్యిని టీటీడీ మార్కెటింగ్‌ అధికారి, సరఫరా సంస్థ ప్రతినిధి సమక్షంలో టీటీడీ మూడు శాంపిళ్లను తీసుకుని ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లతో వేర్వేరుగా పరీక్ష చేయిస్తుంది. 

ఆ మూడు పరీక్షల్లో ప్రమాణాల మేరకు నాణ్యంగా ఉన్నట్లు తేలితేనే ఆ నెయ్యి ట్యాంకర్‌ను ముందుకు అనుమతిస్తారు. ముడి సరుకుల సరఫరాలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. మూడు పరీక్షల్లో ఏ ఒక్క పరీక్షలోనైనా నెయ్యిగానీ ముడిసరుకుగానీ నాణ్యతగా లేదని తేలితే.. ఆ ట్యాంకర్‌ నెయ్యి, సరుకులు తెచ్చిన వాహనాన్ని సరఫరా సంస్థకే వెనక్కి పంపిస్తారు.  

»  2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నాణ్యత లేకపోవడంతో 14–15 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నాణ్యత లేకపోవడంతో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించారు.  ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.  

రెండు నెలలుగా ఏం చేస్తున్నారు? 
ూ    నెయ్యి నాణ్యతగా లేదని రిపోర్టు వచ్చిన శాంపిళ్లను జూలై 12న తీసుకున్నారు. అప్పుడు స్వయంగా చంద్రబాబే ముఖ్యమంత్రి. ఆయన సీఎంగా ఉండగా టీటీడీకి వచ్చిన నెయ్యి ట్యాంకర్‌ నుంచి శాంపిళ్లు తీసుకున్నారు. 3 పరీక్షలు అక్కడే చేశా­రు. అవి సరిగా రాలేదు కాబట్టే శాంపిళ్లను జూలై 17న ఎన్‌డీడీబీకి పంపించారు. జూలై 23న రిపో­ర్టు వచ్చింది. అందులో నాణ్యత లేదని వ­చ్చింది. ఆ రిపోర్టును టీటీడీ అధికారులు అప్పుడే ఎందుకు బయటపెట్టలేదు?  రెండు నెలల నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారు?  
 


» చంద్రబాబు వంద రోజుల పరిపాలనపై ‘ఇది మంచి ప్రభుత్వం’ అంటూ ప్రకటనలు ఇస్తే.. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఏమైందంటూ ప్రజలు తిరగబడుతుండటంతో వారి దృష్టి మళ్లించేందుకు టాపిక్‌ డైవర్ట్‌ చేశారు. అందుకే జూలై 23న ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు తీసి దానికి వక్రభాష్యం చెబుతూ.. నోటికొచ్చినట్టు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు.  

» నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు(ఎన్‌డీడీబీ) నుంచి 2 నెలల కిందట రిపోర్టు వస్తే దానిపై ఏ ఒక్క అధికారీ వివరణ ఇవ్వకపోగా ఇ­ప్పుడు టీడీపీ కార్యాలయంలో దానిని విడు­దల చేయడం వెనుక కచ్చితంగా రాజకీయ దు­రుద్దేశం ఉంది. ఈ కుట్రపై ప్రధానమంత్రితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లే­ఖ రాస్తాం.  

»ఎన్‌డీడీబీ ల్యాబ్‌ రిపోర్టులో ఏం కనిపిస్తోంది? స్టాండర్డ్‌ (ఎస్‌) వాల్యూ ఉండాలి. కానీ డీవియేషన్‌ ఉంది. అలా ఉంటే శాంపిల్‌ కంటెయిన్‌ ఫారిన్‌ ఫ్యాట్‌ (ఏమేం ఉండే వీలుందన్న అవకాశాలతో నివేదికలో పొందుపరిచిన వివరాలను ప్రస్తావించారు).

హిందువుల ప్రతినిధులైతే చంద్రబాబుకు అక్షింతలు వేయండి..
» బీజేపీ వాళ్లకు సగం తెలుసు. సగం తెలియదు. చంద్రబాబు పూర్తిగా అబద్ధాలు, మోసాల మనిíÙ. టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ, సీనియర్‌ మంత్రుల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ గురించి వారికి తెలియదా! తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. తప్పు చంద్రబాబు చేసి, దు్రష్పచారం చేశాడని తేలితే ఆయన  మీద అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీకి ఉందా అని నేను అడుగుతున్నా. 

నిజంగానే వారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే హిందువుల ప్రతినిధులైతే.. శ్రీవారి పవిత్రతను దెబ్బతీసేలా, భక్తుల మనోభావాలను కించపరిచేలా దుర్మార్గంగా మాట్లాడిన చంద్రబాబుకు చీవాట్లు పెట్టాలి. ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా? అంటూ చంద్రబాబుని బీజేపీ నేతలు గట్టిగా కడిగేయాలి.  

»వాస్తవాలు తెలియని వారిని తప్పుదోవ పట్టిస్తే ఎవరికైనా భావోద్వేగాలు పెరుగుతాయి. అలాంటివి చేయకూడని పనులు. చంద్రబాబు కావాలనే భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవంగా ప్రక్రియ ఏమిటన్నది స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఈ విధంగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? 

» నేను చెప్పినవి.. మాట్లాడిన ప్రతి మాట నిజమా.. అబద్ధమా అన్నది మీరే (మీడియా) పరిశీలన చేయండి. నేను ప్రతి మాటా నిజమే మాట్లాడుతున్నా. మీ అందరికీ వారు చూపించింది, వినిపించింది.. ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తెచ్చిన దానికి తేడా గమనించండి. రాజకీయాలు ఇలా చేయడం ధర్మమా, న్యాయమా అని మీ మనస్సాక్షిని అడగండి. ఇది ధర్మం కాదు, న్యాయం కాదు. రాజకీయాలు చేయాలనుకుంటే నేరుగా చేద్దాం.

కేఎంఎఫ్‌కు వాళ్లెందుకు ఇవ్వలేదు..? 
కర్నాటక మిల్క్‌ ప్రొడ్యూసెస్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌)కు ఉద్దేశ పూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్‌ నందినీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్టు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యకరం. టీటీడీలో టెండర్లు పిలుస్తారు.. అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరు ఎల్‌–1గా నిలిస్తే వారికి నెయ్యి సరఫరా బాధ్యత అప్పగిస్తారు. ఇది పద్ధతి. ఇదే చంద్రబాబు హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్‌ వరకు కేఎంఎఫ్‌ బ్రాండ్‌ ఎందుకు లేదని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు?

టీటీడీ బోర్డుకు ఎంతో విశిష్టత..
టీటీడీ బోర్డు చాలా విశిష్టమైనది. క్యాబినెట్‌ కూర్పు చేయడం సులభం. కానీ టీటీడీ బోర్డు కూర్పు చాలా కష్టం. టీటీడీ బోర్డులోకి సిఫారసు చేయాలని కేంద్ర మంత్రులు, చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీల నుంచి సైతం కోరతారు.  ఆయా రాష్ట్రాల్లో విశిష్ట వ్యక్తులు, ప్రసిద్ధిచెందిన వారు బోర్డులో సభ్యులు అవుతారు. ఆ బోర్డు కూర్పు విశిష్టమైన వారితోనే ఉంటుంది. టీటీడీలో టెండర్ల ప్రక్రియను బోర్డు సభ్యులే రాటిఫై చేస్తారు. 

ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జోక్యం ఉండదు. అటానమస్‌ బాడీగా (స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ) టీటీడీ బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ భగవంతుడికి మంచి చేయాలనే దృక్పథంతోనే బోర్డు మెంబర్లు పని చేస్తారు. అలాంటి బోర్డులో 45 సార్లు అయ్యప్పమాల ధరించి గురు స్వామి హోదా పొందిన వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి లాంటి భక్తులను పెట్టాం. 

అబద్ధాలకు రెక్కలు కడుతూ.. 
టీటీడీకి నెయ్యిని సరఫరా చేసే ప్రతి ట్యాంకర్‌ నుంచి మూడు శాంపిళ్లు తీసుకుని వాటిలోని నాణ్యతను ల్యాబ్‌లో పరీక్షిస్తారు. పరీక్షల్లో నాణ్యత బాగుందని తేలితేనే లడ్డూ ప్రసాదంలో వినియోగించడానికి ఉపయోగిస్తారు. నాణ్యత లేదంటే సరఫరా సంస్థకే వెనక్కి పంపిస్తారు. ఇంత గొప్ప విధానం టీటీడీలో ఉన్నందుకు ప్రపంచానికి గొప్పగా చెప్పాల్సింది పోయి అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. 

అసలు వాస్తవంలో జరగని దానికి కట్టుకథలు అల్లి.. నాసిరకమైన పదార్థాలు, జంతు కొవ్వులతో తయారుచేసిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని.. భక్తులకు పంపిణీ చేశారని.. వాటిని భక్తులు తినేశారని సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు చెప్పడం ధర్మమేనా?

» ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయానికి అపవిత్రతను ఆపాదిస్తూ.. లడ్డూ తయారీ ప్రక్రియను అభాసుపాలు చేస్తుండటం దారుణం. మన గుడిని.. మన దేవుడిని మనమే తగ్గించుకోవడం అత్యంత దారుణం. ఇంతకంటే దారుణ పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.  

 టీటీడీ ప్రతిష్టను పెంచింది మేమే..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. స్వామివారి ప్రసాదాలు, లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యతను పెంచేందుకు అక్కడి ల్యాబ్స్‌ను పటిష్టపరిచాం. సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన (సీఎఫ్‌టీఆర్‌ఐ) వారితో టీటీడీ అనుసంధానమైంది. అక్కడి నుంచి సీనియర్‌ ఉద్యోగులను నియమించి నాణ్యత, పారదర్శకతలో రాజీ లేకుండా వ్యవహరించాం.
 
» వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా టీటీడీలో నవనీత సేవ ప్రారంభించాం. దీని కోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండపై ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేశాం. 

»  శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలను రెట్టింపు చేశాం. ప్రసాదాలు తయారు చేసే కార్మికులను క్రమబద్దికరించడంతో పాటు వారి జీతాలు పెంచాం.  

» చంద్రబాబు దేవాలయాలను కూల్చేస్తే.. ఆలయాలను పునరుద్ధరించింది  మేమే. అమరావతి, విశాఖపట్నం, భువనేశ్వర్, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, జమ్మూ కశ్మీర్, చెన్నైలో టీటీడీ ఆలయాలు నిర్మించింది మా హయాంలోనే.  అమెరికాలోలోనూ ఆలయ ని­ర్మా­ణాని­కి మా హయాంలోనే టీటీడీ సహకరించింది.  

» భక్తులకు సేవలందిస్తున్న ఉద్యోగులకు తోడుగా నిలిచేందుకు 9 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చింది మేమే. టీటీడీలో పని చేస్తున్న వారికి సెంటు స్థలం ఇవ్వడానికి కూడా    చంద్రబాబుకు ఏ పొద్దూ మనసు రాలేదు.  

» రాష్ట్రంలో మఠాధిపతులు అందరితో 3 సార్లు విద్వత్తు సదస్సులు జరగ్గా  2 సార్లు వైఎస్సార్‌ హయాంలో..  ఓ సారి మేం నిర్వహించాం. చంద్రబాబు హయాంలో మఠాధిపతులతో ఎప్పుడూ విద్వత్తు కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement