సాక్షి, గుంటూరు: తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం.. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మాట్లాడారంటూ టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దెబ్బతీశారని ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు సవాల్..
‘‘భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు. తిరుమల ప్రసాదం విషయంలో భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధం. చంద్రబాబు తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?. రాజకీయ లబ్ధి కోసం బాబు ఎంతటి నీచాకైనా వెనుకాడడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు. స్వామివారి సమర్పించే నైవేద్యంలో ఆర్గానిక్ సామాగ్రి వాడాం. స్వామివారి నైవేద్యంలో స్వచ్ఛమైన నెయ్యిని వాడాం. మేము తిరుమల పవిత్రతను కాపాడాం’’ అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
ఆధారాలుంటే నిరూపించు చంద్రబాబూ..
‘‘అసలు ఆ మాట వినటానికే వొళ్లు గగుర్పాటుకు గురైంది. చంద్రబాబు ఆరోపణలు చేసినట్టు ఎలాంటి అక్రమాలు జరగలేదు. నిజమైతే చంద్రబాబు ఆధారాలు బయట పెట్టాలి. ఆ ఆరోపణలకు కట్టుబడే ఉంటే వెంటనే ప్రమాణానికి రావాలి. వంద రోజుల వైఫల్యాలను పక్కదారి పట్టించేలా మాటలు ఉన్నాయి. 2014-19 మధ్య ఏ విధానం అమల్లో ఉందో దాన్నే 2019-24 మధ్య అమలు చేశాం. స్వామి వారి నైవేద్యంలో కల్తీ జరిగిందని ఆరోపణ చేశారు. బహిరంగ మార్కెట్‌లో కొనే వస్తువుల్లో రసాయనిక పదార్థాలు ఉంటాయని అవి కొనలేదు. రాజస్థాన్ లోని ఒక ఫార్మ్ నుండి తెప్పిస్తాం. ఇందుకోసం రోజుకు అయ్యే రూ లక్ష ఖర్చును ఒక దాత భరిస్తున్నారు. నెయ్యి నాణ్యతను పరిశీలించటానికి ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్‌లో పరిశీలన అయ్యాకే దిగుమతి చేసుకుంటాం
ఇదీ చదవండి: చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట: భూమన కరుణాకరరెడ్డి
సుప్రీంకోర్టుకు వెళ్తాం..
..ఒక్కోసారి నాణ్యత లేదని దాదాపు పదిసార్లు వెనక్కి కూడా పంపాము. ల్యాబ్‌ని ఆధునీకరించి ప్రత్యేక అధికారులను కూడా నియమించాం. ఇంత పకడ్బందీగా కార్యక్రమాలను మేము అమలు చేశాం. కానీ మాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టాలి. లేకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పరువునష్టం దావా వేస్తాం. రాజకీయ లబ్దికోసం ఘోరమైన ఆరోపణలు చేయొద్దు
భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు..
..మా హయాంలో తీసుకున్న ప్రతి నిర్ణయం బోర్డులో చర్చించే తీసుకున్నాం. చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడారా? తట్టుకోలేక మాట్లాడారో త్వరలోనే తెలుస్తుంది. ఆరోపణలు నిజమనుకుంటే విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. మా ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో ఏ తప్పు జరగలేదని ఛాలెంజ్ చేస్తున్నా. తిరుమల పవిత్రత విషయంలో ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment