దేవుడితో మళ్లీ రాజకీయాలా? | KSR Comments On Chandrababu Naidu Repeated Politics With Tirumala With TTD New Chairman | Sakshi
Sakshi News home page

దేవుడితో మళ్లీ రాజకీయాలా?

Published Fri, Nov 1 2024 2:22 PM | Last Updated on Fri, Nov 1 2024 3:39 PM

KSR Comment: CBN Again Politics With Tirumala With TTD New Chairman

‘‘ఐదేళ్లపాటు నేను తిరుమల శ్రీ వారిని దర్శించుకోవడానికి వెళ్లలేదు’’.. టీటీడీ చైర్మన్‌గా నియమితులైన బీఆర్‌ నాయుడు చేసిన ప్రకటన ఇది. అప్పట్లో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండటం వల్ల.. ఏదో అపవిత్రమైపోయిందని అందుకే తాను శ్రీవారి దర్శనానికి వెళ్లలేదంటూ నాయుడుగారు ఓ కారణమూ చెప్పుకున్నారు. బాగానే ఉంది. కానీ.. ఏదో పార్టీ మీద అలిగి ఆ అక్కసు కాస్తా దేవుడిపై తీర్చుకున్నానని చెప్పిన ధర్మకర్త ఈయన ఒక్కడే కాబోలు!

పంతం కొద్దీ పోలేదనే అనుకుందాం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నాలుగున్నర నెలలవుతోంది కదా.. ఈ కాలంలోనైనా వెళ్లారా? ఆ మాట మాత్రం ఆయన మాట్లాడలేదు. బహుశా ఈ ధర్మకర్త పదవి దక్కేవరకూ వెళ్లకూడదని ఒట్టేసుకున్నట్లుంది. ఈ కారణంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి వ్యక్తి ఈ పదవికి అర్హులా అన్న చర్చ జరుగుతోంది.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ బోర్డు నియామకాలపై అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. టీటీడీ బోర్డును రాజకీయ నిరుద్యోగులకు ఉపాధినిచ్చేదిగా మార్చేశారని, దాన్ని వెంటనే రద్దు చేయాలని విరుచుకు పడిపోయేవారు. కానీ అధికారం చేపట్టడంతోనే ఆయన అదే బోర్డును రాజకీయమయం చేసేశారు. మంత్రి పదవులు దక్కని వారు, టిక్కెట్లు ఆశించి భంగపడ్డవారు, వ్యాపారవేత్తలు.. ఎవరినైతే అవినీతిపరులని విమర్శించారో వారు అందరికీ బోర్డులో స్థానం కల్పించారు. పనిలో పనిగా ఒక రౌడీషీటర్‌కు కూడా బోర్డులో చోటు దక్కిందట.

టీటీడీ ఛైర్మన్‌ పదవి పొందడానికి బీఆర్ నాయుడుకు ఉన్న ఏకైక అర్హత మీడియా సంస్థను నడుపుతూండటమే. ఆ ఛానెల్‌లోనూ టీడీపీ వకాల్తా పుచ్చుకుని మరీ పచ్చి అబద్దాలు ప్రచారం చేయడమే. బహుశా ఇంకో అర్హత.. ముఖ్యమంత్రి చంద్రబాబు, కుమారుడు లోకేశ్‌లను ప్రసన్నం చేసుకోవడంలో విజయం సాధించడం కావచ్చు.  ఆసక్తికరమైన అంశం ఒకటి చెప్పుకోవాలిక్కడ. 

టీటీడీ ధర్మకర్త పదవి బీఆర్‌ నాయుడికి దక్కడం ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణకు ఇష్టం లేదట. ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నించడం వల్లనే ఇంతకాలం ఆగిందని, చివరకు లోకేష్‌ పట్టుబట్టిన కారణంగానే దక్కిందని చర్చ నడుస్తోంది. బాబు తన జేబులో మనిషి అనుకునే రాధాకృష్ణకు ఇది పరాభవమే మరి!కాలం మారుతోంది కదా! టీడీపీ హయాంలో ఇప్పుడు చక్రం తిప్పుతున్నది లోకేష్‌ అన్న విషయాన్ని ఆయన గుర్తించినట్లు లేదు.

బీఆర్ నాయుడు పదవి రాగానే సూక్తి ముక్తావళి మొదలుపెట్టేశారు. అంతవరకూ ఫర్వాలేదు కానీ.. ఆ క్రమంలో తన తెలివి తక్కువతనాన్ని బయట పెట్టేసుకుంటూ ఉండటమే సమస్య. పదవి ఇచ్చినందుకు చంద్రబాబు, లోకేష్‌లకు ధన్యవాదాలు చెబితే తప్పు లేదు. మీడియా తెలివితో వైఎస్సార్‌సీపీని దూషించడం కూడా తన బాధ్యత అనుకుని మాట్లాడి గోతిలో పడ్డారు. దేవస్థానం ధర్మకర్తగా భక్తులకు మెరుగైన సేవలందిస్తానని, సదుపాయాలు సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని కొత్తగా అధికారం చేపట్టిన ఏ ధర్మకర్త అయినా చెబుతూంటారు. భక్తులకు రాజకీయ పార్టీలను అంటకట్టరు. నాయుడు గారు మాత్రం... వైఎస్సార్‌సీపీ పాలనతో తిరుమల అపవిత్రమైందంటూ వ్యాఖ్యానించారు. 

మీడియా నిజాలు రాయాలని ఒకపక్క సలహా ఇస్తూనే ఇంకో పక్క తానే అబద్దాలు  చెప్పడం ఆయనకే చెల్లిందేమో! ఎవరైనా ఆ దేవదేవుడికి అపవిత్రత ఆపాదిస్తారా? అని భక్తులు  ప్రశ్నిస్తున్నారు. పాలనపరంగా ఒకవేళ తప్పులు జరిగి ఉన్నా దేవుడు అపవిత్రమెలా అవుతాడు? బిఆర్ నాయుడు తన టీవీ ఛానెల్‌లో అర్దరాత్రి వేళ మసాలా పాటలు వేసే వారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బట్టతల మీద జుట్టు మొలిపిస్తామంటూ ఆయన గతంలో తన టీవీ ద్వారా ఒక నూనెను ప్రచారం చేసుకుని పెద్ద ఎత్తున సంపాదించిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తికి పవిత్రమైన ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారని టీడీపీలోనూ గుసగుసలు నడుస్తున్నాయి!

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో పలు మార్పులు చేశారు. భక్తులకు మేలైన వసతులు కల్పించే ప్రయత్నం జరిగింది. తనమీద రాకూడదన్న బాధ్యతతో జగన్‌ ఒకటికి, రెండుసార్లు జాగ్రత్తలు చెప్పేవారు. జగన్‌ టీటీడీ ధర్మకర్తగా నియమించిన తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి 44 సార్లు అయ్యప్ప మాల వేసుకుని దర్శనానికి వెళ్లిన భక్తుడు. సొంతంగా ఇంట్లో గోశాలను నిర్వహిస్తున్న వ్యక్తి. ఈయన హయాంలో అమెరికాలో సైతం శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవాలు నడిచాయి. భక్తులు ఎంతో సంతృప్తి చెందారు కూడా. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంగా పిలుస్తున్న అమరావతి, జమ్మూ వంటి నగరాల్లో వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. వై.ఎస్‌. జగన్‌ హయాంలో టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన కరుణాకర రెడ్డి వేలాది గ్రామాలలో దళిత గోవిందం కార్యక్రమాన్ని నిర్వహించి బలహీన వర్గాల వారికి కూడా వేంకటేశ్వరుడి దర్శనం చేయించింది. ఇన్ని మంచి పనులు చేసినా అప్పట్లో ఇదే బీఆర్‌ నాయుడికి చెందిన టీవీ5తోపాటు తెలుగుదేశం మీడియా దుర్మార్గంగా అసత్య కథనాలు ప్రసారం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అన్యమత ప్రచారం జరిగిందంటూ దారుణమైన అసత్యాలతో  అభాండాలు మోపింది. ఒక లైట్‌ శిలువ రూపంలో ఉందంటూ వదంతులు సృష్టించారు. వైఎస్సార్‌సీపీపై, జగన్ ప్రభుత్వంపై అక్కసు, ద్వేషంతో ఎల్లో మీడియా దేవుడికే అపచారం చేసింది.

ఇదీ చదవండి: TTD కొత్త చైర్మన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ తాను దైవ దర్శనానికి వెళ్లలేదని అంటున్న బీఆర్‌ నాయుడు భక్తి వెంకటేశ్వరుడిపైనా లేక టీడీపీపైనా అన్నది ఇక్కడే స్పష్టమవుతోంది. ఆయన చెబుతున్నట్లు నిజంగానే అపవిత్రం అయింది కనుక వెళ్లరాదని అనుకుంటే ఆయనకు పదవి ఇచ్చిన చంద్రబాబు, లోకేష్‌లు వైఎస్సార్‌సీపీ పాలనలో పలు మార్లు దైవ దర్శనానికి వెళ్లారే! బీఆర్‌ నాయుడి ప్రకారం.. వారు తప్పు చేసినట్లేనా? కాదూ అంటే.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు కూడా దైవదర్శనం చేసుకున్నప్పుడు పవిత్రంగానే ఉందని ఒప్పుకున్నట్లే  కదా? వారికి లేని అపవిత్రత నాయుడుకే ఎందుకు వచ్చింది? వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంటే టీడీపీ వాళ్లు.. టీడీపీ పాలనైతే వైఎస్సార్‌సీపీ వాళ్లు తిరుమల వెళ్లకూడదని పరోక్షంగా చెబుతున్నారా?

స్వామి వారిపై ఉన్న భక్తి ఇదేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అన్నిటికి మించి తిరుమల లడ్డూలో జంతు కొవ్వు నెయ్యి కలిసిందన్న పచ్చి అబద్ధాన్ని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు ఇద్దరూ చెబితే టీవీ5తోపాటు టీడీపీ మీడియా వందసార్లు అదే అబద్దాన్ని ప్రచారం చేశాయి కదా! అది స్వామివారి పట్ల అపచారం చేసినట్లు కాదా! కోట్లాది మంది హిందువుల మనో బావాలను దెబ్బ తీసినట్లు కాదా! ఆ పాపంలో బీఆర్‌ నాయుడు వాటా ఎంత? చంద్రబాబు సైతం ఈ విషయంలో నాలుక మడత వేసి కల్తీ జరిగింది కానీ ఎక్కడో అప్రస్తుతమని చెప్పి జారుకున్నారు. సుప్రీంకోర్టు సైతం రాజకీయాలలోకి దేవుడిని లాగవద్దని చెప్పింది కదా! అయినా నాయుడు ఇంకా పదవి చేపట్టక ముందే తిరుమలను రాజకీయం చేస్తున్నారే?

ఇంకో సంగతి... తిరుమల వైఎస్సార్‌సీపీ హయాంలో అపవిత్రమైందనుకుంటే అప్పట్లు జగన్ నియమించిన బోర్డు సభ్యులు నలుగురిని ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నారు?. వైఎస్సార్‌సీపీలోంచి టీడీపీలోకి వెళ్లిన వేమిరెడ్డి ప్రశాంతి, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, బీజేపీ నేతల సిఫారస్ మేరకు నియమితులైన కృష్ణమూర్తి వైద్యనాధన్, బోరాలకు ఎందుకు మళ్లీ పదవులు ఇచ్చారు. కల్తీ నెయ్యి అని చంద్రబాబు  ఆరోపించిన కొనుగోలు కమిటీలో ముగ్గురు సభ్యులుగా ఉన్నారే! వైఎస్సార్‌సీపీ వాళ్లు అపచారం చేసి ఉంటే, తిరుమల అపవిత్రమై ఉంటే వీరందరినీ తన కమిటీలో వేస్తూంటే బీఆర్‌ నాయుడు ఎందుకు అంగీకరించారు? వారిని తీసుకుంటే తాను పదవి చేపట్టనని చెప్పిఉండవచ్చు కదా?

టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఏడుగురి చొప్పున సభ్యులను తీసుకున్నారు. తెలంగాణ నుంచి ఎంపిక చేసిన టీడీపీ నేత నర్సిరెడ్డి గతంలో జగన్‌ను విమర్శించేందుకు  శ్రీ వెంకటేశ్వరుడు, బీబీ నాంచారమ్మలపై జోకులేసి అపచారం చేసిన వ్యక్తే. అలాగే చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయి రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి భోజన, వసతి సదుపాయాలు సమకూర్చిన వ్యక్తికి కూడా బోర్డు సభ్యత్వం దొరికింది. రియల్ ఎస్టేట్  రంగంలో ఉన్న ఎన్.ఆర్.ఐ.కి, మరికొందరు ఆర్ధికంగా స్థితిమంతులకు ఈ పదవులు దక్కాయి. ఈనాడు గ్రూప్ అధినేత కిరణ్ కోటాలో ఆయన బందువు సుచిత్ర ఎల్లాకు పదవి ఇచ్చారని చెబుతున్నారు. ఒక బ్రాహ్మణ అగ్రనాయకుడు లేదా వైశ్య నాయకుడికి స్థానం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా నెరవేరక పోవడంతో ఆయా వర్గాల వారు బాబుపై ఆగ్రహంగా ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ టైమ్‌లో గొడవలు చేసి ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని చెబుతూ వచ్చిన పార్టీ నాయకత్వం, అలాంటి వారెవ్వరికి టీటీడీ సభ్యత్వం ఇచ్చినట్లు లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో ఉండే ముఖ్యమైన జనసేన నేతలకు ఈ పదవులు కేటాయించలేదు. తన కోటాలో వచ్చిన మూడు పదవులను ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణకు చెందిన ఇద్దరు జనసేన నేతలకు, ఒక వ్యక్తిగత స్నేహితుడికి ఇచ్చారట. మాటలు చెప్పడం వేరు.చేతలు వేరు అనడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరమా?.

చంద్రబాబు రాజకీయ నిరుద్యోగులతో,  పారిశ్రామికవేత్తలతో, పైరవీకారులతో టీటీడీ బోర్డును నింపేశారని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి.ఇదే చంద్రబాబు  స్టైల్ అని అంటున్నారు. ఏది ఏమైనా ఇక నుంచి అయినా టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్వామివారి భక్తులకు పార్టీలు ఆపాదించకుండా ఉంటే మంంచిది. అంతేకాదు.ఇంతకాలం స్వామి వారికి అపచారం కలిగేలా అసత్య ప్రచారం చేసినందుకు  క్షమాపణ చెబితే భక్తులు సంతోషిస్తారు.

::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. 







 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement