పాలకమండలి సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల: టీటీడీ చైర్మన్‌గా తాను పనిచేసిన నాలుగేళ్లలో ఎక్కువమంది సామాన్య భక్తులకు తిరుమలలో వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించడం సంతృప్తిని ఇచ్చిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎల్1, ఎల్2, ఎల్3 టికెట్లు రద్దు చేయడంతోపాటు సామాన్యులు స్వామివారి తొలి దర్శనం చేసుకునేలా వారికి పెద్దపీట వేశామన్నారు. ఇందుకు వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాలు అత్యంత సంతృప్తినిచ్చాయని చెప్పారు.
నాలుగేళ్లపాటు చైర్మన్‌గా పనిచేసే అదృష్టం ప్రసాదించిన శ్రీవేంకటేశ్వరస్వామివారికి, తనకు అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు, సహకారం అందించిన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, సిబ్బందికి వైవీ కృతజ్ఞతలు తెలిపారు. నూతన చైర్మన్‌గా నియమితులైన భూమన కరుణాకర్‌రెడ్డి అనుభవం టీటీడీ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీటీడీ ప్రస్తుత ధర్మకర్తల మండలి చివరి సమావేశం సోమవారం తిరుమలలో వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధికారులు ఆయన నాలుగేళ్ల పదవీకాలంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అనంతరం వైవీ సుబ్బారెడ్డి తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే రూ.24 కోట్లతో తిరుమలలోని రెండు ఘాట్ రోడ్లలో రక్షణ గోడల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. కాగా టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు అందించిన సేవలు అనుసరణీయమని టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి కొనియాడారు. ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం భూమన శాలువాతో వైవీని ఘనంగా సన్మానించారు.
10న టీటీడీ చైర్మన్‌గా భూమన ప్రమాణ స్వీకారం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఈ నెల 10వ తేదీ ఉదయం 11.44 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన మొదటిగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని అనంతరం శ్రీవారి గరుడ అల్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, భూమన రెండోసారి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment