భూమన కరుణాకర రెడ్డి దంపతులకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న ఈవో ధర్మారెడ్డి. చిత్రంలో చెవిరెడ్డి, రోజా
సాక్షి, తిరుపతి/తిరుమల: సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం చేయించడానికే ప్రాధాన్యత ఇస్తానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి.. భూమన కరుణాకరరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ స్వామి సేవకులకు సేవకుడిగా పనిచేస్తానన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి దయ, ఆశీస్సులతో తనకు రెండోసారి టీటీడీ చైర్మన్‌గా సేవచేసే మహద్భాగ్యం దక్కిందన్నారు.
ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సనాతన హిందూధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా తమ ధర్మకర్తల మండలి పనిచేస్తుందని చెప్పారు. స్వామి వైభవాన్ని ప్రజల హృదయాల్లో తీర్చిదిద్దేలా వారిలో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతామని, స్వామిని భక్తుల దగ్గరికే తీసుకెళ్లి భక్తిప్రసాదం పంచుతామని తెలిపారు. దేశవిదేశాల్లోని హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేలా టీటీడీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు.
తాను 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు సనాతన హిందూధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశామని, సామాన్య భక్తులకు అవసరమైన వసతులు కల్పించటమేగాక సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇప్పిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఆర్.కె.రోజా, అంబటి రాంబాబు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment