సాక్షి, గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు. ఇప్పుడున్న ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రస్తుత టిటిడి బోర్డు పదవీకాలం ఆగస్టు 8తో ముగియనుంది.
అనుభవజ్ఞుడు, వివాద రహితుడు
ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా పని చేసిన అనుభవం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006 నుండి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా పని చేశారు భూమన.
వైఎస్సార్ జిల్లా, నందలూరు మండలం, ఈదరపల్లెలో జన్మించిన భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి B.A., M.A. చదివారు. మహాత్ముడి ఆత్మకథ సత్యశోధనను భూమన ప్రత్యేక శ్రద్ధతో పునర్ముద్రించారు.
రాజకీయ ప్రస్థానం
రాజకీయాల్లో డాక్టర్ వైఎస్సార్‌కు సన్నిహితంగా ఉండేవారు. 2012లో తిరుపతి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సిపి అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో తిరుపతి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత నెలలో (జులై 2023లో) భూమనను సభా హక్కుల కమిటీ ఛైర్మన్‍గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.
కాగా, తనను టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కరుణాకర్ రెడ్డి. తాజా నియామకంతో రెండేళ్ల పాటు టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment