ఎంపీ మిథున్‌పై దాడి.. పుంగనూరులో టీడీపీ గూండాల విధ్వంసకాండ  | TDP People Attack On MP Mithun Reddy At Punganur | Sakshi
Sakshi News home page

ఎంపీ మిథున్‌పై దాడి.. పుంగనూరులో టీడీపీ గూండాల విధ్వంసకాండ 

Published Fri, Jul 19 2024 4:41 AM | Last Updated on Fri, Jul 19 2024 6:52 AM

TDP People Attack On MP Mithun Reddy At Punganur

పుంగనూరులో రోజంతా టీడీపీ గూండాల విధ్వంసకాండ 

మారణాయుధాలు, రాళ్లతో పచ్చమూకల స్వైర విహారం

ఎంపీడీఓ కార్యాలయం వద్ద మాటు వేసి మూకుమ్మడిగా దాడి

నిలువరించేందుకు యత్నించిన మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ 

శ్రేణులపై రాళ్ల వర్షం.. రెడ్డెప్ప నివాసాన్ని చుట్టుముట్టి దుర్భాషలతో వీరంగం  

వాహనాలు ధ్వంసం.. మాజీ ఎంపీ కారుకి నిప్పు 

కళ్లెదుటే ఓ ఎంపీపై దాడికి తెగబడ్డా పోలీసుల ప్రేక్షక పాత్ర 

పరిస్థితి చేయి దాటడంతో గాల్లోకి కాల్పులు జరిపిన మిథున్‌రెడ్డి గన్‌మెన్‌ 

సొంత నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యేలు పర్యటించకుండా అడ్డుకుంటున్న కూటమి ప్రభుత్వం  

సాక్షి ప్రతినిధి, తిరుపతి: వినుకొండలో నడి­రోడ్డుపై వైఎస్సార్‌ సీపీ కార్యకర్తను నరికి చంపిన టీడీపీ గూండాలు 12 గంటలు గడవక ముందే పుంగనూరులో మరో విధ్వంస కాండను సృష్టించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్సార్‌ సీపీ నాయకులు, కా­ర్యకర్తలే లక్ష్యంగా  జరిగిన దాడుల్లో తీవ్రంగా గా­య­పడిన వారు, ఆస్తులు, పంటలను కోల్పోయి­న బాధితు­లను పరా­మర్శించి భరోసా కల్పించేందుకు వచ్చిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అంతమొందించే ప్రణాళికతో పచ్చముఠాలు గురు­వారం రోజంతా మారణాయుధాలతో తిష్ట వేసి దాడులకు దిగాయి.

నాలుగు గంటలు స్వైర విహారం..
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని హతమా­ర్చడమే లక్ష్యంగా అసాంఘిక శక్తులు పుంగనూరు­లో తీవ్ర ఉద్రిక్తతలు రేకెత్తించాయి. గురువారం ఉదయం 8 గంటల సమయంలో మిథున్‌రెడ్డి పుంగనూరు ఎల్‌ఐసీ కాలనీలోని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో సమావేశమైన విషయం తెలుసుకున్న టీడీపీ మూ­కలు రెచ్చిపోయాయి. ఎంపీ మిథున్‌రెడ్డిని రాళ్లు, కర్రలతో కొట్టి చంపేందుకు మూకుమ్మడిగా దాడు­లకు తెగబడ్డాయి. 

టీడీపీ గూండాలను నిలు­వరించేందుకు యత్నించిన మాజీ ఎంపీ, దళిత నాయ­కుడు రెడ్డప్పపైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. దుర్భాషలాడుతూ రెడ్డప్ప నివాసంలోకి చొరబడ్డారు. ప్రమాదాన్ని పసిగట్టిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు తలుపులు మూసివేయడంతో బద్ధలు కొట్టేందుకు యత్నించారు. రెడ్డప్ప నివా­సంలోకి రాళ్లు రువ్వారు. ఇంటి ముందు ఉన్న పలు వాహనాలను ధ్వంసం చేసి రెడ్డప్ప వాహనానికి నిప్పు పెట్టి తగలబెట్టారు. 

నిలువరించేందుకు ప్ర­య­త్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనా దా­డులు చేశారు. ఘటన గురించి తెలియడంతో అ­క్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులపైనా దాడిచేసి తీవ్రంగా గాయపరి­చారు. 4 గంటలపాటు సాగిన ఈ విధ్వంసంతో పుంగనూరులో తీవ్ర ఉ­ద్రిక్త పరిస్థితులు నెలకొ­న్నాయి. 

ఏకంగా ఓ ఎంపీనే  హత్య చేసేందుకు తెగించినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తు­తున్నా­యి. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంతోపాటు టీడీపీ శ్రేణులు కూల్చివేసిన ఇండోర్‌ స్టేడియాన్ని పరిశీలించి ఎంపీ మిథున్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుసుకున్న అల్లరిమూకలు హింసాకాండకు బుధవారం రాత్రే పక్కా పథకం రూపొందించినట్లు సమాచారం. 


మూకుమ్మడిగా చంపాలన్నదే టార్గెట్‌!
ప్రణాళికలో భాగంగా టీడీపీ మూకలు ఉదయం నుంచి స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమీపంలో రాళ్లు, కర్రలు, ఇతర ఆయుధాలతో మాటు వేశాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ముగించి మిథున్‌రెడ్డి బయటకు వస్తున్నట్లు గుర్తించి ఒక్కసా­రిగా విరుచుకుపడ్డాయి. రాళ్లు రువ్వుతూ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసాన్ని చుట్టుముట్టాయి. 



వారిని అడ్డుకునేందుకు యత్నించిన రెడ్డప్పపైనా దాడికి దిగాయి. ‘రేయ్‌.. బయటకు రారా..’ అంటూ దుర్భా­షలకు దిగాయి. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌ గాయపడగా 25 మందికిపైగా వైఎస్సార్‌సీపీ కార్య­కర్త­­లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు సాక్షి విలేక­రు­లతోపాటు మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

గాల్లోకి కాల్పులు జరిపిన ఎంపీ గన్‌మెన్‌
ఎంపీ, మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేతలకు చెందిన 15 వాహనాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేశా­రు. మరో 12 ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశా­రు. మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనానికి నిప్పుపెట్టి తగలబెట్టారు. రెడ్డెప్ప నివాసం వద్ద పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అల్లరి మూకల నుంచి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని రక్షించేందుకు గన్‌మెన్‌ రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. 

అడుగడుగునా పోలీస్‌ వైఫల్యం
పుంగనూరులో జరిగిన విధ్వంస కాండలో అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం కనిపించింది. పోలీసుల సమక్షంలోనే రాళ్లు రువ్వుతూ, కర్రలతో స్వైర విహారం చేస్తున్నా చూస్తుండిపోయారు. భారీగా టీడీపీ మూకలు మోహరించినా వెంటనే స్పందించాల్సిన ఉన్నతాధికారులు తీరిగ్గా కొంత మంది పోలీసులను పంపి చేతులు దులుపుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎంపీ మిథున్‌రెడ్డి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. 

బాబు ఆదేశాలతో హౌస్‌ అరెస్టు..
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి గత నెల 15న పుంగనూరులో పర్యటించాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసులు వారిద్దరినీ తిరుపతిలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. తాజాగా పార్టీ కార్యకర్తలను, బాధితులను  పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డిని ఏకంగా హతమార్చేందుకు పచ్చమూకలు పథకం వేశాయి.

బెదిరింపులకు భయపడం: ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలే అజెండాగా పని చేస్తోంది. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పురిగొల్పడం దారుణం. ప్రజలు అన్ని విష­యాలను గమనిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నియోజకవర్గంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదు. అభివృద్ధి అంటే వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, పిల్లలు ఆడుకునే బ్యాడ్మింటన్‌ కోర్టును ధ్వంసం చేయడమా? ప్రజా­స్వామ్యంలో దాడులకు తావులేదు. 


చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తు­న్నారు. డీఎస్పీ, సీఐ స్థాయి అధికారుల ఎదుటే దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని మరో బిహార్‌లా మార్చే యత్నం చేస్తున్నారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తేలేదు. ప్రజలకు అం­డగా ఉంటాం. ప్రజ­ల్లోనే ఉంటూ మరోసారి వైఎస్సార్‌సీపీని అధికా­రంలోకి తెచ్చేందుకు కృషి చేస్తాం. తిరిగి ఎన్ని­కలు జరిగితే వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుంది. 

అమ్మ ఒడి పథకం పేరు మార్చి తల్లికి వందనం అంటూ ఒక్కరికే ఇస్తామని మాట మార్చారు. అభివృద్ధిని విస్మరించి, సంక్షేమ పథకాలను ఆపివేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి పొందకుండా తమ పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన సంస్థను చంద్రబాబు సర్కారు కుటిల యత్నాలతో అడ్డుకోవడం సరికాదు. హింసాత్మక ఘటనలు పునరావృతమైతే టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

రాళ్లతో కొట్టి చంపే యత్నం 
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని రాళ్లతో కొట్టి చంపాలని టీడీపీ రౌడీమూకలు యత్నించాయి. పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఎక్కడా లా అండ్‌ ఆర్డర్‌ లేదు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. దళిత నాయకుడైనా నాపైనా దాడి చేశారు. నా ఇంటిని చుట్టుముట్టి రాళ్లు, మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. నా కారుకి నిప్పుపెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక విధ్వంసకాండకు తెర తీసింది. ప్రశాంతంగా ఉండే పుంగనూరులో 12 సార్లు దాడులు జరిగాయి.
– మాజీ ఎంపీ రెడ్డప్ప

పాలనపై దృష్టి పెట్టండి
చంద్రబాబు దాడులపై కాకుండా పాలనపై దృష్టి సారించాలి. ప్రజా ప్రతినిధులకు రక్షణ  కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ నిర్వీర్యంగా మారింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు తగవు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి వారి మెప్పు పొందాలే కానీ దాడులకు పాల్పడడం సరి కాదు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం నిర్వీర్యం కాకుండా చూసే బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులదే. వారి తీరు చూస్తుంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించే పరిస్థితి కనిపించటం లేదు.
– నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎం

హేయమైన చర్య
రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేయడం అత్యంత హేయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ ఎంపీకే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్యులను ఎలా కాపాడుతుంది? ఎంపీపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూశారంటే రాష్ట్రంలో ఎలాంటి ఆటవిక పాలన కొనసాగుతుందో తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని టీడీపీ పాలనలో చూస్తున్నాం. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలి. దాడులకు తగిన మూల్యం చెల్లించుకునే రోజు కచ్చితంగా వస్తుంది. 
– మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement