తిరుపతి తొక్కిసలాట ఘటన..ఆ పాపం వాళ్లదే | Ex Minister Ambati Rambabu Comments On Tirupati Stampede | Sakshi
Sakshi News home page

తిరుపతి తొక్కిసలాట ఘటన..ఆ పాపం వాళ్లదే

Published Thu, Jan 9 2025 2:33 PM | Last Updated on Thu, Jan 9 2025 4:43 PM

Ex Minister Ambati Rambabu Comments On Tirupati Stampede

సాక్షి,తాడేపల్లి: తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు శ్రీవారి భక్తుల మృతికి చంద్రబాబు పాలనా వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి పర్యటనలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు వల్లే శ్రీవారి సేవే పరమావధిగా పనిచేయాల్సిన టీటీడీ కాస్తా టీడీపీ సేవలకు పరిమితమయ్యిందని విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఘోర ప్రమాదం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంకు వచ్చే భక్తులకు టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, పలువురు గాయపడటం బాధాకరం. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తిరుమలపై ప్రతి అంశాన్ని వివాదంగా చేస్తున్నారని అన్నారు.  వైఎస్‌ జగన్ తిరుమల దర్శనం కోసం వస్తున్నారని తెలియగానే ఈఓ, జెఈఓలు పెద్ద పెద్ద బోర్డ్‌లు కట్టారు. ఆయన పర్యటన రద్దు అనగానే వెంటనే వాటిని తొలగించారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా వారు పనిచేస్తున్నారు. 

శ్రీవారి ఆలయంలో పనిచేసే వారు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తన టీవీ ఛానెల్‌లో పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రచారానికి ప్రతిఫలంగా ఆయనకు ఈ పదవి దక్కింది. టీటీడీ ఛైర్మన్‌గా ఉండి కూడా జగన్‌పై రాజకీయపరమైన విమర్శలు చేశారు. ఆయనకు శ్రీవారి పట్ల నిజమైన భక్తి లేదు. ప్రతిసారీ తిరుమలపై వివాదాలను సృష్టించి, రాజకీయంగా వైఎస్సార్‌సీపీని అణచివేయడానికి బీఆర్ నాయుడు, ఈఓ, జెఈఓలు ప్రయత్నించారే తప్ప భక్తులకు సేవ చేయాలని ఏనాడు పనిచేయలేదు. వారి దుర్మార్గమైన ఆలోచనల వల్లే ఇటువంటి దుర్ఘటన జరిగింది. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన కూడా ఒక ప్రహాసనంలా కనిపిస్తోంది. ఈ కేసులో తన వారిని కాపాడుకునేందుకు కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.

టీటీడీ సేవ కాదు టీడీపీకి సేవ చేస్తున్నాడు ఓ సనాతనీ నోరు తెరువు

సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడు పవన్ కళ్యాణ్ ఇంత వరకు దీనిపై స్పందించలేదు. ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని కాపాడేవారు అనేక మంది ఉన్నారు. అటువంటి వారు ఇటువంటి ఘటనలపై స్పందించాలి. ధర్మ పరిక్షణ కోసం ఏం చేయాలో చెప్పాలి. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలో ఈ ప్రభుత్వానికి సూచించాలి. పీఠాధిపతులు, స్వామీజీలు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారికి కోటి రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వాలి. క్షతగాత్రులకు కనీసం పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రమాదం జరిగిన తరువాత కూడా వైద్యశాలకు వెళ్ళినటువంటి వారికి వైద్యం అందలేదు. గాయపడిన వారి పట్ల కనీసం బాధ్యత తీసుకోలేదు. చంద్రబాబు ఏరి కోరి తెచ్చుకున్న తిరుపతి ఎస్పీ ప్రజల కోసం కాకుండా కేవలం టీడీపీ కోసమే పనిచేస్తున్నారు. వైఎస్సార్‌సీపీపై తప్పుడు కేసులు బనాయించడంలోనే ఆయన మునిగిపోయాడు. ఈ ప్రమాదంపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement