
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ బోర్డు) చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, ధర్మకర్తల మండలి పదవీకాలం ఈ నెల 8వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్‌గా భూమనను సీఎం వైఎస్ జగన్ నియమించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ శనివారం జారీ చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులను త్వరలో నియమిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సీఎం జగన్‌కు భూమన కృతజ్ఞతలు
తనను టీటీడీ చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు భూమన కరుణాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన భూమన కరుణాకర్‌రెడ్డి 1958, ఏప్రిల్ 5న వైఎస్సార్ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో జన్మించారు. ఆయన తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2004–06 మధ్య తుడా(తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్‌గా భూమన పనిచేశారు.
ఆ తర్వాత 2006–08 మధ్య టీటీడీ బోర్డు చైర్మన్‌గా అత్యంత సమర్థవంతంగా పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత వైఎస్ జగన్ వెంట భూమన నడిచారు. తిరుపతి శాసనసభ స్థానానికి 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యరి్థగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి శాసనసభ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా భూమన వ్యవహరిస్తున్నారు.