సాక్షి, అమరావతి: హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని ఆయన బలోపేతం చేశారన్నారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు.
ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారని, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 వేల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న 1,401 దేవాలయాలకు దీని ద్వారా సాయం అందించేవారని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం 150 ఆలయాలను మాత్రమే ఈ కార్యక్రమంలోకి కొత్తగా తెచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.30 వేల వార్షికాదాయ పరిమితిని రూ.లక్షకు పెంచి, 2,978 దేవాలయాలకు అదనంగా లబ్ధి చేకూర్చామన్నారు.
ప్రస్తుతం 4,750 దేవాలయాలకు ఈ కార్యక్రమం ద్వారా నిధులు సమకూరుస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఏటా రూ.28.50 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో 2,961 దేవాలయాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.ఈ దేవాలయాల నిర్వహణకు ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు.
♦ అర్చకులకు ఇచ్చే గౌరవ వేతనాల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయని వాటిని సరిచేయడంతో పాటు, అర్చకులు, పురోహితులకు దేవదాయ శాఖ నుంచి గుర్తింపు కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు.
♦ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. వినుకొండలోని కొండపై దేవాలయం నిర్మాణంలో భాగంగా ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసిందన్నారు.
♦ రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా ధూపదీప నైవేద్యం కార్యక్రమం పరిధిలోకి రాకుండా మిగిలిపోయిన ఆలయాలు ఉంటే వాటికి ఈ కార్యక్రమాన్ని వర్తింపజేయాలని పొన్నూరు ఎమ్మెల్యే కె. రోశయ్య విజ్ఞప్తి చేశారు.
♦ విజనరీనని గొప్పలు చెప్పే చంద్రబాబు తాను సీఎంగా ఉండగా సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో దేవాలయాల అభివృద్ధికి చేసింది శూన్యమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి. మధుసూదన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
♦ అన్యాక్రాంతమైన దేవాలయాల భూములను పరిరక్షించాలని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు.
సర్వే నంబర్లు సబ్‌డివిజన్ కాకపోవడంతోనే ఆలస్యం
సర్వే నంబర్ల సబ్ డివిజన్ కాకపోవడంతోనే నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు ఆలస్యమవుతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల రైతుల భూములు దేవదాయ భూములుగా నమోదైనట్టు పేర్కొన్నారు. ఐఎఫ్‌ఆర్, ఇనాం, ఆర్‌ఎస్‌ఆర్ వంటి భూములను క్షుణ్ణంగా పరిశీలించి నిషేధిత జాబితాను సవరిస్తామని చెప్పారు. రైతుల భూములను దేవదాయ భూములుగా నమోదు చేసిన అధికారులపై చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. మంత్రి వివరణను కందుకూరు ఎమ్మెల్యే ఎం.మహీదర్‌రెడ్డి ఆక్షేపించారు.
చిన్న, సన్నకారు రైతుల భూములు రెవెన్యూ శాఖను అడిగే ఎండోమెంట్‌లో కలుపుకున్నారా? అని ప్రశ్నించారు. నిషేధిత జాబితా నుంచి తొలగించమంటే రెవెన్యూ శాఖను బాధ్యులను చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వం చేసిన పాపానికి ఎనిమిదేళ్లుగా రైతులు భూముల హక్కులు బదలాయించుకోలేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కందుకూరు అర్బన్ పరిధిలో 15 ఎకరాల దేవదాయ భూమి మాత్రమే ఉంటే.. 600 ఎకరాలకు పైగా రైతుల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలకు గురైన దేవదాయ భూములను పరిరక్షించకుండా.. రైతుల భూములను అన్యాయంగా నిషేధిత జాబితాలో చేరుస్తున్నారంటూ ఆరోపించారు. దీనికి మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందిస్తూ వీలైనంత త్వరగా నిషేధిత జాబితాను సవరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment