బాలరాముని అయోధ్య మందిరం ఇప్పుడు అంతర్జాతీయ వార్తగా మారింది. ఇక వచ్చే వారం రోజులైతే నిజంగానే ‘‘అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామ మయం’’. ఏదో ఒక రూపంలో రామాయణ కావ్యం లేని వాఙ్మయం ఆసియా దేశాల్లో ఎక్కడా లేదు. భారతీయ సంతతి ప్రజలు నివాసముండని దేశాలు ఈ భూఖండంలో ఒకటో రెండో కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. రామా యణం భారతీయుల జీవన విధాన పారాయణంగా మారినందువల్ల ఆ సంప్రదాయాన్ని మనవాళ్లు దేశదేశాలకూ మోసుకొని వెళ్లారు.
రామనామం పవర్ ఏమిటో బీజేపీ వాళ్లకు తెలిసినంతగా మరే రాజకీయ పార్టీకీ తెలియదు. మన దేశంలోని ఆబాల గోపా లాన్ని టెలివిజన్ ఛానెళ్ల ముందు కూర్చోబెట్టిన తొలి దృశ్య కావ్యం కూడా రామాయణమే. ఒక దశలో లోక్‌సభలో కేవలం రెండే సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ రామభక్తి రసాన్ని రణవ్యూహంగా మార్చుకున్న తర్వాతనే తొంభై సీట్లకు, మూడంకెలకు, ఆపై ప్రభుత్వ స్థాపన స్థాయికి ఎగబాకింది. ఇప్పుడు ప్రభుత్వంలో బలంగా స్థిరపడిపోయింది. పూర్వం రాజాధి రాజులు, చక్రవర్తులు బలంగా ఉన్నప్పుడే అశ్వమేధ యాగాలు చేసేవారట! శత్రు నిశ్శేషం చేసుకోవడం వాటి లక్ష్యం.
ఇప్పుడు దేశంలో బీజేపీ బలంగానే ఉన్నది. అయినా రామాలయ ప్రతిష్ఠాపనను తన ప్రభుత్వ భుజాల మీదకే ఎత్తుకున్నది. అశ్వమేధయాగం స్థాయిలో ఈ మహా క్రతువుకు నడుం కట్టింది. ప్రతిష్ఠాపన యజ్ఞంలో ప్రధానమంత్రి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అందుకు అవసరమైన పదకొండు రోజుల అనుష్ఠానాన్ని కూడా ఆరంభించారు. దీని మీద రక రకాల అభ్యంతరాలు, అభిశంసనలు వస్తున్నాయి. శ్రీరామ చంద్రుడు భార్యావియోగ దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు వశిష్టాది రుషులంతా పూనిక వహించి ఆయన చేత అశ్వమేధం చేయిస్తారు. రాముడికో అనుమానం వస్తుంది. భార్యా విహీనుడైన తానెట్లా యాగం చేయగలనని ప్రశ్నిస్తాడు.
భార్యా సమేతంగానే యజ్ఞ యాగాది క్రతువుల్లో పాల్గొనాలనేది నియమం. శ్రీరామునికి బావ గారైన రుష్యశృంగ మహాముని ఆయన సందేహాన్ని నివృత్తి చేస్తాడు. బంగారంతో భార్య విగ్రహాన్ని చేయించి పక్కన పెట్టుకొని యజ్ఞం పూర్తి చేయొచ్చని తరుణోపాయం చెబుతాడు. త్రేతాయుగంలోనే అవసరాన్ని బట్టి విరుగుడు మంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కలియుగం చివరి పాదంలో ఇప్పుడుండవా? కనుక ఆ విషయంలో మోదీపై అభ్యంతరాలు చెల్లవని శ్రీరామ వర్సెస్ అదర్స్ కేసులో రుష్యశృంగ న్యాయమూర్తి తీర్పు స్పష్టం చేస్తున్నది.
శ్రీరామచంద్రమూర్తి ఒక మతానికి ప్రతీకా? ఇదొక చర్చనీయాంశం. ఈ దేశంలోని మెజారిటీ ప్రజల అభిమతాన్ని మెప్పించి లబ్ధి పొందడమే బీజేపీ ప్రభుత్వ రాజకీయ ఉద్దేశం కావచ్చు. కాదనడానికి ప్రాతిపదిక లేదు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దండయాత్రగానే రామ మంత్రాన్ని బీజేపీ జపించింది. హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే గత ఎన్నికల మేనిఫెస్టోలో ఆలయ నిర్మాణాన్ని ఆ పార్టీ చేర్చింది. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల వాకిట్లో సాక్షాత్తూ ప్రధానమంత్రి హస్తాల మీదుగా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగడం వెనుక రాజకీయ కారణాలే ఉంటాయి. కానీ, అది ఎన్నికల హామీయే కనుక నిలబెట్టుకుంటున్నామని బీజేపీ వాదిస్తున్నది.
శ్రీరాముడు హిందూ మతానికి ప్రతీకగా భావిస్తే లౌకిక రాజ్యంలో ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకోవడం భావ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుంది. అసలు హిందూమతం అంటూ ఒకటున్నదా అనే ప్రశ్న కూడా తరచుగా వినిపిస్తున్నది. ఒక నిర్ధారిత పవిత్రగ్రంథం, ఒక ప్రవక్త లేని జీవన విధానాన్ని మతం అనవచ్చునా? బీజేపీ వాళ్లూ, సంఘ్ పరివార్ వాళ్లూ హిందూమతం అనే మాట కంటే హిందూ ధర్మం అనే మాటనే ఎక్కువగా వాడుతుంటారు. అందుకు కారణం విశ్వాసమైనా కావచ్చు, ఎత్తుగడైనా కావచ్చు. హిందూ ధర్మం అంటే ఏమిటి? అనేది ఇంకో ప్రశ్న.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ అంశంపై దేశంలో పెద్ద చర్చే జరిగింది. సనాతనమంటే శాశ్వతమనే అర్థమున్నది. ధర్మం శాశ్వ తంగా స్థిరంగా ఉంటుందా? కాలానుగుణంగా మారదా? యుగ ధర్మం అంటారు కదా! అంటే ఏమిటి? ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే అన్నాడు కృష్ణ భగ వానుడు. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని కాపాడేందుకు తాను అవతరిస్తానని భావం. అంటే యుగధర్మాన్ని కాపాడేందుకు అవతరించడమా లేక శాశ్వత ధర్మాన్ని రక్షించడానికి ప్రతి యుగంలో అవతరించడమా?
‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని శ్రీరామచంద్రుడిని ప్రశంసిస్తారు. ధర్మానికి ఒక రూపం ఇస్తే అది రాముడిలా ఉంటుందనీ, రాముడు ధర్మ స్వరూపుడనే అర్థంలో! పైగా ఈ మాట అన్నది ఎవరో కాదు. శ్రీరాముని శత్రు శిబిరంలోని వాడైన మారీచుడు. శ్రీరాముడు వరాలిచ్చిన దేవుడు కాదు. ఆపద మొక్కులవాడూ కాదు. ఒక మనిషి. స్వయంగా కోరి కష్టాలను అనుభవించినవాడు. రుజు ప్రవర్తన కలిగినవాడు. తండ్రి మాటను తలదాల్చినవాడు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వాడు. ఒక్కరితోనే జీవన సాహచర్యమని నమ్మినవాడు, ఒక రాజుగా ప్రజాభిప్రాయాన్ని మన్నించినవాడు. శిష్టరక్షణకు దుష్టశిక్షణకు వెనుకాడనివాడు.
ఈ రకంగా తన జీవితాన్ని ఒక పాఠంగా ఈ సమాజానికి అందించినవాడు కనుకనే ఆయనను ధర్మస్వరూపుడని కీర్తించారు. భారతీయులపై రామాయణ ప్రభావం మత విషయాల కంటే సాంస్కృతిక రంగంలోనే ఎక్కువ. సామాజిక కట్టుబాట్లపైన, నైతిక నియమాలపైన, మన సాహిత్యం, సంగీతం, కళలు, నాట్యంపైనా రామాయణం ముద్ర ఉన్నది. ధర్మం, కర్మ, జీవిత పరమార్థం వంటి అంశాలు మన తాత్వికతను పరిపుష్టం చేశాయి. మన పాత్రను సక్రమంగా ఎలా అర్థం చేసుకోవాలో రామాయణం చెబుతుంది. నమ్మిన మార్గంలో సవాళ్లు ఎదురైనా ఎలా ముందుకు వెళ్లాలో రామా యణం బోధిస్తుంది.
లోతుగా పరిశీలిస్తే శ్రీరాముని పాత్ర భారతీయ సమాజంపై వేసిన ముద్ర మతపరమైనదిగా కనిపించదు. ధార్మికమైనది, సాంస్కృతిక పరమైనదిగానే కనిపిస్తుంది. కాకపోతే శ్రీరాముడికి బీజేపీ–సంఘ్‌పరివార్ కొంత రాజకీయం పులమడంతో ఈ కార్యక్రమం మీద మతం రంగు పడింది. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ఠ ఏమిటని మతపెద్దలే కొందరు పెదవి విరుస్తున్నారు.
కొద్దిరోజుల్లో దివ్యమైన సందర్భం శ్రీరామనవమి ఉండగా ఎందుకీ తొందరపాటని విసుక్కుంటున్న వారు కూడా ఉన్నారు. శంకరాచార్యుల వంటి శైవ కూటమి పెద్దలు కార్యక్రమాన్ని అభిశంసిస్తున్నారు. లౌకిక వాదుల విమర్శలు సరేసరి! బీజేపీ, సంఘ్ పరివార్‌ల మూడు దశాబ్దాల కృషి అయోధ్య రామమందిరం. ఇన్నాళ్ల శ్రమను ఎన్నికల్లో గిట్టుబాటు చేసుకోకుండా ఎలా ఉంటాయి?
శ్రీరాముడి ఆదర్శాలన్నీ త్రేతాయుగానికి సంబంధించినంత వరకు ధర్మబద్ధమే కావచ్చు. యుగాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతాయి. వేదవేదాంగాల వంటి శ్రుతులు చెప్పిన విషయాలు నిత్య సత్యాలనీ, మనుస్మృతి వంటి స్మృతులు పెట్టిన నియమాలు కాలాన్నిబట్టి మారుతాయనీ పండితులు చెబుతారు. శ్రీరాముడు చేసిన కొన్ని పనులు ఆ తర్వాతి యుగాలకు సమ్మతమయ్యేవి కావు.
బహుశా ఆ కాలంలో కూడా అసమ్మతి గళాలున్నా రామాయణంలో వినిపించలేదేమో. వర్ణాశ్రమ ధర్మాన్ని ధిక్కరించి తపస్సు చేస్తున్న శూద్ర శంబూ కుని తలను శ్రీరాముడు తెగనరికాడు. ఒకే ఒక్కడి మాటకు ప్రజాభిప్రాయమనే ముద్రవేసి సీతమ్మను అడవులకు పంపించాడు. రావణుడి చెర నుంచి విడిపించినప్పుడు ఆమె శీల పరీక్షకు ఆదేశించాడు. ఇవన్నీ ఏ యుగంలోనూ ఆదర్శాలు కాబోవు.
ప్రజా క్షేమం కోరే పరిపాలన, మాట తప్పని వ్యక్తిత్వం, సవాళ్లకు తలవంచకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం, ఏక పత్నీవ్రతం వంటి రామయ్య సుగుణాలు సర్వకాల సర్వా వస్థల్లోనూ ఆదర్శంగా నిలబడతాయి. అటువంటి ఆదర్శాలకు గుర్తుగా భవ్యమైన రామమందిరం రాజకీయాలకు అతీతంగా ప్రారంభమైతే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. అయో ధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సరిగ్గా మూడు రోజుల ముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో గొప్ప విగ్రహావిష్కరణ కార్య క్రమం జరగబోతున్నది.
శ్రీరాముడు త్రేతాయుగ ధర్మానికి, కొన్ని శాశ్వత మానవీయ విలువలకు సంకేతమైతే, ఈ ప్రజా స్వామ్య యుగ ధర్మాన్ని క్రోడీకరించి, రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథ రచనకు నేతృత్వం వహించినవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన విగ్రహ ప్రతిష్ఠాపన ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగబోతున్నది.
రామాలయం లేని ఊరు ఉండదనేది యాభయ్యేళ్ల కిందట తెలుగునాట తరుచుగా వినిపించిన నానుడి. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి, షిర్డీ సాయిబాబా, అయ్యప్ప స్వామి విజృంభించడంతో ఇప్పుడు ఆ నానుడి వినిపించడం లేదు.
దళితులు, బలహీన వర్గాల ప్రజలు విద్యావంతులవుతున్నకొద్దీ డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలు కూడా ఊరూరా విస్తరించాయి. ఇప్పుడు ఆయన విగ్రహం లేని ఊరు తెలుగు నాటనే కాదు, దేశంలోనే ఎక్కడా లేదు. ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రతిష్ఠాత్మక ప్రదేశాల్లో కూడా అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు విజయవాడ నగరం నడిబొడ్డున పద్దెనిమిది ఎకరాల స్వరాజ్య మైదాన్‌లో ఆవిష్కృతం కాబో తున్న ‘స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ ఒక ఎత్తు. ప్రపంచంలో ఉన్న అన్ని అంబేడ్కర్ విగ్రహాల కంటే ఇది ఎత్తయినది. 80 అడుగుల పాదపీఠికపై 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నది. మొత్తం కలిపి 210 అడుగులు.
ఆంధ్రప్రదేశ్‌లో పెత్తందారీ వర్గాలపై, ఆ వర్గాలు ఆధి పత్యం వహిస్తున్న వ్యవస్థలపై పేదల పక్షాన వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయపోరాటం చేస్తున్నది. ఆ పోరా టానికి నిరంతర స్ఫూర్తి జ్వలితరూపంగా ఈ విగ్రహం నిలబడబోతున్నది. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛా ప్రజాస్వామిక యుగధర్మాలు. ఈ ధర్మాలకు రాజ్యాంగ రచనలో పెద్దపీట వేయడమే కాదు, ప్రజాశ్రేణుల్లో వాటిపై అవగాహన కల్పించడంలోనూ ఆయన కృషి చేశారు. కులవ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా నిజమైన సమానత్వం సిద్ధించదని బోధించాడు.
దేశ ప్రజలందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేకూర్చడం, భావ ప్రకటనా, ఆరాధనా స్వేచ్ఛలను ప్రసాదించడం, అందరికీ సమాన అవకాశాలు, సమాన గౌరవాలు కల్పించడమే ధ్యేయంగా రాజ్యాంగాన్ని అంబేడ్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ రూపొందించింది.
ఆ రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయడానికి పూనుకోవడమే నేరంగా భావించిన ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వర్గం జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. యెల్లో మీడియా చానళ్లు రోజుకు 20 గంటల సమయాన్ని, పత్రికలు ముప్పావు భాగం స్థలాన్ని జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయ డానికి వినియోగిస్తున్నాయి.
అవకాశవాద పొత్తులతో ప్రజా ప్రభుత్వాన్ని ఓడించడానికి కుట్రలు చేస్తున్నాయి. డబ్బులు వెద జల్లుతున్నాయ్. మీడియా–సోషల్ మీడియాల విషప్రచారాలు చాలవని వేలాదిమందిని దినవేతనంపై సమీకరించి వారి ద్వారా కూడళ్లలో విషప్రచారానికి పాల్పడుతున్నాయి. కానీ సమానత్వం ఈ యుగధర్మం. ధర్మంపై అధర్మం గెలవదు. యుగయుగాల సందేశం ఇదే!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
రామ్... భీమ్... యుగధర్మం!
Published Sun, Jan 14 2024 4:58 AM | Last Updated on Sun, Jan 14 2024 4:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment