ఇసుకేస్తే రాలనట్టుగా, నేల ఈనినట్టుగా, ఆకాశానికి చిల్లులు పడి కుండపోతలు కురిసినట్టుగా జనం కనిపిస్తే... వారి సంఖ్యను లక్షల్లో చెబుతారు. అదే స్థాయిలో ఒక సైన్యం కని పిస్తే... పూర్వకాలంలోనైతే అక్షౌహిణుల్లో కొలిచేవారు. ఇదిగో ఇప్పుడు దెందులూరు వైసీపీ సభలో కనుచూపు మేర చీమల దండులా కనిపిస్తున్న వారంతా సైన్యమే! కార్యకర్తల సైన్యం! ఎంతమంది ఉంటారు? రెండు అక్షౌహిణులు? అంతకంటే ఎక్కువ? రథ గజ తురగ పదాతి విభాగాలు కలిసిన ఒక అక్షౌహిణిలో సుమారు 2 లక్షల 20 వేలమంది ఉంటారు. ఇది మహా భారతం లెక్క. పోయిన వారం భీమిలిలో, ఇవ్వాళ దెందులూరులో కార్యకర్తలు ఎందుకిలా పోటెత్తారు? ప్రతి పల్లె నుంచి పదుల సంఖ్యలో ఎందుకు కదిలారు? ప్రభంజనంలా ఎందు కిలా సాగుతున్నారు? వారికేం లాభం? ఏం ఒరిగింది వారికి?...
ఎందుకంటే సమాజానికి ఏదో లాభం జరుగుతున్నది. ప్రతి కుటుంబానికీ సంక్షేమం అందుతున్నది. తాము అభిమానిస్తున్న నాయకుని సారథ్యంలోని ప్రభుత్వ పనితీరును వారు గమనించారు. ఈ స్వల్పకాలంలోనే రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచి కలు చిగురించడం, మొగ్గ తొడగడం వారి అనుభవంలోకి వచ్చింది.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలు ‘జన్మభూమి కమిటీ’ పేరుతో జనాన్ని చెండుకు తిన్నారు.
ప్రతి పనికీ రేటు కట్టి పిండుకున్నారు. ఇప్పుడా అవకాశం వైసీపీ కార్యకర్తలకు ఎంతమాత్రం లేదు. ప్రజాహిత కార్యక్రమాల్లో పార్టీ చొరబాట్లు లేవు. అర్హతే ప్రాతిపదికగా పారదర్శక పాలన ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చింది. వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అభ్యుదయ మార్పులే అధికార పార్టీ కార్యకర్తలను ఉత్తేజితం చేస్తున్నాయి. అందువల్లనే లక్షలాది మంది కార్యకర్తలు సొంత లాభం కోసం పాకులాడకుండా పార్టీ గెలుపు కోసం కెరటాలు కెరటాలుగా తరలివస్తున్నారు.
పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ సభల్లో కార్యకర్తలనుద్దేశించి ఒక మాట తప్పనిసరిగా చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలందరి సమష్టి పార్టీ అని ఆయన చెబుతున్నారు. తనతో పాటు పార్టీ వారంతా ఇందులో భాగస్వాములేనని ప్రకటించారు. తొలి నుంచీ పరిశీలిస్తే ఆయన పార్టీని నడుపుతున్న తీరు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తుంది.
పార్టీని తన సొంత సంస్థగా, ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్‌గా భావించి ఉంటే తన కుటుంబసభ్యులకే అధికారిక పదవుల్లో కీలక బాధ్యతలు అప్పగించి ఉండేవారేమో! ఆయన ఆ పని చేయలేదు. విస్తృత ప్రజా పునాదితోనే జగన్ పార్టీని నిర్మిస్తున్నారు. అందువల్లనే బహుళ ప్రజానీకపు ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే విధంగా పార్టీ ఆశయాలను, కర్తవ్యాలను రూపొందించు కున్నారు. ఇవాళ ప్రభుత్వ పాలనలోనూ ఆ ఆశయాలే మార్గదర్శ కాలుగా మారాయి.
కుటుంబానికి పెద్దపీట వేయకపోవడం వల్ల కొందరు నొచ్చుకొని ఉండవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. ఆ పరి ణామం ఆయనకు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అయినా సరే తన ఆశయపథం నుంచి పక్కకు జరగలేదు. అదేవిధంగా తన పార్టీ కార్యకర్తల అక్రమార్జనకు అవకాశం కల్పించే అడ్డ దారులూ తొక్కలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఆకాంక్షించిన లక్ష్యాల పట్ల జగన్‌మోహన్‌రెడ్డి ఎంత నిబద్ధతతో ఉంటారో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగతమైంది. ‘మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండ’ని గతంలో ఏ నాయ కుడైనా అనగలిగాడా? అలా అనడానికి ఎంత నైతిక బలం ఉండాలి! లక్ష్యాల పట్ల తనకున్న నిబద్ధత వల్లనే ఆ నైతిక బలం ఆయనకు సమకూరింది.
వెనుకబాటుతనం కారణంగా సమాజంలోని దగాపడిన తమ్ముళ్లూ, చెల్లెమ్మలూ రాజ్యాంగబద్ధమైన అవకాశాలను అంది పుచ్చుకోలేకపోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎస్‌సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నందువల్ల ఎంతో కొంత ప్రాతినిధ్యం చట్టసభల్లో లభిస్తున్నది. సగం జనాభా ఉన్న బీసీలు మాత్రం ధనస్వామ్యంగా మారిన ఎన్నికల పోరాటంలో నెగ్గుకురాలేకపోతున్నారు. కంటితుడుపుగా ఒకటీ అరా సీట్ల కేటాయింపులకే గతంలో పార్టీలన్నీ పరిమిత మయ్యేవి.
కార్మిక – కర్షక పార్టీలుగా తమను తాము చెప్పుకునే కమ్యూనిస్టుల కంటే, బీసీల నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే మిన్నగా జగన్‌మోహన్‌రెడ్డి ఈ వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తున్నారు. లోక్‌సభ స్థానాలకు పార్టీ ప్రకటించిన 16 సీట్లలో తొమ్మిదింటిని బీసీలకు కేటాయించారు. ఎస్‌సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన వాటిలో నికరంగా బీసీలకు సగం సీట్లు దక్కనున్నాయి. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా? ఛాన్సే లేదు! కానీ అది జగన్ మోహన్ రెడ్డి నిబద్ధత. ఊకదంపుడు ఉపన్యాసాల్లో కాకుండా అభ్యు దయాన్ని ఆచరణలో చూపించిన తొలి రాజకీయవేత్త జగన్ మోహన్‌రెడ్డి.
‘ఎమ్మెల్యే టిక్కెట్టిస్తాం... ఎన్ని కోట్లు ఖర్చు పెడతావ్, పార్టీకెంత చందా ఇస్తావ’ని ఒక పక్క తెలుగుదేశం నాయకులు అడుగుతున్న రోజులివి. ఉపాధి హామీ కూలీగా పనిచేసే ఒక సాధారణ వ్యక్తిని మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయగల సాహసం ఒక్క జగన్‌కు తప్ప ఇంకెవరికి ఉంటుంది? పార్టీ కార్యకర్త కావడం, పార్టీ పట్ల విధేయత అతని అర్హతలు.
సూపర్ రిచ్ సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలైన రాజమండ్రి, నర్సాపురం లోక్‌సభ స్థానాలను బీసీ సామాజిక వర్గమైన శెట్టి బలిజలకు కేటాయించవచ్చని ఎవరి ఊహకైనా ఎప్పుడైనా తట్టి వుంటుందా? ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి, నరసరావుపేట లోక్‌సభా స్థానం నుంచి యాదవ కులానికి చెందిన బీసీ అభ్యర్థులను నిలబెట్టే ఔదార్యం ఎవరైనా కనబరిచారా? విజయవాడ నగర శివార్లలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండే పెనమలూరులో గౌడ అభ్యర్థిని, మైలవరంలో యాదవ అభ్యర్థిని నిలబెట్టగలగడం ఒక్క జగన్‌కు మాత్రమే సాధ్యమైన విషయం.
రాజకీయ రంగంపై పెత్తందారీ వర్గ ఆధిపత్యాన్ని సవాల్ చేసే విధంగా పేద వర్గాలను సాయుధం చేస్తున్న జగన్‌మోహన్ రెడ్డి విధానాలు ఆ వర్గాలను ఉత్తేజితం చేస్తున్నాయి. కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి వారు ముందుకొస్తున్నారు. శ్రీమంతుల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని పేదవర్గాలకు అందు బాటులోకి తేవడం రాష్ట్ర ప్రజలను అమితంగా ప్రభావితం చేసింది.
వ్యవసాయం దండగనే నాయకుడికి చెంపపెట్టు మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలున్నాయి. చిన్న, సన్నకారు రైతులను చేయిపట్టుకొని ముందుకు నడిపించే బాధ్యతను ఆర్‌బీకే సెంటర్లు చేపట్టాయి. ప్రభుత్వ చేయూత నందుకొని ఈ స్వల్పకాలంలోనే సుమారు రెండు లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పడి 16 లక్షల మందికి ఉపాధినందించాయి.
ఏ ప్రమాణాల ప్రకారం చూసినా... పారిశ్రామిక వృద్ధిలో గానీ, మౌలికరంగ అభివృద్ధిలోగాని, మానవాభివృద్ధిలోగానీ, ప్రజల ఆస్తుల కల్పనలోగానీ, సంక్షేమ రంగంలోగానీ ఈ ఐదేళ్ల కాలంతో పోల్చదగిన మరో పదవీకాలం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే లేదు. ఇది వాస్తవ పరిస్థితి. కానీ చంద్రబాబు – రామోజీ ముఠా ఈ వాస్తవాన్ని వక్రీకరించడానికీ, తలకిందు లుగా చూపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నది. చేతిలో ఉన్న యెల్లో మీడియా సాయంతో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్న ట్టుగా చూపెట్టే పాతకాలపు కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది.
యెల్లో మీడియా రాతలు, మాటలు ఉన్మాద స్థాయికి చేరుకున్నాయి. ఏరకంగానైనా జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి పెత్తందారీ శక్తులు పడరాని పాట్లు పడు తున్నాయి. మరోపక్కన అవకాశవాద పొత్తుతో కుట్రలు పన్ను తున్నాయి. పవన్ కల్యాణ్ పార్టీ అనే తమ బినామీ పార్టీని ఇప్పటికే ముడివేసుకున్నారు. ఇద్దరూ కలిసి బీజేపీ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌తో పరోక్ష పొత్తు కుదిరింది. వైసీపీ ఓట్లను ఎంతోకొంత చీల్చాలన్న ఏకైక టార్గెట్‌ను రాష్ట్ర కాంగ్రె స్‌కు చంద్రబాబు అప్పగించారు.
బాబు టార్గెట్‌ను శిరసా వహిస్తూ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన షర్మిల తన క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించారు. జగన్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత రక్తి కట్టించడం కోసం ఆమె తన కజిన్ సోదరి సునీత సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. చంద్ర బాబు సహాయ సహకారాలు సరేసరి! రాష్ట్రంలో పెత్తందారీ శక్తుల ప్రతినిధులు జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నారు.
పేదల ప్రభుత్వం తరఫున వైసీపీ కార్యకర్తలు ఉరిమే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. భీమిలిలో, దెందు లూరులో జరిగినవి కార్యకర్తల సభలు మాత్రమే. జనసభలు కావు. కార్యకర్తలే లక్షల సంఖ్యలో పాల్గొనడం చిన్న విషయం కాదు. ‘జన్మభూమి కమిటీ’ల పేరుతో చంద్రబాబు మాదిరిగా జగన్ దోచిపెట్టలేదు కనుక ఈ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు పెద్దగా కష్టపడకపోవచ్చని కలలు కన్నవారి కడుపు మండేలా ఈ సభలు జరిగాయి. సభల్లో పాల్గొనడమే కాదు, యుద్ధానికి తాము సిద్ధమేనంటూ సమరనాదాలు కూడా కార్యకర్తలు చేశారు. ‘ఈ పార్టీ నాదీ, నా కుటుంబానిదీ కాదు... ఇది మీది, కార్యకర్తలందరిదీ’ అన్న జగన్ మాటను మంత్రంగా స్వీకరించారు.
‘ఈ యుద్ధంలో అర్జునుడి పాత్ర నాది. సారథ్యం వహించే కృష్ణపరమాత్మలు మీరే’నని కార్యకర్తలను ఆయన ఉత్సాహ పరిచారు. ‘పార్టీ మీదే, పదవులూ మీవే... ముందు ముందు మరిన్ని పదవులు పార్టీకి విశ్వాసపాత్రులైన కార్యకర్తలకే లభిస్తాయ’ని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జన్మ భూమి కమిటీల మాదిరిగా ఆదాయం కోసం పనిచేసే కార్య కర్తలం కాదనీ, ఆశయం కోసం పనిచేసేవారమని ఇప్పటికే రుజువు చేసుకున్న వైసీపీ కేడర్ నాయకుని భరోసాతో మరింత స్ఫూర్తిని పొందింది.
ప్రాంతాల వారీగా పెత్తందార్లపై ఎన్నికల యుద్ధానికి వైసీపీ అక్షౌహిణులు సిద్ధమవుతున్నాయి. ఈ కార్య కర్తల సమరశీలత లోపించడం ప్రతిపక్ష శిబిరానికి అతిపెద్ద మైనస్ పాయింట్. మీడియా మాయాజాలంతో, కుట్రలతో ఈ మైనస్‌ను ప్లస్‌గా మార్చుకోవడం సాధ్యమయ్యే పని కాదు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
అక్షౌహిణులు సిద్ధం!
Published Sun, Feb 4 2024 12:08 AM | Last Updated on Sun, Feb 4 2024 12:01 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment