సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ పాజిటివ్ ఓటుతోనే మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్ల నాలుగు నెలల కాలంలో అమలుచేసిన పాలన సంస్కరణలు, సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, అవినీతి రహిత కార్యక్రమాలే తమ పా ర్టీకి వజ్రాయుధాలన్నారు. గత ఎన్నికలకు ముందు చెప్పినవి చిత్తశుద్ధితో అమలుచేశామని, దీంతో ప్రజలు ప్రభుత్వంపట్ల పూర్తి సంతృప్తిని కనబరుస్తున్నారని చెప్పారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘సీం వైఎస్ జగన్ ఎన్నికల కోసం పనిచేసే మనిషి కాదు.
ప్రజలకు వీలైనంత ఎక్కువ మంచి చేసి, ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలన్న ఆశయంతో పనిచేస్తున్న వ్యక్తి. రాష్ట్రంలో 1.62 కోట్ల కుటుంబాల ఇళ్లకు వలంటీర్లను పంపి, అందరి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని, ఆ ఊళ్లో డాక్టర్ల క్యాంపులు పెట్టి ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారంటే రాష్ట్ర ప్రజలపట్ల సీఎం చిత్తశుద్ధి తెలిసిపోతోంది. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి కుటుంబం జగన్‌మోహన్‌రెడ్డిని తమ సొంత కుటుంబ సభ్యుడిగా భావించే పరిస్థితి ఉంది. మరోవైపు.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు అడ్డుపడడమే పనిగా పనిచేస్తున్నాయి’అని అన్నారు.
దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు..
విజయవాడ దుర్గగుడితో పాటు రాష్ట్రంలో పలు ప్రముఖ ఆలయాల్లో దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయి. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలో కొన్ని ఆలయాల స్థాయిని పెంచడం ద్వారా దేవదాయ శాఖలో అదనంగా 14 డిప్యూటీ కమిషనర్లు, నలుగురు అసిస్టెంట్ కమిషనర్ల పోస్టులు అవసరమవుతాయి. పదోన్నతుల ద్వారా ఇప్పటికే ఉన్న సిబ్బందికి ఈ పోస్టుల భర్తీలో ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే, బ్యాంకుల్లో ప్రస్తుతం నగదు డిపాజిట్లకు ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నందున.. గతంలో తక్కువ వడ్డీ రేటుకు డిపాజిట్లు చేసిన చోట సమీక్షించి, అవసరమైతే పాత డిపాజిట్లను రద్దుచేసి కొత్తగా అదనపు వడ్డీ రేటుకు డిపాజిట్ చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశించాం.
Comments
Please login to add a commentAdd a comment