హిందూ ధర్మంపై, హిందువులపై ప్రస్తుతం బహుముఖ దాడులు కొనసాగుతున్నాయి. మతమార్పిడి కార్యక్రమాల వల్ల హిందూ సమా జంలోని నిరుపేద వర్గాలు మాత్రమే కాకుండా ఆర్థికంగా సంపన్నులైన ఆధిపత్య కులాల ప్రజలు కూడా మతం మార్చుకుంటున్నారు. హిందూ ధర్మంపై అవగాహన లోపమే మతమార్పిడికి ఒక కారణం. అనేక కారణాల వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మన సమాజంలో ఉనికిలో లేకుండా పోయింది. దీంతో మన ధర్మం గురించి పిల్లలకు బోధించే వారే లేకుండాపోయారు. ఇంట్లో కానీ, పాఠశాలల్లో కానీ, సమాజ జీవితంలో కానీ హిందూ ధర్మం గురించి యువతకు చెప్పేవారే లేరు.
హిందువుల్లో పలురకాల భక్తులున్నారనిపిస్తుంది. చాలామంది తమ సొంత కోరికలను తీర్చుకోవడం కోసమే పూజలూ, ప్రార్థనలూ చేస్తారు. వీరికి హిందూ ధర్మం గురించి ఎవరూ చెప్పరు. పూజారులు చదివే మంత్రాల అర్థాలూ వీరికి తెలియవు.
దేశంలోనూ, దేశం వెలుపలి నుంచి సేకరిస్తున్న భారీ నిధులతో క్రైస్తవులు పాఠశాలలు నడుపుతున్నారు. అయితే ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు నడుపుతున్న పాఠశాలల కంటే మెరుగైన క్రమశిక్షణ, ఆదేశాలను పాటించడం క్రిస్టి యన్ పాఠశాలల్లో అమలవుతుందని అందరికీ తెలుసు. అందుకే హిందూ తల్లితండ్రులు తమ పిల్లలను కూడా క్రిస్టియన్ సంస్థలు నడుపుతున్న పాఠశాలలకే పంపుతుం డటం కద్దు. హిందూమతంలోని వివిధ పీఠాధిపతులు తమ వంతుగా విద్యాసంస్థలను స్థాపించి హైందవ ధార్మిక అంశాలను సిలబస్‌లో, పాఠ్యేతర కార్యక్రమాల్లో తప్ప కుండా భాగం చేయాలి.
ఇంట్లోనూ, పాఠశాలల్లోనూ, సమాజంలోనూ హిందూ ధర్మానికి సంబంధించి ఉపదేశించేవారే లేనప్పుడు మనం ఏం చేయాలి? క్రిస్టియన్, ఇస్లామిక్ మతాలే ఇక్కడ కూడా మనకు ఆదర్శం కావాలి. క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళతారు. ముస్లింలు శుక్రవారం మసీదుకు వెళతారు. ఈ రెండింటిలోనూ ప్రార్థనలు మాత్రమే చేయరు. తమ మతం గురించి ఉపదేశిస్తారు. మతానుయాయుల విధులను వివరిస్తారు. (చదవండి: కేంద్ర పథకాలకు మార్గదర్శి)
హిందూ మతంలోని ప్రతిశాఖలోనూ హనుమాన్‌ని పూజిస్తారు కాబట్టి ప్రతి ఆదివారం భక్తులందరూ సమీపంలోని హనుమాన్ ఆలయానికి నిర్దిష్ట సమయంలో వెళ్లి పూజలు చేయాలి. అక్కడ వీరికి చర్చిలు, మసీదుల్లో మాదిరే, హిందూ ధర్మం గురించి ప్రవచనాలు, ప్రసంగాలు వినిపించాలి. భజనలు, ప్రసాదం పంపిణీ ఆ తర్వాతే చేయాలి. ఈ రకంగా మాత్రమే వేర్వేరు దేవతలను, మత శాఖలను పూజించే, పాటించే హిందూమత అనుయాయుల మధ్య సంఘీభావం ఏర్పడుతుంది. ఇది మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడుతుంది. ఆలయాల నిర్వహణ నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని మనం డిమాండ్ చేస్తున్నప్పుడు వాటిని ఎవరికి అప్పగించాలని ప్రభుత్వాలే అడుగుతున్నాయి. దీనికి సమాధానం సింపుల్. మసీదులు, చర్చిలు, గురుద్వారాలకు లాగానే భక్త బృందాలు, భక్తుల సొసైటీలు వీటిని నడపాలి. ఇంతకుమించి మహాధర్మాచార్య సభ ఉండితీరాలి. (చదవండి: సంగీత సరస్వతి... స్వర సామ్రాజ్ఞి)
ఆలయాలపై ప్రభుత్వ యాజమాన్యాన్ని తప్పించి తగిన స్థాయి కలిగిన హిందూ విభాగాల సూచనలను స్వీకరించి పరమ ధర్మాచార్యులతో కమిటీని ఏర్పర్చాలి. హిందూ సంస్థాగత నిర్మాణానికి మనం సిక్కు గురుద్వారా చట్టాన్ని ప్రారంభ బిందువులా స్వీకరించవచ్చు. అందుకే ధర్మాచార్యులు పీఠాలు, మఠాలకు మాత్రమే పరిమితం కాకుండా విస్తృతంగా పర్యటనలు చేసి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి రాజకీయ పార్టీలను ప్రభావితం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ సంకల్పం లేనిదే మనం కోరు కుంటున్న మార్పు సాధ్యపడదు. (చదవండి: పరాయీకరణ దిశలో మేడారం జాతర)
హిందూ మతం లేనిదే భారతదేశానికి భవిష్యత్తు లేదని, భారతీయ మూలాల్లో పాతుకుని ఉన్న హిందూ తత్వాన్ని తొలగిస్తే దేశమనే దొడ్డ వృక్షం పునాది నుంచి కూలిపోతుందని మేడమ్ అనీబిసెంట్ చేసిన హెచ్చరికను గుర్తుంచుకోవాలి. భారతమాత పుత్రులే ఆమె విశ్వాసాన్ని పుణికిపుచ్చుకోకపోతే దాన్ని ఎవరు పరిరక్షిస్తారు అని ఆమె ఆనాడు వేసిన ప్రశ్న ఈనాటికైనా మనకు కనువిప్పు కలిగించాలి.
- డాక్టర్ టి. హనుమాన్ చౌదరి
భారతీయ ధర్మ రక్షణ సమాఖ్య కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment