
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణను ప్రారంభించింది. దశాబ్ధాల తరబడి సాగుతున్న అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాద కేసు పరిష్కారానికి కోర్టు పర్యవేక్షణలో మధ్యవర్తిత్వానికి అనుమతించాలనే లేదా అనే అంశంపై వాదనలు ఆలకించిన సర్వోన్నత న్యాయస్ధానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
అయోధ్య వివాద పరిష్కారానికి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ సెక్షన్ 89 కింద మధ్యవర్తిత్వ ప్రక్రియకు అనుమతించాలా, లేదా అనే అంశంపై కోర్టు ఓ నిర్ణయానికి రానుంది. మరోవైపు అయోధ్య వివాద పరిష్కారానికి పలువురు మధ్యవర్తులతో కూడిన ప్యానెల్ అవసరమని జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అభిప్రాయపడ్డారు.
కేసు విచారణ దశలో మీడియా కథనాలు అందించే విషయంలో సంయమనం పాటించాలని ఆయన సూచించారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ సాగే క్రమంలో మీడియా రిపోర్టింగ్‌కు దూరంగా ఉండాలని, మధ్యవర్తిత్వ ప్రక్రియ కొనసాగే సమయంలో ఎవరికీ ఎలాంటి ఉద్దేశాలూ ఆపాదించరాదని కోరారు. గతంలో జరిగిన దానిపై మనకు నియంత్రణ ఉండదని, ప్రస్తుత వివాదం మనకు తెలుసని, వివాదాన్ని ఎలా పరిష్కరించాలనే దానిపైనే తాము దృష్టి సారించామన్నారు. ఈ వివాదం పలువురి మనోభావాలు, మతవిశ్వాసాలతో ముడిపడిఉన్నందున దీని తీవ్రతను తాము గుర్తెరిగామని జస్టిస్ బోబ్డే పేర్కొన్నారు.
ముస్లిం పిటిషనర్ల అంగీకారం
అయోధ్య కేసు సామరస్య పరిష్కారంలో భాగంగా మధ్యవర్తిత్వ ప్రక్రియకు ముస్లిం పిటిషనర్లు సంసిద్ధత వ్యక్తం చేశారు. కేసు పరిష్కారానికి మధ్యవర్తిత్వానికి ముస్లిం పిటిషనర్లు అంగీకరిస్తారని, ఆయా పిటిషనర్ల తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ కోర్టుకు నివేదించారు. మధ్యవర్తులు సూచించే పరిష్కారానికి అన్ని పార్టీలూ కట్టుబడి ఉండాలని సూచించారు. మధ్యవర్తిత్వ ప్రక్రియకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేయాలని ఆయన రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరారు.