న్యూఢిల్లీ: రామ జన్మభూమి –బాబ్రీమసీదు కేసులో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్‌కు ముస్లిం పక్షాలు ఉద్వాసన పలికాయి. అనారోగ్యంతో ఉన్నానంటూ అర్థం లేని కారణం చూపి ఈ కేసు నుంచి తప్పించారని న్యాయవాది రాజీవ్ ధావన్ మంగళవారం వెల్లడించారు. ‘బాబ్రీ కేసు నుంచి నన్ను తప్పించినట్లు కక్షిదారైన జమియత్ ఉలేమా– ఇ– హింద్ ప్రతినిధి ఏవోఆర్ (అడ్వొకేట్ ఆన్ రికార్డు) ఎజాజ్ మక్బూల్ తెలపగా వెంటనే అంగీకరించా. ఈ కేసులో నా జోక్యం ఉండదు’అని అన్నారు. ‘నన్ను తొలగించేందుకు ఎజాజ్‌కు అధికారం ఉంది. కానీ, నాకు ఆరోగ్యం బాగోలేని కారణంగానే తీసేసినట్లు పేర్కొనడం అర్థం లేనిది. అనారోగ్యంతో ఉంటే ఇతర కేసులను ఎలా డీల్ చేస్తున్నా?’అని ప్రశ్నించారు.
కాగా, అయోధ్యలో రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలైంది. తీర్పులో కొన్ని తప్పులున్నాయని, వాటిని సవరించాలని కోరుతూ సోమవారం మౌలానా సయ్యద్ అషాద్ రషీది, జామియత్ ఉలేమా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment