రాజీవ్ పార్క్ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
సందర్శకులు సిటీ వ్యూ చూసేందుకు ఎత్తైన అబ్జర్వేటరీ డెక్ కూడా..
స్థల సమీకరణకు అధికారుల కసరత్తు షురూ
బిలియనీర్ల గృహాలకు 4,100 ఎకరాలు కేటాయింపు
పార్క్ చుట్టూ అత్యాధునిక నివాస, వాణిజ్య సముదాయాలు
‘రీ ఇమేజింగ్ హైదరాబాద్’లో బిల్డర్లతో భేటీలో సీఎం వెల్లడి!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ‘రాజీవ్ పార్క్’ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. పట్టణ ఉద్యానవనంగా పిలిచే న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో రాజీవ్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. దీంతో అనువైన ప్రాంతం, స్థల సమీకరణ కోసం అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. పశ్చిమ హైదరా బాద్‌లో కొలువుదీరనున్న రాజీవ్ పార్క్‌లో సందర్శకులు సిటీ వ్యూ చూసేందుకు వీలుగా ఎత్తయిన అబ్జర్వేటరీ డెక్ కూడా ఏర్పాటు చేయా లనుకుంటున్నారు. రీ ఇమేజినింగ్ హైదరాబాద్ పేరిట ఇటీవల ఓ హోటల్‌లో సీఎం రేవంత్ నిర్వహించిన సమావేశంలో పలువురు బిల్డర్లతో ఈ అంశాన్ని వెల్లడించినట్లు తెలిసింది.
న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ఇలా..
న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో 843 ఎకరాల్లో సెంట్రల్ పార్క్ ఉంది. అమెరికాలో తొలి ల్యాండ్‌స్కేప్ పార్క్ ఇదే. 2016 అంచనాల ప్రకారం ఏటా సుమారు 4.2 కోట్ల మంది పర్యాటకులు ఈ పార్క్‌ను సందర్శి స్తున్నారు. ఇందులో సినిమా షూటింగ్ స్పాట్లు, అభయారణ్యం, థియేటర్, ఫుడ్ జోన్స్, జూ, కిడ్స్ ప్లే ఏరియా వంటి వినోద కేంద్రాలు ఉన్నాయి. సైక్లింగ్, వాక్‌వేలు, ఇతరత్రా క్రీడా సౌకర్యాలు, సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. సంస్కృతీ సంప్రదాయాలు, చర్రితను తెలియజెప్పే విభిన్న ఆకృతులతో మాన్యుమెంట్స్ ఉన్నాయి.
బిలియనీర్ల కోసం 4,100 ఎకరాలు
రాజీవ్ పార్క్ చుట్టూ బిలియనీర్లు, అల్ట్రా లగ్జరీ ప్రముఖుల నివాస, వాణిజ్య సముదాయాల కోసం 4,100 ఎకరాలను అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. సాధారణంగా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌ఐ), ప్రవాసులు, బహుళజాతి సంస్థల అధినేతలు, సెలబ్రిటీలు ఎక్కువగా ఉబర్ లగ్జరీ నివాస సముదాయాల్లో ఉండేందుకు ఇష్టపడతారు.
ఈ తరహా భవనాల్లో విశాలమైన లాంజ్‌లు, ఇంట్లోనే జిమ్, స్పా, సెలూన్, కట్టుదిట్టమైన భద్రత, ప్రైవేట్ ఔట్‌డోర్ స్పేస్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆధునిక వసతులుంటాయి. ప్రభుత్వం తలపెట్టిన రాజీవ్ పార్క్ కార్యరూపంలోకి వస్తే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉంటాయని స్థిరాస్తి నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంపన్న వర్గాలు ఎక్కువగా ఈ తరహా ప్రాంతాల్లో నివసించేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో విలాసవంతమైన గృహాలు, ఆఫీసు భవనాలు వెలుస్తాయని చెబుతున్నారు.
చైనాలో అర కిలోమీటర్‌కన్నా ఎత్తైన అబ్జర్వేటరీ డెక్
⇒ ఎత్తయిన ప్రదేశం నుంచి సిటీ వ్యూ, సుదూర ప్రాంతాలను చూసేందుకు వీలుగా ఉండే ప్లాట్‌ఫామ్‌ను అబ్జర్వేటరీ డెస్క్ అంటారు. సాధారణంగా హైరైజ్ నివాస, వాణిజ్య సముదాయాలలో ఈ తరహా డెక్‌లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కనుచూపు మేరలో సిటీ వ్యూ కనిపిస్తూ, ధారాళమైన గాలి, వెలుతురుతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
అబ్జర్వేటరీ డెక్‌లు షాంఘై, దుబాయ్, మలేషియా, టోక్యో వంటి దేశాలలో ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీ డెక్ చైనాలోని షాంఘై టవర్‌లో ఉంది. 632 మీటర్ల (2,073 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ భవనంలో మొత్తం 128 అంతస్తులుంటాయి. 118వ అంతస్తులో అంటే 562 మీటర్లు (1,841 అడుగులు) ఎత్తులో అబ్జర్వేటరీ డెక్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment