Park development
-
‘న్యూయార్క్ సెంట్రల్ పార్క్’ హైదరాబాద్‌లో
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ‘రాజీవ్ పార్క్’ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. పట్టణ ఉద్యానవనంగా పిలిచే న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో రాజీవ్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. దీంతో అనువైన ప్రాంతం, స్థల సమీకరణ కోసం అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. పశ్చిమ హైదరా బాద్‌లో కొలువుదీరనున్న రాజీవ్ పార్క్‌లో సందర్శకులు సిటీ వ్యూ చూసేందుకు వీలుగా ఎత్తయిన అబ్జర్వేటరీ డెక్ కూడా ఏర్పాటు చేయా లనుకుంటున్నారు. రీ ఇమేజినింగ్ హైదరాబాద్ పేరిట ఇటీవల ఓ హోటల్లో సీఎం రేవంత్ నిర్వహించిన సమావేశంలో పలువురు బిల్డర్లతో ఈ అంశాన్ని వెల్లడించినట్లు తెలిసింది.న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ఇలా..న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో 843 ఎకరాల్లో సెంట్రల్ పార్క్ ఉంది. అమెరికాలో తొలి ల్యాండ్‌స్కేప్ పార్క్ ఇదే. 2016 అంచనాల ప్రకారం ఏటా సుమారు 4.2 కోట్ల మంది పర్యాటకులు ఈ పార్క్‌ను సందర్శి స్తున్నారు. ఇందులో సినిమా షూటింగ్ స్పాట్లు, అభయారణ్యం, థియేటర్, ఫుడ్ జోన్స్, జూ, కిడ్స్ ప్లే ఏరియా వంటి వినోద కేంద్రాలు ఉన్నాయి. సైక్లింగ్, వాక్‌వేలు, ఇతరత్రా క్రీడా సౌకర్యాలు, సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. సంస్కృతీ సంప్రదాయాలు, చర్రితను తెలియజెప్పే విభిన్న ఆకృతులతో మాన్యుమెంట్స్ ఉన్నాయి.బిలియనీర్ల కోసం 4,100 ఎకరాలురాజీవ్ పార్క్ చుట్టూ బిలియనీర్లు, అల్ట్రా లగ్జరీ ప్రముఖుల నివాస, వాణిజ్య సముదాయాల కోసం 4,100 ఎకరాలను అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. సాధారణంగా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు, బహుళజాతి సంస్థల అధినేతలు, సెలబ్రిటీలు ఎక్కువగా ఉబర్ లగ్జరీ నివాస సముదాయాల్లో ఉండేందుకు ఇష్టపడతారు.ఈ తరహా భవనాల్లో విశాలమైన లాంజ్‌లు, ఇంట్లోనే జిమ్, స్పా, సెలూన్, కట్టుదిట్టమైన భద్రత, ప్రైవేట్ ఔట్‌డోర్ స్పేస్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆధునిక వసతులుంటాయి. ప్రభుత్వం తలపెట్టిన రాజీవ్ పార్క్ కార్యరూపంలోకి వస్తే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉంటాయని స్థిరాస్తి నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంపన్న వర్గాలు ఎక్కువగా ఈ తరహా ప్రాంతాల్లో నివసించేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో విలాసవంతమైన గృహాలు, ఆఫీసు భవనాలు వెలుస్తాయని చెబుతున్నారు.చైనాలో అర కిలోమీటర్‌కన్నా ఎత్తైన అబ్జర్వేటరీ డెక్⇒ ఎత్తయిన ప్రదేశం నుంచి సిటీ వ్యూ, సుదూర ప్రాంతాలను చూసేందుకు వీలుగా ఉండే ప్లాట్‌ఫామ్‌ను అబ్జర్వేటరీ డెస్క్ అంటారు. సాధారణంగా హైరైజ్ నివాస, వాణిజ్య సముదాయాలలో ఈ తరహా డెక్‌లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కనుచూపు మేరలో సిటీ వ్యూ కనిపిస్తూ, ధారాళమైన గాలి, వెలుతురుతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.అబ్జర్వేటరీ డెక్‌లు షాంఘై, దుబాయ్, మలేషియా, టోక్యో వంటి దేశాలలో ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీ డెక్ చైనాలోని షాంఘై టవర్‌లో ఉంది. 632 మీటర్ల (2,073 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ భవనంలో మొత్తం 128 అంతస్తులుంటాయి. 118వ అంతస్తులో అంటే 562 మీటర్లు (1,841 అడుగులు) ఎత్తులో అబ్జర్వేటరీ డెక్ ఉంది. -
గుజరాత్‌పై అర్బన్ నక్సల్స్ కన్ను: మోదీ
బరూచ్(గుజరాత్): కొత్త రూపంలో అర్బన్ నక్సల్స్ తొలిసారిగా గుజరాత్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ బరూచ్ జిల్లాలో దేశంలోనే తొలి బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘ అర్బన్ నక్సల్ కన్ను గుజరాత్‌పై పడింది. శక్తియుక్తులున్న గుజరాతీ అమాయక ఆదివాసీ యువతను వారు లక్ష్యంగా చేసుకుందామనుకుంటున్నారు. అయితే వీరి ఆటలు ఇక్కడ సాగవు. వారిని రాష్ట్రం తరిమికొడుతుంది’ అని మోదీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా గుజరాత్ ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యంలో ఆప్‌నుద్దేశిస్తూ మోదీ ఈ పరోక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్‌ను మేథాపాట్కర్ వంటి వారు అడ్డుకోవడాన్ని అభివృద్ధి నిరోధక అర్బన్ నక్సలైట్లుగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అభివర్ణించారు. మేథా పాట్కర్ గతంలో ఆప్ టికెట్‌పై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. బరూచ్ ఫార్మా పార్క్ అందుబాటులోకి వచ్చాక బల్క్ డ్రగ్స్‌లో భారత్ స్వావలంబన సాధిస్తుందని మోదీ అన్నారు. పటేల్ ఏకంచేశారు. కానీ నెహ్రూ.. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో సోమవారం ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘సర్దార్ పటేల్ సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేశారు. కానీ ఒక్క వ్యక్తి జమ్మూకశ్మీర్ అంశాన్ని నెత్తినేసుకుని ఎటూ తేల్చకుండా వదిలేశారు’ అని నెహ్రూపై విమర్శలు చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న కశ్మీర్ సమస్యను పటేల్ స్ఫూర్తితో పరిష్కరించి ఆయనకు నివాళులర్పించానన్నారు. -
మన్నించు..జయశంకరా
హన్మకొండ చౌరస్తా వరంగల్ : తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతివనం సుందరీకరణ పనులు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కును ప్రొఫెసర్ ‘జయశంకర్ స్మృతివనం’గా నామకరణం చేసిన టీఆర్ఎస్ సర్కార్, దాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు నిధులను సైతం కేటాయించింది. ఏళ్లు గడుస్తున్నా నేటికీ పనులు పూర్తి కాకపోవడంపై తెలంగాణవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేడు సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర శాసనసభాపతి మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అయితే అసంపూర్తిగా మిగిలిన స్మృతివనం పనులపై ఆరా తీసిన వారు ఒక్కరూ లేరు. ఈ నేపథ్యంలో ‘స్మృతివనం’ పనులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో.. సార్ మృతి యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని దుఃఖ సాగరంలో ముంచేసింది. సార్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం బాలసముద్రంలోని ఏకశిలపార్కులో ఉంచారు. సార్ గుర్తుగా ఆ పార్కును ఆయన స్మృతి వనంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. 2014లో సార్ నిలువెత్తు విగ్రహాన్ని పార్కులో ఆవిష్కరించారు. నత్త నడకన స్మృతివనం పనులు.. ఏకశిల పార్కును సార్ స్మృతి వనంగా ప్రకటించాక స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తన నియోజకవర్గ నిధుల నుంచి రూ.43.65 లక్షల మంజూరు చేశారు. ఆయా నిధులతో పనులు ప్రారంభించేందుకు జూన్ 17, 2016న పార్కు ఆవరణలో శంకుస్థాపన కూడా చేశారు. ఆయా పనులను ‘కుడా’కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఎంతో హడావుడిగా పనులు ప్రారంభించిన అధికారులు.. దాదాపు ఏడాదిన్నర పాటు పనులను సాగదీస్తూ వచ్చారు. కాగా సుమా రు నాలుగు నెలల క్రితం మున్సిపల్ కార్పొరేషన్‌కు మరో రూ.2 కోట్ల నిధులు కేటాయించి పనులను అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు. బోసిపోతున్న పార్కు.. గతంలో ఏకశిలపార్కులో స్థానికులు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేవారు. ఇప్పుడు అసంపూర్తిగా వదిలిన పనులతో అటువైపు రావడం కూడా మానేశారు. వాకర్లతో పాటు చాలా మంది పార్కులో ఉండే భారీ వృక్షాల నీడన సేదతీరే వారు. పార్కు అభివృద్ధిలో భాగంగా చెట్లు కనుమరుగవగా, ప్రస్తుతం మట్టికుప్పలు, సిమెంటు గోడలతో ‘స్మృతివనం’ బోసిపోతోంది. ప్రొఫెసర్ జయశంకర్ నిలువెత్తు విగ్రహం ఉన్న పార్కు కళావిహీనంగా ఉండడంపై సార్ అభిమానులు, తెలంగాణ వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లు గడుస్తున్నా పార్కు సుందరీకరణ పూర్తి కాకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని స్మృతి వనం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. మరో మూడు నెలల్లో పూర్తి చేస్తాం మాకు పనులు అప్పగించి నాలుగు నెలలు మాత్రమే అవుతోంది. అంతకుముందు ‘కుడా’ చేపట్టిందని తెలుసు. రూ. 2 కోట్ల నిధులతో పనులు కొనసాగుతున్నాయి. స్మృతివనం పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో మూడు నెలల్లో సుందరీకరణ పూర్తిచేస్తాం. ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం మిగిలిన పనుల్లో కాస్త ఆలస్యం జరిగింది. – సంతోష్, డీఈ, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ -
హరిత హైదరాబాద్!
సాక్షి హైదరాబాద్: మహానగరంలో పెరిగిపోతున్న కాలుష్యానికి అర్బన్ పార్కుల నిర్మాణంతో చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్క హైదరాబాద్ చుట్టూ మాత్రమే కాకుండా పక్కన ఆనుకొని ఉన్న 6 జిల్లాల్లోనూ పార్కుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు వీలైనంత త్వరగా అన్ని సౌకర్యాలతో కూడిన అర్బన్ ఫారెస్ట్ పార్కులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్‌కు చుట్టుపక్కల ఉన్న 188 ఫారెస్ట్ బ్లాకుల్లో 129 ప్రాంతాలు పార్కుల నిర్మాణం, అభివృద్ధికి అనుకూలంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు సమావేశంలో నివేదించారు. వీటిల్లో 70 ప్రాంతాలను ఫారెస్ట్ కన్జర్వేషన్ జోన్లుగా, మిగతా వాటిల్లో 52 ప్రాంతాలను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా, మరో ఏడు ప్రాంతాలను ఎకో టూరిజం జోన్లుగా రూపొందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. సీఎం ఆదేశం మేరకు: సీఎస్ రానున్న రెండేళ్లలో దశలవారీగా పార్కులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని సీఎస్ ఎస్కే జోషి చెప్పారు. ఆ దిశగా అన్ని శాఖలు పనిచేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య, ఆహ్లాద, విహార సౌకర్యాలకు అనువుగా అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులను, ఎకో టూరిజం స్పాట్లను తీర్చిదిద్దాలన్నారు. అటవీశాఖ ఇప్పటికే చేపట్టిన అర్బన్ పార్క్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. భాగ్యనగర్ నందనవనం, మేడిపల్లి ఫారెస్ట్ పార్క్, కండ్లకోయ ఆక్సిజన్ పార్కులు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, రోడ్లు భవనాలు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, పంచాయతీరాజ్ కార్యదర్శి వికాస్‌రాజ్, పీసీసీఎఫ్ పీకే ఝా, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల పరిధిలో.. రంగారెడ్డి జిల్లా పరిధిలో 26 పార్కులు, మేడ్చల్‌లో 11, యాదాద్రిలో 6, మెదక్‌లో 4, సంగారెడ్డిలో 3, సిద్దిపేటలో 1, చొప్పన కొత్త పార్కుల నిర్మాణానికి అధికారులు రూపకల్పన చేశారు. తొలిదశలో అటవీశాఖ 15, హెచ్ఎండీఏ 17, జీహెచ్ఎంసీ 3, టీఎస్ఐఐసీ 11, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 4, మెట్రోరైల్ 2 పార్కుల చొప్పున దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులు, మానవ వనరులను ఆయాశాఖలు సొంతంగా సమీకరణ చేసుకోవాలని లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను వాడుకోవచ్చని సీఎస్ సూచించారు. వివిధ శాఖలు అర్బన్ పార్కులను అభివృద్ధి చేసి అటవీశాఖకు అప్పగిస్తే ఆ శాఖే నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుందన్నారు. టూరిజం శాఖ పరిధిలో మరో ఏడు చోట్ల ఎకో టూరిజంను పార్కులను అభివృద్ధి చేయనున్నారు. మేడ్చల్ జిల్లాలో మూడు, యాదాద్రి జిల్లాలో 4 చొప్పున ఎకో టూరిజం పార్కులు రానున్నాయి. -
అల్లూరి జిల్లాగా మార్చకుంటే నిరవధిక దీక్ష
అల్లూరి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రరావు హెచ్చరిక నామమాత్రంగా పార్కు అభివృద్ధిపై అసంతృప్తి గొలుగొండ: విశాఖ జిల్లాను అల్లూరి జిల్లాగా మార్చుతూ ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని రాష్ట్ర అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో త్వరలో అల్లూరి పార్కులో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఆయన ఆదివారం కేడిపేటలో విలేకరులతో మాట్లాడుతూ, అల్లూరి పార్కును కోట్లాది రుపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం 20 లక్షలు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. దీనివల్ల పార్కు అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని అసంతృప్తి వ్యక్తంచేశారు. మాట ఇచ్చి తప్పారు విశాఖ జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని గత ఏడాది ఆమరణ నిరాహార దీక్షలు చేపడితే, దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, దీక్ష విరమింపజేశారని గుర్తుచేశారు. తరువాత ఈ విషయం ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. త్వరలో మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు అల్లూరి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సమయంలో మంప ప్రాంతంలో ఉన్న రహస్య గృహాలను అభివృద్ధి చేయాలని, అల్లూరి జయంతినే కాకుండా వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని కోరారు. కేడిపేటలో ఉన్న అల్లూరి సీతారామరాజు మైత్రీ గంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ గుర్తించి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.