మన్నించు..జయశంకరా | Park Works Not Completed | Sakshi
Sakshi News home page

మన్నించు..జయశంకరా

Published Tue, Aug 7 2018 1:33 PM | Last Updated on Fri, Aug 10 2018 1:17 PM

Park Works Not Completed - Sakshi

అసంపూర్తిగా నిర్మించిన సిమెంట్‌ గోడలతో కళ తప్పి కన్పిస్తున్న పార్కు

హన్మకొండ చౌరస్తా వరంగల్‌ : తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ స్మృతివనం సుందరీకరణ పనులు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కును ప్రొఫెసర్‌ ‘జయశంకర్‌ స్మృతివనం’గా నామకరణం చేసిన టీఆర్‌ఎస్‌ సర్కార్,  దాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు నిధులను సైతం కేటాయించింది.  ఏళ్లు గడుస్తున్నా నేటికీ పనులు పూర్తి కాకపోవడంపై తెలంగాణవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నేడు సార్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర శాసనసభాపతి మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అయితే అసంపూర్తిగా మిగిలిన స్మృతివనం పనులపై ఆరా తీసిన వారు ఒక్కరూ లేరు. ఈ నేపథ్యంలో ‘స్మృతివనం’ పనులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో.. సార్‌ మృతి యావత్‌ తెలంగాణ ప్రజానీకాన్ని దుఃఖ సాగరంలో ముంచేసింది.  

సార్‌ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం బాలసముద్రంలోని ఏకశిలపార్కులో ఉంచారు. సార్‌ గుర్తుగా ఆ పార్కును ఆయన స్మృతి వనంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. 2014లో సార్‌ నిలువెత్తు విగ్రహాన్ని పార్కులో ఆవిష్కరించారు.  

నత్త నడకన స్మృతివనం పనులు..

ఏకశిల పార్కును సార్‌ స్మృతి వనంగా ప్రకటించాక స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ తన నియోజకవర్గ నిధుల నుంచి రూ.43.65 లక్షల  మంజూరు చేశారు. ఆయా నిధులతో పనులు ప్రారంభించేందుకు జూన్‌ 17, 2016న  పార్కు ఆవరణలో శంకుస్థాపన కూడా చేశారు. ఆయా పనులను ‘కుడా’కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఎంతో  హడావుడిగా పనులు ప్రారంభించిన అధికారులు.. దాదాపు ఏడాదిన్నర పాటు పనులను సాగదీస్తూ వచ్చారు. కాగా సుమా రు నాలుగు నెలల క్రితం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మరో రూ.2 కోట్ల నిధులు కేటాయించి పనులను అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు. 

బోసిపోతున్న పార్కు..

గతంలో ఏకశిలపార్కులో స్థానికులు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేసేవారు. ఇప్పుడు అసంపూర్తిగా వదిలిన పనులతో అటువైపు రావడం కూడా మానేశారు. వాకర్లతో పాటు చాలా మంది పార్కులో ఉండే భారీ వృక్షాల నీడన సేదతీరే వారు. పార్కు అభివృద్ధిలో భాగంగా చెట్లు కనుమరుగవగా, ప్రస్తుతం మట్టికుప్పలు,  సిమెంటు గోడలతో ‘స్మృతివనం’ బోసిపోతోంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ నిలువెత్తు  విగ్రహం ఉన్న పార్కు కళావిహీనంగా ఉండడంపై సార్‌ అభిమానులు, తెలంగాణ వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్లు గడుస్తున్నా పార్కు సుందరీకరణ పూర్తి కాకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని  స్మృతి వనం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.

మరో మూడు నెలల్లో పూర్తి చేస్తాం

మాకు పనులు అప్పగించి నాలుగు నెలలు మాత్రమే అవుతోంది. అంతకుముందు ‘కుడా’ చేపట్టిందని తెలుసు. రూ. 2 కోట్ల నిధులతో పనులు కొనసాగుతున్నాయి. స్మృతివనం పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో మూడు నెలల్లో సుందరీకరణ పూర్తిచేస్తాం. ఎలక్ట్రికల్‌ పనుల నిమిత్తం మిగిలిన పనుల్లో కాస్త ఆలస్యం జరిగింది.

– సంతోష్, డీఈ, గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement