బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్
పుణే, బిజినెస్ బ్యూరో: కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట అతి నియంత్రణలు, అధిక స్థాయి జీఎస్‌టీలను అమలు చేయడం వల్లే వాహనాల రేట్లకు రెక్కలు వచ్చాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ వంటి దేశాల్లో మోటార్‌సైకిళ్లపై పన్నులు 8–14 శాతం శ్రేణిలో ఉండగా దేశీయంగా మాత్రం అత్యధికంగా 28 శాతం జీఎస్‌టీ ఉంటోందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి ఉండటం లేదని, దీంతో నిర్వహణ వ్యయాలైనా తగ్గే విధంగా వాహనాలను రూపొందించడం ద్వారా కొనుగోలుదారులకు కొంతైనా ఊరటనిచ్చే ప్రయత్నం జరుగుతోందని బజాజ్ చెప్పారు. 125 సీసీ పైగా సామర్ధ్యం ఉండే స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్ల విభాగంలో తమకు ముప్ఫై రెండు శాతం మేర వాటా ఉందని, దీన్ని మరింతగా పెంచుకునే దిశగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం తరహాలో డబుల్ ఇంజిన్ కారోబార్ (కార్యకలాపాలు) వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు.
బజాజ్ పల్సర్ 400 ధర రూ. 1,85,000
బజాజ్ ఆటో తాజాగా పల్సర్ ఎన్‌ఎస్ 400జీ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 1,85,000గా (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. డెలివరీలు జూన్ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. స్పోర్ట్స్ సెగ్మెంట్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్సర్ బైకులు 1.80 కోట్ల పైచిలుకు అమ్ముడైనట్లు బజాజ్ వివరించారు. పరిమిత కాలం పాటు వర్తించే ఆఫర్ కింద కొత్త పల్సర్‌ను రూ. 5,000కే బుక్ చేసుకోవచ్చు. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. శక్తివంతమైన 373 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్రక్టానిక్ థ్రోటిల్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి.
సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ను జూన్ 18న ఆవిష్కరించనున్నామని రాజీవ్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment