taxes hike
-
పీవోకేలో భగ్గుమన్న నిరసనలు
మిర్పూర్: పన్నుల పెంపు, నిరసనకారుల అరెస్టులపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో శుక్రవారం నిరసనలు భగ్గుమన్నాయి. మిర్పూర్ జిల్లా దద్యాల్ తహశీల్ పరిధిలో నిరసనకారులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడంతోపాటు వారితో తలపడ్డారు. బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టాయి. కొన్ని టియర్ గ్యాస్ తూటాలు సమీపంలోని పాఠశాల ఆవరణలో పడగా విద్యార్థినులు గాయపడ్డారు.పెరుగుతున్న ధరలు, పన్ను భారం, విద్యుత్ కొరతకు సంబంధించి ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయనుందుకు ఆగ్రహిస్తూ జమ్మూకశ్మీర్ జాయింట్ ఆవామీ కమిటీ 10వ తేదీన శుక్రవారం బంద్‌కు, 11న లాంగ్ మార్చ్‌కి పిలుపునిచి్చంది. దీంతో, భద్రతా బలగాలు గురువారం కమిటీ నాయకులు సహా 70 మందిని అదుపులోకి తీసుకున్నాయి. -
వాహనాల ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..?
పుణే, బిజినెస్ బ్యూరో: కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట అతి నియంత్రణలు, అధిక స్థాయి జీఎస్టీలను అమలు చేయడం వల్లే వాహనాల రేట్లకు రెక్కలు వచ్చాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ వంటి దేశాల్లో మోటార్‌సైకిళ్లపై పన్నులు 8–14 శాతం శ్రేణిలో ఉండగా దేశీయంగా మాత్రం అత్యధికంగా 28 శాతం జీఎస్టీ ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి ఉండటం లేదని, దీంతో నిర్వహణ వ్యయాలైనా తగ్గే విధంగా వాహనాలను రూపొందించడం ద్వారా కొనుగోలుదారులకు కొంతైనా ఊరటనిచ్చే ప్రయత్నం జరుగుతోందని బజాజ్ చెప్పారు. 125 సీసీ పైగా సామర్ధ్యం ఉండే స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్ల విభాగంలో తమకు ముప్ఫై రెండు శాతం మేర వాటా ఉందని, దీన్ని మరింతగా పెంచుకునే దిశగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం తరహాలో డబుల్ ఇంజిన్ కారోబార్ (కార్యకలాపాలు) వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు.బజాజ్ పల్సర్ 400 ధర రూ. 1,85,000బజాజ్ ఆటో తాజాగా పల్సర్ ఎన్ఎస్ 400జీ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 1,85,000గా (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. డెలివరీలు జూన్ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. స్పోర్ట్స్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్సర్ బైకులు 1.80 కోట్ల పైచిలుకు అమ్ముడైనట్లు బజాజ్ వివరించారు. పరిమిత కాలం పాటు వర్తించే ఆఫర్ కింద కొత్త పల్సర్‌ను రూ. 5,000కే బుక్ చేసుకోవచ్చు. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. శక్తివంతమైన 373 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్రక్టానిక్ థ్రోటిల్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. సీఎన్జీ మోటార్‌సైకిల్‌ను జూన్ 18న ఆవిష్కరించనున్నామని రాజీవ్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ అన్నారు. -
జనవరి నుంచి జీఎస్టీలో కొత్త మార్పులు అమల్లోకి..
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)లో చేసిన పలు మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్యాసింజర్ల రవాణా .. రెస్టారెంటు సర్వీసులు మొదలైన వాటిని అందించే ఈ–కామర్స్ కంపెనీలు ఈ సేవలపై పన్నులు చెల్లించాల్సి రానుంది. ఇక పాదరక్షలు, టెక్స్టైల్ రంగాలకు కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల పాదరక్షలకు 12 శాతం, కాటన్ మినహా అన్ని రకాల టెక్స్టైల్ ఉత్పత్తులకు (రెడీమేడ్ గార్మెంట్స్ సహా) 12 శాతం జీఎస్టీ వర్తించనుంది. అలాగే ఈ–కామర్స్ కంపెనీలు గానీ ప్యాసింజర్ రవాణా సర్వీసులు అందిస్తే 5 శాతం రేటు వర్తిస్తుంది. ఆఫ్‌లైన్ విధానంలో ఈ సేవలు అందించే ఆటో రిక్షా డ్రైవర్లకు మినహాయింపు ఉంటుంది. ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఆహార డెలివరీ సేవలు అందించే ఈ–కామర్స్ ఆపరేటర్లు జనవరి 1 నుంచి .. ఆయా హోటల్స్ నుంచి జీఎస్టీ వసూలు చేసి, డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇన్వాయిస్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే కస్టమర్ల నుంచి రెస్టారెంట్లు జీఎస్టీ వసూలు చేస్తున్న నేపథ్యంలో అంతిమంగా కస్టమరుపై అదనపు భారం పడదు. జీఎస్టీ డిపాజిట్ బాధ్యతలను మాత్రమే ఫుడ్ డెలివరీ సంస్థలకు బదలాయించినట్లవుతుంది. -
పెట్రోల్ రూ.120 దాటేసింది
న్యూఢిల్లీ/భోపాల్: లీటర్‌కు రూ.120.. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరల్లో కొత్త రికార్డు ఇది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో లీటర్ ధర రూ.120 మార్కును దాటేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు.. ఆదివారం సైతం 35 పైసల చొప్పున పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ రెండింటి ధరల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.34కు, డీజిల్ రేటు రూ.98.07కు చేరింది. మధ్యప్రదేశ్‌లో స్థానిక పన్నుల కారణంగా పెట్రోల్ ధర మోత మోగుతోంది. పన్నా, సాత్నా, రేవా, షాడోల్, చింద్వారా, బాలాఘాట్ తదితర ప్రాంతాల్లో లీటర్ రూ.120కి పైగానే పలుకుతోంది. రాజస్తాన్‌లోని గంగానగర్, హనుమాన్‌గఢ్‌లోనూ లీటర్ రేటు రూ.120 దాటింది. దేశంలోనే అత్యధిక ధర గంగానగర్‌లో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రేటు రూ.121.52కు, డీజిల్ రేటు రూ.112.44కు ఎగబాకింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి ఇప్పటిదాకా పెట్రోల్ ధర 25 సార్లు (లీటర్‌కు రూ.8.15) పెరిగింది. సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ రేటు 28 సార్లు(లీటర్‌కు రూ.9.45) పెరిగింది. రండి.. మా దగ్గర ధర తక్కువ మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో ఆదివారం వార్తాపత్రికలు తెరిచిన జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గోండియాలో పెట్రోల్, డీజిల్ రేటు లీటర్‌కు రూ.4 తక్కువ, అక్కడే పోయించుకోండంటూ ముద్రించిన కరపత్రాలు అందులో ఉండడమే ఇందుకు కారణం. బాలాఘాట్ నుంచి గోండియాకు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రెండు రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నా పెట్రో ధరల్లో వ్యత్యాసం రూ.4 కు పైగా ఉంది. -
ఉచిత వ్యాక్సినేషన్ వల్లనే పెట్రో మంట!
న్యూఢిల్లీ: దేశంలో కరోనాటీకా ఉచితంగా ఇస్తున్నందునే పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయని పెట్రోలియం, సహజవాయు శాఖా సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వ్యాఖ్యానించారు. ఒక లీటర్ పెట్రోలు కన్నా ఒకలీటర్ హిమాలయన్ నీటి ధర అధికమన్నారు. పెట్రోల్ అంత ఖరీదేమీ కాదని, కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల ఖరీదైందని చెప్పారు. ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తున్నారని, ఇందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వాలు విధించే పన్నులతోనే టీకాలు కొంటున్నామన్నారు. 130 కోట్ల మందికి ఉచితంగా టీకాలివ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, ఒక్కో టీకా సుమారు రూ.1,200 అవుతుందని గుర్తు చేశారు. లీటరు పెట్రోలు ఖరీదు సుమారు రూ. 40 ఉండొచ్చని, దీనిపై వ్యాట్ తదితర పన్నులు వేస్తారని వివరించారు. ఒక లీటర్ హిమాలయన్ బాటిల్ ఖరీదు రూ.100 ఉంటోందని గుర్తు చేశారు. అంతేకాకుండా క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి మారుతుంటాయని తెలిపారు. చమురు ధరలను తమ శాఖ నిర్ణయించదని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ ధరలు మారేలా గతంలో వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుం దని చెప్పారు. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని, కానీ విపక్షపాలిత రాష్ట్రాలు పన్ను తగ్గించకుండా తమపై నింద మోపాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇటీవలే తమ శాఖ నిధులను ఆరోగ్య శాఖకు కోవిడ్ కోసం మరలించామన్నారు. -
బడ్జెట్.. ముంచెన్!
విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను పోటు మరింతగా పెరుగుతుందనే ఆందోళనతో సోమవారం మన స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 38,800 పాయింట్ల దిగువకు, నిఫ్టీ, 11,600 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఇంట్రాడేలో 907 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 793 పాయింట్ల నష్టంతో 38,721 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఇంట్రాడేలో 288 పాయింట్ల మేర క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 11,559 పాయింట్ల వద్దకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఈ ఏడాది బాగా నష్టపోయింది ఈ రోజే. సెన్సెక్స్, నిఫ్టీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, 2016, ఏప్రిల్ తర్వాత ఈ సూచీలు అత్యధికంగా నష్టపోవడం ఇదే మొదటిసారి. ఆర్థిక, వాహన, చమురు షేర్లు బాగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. అంచనాలు తల్లకిందులు... మందగమనంలో ఉన్న వినియోగ రంగానికి జోష్‌నివ్వడానికి కేంద్రం బడ్జెట్లో తాయిలాలు ఇవ్వగలదని అందరూ అంచనా వేశారని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ సునీల్ శర్మ పేర్కొన్నారు. ఈ అంచనాలన్నీ తల్లకిందులు కావడం, మరోవైపు రానున్న ఆర్థిక ఫలితాలు మరింత అధ్వానంగా ఉండబోతున్నాయన్న ఆందోళనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని వివరించారు. సెన్సెక్స్ భారీ నష్టాల్లో ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ ఎలాంటి ఊరటలేకపోగా, ఈ నష్టాలు అంతకంతకూ పెరిగాయి. మరిన్ని విశేషాలు.. ► ఇటీవల ప్రతిరోజూ ఆల్‌టైమ్ హైలను తాకుతున్న బజాజ్ ఫైనాన్స్ షేర్ 8 శాతం నష్టంతో రూ.3,415 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► అమ్మకాలు తగ్గుతుండటంతో వాహన కంపెనీలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయన్న వార్తలు వాహన షేర్లను పడగొట్టాయి. హీరో మోటోకార్ప్ 5.3 శాతం, మారుతీ సుజుకీ 5.2 శాతం, టాటా మోటార్స్ 3.4 శాతం, బజాజ్ ఆటోలు 2 శాతం చొప్పున నష్టపోయాయి. ► ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఓఎన్జీసీ 5.4 శాతం, ఎల్ అండ్ టీ 4.3 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.85 శాతం చొప్పున కుదేలయ్యాయి. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ భారీగా పతనమైంది. భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్‌కు సంబంధించిన ఖాతాలో రూ.3,800 కోట్ల మోసం జరిగిందన్న విషయం వెలుగులోకి రావడంతో బీఎస్ఈలో పీఎన్బీ షేర్ 11 శాతం నష్టంతో రూ.72.80 వద్ద ముగిసింది. ► ఎల్ అండ్ టీ కంపెనీ ఇటీవలనే బలవంతంగా చేజిక్కించుకున్న మైండ్‌ట్రీ షేర్ 10 శాతం నష్టంతో రూ.774 వద్ద ముగిసింది. మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు కృష్ణకుమార్ నటరాజన్, ఎన్ఎస్. పార్థసార«థి, రోస్టో రావణన్‌లు తమ తమ డైరెక్టర్ల పదవులకు, కంపెనీ పదవులకు రాజీనామా చేయడం దీనికి కారణం. ► దాదాపు 300కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్; హీరో మోటోకార్ప్, ఈరోస్ మీడియా, ఎస్కార్ట్స్, సన్ టీవీ, కాక్స్ అండ్ కింగ్స్, గోవా కార్బన్, గ్రాఫైట్ ఇండియా తదితర షేర్లు ఈ పతన జాబితాలో ఉన్నాయి. ► ఎల్ అండ్ టీ రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, బ్యాంక్ ఆఫ్ అమెరికా డౌన్‌గ్రేడ్ చేయడంతో ఎల్ అండ్ టీ షేర్ 4% నష్టంతో రూ.1,490 వద్ద ముగిసింది. ఎందుకు పడిందంటే... ఎఫ్‌పీఐలపై పన్ను సంపన్న వర్గాలపై మరింత పన్ను విధించాలన్న ప్రతిపాదన.. భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న 2,000కు పైగా విదేశీ ఫండ్స్‌పై తీవ్రంగానే ప్రభావం చూపగలదని నిపుణులంటున్నారు. ట్రస్ట్‌ల మార్గంలో భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న ఎఫ్‌పీఐలపై తాజా సర్‌చార్జీ భారం మరింతగా పెరుగుతుందని, ఫలితంగా పన్ను పరంగా భారత్‌కు ఉన్న ఆకర్షణ తొలగుతుందని, విదేశీ పెట్టుబడులు నీరసిస్తాయని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాజా ప్రతిపాదన కారణంగా విదేశీ ఇన్వెస్టర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ) భారం మరింతగా పెరుగుతుంది. ఈ పన్ను విషయమై త్వరలోనే వివరణ ఇస్తామని సీబీడీటీ చైర్మన్ పేర్కొనగా, ఇక ఎలాంటి వివరణ అవసరం లేదని, అంతా స్పష్టంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెగేసి చెప్పారు. దీంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బడ్జెట్ ప్రతిపాదనలు... లిస్టెడ్ కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లో షేర్ల సప్లై పెరిగి లిక్విడిటీ ఆవిరైపోతుంది. ఐటీ, పీఎస్‌యూ షేర్లపై ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక ఎమ్ఎన్సీలు మన మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి ప్రయత్నాలు చేస్తాయి. ఇక సంపన్నులపై అధిక పన్నులు విధించడం, షేర్ల బైబ్యాక్‌పై 20 శాతం పన్ను తదితర ప్రతిపాదనలు కూడా మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావమే చూపుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం... అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతకు సిద్ధమవుతోంది. అయితే గత శుక్రవారం వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించాయి. ఆర్థిక వ్యవస్థ బానే ఉందన్న సంకేతాలు ఈ గణాంకాలు ఇవ్వడంతో ఫెడరల్ రిజర్వ్ రేట్లకోత విషయంలో పునరాలోచించే అవకాశాలున్నాయన్న అంచనాలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మోర్గాన్ స్టాన్లీ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లను డౌన్‌గ్రేడ్ చేయడమే కాకుండా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో తన పెట్టుబడులను తగ్గించుకోవాలని(ఇది దాదాపు ఐదేళ్ల కనిష్ట స్థాయి) నిర్ణయించుకోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఈ కారణాలన్నింటి వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా షాంఘై సూచీ 2.5 శాతం, హాంగ్‌సెంగ్ సూచీ 1.5 శాతం, జపాన్ నికాయ్ సూచీ 1 శాతం, దక్షిణ కొరియా కోస్పి సూచీ 2.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇక యూరప్సూచీలు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. జూన్ క్వార్టర్ ఫలితాలు.. ఎలా ఉంటాయో ? వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉన్న నేపథ్యంలో నేటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెలువడనున్నాయి. బ్యాంక్‌లు మినహా ఇతర రంగాల కంపెనీల ఆర్థిక ఫలితాల్లో పెద్దగా మెరుపులు ఉండకపోవచ్చని, అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న ఆందోళన నెలకొన్నది. 2 రోజులు..రూ. 5 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా సోమవారం ఇన్వెస్టర్ల సంపద రూ.3.39 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.3,39,193 కోట్లు ఆవిరై రూ.1,47,96,303 కోట్లకు పడిపోయింది. బడ్జెట్ రోజు సంపద నష్టాన్ని కూడా కలుపుకుంటే మొత్తం రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.5,61,773 కోట్లు హరించుకుపోయింది. ఎదురీదిన యస్ బ్యాంక్ అన్ని షేర్లు క్షీణించినా, యస్ బ్యాంక్ మాత్రం ఎదురీదింది. ఆరంభంలోనే ఐదేళ్ల కనిష్ట స్థాయి, రూ.85.70కు పడిపోయిన ఈ షేర్ తర్వాత పుంజుకొని 5.5 శాతం లాభంతో రూ.93 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులు భేషుగ్గా ఉన్నాయని యాజమాన్యం స్పష్టతనివ్వడంతో పాటు ఉన్నత స్థాయిల్లోని నిర్వహణ పదవులను భర్తీ చేయడం కూడా కలిసి వచ్చింది. సెన్సెక్స్‌లో ఈ షేర్‌తో పాటు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే లాభపడ్డాయి. మొత్తం మీద 31 సెన్సెక్స్ షేర్లలో 28 షేర్లు నష్టపోయాయి. -
ప్రజలపై పన్నుల భారం సహించం
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు రూరల్: హడ్కో రుణ భారాన్ని నగర ప్రజలపై వేస్తే సహించబోమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. నగరంలోని 22వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో చర్చించి, ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సౌకర్యాల కోసం రూ.1200 కోట్లతో పనులు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్ రూపంలో ఇస్తే ప్రజలపై ఎలాంటి భారం ఉండదన్నారు. అలా కాకుండా అప్పు రూపంలో ఇచ్చారని, ఈ భారాన్ని నగర కార్పొరేషన్ భరించే పరిస్థితిలో లేదని చెప్పారు. విజయవాడ కార్పొరేషన్ తీసుకున్న రూ.300 కోట్ల అప్పు వల్ల ఆర్థికంగా చితికిపోయిందన్నారు. విజయవాడ నగరమే రూ.300 కోట్ల అప్పును తట్టుకోలేకపోతే, నెల్లూరు రూ.1200 కోట్ల భారాన్ని ఎలా భరించగలదని ప్రశ్నించారు. ఇంటి పన్నులు, కుళాయి మీటర్ల రూపంలో నగర ప్రజలపై భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, 22వ డివిజన్ ఇన్చార్జి మొయిళ్ల సురేష్‌రెడ్డి, చేజర్ల మహేష్, రాజారెడ్డి, వెంగళరెడ్డి, రమణయ్య, భాస్కర్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, కంచర్ల రమేష్, రమణారెడ్డి, కరిముల్లా, కొండారెడ్డి, దైవాదీనం, మునుస్వామి, సప్తగిరి శ్రీనివాసులురెడ్డి, శ్రీనివాసులురెడ్డి, తదతరులు పాల్గొన్నారు.