ప్రజలపై పన్నుల భారం సహించం
-
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు రూరల్: హడ్కో రుణ భారాన్ని నగర ప్రజలపై వేస్తే సహించబోమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. నగరంలోని 22వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో చర్చించి, ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సౌకర్యాల కోసం రూ.1200 కోట్లతో పనులు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్ రూపంలో ఇస్తే ప్రజలపై ఎలాంటి భారం ఉండదన్నారు. అలా కాకుండా అప్పు రూపంలో ఇచ్చారని, ఈ భారాన్ని నగర కార్పొరేషన్ భరించే పరిస్థితిలో లేదని చెప్పారు. విజయవాడ కార్పొరేషన్ తీసుకున్న రూ.300 కోట్ల అప్పు వల్ల ఆర్థికంగా చితికిపోయిందన్నారు. విజయవాడ నగరమే రూ.300 కోట్ల అప్పును తట్టుకోలేకపోతే, నెల్లూరు రూ.1200 కోట్ల భారాన్ని ఎలా భరించగలదని ప్రశ్నించారు. ఇంటి పన్నులు, కుళాయి మీటర్ల రూపంలో నగర ప్రజలపై భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, 22వ డివిజన్ ఇన్‌చార్జి మొయిళ్ల సురేష్‌రెడ్డి, చేజర్ల మహేష్, రాజారెడ్డి, వెంగళరెడ్డి, రమణయ్య, భాస్కర్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, కంచర్ల రమేష్, రమణారెడ్డి, కరిముల్లా, కొండారెడ్డి, దైవాదీనం, మునుస్వామి, సప్తగిరి శ్రీనివాసులురెడ్డి, శ్రీనివాసులురెడ్డి, తదతరులు పాల్గొన్నారు.