నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి బ్రదర్స్ నయా పాలిట్రిక్స్
తమ్ముడి రాజకీయ భవిష్యత్తుకు ఎమ్మెల్యే వ్యూహం
డిసెంబర్ 4 నుంచి గడప గడపకు గిరిధర్‌రెడ్డి
సర్కార్ ఏర్పాటైన కొద్ది నెలలకే ఈ హడావుడి వెనుక ప్రణాళిక
మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కోటంరెడ్డి రివర్స్ గేర్ ప్లానా..?
జమిలి ఎన్నికలు వచ్చే అవకాశంతో ముందస్తుకు సిద్ధమా..?
కార్యక్రమానికి అధిష్టానం అనుమతి లేదంటున్న పార్టీ నేతలు
రాజకీయ ఉద్ధండులకు, వ్యూహ ప్రతివ్యూహాలకు పెట్టిన పేరు సింహపురి. అలాంటి జిల్లాలో ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాట్‌టాపిక్‌గా మారారు. తాజాగా అధికార పక్షంలో ఉంటూ రాజకీయ చర్చకు, రచ్చకు తెరలేపుతున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు కాలేదు. అప్పుడే నయా పాలి‘ట్రిక్స్’తో ముందుకు ఉరుకుతున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన కోటంరెడ్డి భవిష్యత్తు ప్రణాళికలకు సిద్ధమవుతున్నారని కొందరు భావిస్తుంటే.. తన సోదరుడి రాజకీయ భవిష్యత్తుకు లైన్ క్లియర్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి వచ్చే నెల నుంచి నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీలో ఉన్న గిరిధర్‌రెడ్డికి పార్టీ పరంగా ఎలాంటి పదవులు దక్కలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు కూడా గడవలేదు. ఎన్నికలకు ఎంతో గడువున్నా, అప్పుడే ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి గిరిధర్‌రెడ్డి శ్రీకారం చుట్టడం వెను క రాజకీయ వ్యూహంతో పాటు సంకేతాలూ ఉన్నా యనే అంశం తెలుస్తోంది. అధికార పార్టీ అను మతి లేకుండానే గిరిధర్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే యత్నంలో గల ఆంతర్య మేమిటనే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
తమ్ముడి రాజకీయ భవిష్యత్తు కోసమేనా..?
ఇప్పటి వరకు ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జిగా తెరవెనుక రాజకీయ వ్యవహారాలు నడిపిన గిరిధర్‌రెడ్డి ఇక తెరపైకి రావడం వెనుక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ‘గడప గడపకు గిరిధర్‌రెడ్డి’ కార్యక్రమాన్ని డిసెంబర్ 4 నుంచి నిర్వహించేందుకు కోటంరెడ్డే రూపకల్పన చేశారని తెలుస్తోంది. టీడీపీలో కార్యకర్తగా ఉన్న గిరిధర్‌రెడ్డి ఆ పార్టీ అధిష్టాన అనుమతి లేకుండానే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రాజకీయంగా ఎలాంటి హోదా లేకుండానే ఆయన ప్రజల్లోకి ఎలా వెళ్తారనే ప్రశ్న ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు తన సోదరుడితో కలిసి గిరిధర్‌రెడ్డి అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎమ్మెల్యే హోదాను అనధికారికంగా అనుభవిస్తున్నారు. ఎమ్మెల్యే తరహాలో అధికార కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, సమీక్షలు నిర్వహించడం, మంత్రులు నిర్వహించే సమీక్షల్లోనూ పాల్గొంటున్నారు.
జమిలి ఎన్నికల ప్రచార నేపథ్యంలో..
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన సోదరుడ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని బట్టి జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే సంకేతాలున్నాయని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 2026లో నియోజకవర్గాల పునరి్వభజన ఉంటుందని, మరుసటి ఏడాదిలోనే జమిలి ఎన్నికలు జరుగుతాయనే ప్రచార నేపథ్యంలో ఇప్పటి నుంచే తానే ఎమ్మెల్యే అభ్యర్థనని చెప్పుకొనేందుకు గిరిధర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని తెలుస్తోంది.
మంత్రి పదవి దక్కలేదనేనా..?
రాజకీయ నాయకులు ఎన్నికలకు ఏడాది ముందు నుంచి హడావుడి చేయడం సహజం. అయితే ఎన్నికలు పూర్తయి ఆర్నెల్లు గడవకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సరికొత్త రాజకీయ వ్యూహా నికి తెరతీశారు. వైఎస్సార్సీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అది దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. టీడీపీలో చేరితే అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇస్తామనే హామీతో ఎన్నికలకు ఏడాదిన్నర క్రితం ఆ పారీ్టలో చేరి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే కోటంరెడ్డికి తన చిరకాల వాంఛగా ఉన్న మంత్రి పదవి కోసం లోకేశ్ కోటరీ ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.
తనను నమ్మించి వంచించారనే మనస్తాపంతో ఉన్న ఎమ్మెల్యే వైరాగ్యంలో కూరుకుపోయారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో సాన్నిహిత్యంగా ఉన్నా, ప్రస్తుతం వారితో పొసగడం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆయువుపట్టుగా ఉన్న నగర కార్పొరేషన్లో మంత్రి నారాయణ పెత్తనంతో కోటంరెడ్డికి ప్రాధాన్యం తగ్గింది. ఈ పరిణామాలూ ఆయనకు రుచించడం లేదు. వైఎస్సార్సీపీలో ఉన్న స్వేచ్ఛా వాతావరణం టీడీపీలో లేకపోవడంతో ఆయన మానసిక సంఘర్షణకు గురవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో చేపట్టే మంత్రివర్గ విస్తరణలోనైనా అవకాశం లభిస్తుందనే యత్నంలో భాగంగానే తన సోదరుడితో నయా పాలి‘ట్రిక్స్’ సాగిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అది సాధ్యం కానప్పుడు తన సోదరుడి రాజకీయ భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేసేందుకు.. ప్రజల్లో పరపతిని పెంచే యత్నం కావొచ్చని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
అధిష్టానం అనుమతి లేకున్నా..
కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కుదురుకోలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేక ప్రజాగ్రహానికి గురవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి తన సోదరుడ్ని ప్రజల్లోకి పంపే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతినిధిగా వ్యవహరిస్తున్న గిరిధర్‌రెడ్డి ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారి నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ పరిణామాలు రాష్ట్రం మొత్తంలో చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే కూటమి ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ పరిస్థితుల్లో గిరిధర్‌రెడ్డి కార్యక్రమానికి అనుమతి ఇచ్చే సాహసాన్ని పార్టీ అధిష్టానం చేయకపోవచ్చు. పార్టీ అనుమతి చ్చినా.. ఇవ్వకపోయినా.. గిరిధర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి సిద్ధమైతే పరిస్థితులు, పరిణామాలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment