
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ)లో చేసిన పలు మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్యాసింజర్ల రవాణా .. రెస్టారెంటు సర్వీసులు మొదలైన వాటిని అందించే ఈ–కామర్స్ కంపెనీలు ఈ సేవలపై పన్నులు చెల్లించాల్సి రానుంది. ఇక పాదరక్షలు, టెక్స్‌టైల్ రంగాలకు కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల పాదరక్షలకు 12 శాతం, కాటన్ మినహా అన్ని రకాల టెక్స్‌టైల్ ఉత్పత్తులకు (రెడీమేడ్ గార్మెంట్స్ సహా) 12 శాతం జీఎస్‌టీ వర్తించనుంది. అలాగే ఈ–కామర్స్ కంపెనీలు గానీ ప్యాసింజర్ రవాణా సర్వీసులు అందిస్తే 5 శాతం రేటు వర్తిస్తుంది.
ఆఫ్‌లైన్ విధానంలో ఈ సేవలు అందించే ఆటో రిక్షా డ్రైవర్లకు మినహాయింపు ఉంటుంది. ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఆహార డెలివరీ సేవలు అందించే ఈ–కామర్స్ ఆపరేటర్లు జనవరి 1 నుంచి .. ఆయా హోటల్స్ నుంచి జీఎస్‌టీ వసూలు చేసి, డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇన్‌వాయిస్‌లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే కస్టమర్ల నుంచి రెస్టారెంట్లు జీఎస్‌టీ వసూలు చేస్తున్న నేపథ్యంలో అంతిమంగా కస్టమరుపై అదనపు భారం పడదు. జీఎస్‌టీ డిపాజిట్ బాధ్యతలను మాత్రమే ఫుడ్ డెలివరీ సంస్థలకు బదలాయించినట్లవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment