Goods and Services Tax
-
జీఎస్టీలో కొత్త సవరణలు..
పన్నులు ఎగవేసేందుకు ఆస్కారమున్న ఉత్పత్తులను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడేలా ‘ట్రాక్ అండ్ ట్రేస్’ నిబంధన సహా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంలో కేంద్ర బడ్జెట్ పలు సవరణలు ప్రతిపాదించింది. ఈ నిబంధన అమలు కోసం విశిష్ట గుర్తింపు మార్కింగ్‌కు నిర్వచనం ఇస్తూ సెంట్రల్ జీఎస్టీ చట్టంలో కొత్త నిబంధన చేర్చింది. ప్రత్యేకమైన, సురక్షితమైన, తొలగించడానికి వీలుకాని విధంగా ఉండే డిజిటల్ స్టాంప్, డిజిటల్ మార్క్ లేదా ఆ కోవకు చెందిన ఇతరత్రా గుర్తులు ‘విశిష్ట గుర్తింపు మార్కింగ్’ కిందికి వస్తాయి. సరఫరా వ్యవస్థను మెరుగ్గా పర్యవేక్షించడానికి, వ్యాపారవర్గాలను డిజిటైజేషన్ వైపు మళ్లించడానికి ఇలాంటి చర్యలు దోహదపడగలవని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. -
జీఎస్టీ వసూళ్ల రికార్డ్
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అక్టోబర్‌లో రికార్డు సృష్టించాయి. సమీక్షా నెలలో 9 శాతం పురోగతితో (2023 ఇదే నెలతో పోల్చితే) రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జూలైలో జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఒక నెలలో ఈ స్థాయి వసూళ్లు ఇది రెండవసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు ఇప్పటి వరకూ ఆల్‌టైమ్ రికార్డు. దేశీయ అమ్మకాలు, పన్ను పరిధి విస్తృతి తాజా రికార్డుకు కారణమని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రిఫండ్స్ రూ.19,306 కోట్లుకాగా, మొత్తం అక్టోబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1,87,346 కోట్లలో రూ.19,306 కోట్ల రిఫండ్స్ జరిగాయి. 2023 అక్టోబర్‌తో పోలి్చతే ఇది 18.2 శాతం అధికం. రిఫండ్స్ మినహాయిస్తే, నికర జీఎస్టీ వసూళ్లు 8 శాతం వృద్ధితో రూ.1.68 లక్షల కోట్లుగా ఉన్నాయి. విభాగాల వారీగా→ మొత్తం వసూళ్లు రూ. 1,87,346 కోట్లు → సెంట్రల్ జీఎస్టీ రూ.33,821 కోట్లు → స్టేట్ జీఎస్టీ రూ.41,864 కోట్లు → ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ విలువ రూ.99,111 కోట్లు → సెస్ రూ.12,550 కోట్లు. -
వాటర్ క్యాన్, సైకిళ్లపై తగ్గింపు షూ, వాచీలపై పెంపు
న్యూఢిల్లీ: 20 లీటర్ల వాటర్ క్యాన్, సైకిళ్లు, నోటు పుస్తకాల ధరలు తగ్గే వీలుంది. వస్తుసేవల పన్నుల(జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం(జీఓఎం) శనివారం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్యాక్చేసిన 20 లీటర్ల నీళ్ల క్యాన్, సైకిళ్లు, రాసుకునే నోటుపుస్తకాలపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని జీఓఎం నిర్ణయించింది. ఖరీదైన చేతి గడియారాలు, షూలపై పన్నులను పెంచాలని మంత్రుల బృందం నిర్ణయించిందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కొన్ని వస్తువులపై పన్నులు పెంచడం ద్వారా రూ.22,000 కోట్ల ఆదాయం సమకూరవచ్చని బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం అంచనావేసింది. ఈ సిఫార్సులను జీఎస్టీ మంత్రిమండలి ఆమోదిస్తే సవరణల అమల్లోకి రానున్నాయి. ప్యాక్చేసిన 20 లీటర్ల నీళ్ల బాటిల్‌పై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలుచేస్తుండగా త్వరలో అది 5 శాతానికి దిగిరానుంది. రూ.10వేలలోపు ధర ఉన్న సైకిళ్లపై ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉండగా దానిని 5 శాతానికి తగ్గిస్తారు. నోటు పుస్తకాలపైనా 5 శాతం జీఎస్టీనే వసూలుచేయనున్నారు. కొన్నింటి ధరలు పెరిగే వీలుంది. హెయిర్ డ్రయర్లు, హెయిర్ కర్లర్లు, బ్యూటీ/మేకప్ సామగ్రిపై ప్రస్తుతం అమలవుతున్న 18 శాతం జీఎస్టీని 28 శాతానికి పెంచనున్నారు. మంత్రుల బృందంలో ఉత్తరప్రదేశ్ ఆర్థికమంత్రి సురేశ్ ఖన్నా, రాజస్తాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ సభ్యులుగా ఉన్నారు. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబులతో జీఎస్టీని అమలుచేస్తున్నారు. నిత్యావసరాల సరకులపై తక్కువ పన్నులను, అత్యంత విలాసవంత వస్తువులపై 28 శాతం జీఎస్టీని వసూలుచేస్తుండటం తెల్సిందే. వినియోగదారులు, మార్కెట్వర్గాల నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటూ ఎప్పటి కప్పుడు ఆయా వస్తువులను ప్రభుత్వం వేర్వేరు శ్లాబుల్లోకి మారుస్తోంది. -
వాహన పరిశ్రమ @ రూ. 20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ టర్నోవర్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కోట్ల మార్కును దాటిందని వాహన తయారీదారుల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం వస్తు, సేవల పన్నుల్లో (జీఎస్టీ) 14–15 శాతం వాటా ఆటో పరిశ్రమదే ఉంటోందని ఆయన చెప్పారు. అలాగే దేశీయంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయంగా ఉపాధి కలి్పస్తోందని ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 64వ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ వాటా 6.8 శాతంగా ఉండగా ఇది మరింత పెరగగలదని వివరించారు. అంతర్జాతీయంగా భారతీయ ఆటో రంగం పరపతి పెరిగిందని అగర్వాల్ చెప్పారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఉత్పత్తి చేయగలిగే 50 క్రిటికల్ విడిభాగాలను పరిశ్రమ గుర్తించిందని ఆయన వివరించారు. 100 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం: కేంద్ర మంత్రి గోయల్ భారతీయ వాహన సంస్థలు 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏసీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. ఇందులో భాగంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, స్థానికంగా ఉత్పత్తిని మరింతగా పెంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వాహన ఎగుమతులు 21.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పరిశ్రమలకు ఉపయోగపడేలా ప్రభుత్వం 20 స్మార్ట్ ఇండస్ట్రియల్ నగరాలను అభివృద్ధి చేస్తోందని, వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ టౌన్íÙప్ల రూపంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి చెప్పారు. మరోవైపు, లోకలైజేషన్‌ను పెంచేందుకు సియామ్, ఏసీఎంఏ స్వచ్ఛందంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
జీఎస్టీతో భారీగా తగ్గిన ఉత్పత్తుల ధరలు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంతో గృహావసర ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనితో ‘పన్నులపరంగా ఉపశమనం లభించి, ఇంటింటా ఆనందం వచి్చందని‘ పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడేళ్లయిన సందర్భంగా మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో ఆర్థిక శాఖ ఈ మేరకు పోస్ట్ చేసింది. జీఎస్టీకి పూర్వం అన్ప్యాక్డ్ గోధుమలు, బియ్యం, పెరుగు, లస్సీ మొదలైన వాటిపై 2.5–4 శాతం పన్ను ఉండేదని, కొత్త విధానం అమల్లోకి వచ్చాక వాటిపై పన్నులు లేవని పేర్కొంది. అలాగే కాస్మెటిక్స్, రిస్ట్ వాచీలు, శానిటరీ ప్లాస్టిక్ వేర్, ఫరి్నచర్ మొదలైన వాటిపై రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇక, 32 అంగుళాల వరకు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, గీజర్లు మొదలైన వాటిపై 31.3 శాతం పన్నుల భారం ఉండేదని .. కొత్త విధానం అమల్లోకి వచ్చాక ఇవి 18 శాతం శ్లాబ్‌లోకి వచ్చాయని పేర్కొంది. 2023–24లో రూ. 2 కోట్ల వరకు వార్షిక టర్నోవరు ఉన్న ట్యాక్స్‌పేయర్లకు రిటర్నులు దాఖలు చేయడం నుంచి మినహాయింపునివ్వడంతో చిన్న స్థాయి ట్యాక్స్‌పేయర్లకు నిబంధనల భారం తగ్గిందని వివరించింది. 17 రకాల స్థానిక పన్నులు, సెస్సుల స్థానంలో జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచి్చంది. ఆ తర్వాత నుంచి నిబంధనలను పాటించడంతో పాటు ట్యాక్స్‌పేయర్ల బేస్ కూడా గణనీయంగా పెరిగినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) బోర్డు చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. 2018లో 1.05 కోట్లుగా ఉన్న జీఎస్టీ ట్యాక్స్‌పేయర్ల సంఖ్య 2024 ఏప్రిల్ నాటికి 1.46 కోట్లకు చేరినట్లు వివరించారు. -
జీఎస్టీ రికార్డు వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చరిత్రాత్మక రికార్డు సృష్టించాయి. సమీక్షా నెల్లో 2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023 ఇదే నెలలో నమోదయిన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటి రికార్డు. అంటే సమీక్షా నెల్లో వార్షిక ప్రాతిపదికన 12.4 శాతం పురోగతి నమోదయ్యిందన్నమాట. ఆర్థిక క్రియాశీలత, దిగుమతుల పురోగతి వంటి అంశాలు జీఎస్టీ రికార్డుకు కారణమయ్యింది. విభాగాల వారీగా ఇలా... ⇒ మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.2,10,267 కోట్లు. ⇒ సెంట్రల్ జీఎస్టీ రూ.43,846 కోట్లు. ⇒ స్టేట్ జీఎస్టీ రూ.53,538 కోట్లు. ⇒ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.99,623 కోట్లు ⇒ సెస్ రూ.13,260 కోట్లు (దిగుమతులపై రూ.1,008 కోట్లుసహా) ఏపీలో 12%, తెలంగాణలో 11% వృద్ధి కాగా, జీఎస్టీ ఇంటర్ గవర్నమెంట్ సెటిల్మెంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి కేంద్ర జీఎస్టీకి రూ.50,307 కోట్లు, రాష్ట్ర జీఎస్టీకి రూ.41,600 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ పంపిణీ చేసింది. దీంతో మొత్తంగా కేంద్ర జీఎస్టీగా రూ.94,153 కోట్లు, రాష్ట్ర జీఎస్టీగా రూ.95,138 కోట్ల ఆదాయం సమీక్షా నెల్లో సమకూరినట్లయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు వృద్ధిని కనబరిచాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 12% వృద్ధితో రూ.4,850 కోట్లు, తెలంగాణలో 11% వృద్ధితో రూ.6,236 కోట్లు నమోదయ్యాయి. అయితే దేశంలోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో వసూళ్లు 13 శాతం వృద్ధితో రూ.37,671 కోట్లకు ఎగశాయి. గత ఆర్థిక సంవత్సరంలో నుంచి (అంకెలు రూ. లక్షల కోట్లలో) ఏప్రిల్ 2023 1.87 మే 1.57 జూన్ 1.61 జూలై 1.60 ఆగస్టు 1.59 సెపె్టంబర్ 1.63 అక్టోబర్ 1.72 నవంబర్ 1.67 డిసెంబర్ 1.64 జనవరి 2024 1.74 ఫిబ్రవరి 1.68 మార్చి 1.78 ఏప్రిల్ 2.102017జూలైలో తాజా పరోక్ష పన్ను వ్యవస్థ జీఎస్టీ ప్రారంభమైన తర్వాత 2024 ఏప్రిల్, 2023 ఏప్రిల్, 2024 మార్చి, 2024 జనవరి, 2023 అక్టోబర్ ఇప్పటి వరకూ టాప్–5 జీఎస్టీ నెలవారీ వసూళ్లను నమోదుచేశాయి. -
జనవరిలో జీఎస్టీ @ రూ.1.72 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జనవరిలో 10.4 శాతం పెరిగి రూ.1,72,129 కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. 2017 జూలైలో కొత్త పరోక్ష పన్నుల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఇవి రెండవ అతిపెద్ద భారీ వసూళ్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.70 లక్షల కోట్లుపైబడిన వసూళ్లు ఇది మూడవసారి కావడం మరో విశేషం. జనవరి 31వ తేదీ 5 గంటల సమయం వరకూ చూస్తే, ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ నుంచి జనవరి 2024 వరకూ జీఎస్టీ వసూళ్లు 11.6 శాతం పెరిగి 16.69 లక్షల కోట్లకు ఎగసింది. 2023 ఏప్రిల్‌లో ఇప్పటివరకూ అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లు చోటుచేసుకున్నాయి. -
జీఎస్టీ వసూళ్లు @ రూ.1.57 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా మూడో నెల మేలో కూడా రూ. 1.50 లక్షల కోట్లు దాటాయి. సమీక్షా నెల్లో (2022 మే నెలతో పోల్చి) 12 శాతం వృద్ధితో రూ. 1.57 లక్షల కోట్లకు పైగా వసూళ్లు నమోదయినట్లు గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగున్నట్లు ఈ ఫలితాలు పేర్కొంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్చిలో వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లుకాగా, ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో (2017 జూలైలో ప్రారంభమైన తర్వాత ఎన్నడూ లేనంతగా) రూ.1.87 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి. ఇక రూ.1.4 లక్షలకోట్ల పైన వసూళ్లు వరుసగా 14వ నెల. తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► మొత్తం వసూళ్లు రూ.1,57,090 కోట్లు. ► సెంట్రల్ జీఎస్టీ రూ.28,411 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ రూ.35,828 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.81,363 కోట్లు. ► సెస్ రూ.11,489 కోట్లు. -
కలెక్షన్ల వరద..రెండోసారి రూ1.60లక్షల కోట్లు దాటిన వసూళ్లు!
దేశంలో జీఎస్టీ వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మార్చి నెలలో 13 శాతం వృద్దితో రూ.1.60 లక్షల కోట్ల వసూళ్లు జరిగినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ అధికారికంగా ప్రకటించింది. మార్చినెలలో మొత్తం జీఎస్టీ వసూళ్ల వివరాల్ని పరిశీలిస్తే.. సీజీఎస్టీ రూ.29,546 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.37,314 కోట్లు, ఐజీఎస్టీ రూ.82,907 కోట్లు, సెస్ రూ.10,355 కోట్లు కలెక్షన్లను రాబట్టినట్లు ఆర్ధిక శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గత ఆర్ధిక సంవత్సరం (2022-2023) లో వరుసగా నాల్గవ సారి రూ.1.5లక్షల కోట్లు దాటగా.. జీఎస్టీని అమల్లోకి తెచ్చినప్పటి నుంచి ఈ వసూళ్లు రూ.1.60లక్షల కోట్లు దాటడం (మార్చి నెలలో)ఇది రెండోసారి అని ఆర్ధిక శాఖ వెల్లడించింది. -
జీఎస్టీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఫిబ్రవరిలో 2022 ఇదే నెలతో పోల్చితే 12 శాతం పెరిగి రూ.1.49 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ ఆర్థిక క్రియాశీలత, వినియోగ వ్యయాల పటిష్టత దీనికి కారణం. అయితే 2023 జనవరితో పోల్చితే (రూ.1.55 లక్షల కోట్లు. జీఎస్టీ ప్రవేశపెట్టిన 2017 జూలై 1 తర్వాత రెండవ అతి భారీ వసూళ్లు) వసూళ్లు తగ్గడం గమనార్హం. అయితే ఫిబ్రవరి నెల 28 రోజులే కావడం కూడా ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. విభాగాల వారీగా చూస్తే... ► మొత్తం రూ.1,49,577 కోట్ల వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.27,662 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ రూ.34,915 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.75,069 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.35,689 కోట్లుసహా). ► సెస్ రూ.11,931 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.792 కోట్లుసహా). కాగా, జీఎస్టీ ప్రారంభమైన తర్వాత సెస్ వసూళ్లు ఈ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి. ► ‘ఒకే దేశం– ఒకే పన్ను’ నినాదంతో 2017 జూలైలో పలు రకాల పరోక్ష పన్నుల స్థానంలో ప్రారంభమైన జీఎస్టీ వ్యవస్థలో 2022 ఏప్రిల్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1,67,650 కోట్లుగా నమోదయ్యాయి. -
జీఎస్టీ వసూళ్లు.. రూ.1.50 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు డిసెంబర్లో 15% పెరుగుదలతో రూ.1,49,507 కోట్లకు చేరాయి. 2021 ఇదే నెలతో (రూ.1.30 లక్షల కోట్లు) పోల్చితే ఈ పెరుగుదల 15 శాతంగా నమోదయ్యింది. తయారీ, వినియోగ రంగాల నుంచి డిమాండ్ పటిష్టంగా ఉందని గణాంకాలు వెల్లడించాయి. వస్తు సేవల పన్ను వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లను అధిగమించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది వరుసగా 9వ నెల. -
అన్‌రిజిస్టర్డ్ వ్యక్తులకూ ఇక జీఎస్టీ రిఫండ్స్!
న్యూఢిల్లీ: రద్దయిన కాంట్రాక్టులు లేదా బీమా పాలసీలకు సంబంధించి నమోదుకాని (అన్‌రిజిస్టర్డ్) వ్యక్తులు కూడా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వాపసులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)తో జీఎస్టీ పోర్టల్‌లో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను పొందాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక ప్రకటనలో సూచించింది. బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తోపాటు, రిఫండ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాంట్రాక్ట్ రద్దయిన సందర్భంలో తాము అప్పటికే భరించిన పన్ను మొత్తాన్ని వాపసు కోసం క్లెయిమ్ చేయడానికి ఒక సదుపాయాన్ని (ఫెసిలిటీ) కల్పించాలని రిజిస్టర్ కాని కొనుగోలుదారులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెలువరిస్తున్నట్లు తెలిపింది. రెండేళ్ల కాల వ్యవధి... తాజా నిర్ణయంతో ఫ్లాట్, భవనం నిర్మాణం లేదా దీర్ఘకాలిక బీమా పాలసీ రద్దుకు సంబంధించి అప్పటికే చెల్లించిన జీఎస్టీని ఇకపై అన్ రిజిస్టర్డ్ వ్యక్తులూ తిరిగి పొందే (రిఫండ్) వెసలుబాటు కలిగింది. నమోదవ్వని పన్ను చెల్లింపుదారు సంబంధిత తేదీ నుండి రెండు సంవత్సరాలలోపు వాపసుల కోసం ఫైల్ చేయవచ్చని సీబీఐసీ వివరించింది. వస్తువులు, సేవలను స్వీకరించిన తేదీ లేదా ఒప్పందం రద్దయిన తేదీ నుంచి ఇది ఈ రెండేళ్ల కాల వ్యవధి వర్తిస్తుందని వివరించింది. డిసెంబర్ 17న జరిగిన జీఎస్టీ అత్యున్నత స్థాయి 48వ సమావేశం నిర్ణయాలకు అనుగుణంగా తాజాగా సీబీఐసీ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ‘‘రిజిస్టర్ చేయని కొనుగోలుదారులు సరఫరా జరగని చోట జీఎస్టీ వాపసు పొందడానికి తాజా నిర్ణయం అనుమతిస్తుంది. వారిపై ఇప్పటి వరకూ ఉన్న అనవసరమైన వ్యయ భారాన్ని నివారించడంలో సహాయపడుతుంది’’ అని అని భారత్‌లో కేపీఎంసీ ప్రతినిధి (పరోక్ష పన్ను) అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. -
రూ.2 కోట్లు దాటితేనే ‘జీఎస్టీ’నేరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నేర విచారణ విషయంలో అత్యున్నత స్థాయి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు కనీస పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.1 కోటి నుంచి రూ.2 కోట్లకు పెంచింది. నకిలీ ఇన్వాయిస్లకు మాత్రం పన్ను పరిమితి రూ.1 కోటి కొనసాగించాలని శనివారం జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు. దేశంలో జీఎస్టీ పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 1.4 కోట్లు కాగా నెలకు సగటున రూ.1.4 లక్షల కోట్లు వసూలవుతున్నాయని వివరించారు. అధికారి విధులకు ఆటంకం కలిగించడం, ఉద్ధేశపూర్వకంగా సాక్ష్యాల తారుమారు, సరఫరా సమాచారాన్ని ఇవ్వకపోవడం వంటి మూడు అంశాలను నేర జాబితా నుంచి తొలగించాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. రిఫైనరీలకు సరఫరా చేసే ఇథైల్ ఆల్కహాల్‌పై పన్ను 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. అదనపు సుంకాల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 50–150 శాతం శ్రేణి నుంచి 25–100 శాతం శ్రేణికి కుదించారు. పరిహార (కంపెన్సేషన్) పన్ను 22 శాతం విధించడానికి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) నిర్వచనంపై కూడా కౌన్సిల్ స్పష్టత ఇచ్చింది. ఇకపై 1,500 సీసీ ఆపైన ఇంజిన్ సామర్థ్యం, 4,000 మిల్లీమీటర్ల కంటే పొడవు, 170 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే ఎస్‌యూవీగా పరిగణిస్తామని సీతారామన్ తెలిపారు. అదేవిధంగా, ఆన్లైన్ గేమ్‌లు గెలవడం అనేది ఒక నిర్దిష్ట ఫలితంపై ఆధారపడి ఉంటే పూర్తి పందెం విలువపై 28 శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. -
జీఎస్టీ వసూళ్లు అదుర్స్..నవంబరులో రూ.1.46 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) భారీ వసూళ్లు కొనసాగుతున్నాయి. వినియోగ వ్యయాల దన్నుతో నవంబర్‌లో 11 శాతం పెరిగి (2021 నవంబర్‌తో పోల్చి) రూ.1,45,867 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ వసూళ్లు రూ.1.4 లక్ష కోట్లు దాటడం ఇది వరుసగా తొమ్మిదవ నెల. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. కాగా, ఆగస్టు తర్వాత తక్కువ వసూళ్లు జరగడం నవంబర్లోనే మొదటిసారి. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలు విభాగాల వారీగా.. ►సెంట్రల్ జీఎస్టీ రూ.25,681 కోట్లు ►స్టేట్ జీఎస్టీ రూ.32,651 కోట్లు ►ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.77,103 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.38,635 కోట్లుసహా). ►సెస్ రూ.10,432 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.817 కోట్లతో సహా) ►‘ఒకే దేశం– ఒకే పన్ను’ నినాదంతో 2017 జూలైలో పలు రకాల పరోక్ష పన్నుల స్థానంలో ప్రారంభమైన జీఎస్టీ వ్యవస్థలో 2022 ఏప్రిల్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1,67,650 కోట్లుగా నమోదయ్యాయి. -
బడ్జెట్ అంచనాలను మించి పన్ను వసూళ్లు!
న్యూఢిల్లీ: భారత్ పన్ను వసూళ్లు 2023 మార్చితో ముగిసే 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించి నమోదుకానున్నట్లు రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. లక్ష్యంకన్నా రూ.4 లక్షల కోట్ల అధిక వసూళ్లు జరగవచ్చని ఆయన తెలిపారు. భారీగా జరుగుతున్న ఆదాయపు పన్ను, కస్టమ్స్ సుంకాలు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు దీనికి కారణమని ఆయన అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపిన అంశాలు... ► పన్ను రాబడిలో వృద్ధి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కంటే ఎక్కువగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి దీనికి కారణం. ► 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు. ► అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చు. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. ► ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సైతం పన్నుల లక్ష్యం మరింత పెద్దగా ఉండొచ్చు. ► పన్ను వసూళ్ల మదింపునకు మేము విస్తృత స్థాయిలో డేటాను ఉపయోగిస్తున్నాము. ఆదాయపు పన్ను, జీఎస్టీ విభాగాలు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) నుండి డేటాను ఎప్పుటికప్పుడు పొందుతున్నాము. సాంకేతికత అధికారికీకరణ అనుకూలతను మెరుగుపరచడంతో డేటాను సమగ్ర స్థాయిలో పొందగలుగుతున్నాము. ► 2020–21తో పోల్చితే 2021–22లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 50 శాతం పెరిగి, రూ.14.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ► ఈ ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించినప్పటికీ ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించిన లక్ష్యానికి అతి చేరువలో ఉండడం హర్షణీయం. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల ద్వారా వరుసగా రూ.2.13 లక్షల కోట్లు, రూ.3.35 లక్షల కోట్ల చొప్పున వసూళ్లు జరగాలన్నది బడ్జెట్ లక్ష్యం. ► ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్) సంబంధించి ఇప్పటి వరకూ 6.85 కోట్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 31 వరకూ తుది గడువు ఉండడంతో రిటర్న్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2021–22కిగాను ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న కార్పొరేట్లు, ఇతరులకు తుది గడువు నవంబర్ 7. గడువు తప్పినట్లయితే, పన్ను చెల్లింపుదారులు జరిమానా చెల్లించడం ద్వారా ఆలస్యంగా కూడా రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ 10 వరకూ రిఫండ్స్ విలువ (31 శాతం వృద్ధితో) రూ. 2లక్షల కోట్లు. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లుకాగా, రిఫండ్స్ పోను మిగిలిన మొత్తం రూ.8.54 లక్షల కోట్లు. వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఈ విలువ 61.31 శాతానికి చేరింది. ► దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం హర్షణీయ పరిణామం. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఎనిమిది నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. కట్టడిలో ద్రవ్యలోటు చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందని భావిస్తున్నాం. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. -
Pre-Budget 2023: ఉపాధి కల్పనే ధ్యేయంగా బడ్జెట్..
న్యూఢిల్లీ: వినియోగాన్ని పెంచడానికి ఉపాధి కల్పనే ధ్యేయంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పారిశ్రామిక రంగం విజ్ఞప్తి చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్‌లను హేతుబద్ధీకరించాలని, తద్వారా పన్ను బేస్‌ను విస్తృతం చేసే చర్యలపై బడ్జెట్ దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రితో సోమవారం జరిగిన వర్చువల్ ప్రీ–బడ్జెట్ సమావేశంలో కోరాయి. ఈ సమావేశంలో తమ ప్రతినిధులు చేసిన సూచనలపై పారిశ్రామిక వేదికలు చేసిన ప్రకటనల ముఖ్యాంశాలు.. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం: సీఐఐ ‘అంతర్జాతీయ పరిణామాలు కొంతకాలం పాటు అననుకూలంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో దేశీయ డిమాండ్, అన్ని రంగాల పురోగతి, వృద్ధి పెంపునకు చర్యలు అవసరం. ఉపాధి కల్పనను ప్రోత్సహించడం ద్వారా మన దేశీయ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దూకుడుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడి తప్పకుండా చూడ్డానికి పెట్టుబడులకు దారితీసే వృద్ధి వ్యూహంపై దృష్టి పెట్టాలి. మూలధన వ్యయాల కేటాయింపుల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపాధి కల్పనను పెంచేందుకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టాలి. ముఖ్యంగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాపారాలకు సంబంధించి పన్ను ఖచ్చితత్వం అవసరం. ఇందుకుగాను కార్పొరేట్ పన్ను రేట్లను ప్రస్తుత స్థాయిలో కొనసాగించాలి. పన్నుల విషయంలో మరింత సరళీకరణ, హేతుబద్ధీకరణ, చెల్లింపులో సౌలభ్యత, వ్యాజ్యాల తగ్గింపు ప్రధాన ప్రాధాన్యతలుగా ఉండాలి’ అని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. పంచముఖ వ్యూహం: పీహెచ్‌డీసీసీఐ ‘కేంద్ర బడ్జెట్ (2023–24) భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వంటి కీలకమైన తరుణంలో రూపొందుతోంది. ఈ తరుణంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి పథాన్ని కొనసాగించడానికి, దేశీయ వృద్ధి వనరులను పెంపొందించడానికి కీలక చర్యలు అవసరం. ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడులను పునరుద్ధరించడానికి పంచముఖ వ్యూహాన్ని అవలంభించాలి. వినియోగాన్ని పెంచడం, కర్మాగారాల్లో సామర్థ్య వినియోగాన్ని పెంచడం, ఉద్యోగాల అవకాశాల కల్పన, సామాజిక మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడం, భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం వంటి చర్యలు ఇందులో కీలకమైనవి’అని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాల్మియా సూచించారు.æ శుక్రవారం రాష్ట్రాల ఆర్థికమంత్రులతో భేటీ కాగా, ఆర్థికమంత్రి సీతారామన్ వచ్చే శుక్రవారం (25వ తేదీ) రాష్ట్రాల ఆర్థికమంత్రులతో న్యూఢిల్లీలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. -
జీఎస్టీ.. రెండో భారీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అక్టోబర్‌లో రూ.1.52 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2021 ఇదే నెలతో పోల్చితే ఈ వసూళ్లు 16.5 శాతం అధికం. ఇక ఈ స్థాయిలో వసూళ్లు జరగడం జీఎస్టీ చరిత్రలో రెండవసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్ధాయిలో రూ.1.68 లక్షల కోట్లు నమోదుకాగా, సెప్టెంబర్‌లో ఈ విలువ రూ.1.48 లక్షల కోట్లుగా ఉంది. పండుగల సీజన్లో ఎకానమీ ఉత్సాహభరిత క్రియాశీలతను తాజా గణాంకాలు ప్రతిబింబిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు.. ► అక్టోబర్‌లో మొత్తం రూ.1,51,718 కోట్ల వసూళ్లు జరిగాయి. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.26,039 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.33,396 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.81,778 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.37,297 కోట్లుసహా). సెస్ రూ.10,505 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.10,505 కోట్లుసహా) ► జీఎస్టీ వసూళ్లు వరుసగా 8 నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. ► 2022 సెప్టెంబర్ నెలలో 8.3 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ ఆయ్యాయి. 2022 అక్టోబర్ నెలలో ఈ సంఖ్య 7.7 కోట్లుగా ఉంది. -
జీఎస్టీ వసూళ్లు రయ్ రయ్
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో జోష్ మరింత పెరిగింది. ఈ ఏడాది మార్చి నుంచి వరసగా ఏడోసారి జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. గడిచిన సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,47,686 కోట్లుగా ఉందని శనివారం కేంద్ర ఆర్ధిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. సెంట్రల్ జీఎస్టీ రూ.25,271 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.31,813 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.80,464 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన మొత్తం రూ.41,215 కోట్లతో కలిపి), సెస్ రూ.10,137 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.856 కోట్లతో కలిపి)గా నమోదయ్యాయి. ఈ సెప్టెంబర్ వసూళ్లు.. గత ఏడాది సెప్టెంబర్ నెల వసూళ్లతో పోలిస్తే ఏకంగా 26 శాతం ఎక్కువ కావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 39 శాతం పెరిగింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు 22 శాతం ఎక్కువయ్యాయి. జీఎస్టీ వసూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఎనిమిదవ సారి. రూ.1.4 లక్షల కోట్ల మార్క్ దాటం ఈ ఏడాది మార్చి నుంచి చూస్తే వరుసగా ఏడోసారి. ఈ ఏడాదిలో అత్యధిక సింగిల్ డే కలెక్షన్ జూలై 20న నమోదైంది. ఆ రోజు 9.58 లక్షల చలాన్ల ద్వారా రూ.57,846 కోట్లు వచ్చాయి. రెండో అత్యధిక సింగిల్ డే కలెక్షన్లు సెప్టెంబర్ 20న నమోదయ్యాయి. ఏపీలో 21 శాతం.. తెలంగాణలో 12 శాతం జీఎస్టీ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు గణనీయ వృద్ధిని సాధించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2,595 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది 21 శాతం మేర పెరిగి రూ.3,132 కోట్లకు చేరిందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది రూ.3,494 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు 12శాతం మేర పెరిగి రూ.3,915 కోట్లకు పెరిగాయని వెల్లడించింది. -
జులై నెలలో రూ.1.49 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు!
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో సరికొత్త రికార్డ్‌లు నమోదవుతున్నాయి. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జులై నెలలో 28శాతం పెరిగి దేశం మొత్తం మీద రూ.1.49లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్ధిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చిలో వసూలు చేసిన జీఎస్టీ కంటే జులై నెలలో కలెక్ట్ చేసిన జీఎస్టీ 3 శాతం పెరిగింది. దీంతో గత 5 నెలల నుంచి ప్రతి నెల రూ.1.4కోట్లుకు పైగా జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయే తప్పా ఎక్కడా తగ్గడం లేదని ఆర్ధిక శాఖ పేర్కొంది. ఇక వసూలైన జీఎస్టీ కలెక్షన్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.25,751, స్టేట్ జీఎస్టీ రూ.32,807 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.79,518కోట్లు, సెస్ రూ.10,920కోట్లు నమోదైంది. -
పాలిస్టర్ జాతీయ జెండా అమ్మకాలపై జీఎస్టీ మినహాయింపు
న్యూఢిల్లీ: పాలిస్టర్ లేదా యంత్రంపై తయారైన భారత జాతీయ జెండా అమ్మకంపైనా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపు లభించనుంది. ఆర్థికశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. చేతితో నేసిన లేదా అల్లిన పత్తి, పట్టు, ఉన్ని లేదా ఖాదీ జాతీయ జెండాలు ఇప్పటికే జీఎస్టీ నుండి మినహాయింపు పొందుతున్నాయి. అయితే పాలిస్టర్, యంత్రంపై తయారైన జాతీయ పతాకాన్నీ జీఎస్టీ నుంచి తాజాగా మినహాయిస్తున్నట్లు తెలిపింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి తాజా వివరణ వెలువడింది. -
వస్తు సేవల పన్ను వ్యవస్థ సరళీకరణ అవశ్యం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ మరింత సరళీకరణ అవసరమని పారిశ్రామిక వేదిక– సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ స్పష్టం చేశారు. విద్యుత్‌తో పాటు ఇంధనాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. దీనివల్ల పరిశ్రమను మరింత పోటీ పరిస్థితుల్లో నిలబెట్టవచ్చని ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. జీఎస్టీ కింద ఉన్న పన్ను శ్లాబుల సంఖ్యను మూడుకు తగ్గించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం మినహాయించిన విభాగంకాకుండా, జీఎస్టీ 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం పన్ను శ్లాబ్‌లను కలిగి ఉంది. బంగారం, విలువైన, పాక్షిక విలువైన రాళ్లకు ప్రత్యేక పన్ను రేట్లు అమలవుతున్నాయి. నిత్యావసరాలపై 5 శాతం పన్ను రేటు మొదటిది. కార్లు, డీమెరిట్, లగ్జరీ, సిన్ గూడ్స్‌పై 28 శాతం అత్యధిక రేటు అమలవుతోంది. మధ్యస్థంగా 12, 18 శాతం రేట్లు అమలవుతున్నాయి. క్యాసినోలు, గుర్రపు పందాలు ఆన్లైన్ గేమింగ్ సేవలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. రూపాయి అనిశ్చితికి ఆర్బీఐ చెక్ కాగా, డాలర్ మారకంలో రూపాయి ఒడుదుడుకులను నిరోధించి స్థిరీకరణ చేయగలిగిన సామర్థ్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి ఉందని సీఐఐ ప్రెసిడెంట్ అభిప్రాయపడ్డారు. ఇందుకు తగిన విదేశీ మారకపు నిల్వలు ఆర్బీఐ వద్ద ఉన్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఏదోఒకరోజు రూపాయి తన స్వంత స్థాయిని కనుగొనవలసి ఉంటుందని మేము నమ్ముతున్నాము. అది భారత్ స్వంత పోటీతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ‘‘అయితే మారకపు విలువ అస్థిరతను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ ఇందుకు ప్రయ త్నిస్తుందని విశ్వసిస్తున్నాం’’ అని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం... అధిక ద్రవ్యోల్బణం గురించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని అన్నారు. ‘‘మీరు ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే, ఇందుకు ఇంధనం, ఆహార ధరలు కారణంగా కనబడుతున్నాయి. రుతుపవన పరిస్థితి బాగుంటుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ పరిణామం కనీసం ఆహార ధరలను తగ్గడానికి దోహదపడుతుంది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో ఉన్న ఇంధన ధర కూడా తగ్గడం ప్రారంభమవుతుందని భావిస్తునట్లు పేర్కొన్నారు. భారత్ పరిస్థితి బెటర్... భారత్ ఎకానమీపై బజాజ్ ఏమన్నారంటే... పరిశ్రమల సామర్థ్య వినియోగం 74–75 శాతానికి చేరుకుంది. లాజిస్టిక్స్, కెమికల్స్, కమోడిటీలు, నిర్మాణ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న పలు కీలక చర్యల కారణంగా భారతదేశ ఎకానమీ అనేక ఇతర దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉంది. గత కొన్ని త్రైమాసికాల్లో డిమాండ్ తిరిగి పుంజుకోడాన్ని మేము చూస్తున్నాము. అయితే గత నెలా, రెండు నెలల్లో కొంత నిరాశాజనక ఫలితాలు ఉన్నా... తిరిగి భారీగా పుంజుకుంటుందని భావిస్తున్నాము. ఆశాజనక మంచి రుతుపవనాలు, ద్రవ్యోల్బణం తగ్గుదల వల్ల భారత్ బలమైన వృద్ధిని తిరిగి చూడటం ప్రారంభిస్తుందని విశ్వసిస్తున్నాం. -
జీఎస్టీ వసూళ్లు హైజంప్
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఫుల్ జోష్‌లో కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఏకంగా 56 శాతం ఎగసి రూ. 1.44 లక్షల కోట్లకు దూసుకెళ్లాయి. ఆర్థిక రికవరీ, సమర్థవంతమైన ఎగవేత వ్యతిరేక చర్యలు ఇందుకు దోహద పడినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. గతేడాది(2021) జూన్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 92,800 కోట్లుగా నమోదయ్యాయి. వెరసి 2022 మార్చి నుంచి వరుసగా నాలుగో నెలలోనూ రూ. 1.4 లక్షల కోట్ల మార్క్‌ను దాటినట్లు ఆర్థిక శాఖ తెలియజేసింది. జీఎస్టీని ప్రవేశపెట్టాక ఈ స్థాయి వసూళ్లు ఇది ఐదోసారని వెల్లడించింది. కాగా.. జూన్ నెల వసూళ్లు కీలక స్థాయికి నిదర్శనమంటూ జీఎస్టీ డే వేడుకల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. 55 శాతం అప్: గతేడాది జూన్‌తో పోలిస్తే గత నెలలో వస్తు దిగుమతుల ఆదాయం 55% పురోగమించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. సర్వీసుల తో కలిపి దేశీ లావాదేవీల ఆదాయం 56% ఎగసినట్లు తెలిపింది. 2022 మే నెలలో 7.3 కోట్ల ఈవే బిల్స్ నమోదుకాగా.. ఏప్రిల్‌లో 7.4 కోట్ల బిల్స్ జారీ అయ్యాయి. ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.41 లక్షల కోట్లుకాగా, ఏప్రిల్‌లో రూ. 1.68 లక్షల కోట్లకు చేరాయి. -
జీఎస్టీకి ఐదేళ్లు పూర్తి
న్యూఢిల్లీ: వాణిజ్య పన్నుల ఎగవేతలకు నివారించడం, దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానం ఉండాలన్న లక్ష్యాలతో వచ్చిందే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)చట్టం. దేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ 2017 జూలై 1న అమల్లోకి రాగా, ఈ ఏడాది జూన్ 30తో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నూతన పన్ను వ్యవస్థ అనుకున్న లక్ష్యం దిశగా నిదానంగా అడుగులు వేస్తోంది. గతంతో పోలిస్తే పన్ను ఎగవేతలు తగ్గాయి. టెక్నాలజీ సాయంతో ఎగవేతలను గుర్తించడం యంత్రాంగానికి సాధ్యపడుతోంది. ప్రతీ నెలా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం సగటున రూ.1.3 లక్షల కోట్లపైనే ఉంటోంది. 17 రకాల పన్నులు, పలు సెస్సుల స్థానంలో వచ్చిందే జీఎస్టీ. ఇందులో 5, 12, 18, 28 రేట్ల శ్లాబులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వీటికి భిన్నంగా బంగారం ఒక్కదానిపై 3 శాతం రేటు అమలవుతోంది. గతంలో అయితే అన్నింటిపైనా వినియోగదారుల చెల్లించే సగటు పన్ను సుమారు 31 శాతంగా ఉండేది. లగర్జీ వస్తువులు, ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే వాటిపై జీఎస్టీ కింద అదనంగా సెస్సు అమల్లో ఉంది. ఈ రూపంలో వచ్చిన మొత్తాన్ని ప్రత్యేకంగా పరిహార నిధి పేరుతో కేంద్రం నిర్వహిస్తోంది. జీఎస్టీ కారణంగా పన్ను ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలకు ఈ సెస్సు నిధి నుంచి పరిహారాన్ని కేంద్రం చెల్లిస్తోంది. 2022 ఏప్రిల్ నెలకు వసూలైన రూ.1.68 లక్షల కోట్లు.. జీఎస్టీ చరిత్రలో గరిష్ట నెలవారీ పన్నుల ఆదాయంగా ఉంది. జీఎస్టీ కింద మొదటిసారి రూ.లక్ష కోట్ల పన్ను ఆదాయం 2018 ఏప్రిల్ నెలకు నమోదైంది. కరోనా కారణంగా 2020 ఏప్రిల్, మే నెలలకు పన్ను ఆదాయం గణనీయంగా పడిపోవడం గమనార్హం. శ్లాబుల క్రమబద్ధీకరణ మరోవైపు జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించే ప్రతిపాదన కూడా ఉంది. 5 శాతం రేటును ఎత్తివేసి అందులోని వస్తు, సేవలను 8 శాతం శ్లాబులోకి తీసుకెళ్లాలన్నది ఒకటి. 12, 18 శాతం పన్ను రేట్లలో ఒకదాన్ని ఎత్తివేయడం కూడా పరిశీలనలో ఉంది. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, లిక్కర్లను కూడా జీఎస్టీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ సైతం ఉంది. కాకపోతే రాష్ట్రాలకు అధిక ఆదాయం వీటి రూపంలో వస్తున్నందున ఈ ప్రతిపాదనకు అవి సుముఖంగా లేవు. జీఎస్టీ వ్యవస్థ అమలును చూడడం, పన్ను రేట్ల సమీక్ష, ఇతర అంశాలను జీఎస్టీ కౌన్సిల్ చూస్తుంటుంది. ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్ 47 విడతలుగా భేటీ అయింది. ఎన్నో ఉత్పత్తులు ఇప్పటి వరకు రేట్ల సవరణకు గురయ్యాయి. టెక్నాలజీతో లీకులకు చెక్ జీఎస్టీ యంత్రాగానికి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని జీఎస్టీ నెట్వర్క్ అందిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో డేటాను విశ్లేషించడం ద్వారా, ఎగవేతలు, లీకేజీలకు అడ్డుకట్ట వేస్తోంది. మరింత సులభంగా ఉండాలి.. ఈ ఐదేళ్లలో జీఎస్టీ చట్టం కొంత పురోగతి సాధించినప్పటికీ.. పన్ను అంశాల పరంగా మరింత సరళంగా మారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అన్నది మొత్తం సరఫరా చైన్‌లో ఎటువంటి నష్టాల్లేకుండా, సాఫీగా సాగేందుకు జీఎస్టీ నిర్మాణం మరింత సరళంగా మారాలన్నది పన్ను నిపుణుల నుంచి వినిపిస్తున్న మాట. ‘‘గత ఐదేళ్లలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు సకాలంలో వివరణలు, సవరణల చేయడం ద్వారా జీఎస్టీ చట్టం అభివృద్ధి చెందింది. అయినప్పటికీ అవాంఛనీయ షోకాజు నోటీసులను నివారించే దిశగా జీఎస్టీ కౌన్సిల్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బలమైన, టెక్నాలజీతో కూడిన ఏకీకృత అసెస్మెంట్ కార్యక్రమం ఉండాలి’’అని బీడీవో ఇండియా పార్టనర్ జీ ప్రభాకరన్ పేర్కొన్నారు. ‘‘వివాదాలను తగ్గించాల్సి ఉంది. ఇందుకు అస్పష్టమైన నిబంధనలను మార్చాలి. బీపీవో/కేపీవో ఇంటర్మీడియరీకి అర్హత సాధిస్తాయా, భవనాలకు సంబంధించి చేసే మూలధన నిధులపై పన్ను జమ, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ పై జీఎస్టీ లెవీ ఇలా వివిధ రంగాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలని వ్యాపారులు కోరుకుంటున్నారు’’అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ లను కూడా జీఎస్టీ కిందకు తీసుకొస్తే కంపెనీలకు వ్యయాలు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
వస్తు సేవల పన్ను విధానం సూపర్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అడ్డంకులను తగ్గించడం ద్వారా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం వ్యాపారాన్ని సులభతరం చేసిందని 90 శాతం మంది భారత్ పారిశ్రామిక ప్రతినిధులు భావిస్తున్నారని డెలాయిట్ సర్వే బుధవారం తెలిపింది. జీఎస్టీ విధానం అంతిమ వినియోగదారులకు సంబంధించి వస్తువులు, సేవల ధరల ప్రక్రియను సానుకూలం చేసిందని తెలిపింది. తమ సరఫరా చైన్లను పటిష్టం చేసుకోవడంలో కంపెనీలకు సైతం పరోక్ష పన్నుల విధానం దోహదపడుతోందని వివరించింది. ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, వ్యాట్, 13 సెస్సులు వంటి 17 స్థానిక లెవీల స్థానంలో దేశవ్యాప్తంగా 2017 జూలై 1వ తేదీ నుంచి జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘జీఎస్టీ:5 సర్వే 2022’ పేరుతో జరిపిన ఈ సర్వేలో వెల్లడయిన మరికొన్ని అంశాలు.. ► నాలుగు వారాల పాటు జరిగిన సర్వేలో 234 మంది చీఫ్ ఎక్పీరియన్స్ ఆఫీసర్లు (సీఎక్స్‌వో), సీఎక్స్‌వో–1 స్థాయి ఇండివిడ్యువల్స్ పాల్గొని తమ అప్రాయాలను వ్యక్తం చేశారు. వినియోగదారులు, ఇంధన వనరులు, పరిశ్రమలు, ఆర్థిక సేవలు, ప్రభుత్వ, ప్రజా సేవలు; లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ సహా పలు కీలక రంగాలపై జీఎస్టీ ప్రభావాన్ని సర్వే ట్రాక్ చేసింది. ► కీలక రంగాల్లోని తొంభై శాతం మంది సీఎక్స్‌వోలు జీఎస్టీ పరోక్ష పన్ను విధానాన్నికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ’ఒక దేశం, ఒకే పన్ను’ సంస్కరణ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అడ్డంకులను తగ్గించి, వ్యాపారాన్ని సులభంగా, ప్రభావవంతంగా మార్చిందని వారు అభిప్రాయపడ్డారు. అటు వ్యాపారవ్తేలకు ఇటు పన్ను చెల్లింపుదారులకు జీఎస్టీ విధానం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు. ► పన్నుల చెల్లింపునకు సంబంధించి ఆటోమేషన్, ఈ–ఇన్వాయిస్/ఈ–వే సౌకర్యాన్ని ప్రవేశపెట్ట డం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రయోజనకరమైన సంస్కరణ అని వారు తెలిపారు. ► వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడానికి పన్ను వ్యవస్థ మరింత సరళతరం కావాలని విజ్ఞప్తి చేశారు. ► నెలవారీ, వార్షిక రిటర్న్స్ పక్రియను సులభతరం చేయడానికి సాంకేతికతను అప్‌గ్రేడ్ చేయడం కీలకమని తెలిపారు. ► ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మ్యాచింగ్‌ను సరళీకృతం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. పన్ను చెల్లింపుదారుల కోసం నిర్వహణా సంక్లిష్టతలను తగ్గించాలని, పన్ను వివాదాల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమలు కోరుతున్నాయి. ఆయా అంశాలు తీవ్రమైన దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలకు దారితీస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారీ పన్ను వసూళ్లే విజయ సంకేతం ఇటీవలి నెలల్లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ వ్యవస్థ గణనీయమైన విజయం సాధించిందనడానికి ఇదే ఉదాహరణ. వ్యవస్థ పట్ల పన్ను చెల్లింపుదారుల స్నేహ పూర్వక విధానాన్ని ఇది సూచిస్తోంది. ఈ పన్ను విభాగం మరింత విస్తృతంగా ప్రజాదరణ పొందడానికి మరిన్ని చర్యలు అమల్లోకి వస్తాయని అభిప్రాయపడుతున్నాం. – మహేశ్ జైసింగ్, డెలాయిట్ విశ్లేషణ విభాగం ప్రతినిధి ఎకానమీకి శుభ సంకేతం గత మూడు నెలల్లో వరుసగా రూ. 1.4 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి, వృద్ధికి సంకేతం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సంఖ్యలతో సహా ఇతర ఆర్థిక విభాగాల్లో రికవరీ పరిస్థితి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పటిష్ట ఆడిట్లు, ప్రభుత్వ చర్యలు పన్ను ఎగవేతల నిరోధానికి దోహదపడుతున్నాయి. – ఎంఎస్ మణి డెలాయిట్ ఇండియా పార్ట్నర్ -
కొనసాగుతున్న ‘జీఎస్టీ’ కనకవర్షం!
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారీ వసూళ్లు కొనసాగుతున్నాయి. 2022 మేలో 2021 ఇదే నెలతో పోల్చితే (రూ.97,821) వసూళ్లు 44% పెరిగి రూ.1,40,885 లక్షల కోట్లకు చేరాయి. అయితే ఆల్ టైమ్ రికార్డు ఏప్రిల్ రూ.1,67,540 కోట్లు, మార్చి రూ.1,42,095 కోట్లు, జనవరి రూ. 1,40,986 కోట్లతో పోల్చితే మే వసూళ్లు తక్కువ. అంటే 2017 జూలై 1న ప్రారంభమై తర్వాత మేలో వసూళ్లు నాల్గవ అతిపెద్ద పరిమాణం. కాగా, ఈ క్యాలెండర్ ఇయర్లో ఫిబ్రవరిని (రూ.1,33,026 కోట్లు) మినహాయిస్తే, జీఎస్టీ రూ.1,40 లక్షల కోట్లను అధిగమించడం ఇది నాల్గవసారి. వేర్వేరుగా... ► మొత్తం వసూళ్లు రూ.1,40,885 కోట్లుకాగా, సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.25,036 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ వసూళ్లు రూ.32,001 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వసూళ్లు రూ.73,345 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.37,469కోట్లుసహా). ► సెస్ రూ.10,502 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.931 కోట్లుసహా). ► మే నెల గణాంకాలకు ప్రాతిపదిక అయిన ఏప్రిల్ నెల్లో నమోదయిన ఈ–వే బిల్లులు 7.4 కోట్లు. ఎకానమీకి శుభ సంకేతం గత మూడు నెలల్లో రూ. 1.4 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి, వృద్ధికి సంకేతం. స్థూల దేశీయోత్పత్తి (జీఎస్టీ) సంఖ్యలతో సహా ఇతర ఆర్థిక విభాగాల్లో రికవరీ పరిస్థితి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పటిష్ట ఆడిట్లు, ప్రభుత్వ చర్యలు పన్ను ఎగవేతల నిరోధానికి దోహదపడుతున్నాయి. – ఎంఎస్ మణి, డెలాయిట్ ఇండియా పార్ట్నర్ -
ఏపీలో మే జీఎస్టీ వసూళ్లు రూ.3,047 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన వృద్ధి సాధించినట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం వెల్లడించింది. మే నెలలో రూ.3,047 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు తెలిపింది. గత ఏడాది మే నెలలో వసూలైన జీఎస్టీ రూ.2,074 కోట్లతో పోలిస్తే 47 శాతం పెరిగిందని పేర్కొంది. తెలంగాణలోనూ జీఎస్టీ వసూళ్లలో 33 శాతం వృద్ధి ఉన్నట్లు తెలిపింది. గత ఏడాది మే నెలలో రూ.2,984 కోట్ల జీఎస్టీ వసూలు కాగా ఈ ఏడాది రూ.3,982 కోట్లు వసూలైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా రూ.1,40,885 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా మే నెలలో జీఎస్టీ రూ.1,40,885 కోట్లు వసూలైనట్లు తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.97,821 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం అధికమని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 43 శాతం, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం 44 శాతం పెరిగినట్లు వివరించింది. జీఎస్టీ వసూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి కాగా.. ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా మూడోసారని వెల్లడించింది. -
జీఎస్టీ వసూళ్లు.. రికార్డ్
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మార్చి నెల్లో ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదుచేశాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం రూ.1.42 లక్షల కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 15 శాతం పురోగతి నమోదయ్యింది. ఎకానమీ రికవరీ, పటిష్ట అమ్మకాలను గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. దీనికితోడు పన్ను ఎగవేతల నిరోధానానికి కేంద్రం తీసుకున్న పలు చర్యలూ తగిన ఫలితాలు ఇస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2022లో జనవరిలో నమోదయిన వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లు ఇప్పటి వరకూ రికార్డుగా ఉన్నాయి. తాజా గణాంకాలు ఈ అంకెలను అధిగమించాయి. ► మొత్తం రూ.1,42,095 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.25,830 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.32,378 కోట్లు ఇంటిగ్రేటెడ్ (రెండూ కలిసి) వాటా రూ.74,470 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలయిన రూ.39,131 కోట్లుసహా). సెస్ రూ.9,417 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలయిన రూ.981 కోట్లుసహా). ► 2022 మార్చిలో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 25 శాతం అధికం. దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ఆదాయాలు 11 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. ► 2022 ఫిబ్రవరిలో మొత్తం ఈ–వే బిల్లుల సంఖ్య 6.91 కోట్లు. ఇది వ్యాపార కార్యకలాపాల వేగవంతమైన రికవరీని సూచిస్తోంది. ► గత ఆర్థిక సంవత్సరం రూ. లక్ష కోట్లపైన జీఎస్టీ వసూళ్లు ఇది వరుసగా తొమ్మిదవ నెల. మే, జూన్ మినహా మిగిలిన పది నెలల్లో వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించాయి. ఇక వసూళ్లు రూ.1.30 లక్షల కోట్లను దాటడం ఆర్థిక సంవత్సరంలో ఆరవసారి. -
వన్ ఇండియా.. వన్ టూరిజం
పర్యాటకానికి సంబంధించి దేశం మొత్తం మీద ఒకే విధానం అమలయ్యేలా వన్ ఇండియా వన్ టూరిజం పద్ధతిని పరిశీలించాలని ట్రావెల్ ఏజెంట్ల అసోసియేషన్ (టీఏఏఐ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఒకే పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చే అంశాన్ని బడ్జెట్లో చేర్చాలని కోరింది. తద్వారా మహమ్మారి ధాటికి సంక్షోభంలో చిక్కుకున్న దేశీ ట్రావెల్, టూరిజం, ఆతిథ్య రంగానికి తోడ్పాటు అందించాలని టీఏఏఐ విజ్ఞప్తి చేసింది. మరోవైపు, సంబంధిత వర్గాలందరికీ విమాన ప్రయాణం మరింత చౌకగా అందుబాటులో ఉండేలా విమాన ఇంధనాన్ని (ఏటీఎం) కూడా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి చేర్చాలని కోరింది. అలాగే, అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం (ఈసీఎల్జీఎస్) పరిధిని మరింత విస్తృతం చేయాలని ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రం, రాష్ట్రాలు తోడ్పాటునివ్వాలి.. టూరిజం రంగం కోలుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటునివ్వాలని టీఏఏఐ పేర్కొంది. విచక్షణాయుత ఖర్చులు పెట్టేందుకు వీలుగా మధ్యతరగతి ప్రజల చేతిలో తగు స్థాయిలో డబ్బులు ఆడేందుకు సముచిత చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. స్టార్టప్‌లు, చిన్న .. మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) వర్కింగ్ క్యాపిటల్ భారాన్ని తగ్గించేందుకు, నగదు లభ్యత మెరుగుపడేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. అలాగే ఆదాయపు పన్ను రేటు, జీఎస్టీ రేటును తగ్గించాలని, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. 2022–2023లో అన్ని టూరిస్ట్ వీసాలపై ఈ–వీసా ఫీజు మినహాయింపునివ్వాలని పేర్కొంది. ఎంఎస్ఎంఈలను పటిష్టం చేయడం, పరిశ్రమలో టెక్నాలజీ వినియోగానికి ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమును ఏర్పాటు చేయడం, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం క్రెడిట్ ఆధారిత క్యాపిటల్ సబ్సిడీ స్కీము (సీఎల్సీఎస్ఎస్)ను పునరుద్ధరించడం తదితర చర్యలు తీసుకోవాలని టీఏఏఐ కోరింది. అలాగే, ట్రావెల్ ఏజెంట్లు, ఆపరేటర్ల మనుగడ కోసం వారికి రావల్సిన చెల్లింపులకు భద్రత కల్పించే విధంగా తగు వ్యవస్థను నెలకొల్పాలని విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ ఎంఐసీఈ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) కార్యక్రమాలను భారత్‌కు రప్పించే దిశగా, దేశీ ఎంఐసీఈ కంపెనీలు అంతర్జాతీయ బిడ్డింగ్‌లలో పాల్గొనేందుకు ఉపయోగపడే గ్లోబల్ బిడ్డింగ్ ఫండ్ ఏర్పాటు అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని టీఏఏఐ కోరింది. -
జీఎస్టీ పరిహారం మరో ఐదేళ్లు పొడిగించండి
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిహారానికి మరో ఐదు సంవత్సరాలు పొడిగించాలని పలు రాష్ట్రాల ఆర్థికమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం (2022–23) బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో బడ్జెట్ ముందస్తు సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత వ్యాట్ వంటి స్థానిక పన్నులను ఉపసంహరించుకోవడం జరిగింది. దీనివల్ల ఏర్పడే ఆదాయ లోటు కోసం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లిస్తోంది. ఈ చెల్లింపుల గడువు వచ్చే ఏడాది జూన్‌తో ముగుస్తుంది. కరోనా కష్టకాలంలో మరో ఐదేళ్లు పరిహార కాలాన్ని పొడిగించాలని పలు రాష్ట్రాలు తాజాగా డిమాండ్ చేశాయి. పలు వర్గాలతో భేటీ... 2022–23 వార్షిక బడ్జెట్‌పై ఆర్థికమంత్రి పలు వర్గాలతో ఈ నెల ప్రారంభం నుంచి సమావేశాలు నిర్వహిస్తూ, వారి అభిప్రాయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, ఫైనాన్షియల్ రంగానికి చెందిన నిపుణులు, కార్మిక సంఘాలు, వ్యవసాయ రంగ ప్రతినిధులు వీరిలో ఉన్నారు. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 22 వరకూ ఎనిమిది దఫాల్లో వర్చువల్‌గా ఈ సమావేశాలు జరిగాయి. దాదాపు 120 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. ఆదాయపు పన్ను శ్లాబ్‌ల హేతుబద్దీకరణ, డిజిటల్ సేవలకు మౌలిక రంగం హోదా, హైడ్రోజన్ స్టోరేజ్‌కి ప్రోత్సాహకాలు వంటి ప్రతిపాదనలు వారి నుంచి కేంద్రానికి అందాయి.మోడీ 2.0 ప్రభుత్వానికి, ఆర్థికమంత్రికి ఇది నాల్గవ వార్షిక బడ్జెట్. ఇక్కడి విజ్ఞాన్ భవల్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు తమ డిమాండ్లు ఏమిటన్నది మీడియాకు వెల్లడించారు. ఆయా అంశాలు పరిశీలిస్తే... బంగారం దిగుమతి సుంకాలు తగ్గాలి 2027 వరకూ పరిహారం పొడిగించాలన్న రాష్ట్రాల డిమాండ్ సరైందే. దీనిని కేంద్రం పరిశీలించాలి. దీనికితోడు బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలి. కేంద్ర పథకాల్లో కేంద్రం వాటా క్రమంగా తగ్గుతూ, రాష్ట్రాల వాటా పెరగాలనేది మా అత్యంత ముఖ్యమైన డిమాండ్. ఇంతకుముందు షేరు 90–10గా ఉండేది. మరియు ఇప్పుడు అది 50–50 లేదా 60–40గా ఉంది. అది 90–10కి తిరిగి వెళ్లాలని మా అభ్యర్థన. కోవిడ్ మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో ఇది అత్యవసరం. నీటిపారుదల, నీటి పనుల ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని అలాగే కేంద్ర పథకాలుగా ప్రకటించాలని కూడా కోరుతున్నాం. – సుభాష్ గార్గ్, రాజస్తాన్ విద్యాశాఖ మంత్రి లేకపోతే కష్టమే... పలు రాష్ట్రాలు పరిహారం కొనసాగింపును కోరాయి. మేము కూడా పొడిగించమని కోరాము. పొడిగించకపోతే, అనేక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది. మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి భారీ ఆదాయాన్ని కోల్పోతున్నాం జీఎస్టీ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఆదాయానికి గండి పడింది. వచ్చే ఏడాదిలో రాష్ట్రం దాదాపు రూ. 5 వేల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. దీనిని భర్తీ చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేయలేదు. కాబట్టి జీఎస్టీ పరిహారం మంజూరును కొనసాగించాలని కోరుతున్నాం. మూడే ళ్లలో కేంద్ర బడ్జెట్లో ఛత్తీస్‌గఢ్‌కు రూ.13,089 కోట్ల తక్కువ కేంద్ర పన్నుల వాటా వచ్చింది. వచ్చే ఏడాదిలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కోల్ బ్లాక్ కంపెనీల నుంచి బొగ్గు తవ్వకాలకు సంబంధించి టన్నుకు రూ.294 చొప్పున కేంద్రం వద్ద జమ అయ్యింది. దీనికి సంబంధించి రూ.4,140 కోట్లను కూడా వెంటనే ఛత్తీస్‌గఢ్‌కు బదలాయించాలి. భూపేష్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అదనపు రుణ సౌలభ్యత కావాలి కరోనా సవాళ్లతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీనితో జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పెంచకతప్పదు. దీనితోపాటు రాష్ట్ర రుణాలకు సంబంధించి, ఎలాంటి ఆంక్షలు, పరిమితి లేకుండా అదనపు రుణాల సౌలభ్యతను కల్పించాలి. – చంద్రిమా భట్టాచార్య, పశ్చిమ బెంగాల్ పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి -
జనవరి నుంచి జీఎస్టీలో కొత్త మార్పులు అమల్లోకి..
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)లో చేసిన పలు మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్యాసింజర్ల రవాణా .. రెస్టారెంటు సర్వీసులు మొదలైన వాటిని అందించే ఈ–కామర్స్ కంపెనీలు ఈ సేవలపై పన్నులు చెల్లించాల్సి రానుంది. ఇక పాదరక్షలు, టెక్స్టైల్ రంగాలకు కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల పాదరక్షలకు 12 శాతం, కాటన్ మినహా అన్ని రకాల టెక్స్టైల్ ఉత్పత్తులకు (రెడీమేడ్ గార్మెంట్స్ సహా) 12 శాతం జీఎస్టీ వర్తించనుంది. అలాగే ఈ–కామర్స్ కంపెనీలు గానీ ప్యాసింజర్ రవాణా సర్వీసులు అందిస్తే 5 శాతం రేటు వర్తిస్తుంది. ఆఫ్‌లైన్ విధానంలో ఈ సేవలు అందించే ఆటో రిక్షా డ్రైవర్లకు మినహాయింపు ఉంటుంది. ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఆహార డెలివరీ సేవలు అందించే ఈ–కామర్స్ ఆపరేటర్లు జనవరి 1 నుంచి .. ఆయా హోటల్స్ నుంచి జీఎస్టీ వసూలు చేసి, డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇన్వాయిస్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే కస్టమర్ల నుంచి రెస్టారెంట్లు జీఎస్టీ వసూలు చేస్తున్న నేపథ్యంలో అంతిమంగా కస్టమరుపై అదనపు భారం పడదు. జీఎస్టీ డిపాజిట్ బాధ్యతలను మాత్రమే ఫుడ్ డెలివరీ సంస్థలకు బదలాయించినట్లవుతుంది. -
మీరు ఉద్యోగం మానేస్తున్నారా? అయితే మీకో హెచ్చరిక..!
జీఎస్టీ విధించే విషయంలో కేంద్రం దూకుడు ప్రదర్శిస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) నవంబర్ 18న గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్టైల్స్ గార్మెంట్‌పై జీఎస్టీ విధిస్తున్నట్లు తెలిపింది. తాజాగా ఉద్యోగి తీసుకునే చివరి జీతంపై కేంద్రం జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పన్ను విధించడం లేదంటే తగ్గించాలా' అని నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి చెందిన అథారటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (aar)కి ఉంటుంది. అయితే డిసెంబర్ 3న ఏఏఆర్ అధికారికంగా ఓ రిపోర్ట్‌ను విడుదల చేసిందంటూ నేషనల్ మీడియా కొన్ని కథనాల్ని ప్రచురించింది. ఆ రిపోర్ట్ ప్రకారం...ఏదైనా సంస్థలో పనిచేసే ఉద్యోగి..ఆ సంస్థకు రిజైన్ చేసే మరో సంస్థకు వెళ్లే సమయంలో కంపెనీని బట్టి నెల రోజులు లేదంటే, 15రోజుల పాటు నోటీస్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. అలా ఎవరైతే నోటీస్ సర్వ్ చేయని ఉద్యోగులు, వారి చివరి నెల జీతంపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది' అనేది కథనం సారాంశం. అయితే ఇప్పుడు ఈ జీఎస్టీ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందంటే భారత్ ఒమన్ రిఫైనరీస్ కేసులో తీర్పునిస్తూ, నోటీసు సర్వ్ చేయని ఉద్యోగికి..ఆ ఉద్యోగికి ఇచ్చే చివరి నెల జీతంలో గ్రూప్ ఇన్సూరెన్స్, టెలిఫోన్ బిల్లులపై జీఎస్టీ వర్తిస్తుందని అడ్వాన్స్ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ తెలిపింది. నవంబర్ 30 న ఏఏఆర్ ప్రకటనపై ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ తీర్పును ఉటంకిస్తూ..మాట్లాడిన నిపుణులు కంపెనీ నుండి ఒక వ్యక్తి తీసుకునే చివరి జీతం కూడా జీఎస్టీ వర్తిస్తుందని చెప్పారు. "నోటీస్ పిరిడ్‌ను అందించకుండా సంస్థను విడిచిపెట్టిన ఉద్యోగిపై సంస్థ 18 శాతం జీఎస్టీని వసూలు చేయొచ్చు" అని సెబి రిజిస్టర్డ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ జితేంద్ర సోలంకి చెప్పినట్లు లైవ్ మింట్ పేర్కొంది. అయితే నోటీసు సర్వ్ చేయని ఉద్యోగి వద్ద నుంచి మాత్రమే జీఎస్టీని వసూలు చేయాల్సి ఉంటుందని సోలంకి వివరించారు. అయితే దీన్ని బట్టి చివరి నెల నోటీస్ సర్వ్ చేయని ఉద్యోగి జీతంపై జీఎస్టీ వసూలు చేసే అవకాశం ఉండనుంది. చదవండి: కేంద్రం షాక్..! భారీగా పెరగనున్న దుస్తులు, చెప్పుల ధరలు -
ధనాధన్ ‘నవంబర్’!
భారత్ ఆర్థిక వ్యవస్థ నవంబర్‌లో మంచి ఫలితాలను నమోదుచేసినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను వసూళ్లు, ఎగుమతులు, తయారీ రంగం ఇలా ప్రతి కీలక విభాగమూ వృద్ధిలో దూసుకుపోయింది. ఆయా రంగాలను పరిశీలిస్తే.. జీఎస్టీ ఆదాయం రూ.1,31,526 కోట్లు న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్‌లో రూ.1,31,526 కోట్లుగా నమోదయ్యాయి. ఎక్సైజ్ సుంకం, సేవల పన్ను, వ్యాట్ వంటి పలు రకాల పరోక్ష పన్నులను ఒకటిగా మార్చుతూ 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత, జీఎస్టీ ద్వారా ఈ స్థాయి వసూళ్లు జరగడం ఇది రెండవసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో వసూలయిన రూ.1,39,708 కోట్లు ఇప్పటి వరకూ భారీ వసూలుగా రికార్డయ్యింది. కాగా, 2020 నవంబర్ నెలతో (1.05 లక్షల కోట్లు) పోల్చితే తాజా సమీక్షా నెల వసూళ్లలో 25 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక 2019 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 27 శాతం ఎగశాయి. వ్యాపార క్రియాశీలత మెరుగుపడ్డం, ఎకానమీ రికవరీ పటిష్టత వంటి అంశాలు తాజా సమీక్షా నెల్లో మంచి ఫలితాలకు కారణం. ఇక జీఎస్టీ వసూళ్లు లక్షకోట్లు పైబడ్డం కూడా ఇది వరుసగా ఐదవనెల. పన్ను ఎగవేతలను నిరోధించడానికి కేందం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని, జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడానికి ఇదీ ఒక కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది. అంకెల్లో చూస్తే... ► నవంబర్‌లో మొత్తం స్థూల వసూళ్లు రూ.1,31,526 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.23,978 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ రూ.31,127 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.66,815 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.32,165 కోట్లు సహా) ► సెస్ రూ.9,606 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలు చేసిన రూ.653 కోట్లుసహా) ఇదిలాఉండగా, ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల జీఎస్టీ వసూళ్ల అంకెల్లో సవరణ జరిగింది. ఎగుమతులు 26 % అప్ భారత్ ఎగుమతులు నవంబర్‌లో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 26.49 శాతం ఎగశాయి. విలువ రూపంలో 29.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, పెట్రోలియం, రసాయనాలు, మెరైన్ ఉత్పత్తుల వంటి పలు విభాగాలు పురోగతిలో నిలిచాయి. 2020 నవంబర్‌లో ఎగుమతుల విలువ 23.62 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 57.18 శాతం పెరిగి 53.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ 38.81 బిలియన్ డాలర్లు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా చూస్తే, వాణిజ్యలోటు రెట్టింపు కావడం గమనించాల్సిన మరో అంశం. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మొత్తం ఎగుమతుల్లో 28.19 శాతం వాటా ఉన్న ఇంజనీరింగ్ ఎగుమతులు 37% పెరిగి 8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎగుమతులు 145.3% పెరిగి 3.82 బిలియన్ డాలర్ల్లకు చేరాయి. ► రత్నాభరణాల దిగుమతులు మాత్రం 11% క్షీణించి 2.4 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► సమీక్షా నెల్లో పసిడి దిగుమలు 8 శాతం పెరిగి 4.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు 132.44 శాతం పెరిగి 14.68 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రికెట్స్ దిగుమతులు 135.81% పెరిగి 3.58 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే ఎగుమతులు విలువ 50.71 శాతం పెరిగి 174.15 బిలియన్ డాలర్ల నుంచి 262.46 బిలియన్ డాలర్లకు ఎగసింది. కరోనా ముందస్తు సమయం 2019 ఏప్రిల్–నవంబర్‌తో పోల్చినా ఎగుమతులు 24 శాతం పెరగడం గమనార్హం. అప్పట్లో ఈ విలువ 211.17 బిలియన్ డాలర్లు. 10 నెలల గరిష్టానికి ‘తయారీ’ భారత్ తయారీ రంగం నవంబర్‌లో పురోగమించింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 57.6కు ఎగసింది. అక్టోబర్‌లో ఈ సూచీ 55.9 వద్ద ఉంది. గడచిన 10 నెలల్లో ఈ స్థాయి మెరుగుదల ఇదే తొలిసారి. కాగా ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా లెక్కించడం జరుగుతుంది. దీర్ఘకాలిక సగటు 53.6కన్నా కూడా సూచీ పైన ఉండడం తాజా సమీక్షా నెల ముఖ్యాంశం. మూడు నెలల వరుస క్షీణత అనంతరం నవంబర్‌లో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా మెరుగుపడినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పాలీయానా డీ లిమా పేర్కొన్నారు. వరుసగా ఐదు నెలల తర్వాత నిర్వహణా పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని కూడా ఆమె తెలిపారు. -
జీఎస్టీ లోటు భర్తీ...
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) లోటును భర్తీ చేయడానికి కేంద్రం గురువారం రూ.44,000 కోట్లను రుణంగా రాష్ట్రాలకు విడుదల చేసింది, దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా నిధుల విడుదల పరిమాణం మొత్తం రూ.1.59 లక్షల కోట్లకు చేరుకుంది. నిధులను బ్యాక్–టు–బ్యాక్ లోన్లుగా విడుదల చేయడం... సెస్ వసూళ్ల నుండి ఇచ్చే ద్వైమాసిక జీఎస్టీ పరిహారానికి అదనం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 1.59 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరపాలని, ఈ నిధులను (జీఎస్టీ పరిహార నిధిలో లోటు భర్తీకి) వనరుల అంతరాన్ని తీర్చడానికి ఒక బ్యాక్–టు–బ్యాక్ ప్రాతిపదికన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయాలని ఈ ఏడాది మే 28వ తేదీన జరిగిన 43వ జీఎస్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం ఈ విధంగా ఇదే విధానం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం రూ. 1.10 లక్షల కోట్లు విడుదల చేసింది. -
జీఎస్టీ షురూ: ఐస్‌క్రీమ్ పార్లర్లు, స్టోర్ల నిర్వాహకులకు షాక్
న్యూఢిల్లీ: పార్లర్లు లేదా స్టోర్లు విక్రయించే ఐస్‌క్రీమ్‌లపై 18 శాతం జీఎస్టీ అమలవుతుందని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) స్పష్టం చేసింది. గత నెల 17నాటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 21 వస్తు, సేవల జీఎస్టీ రేట్ల లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకోగా.. వీటికి సంబంధించి వర్తక సంఘాలు వివరణలు కోరడంతో సీబీఐసీ తాజా ఆదేశాలిచ్చింది. తయారైన ఐస్‌క్రీమ్‌లను విక్రయించే కేంద్రాలే పార్లర్ల కిందకు వస్తాయని.. రెస్టారెంట్ తరహావి కాదని స్పష్టం చేసింది. ఐస్‌క్రీమ్‌ను ఒక ఉత్పత్తి (తయారు చేసిన) గా అందించడానికే వాటి పాత్ర పరిమితం అవుతుందని.. రెస్టారెంట్ మాదిరి ఏ తరహా ఉడికించే కార్యకలాపాల్లో పాల్గొనేవి కావంటూ వివరించింది. -
జీఎస్టీ వసూళ్లు @ రూ.1,17,010 కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెపె్టంబర్లో ఐదు నెలల గరిష్టస్థాయిలో రూ.1,17,010 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే వసూళ్లు రూ.లక్ష కోట్ల పైబడ్డం ఇది వరుసగా మూడవనెల. 2021–22 ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో (2021అక్టోబర్–మార్చి2022) కేంద్రానికి ఆదాయాలు గణనీయంగా మెరుగుపడతాయన్న విశ్వాసాన్ని తాజా గణాంకాలు కల్పిస్తున్నాయి. తాజా వసూళ్లు 2020 సెపె్టంబర్ వసూళ్లతో (రూ.95,480 కోట్లు) పోలి్చతే 23 శాతం అధికం. 2019 సెప్టెంబర్ వసూళ్లతో (రూ.91,916 కోట్లు) పోలి్చతే 27 శాతం అధికం. ఏప్రిల్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.41 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అటు తర్వాత ఈ స్థాయిలో (రూ.1.17 లక్షల కోట్లు) వసూళ్లు ఇదే తొలిసారి. సెపె్టంబర్ మొత్తం వసూళ్లు రూ.రూ.1,17,010 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.20,578 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.26,767 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.60,911 కోట్లు. సెస్ రూ.8,754 కోట్లు. -
సెప్టెంబర్ వరకూ కేంద్ర రుణం రూ.7.02 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) బాండ్ల జారీ ద్వారా 7.02 కోట్లు సమీకరించింది. అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది. ఆర్థిక శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 2021–22 బడ్జెట్ నిర్దేశాల ప్రకారం– కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12.05 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణ సమీకరణ జరపాల్సి ఉంది. ఇందులో మొదటి ఆరు నెలల్లోనే రుణ లక్ష్యంలో 60 శాతం అంటే దాదాపు రూ.7.24 లక్షల కోట్ల సమీకరణ చేయాల్సి ఉంది. అయితే సమీకరణ లక్ష్యం కొంత తగ్గింది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును కొంత మేర భర్తీ చేయడానికి మార్కెట్ నుంచి కేంద్రం రుణ సమీకరణలు జరుపుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 9.3 శాతంగా ఉంది. 2021–22లో జీడీపీలో 6.8 శాతం(రూ.15,06,812 కోట్లు)ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే 8శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 21.3 శాతం. ద్రవ్యలోటు కట్టడికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థికవేత్తలు కొందరు ఉద్ఘాటిస్తుండగా, కేవీ కామత్ లాంటి ప్రముఖ బ్యాంకర్లు ఈ విషయంలో కొంత సాహస వైఖరిని కేంద్రం ప్రదర్శించవచ్చని సూచిస్తున్నారు. -
పటిష్ట బాటన ఎకానమీ
చండీగఢ్: భారత్ ఎకానమీ పటిష్ట పునరుజ్జీవ బాటన పయనిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శుక్రవారం పేర్కొన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భారీగా నమోదుకావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని స్టాక్ మార్కెట్ కూడా ప్రతిబింబిస్తోందన్నారు. రిటైల్, చిన్న ఇన్వెస్టర్లు సైతం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. మీడియాను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► కరోనా సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవ బాట పట్టిందనడానికి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ► ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించి 2021–22 అర్ధ వార్షిక లక్ష్యాలను (ఏప్రిల్–సెపె్టంబర్) ఇప్పటికే సాధించడం జరిగింది. జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.11 లక్షల కోట్లు– రూ.1.12 లక్షల కోట్ల శ్రేణిలో ఉన్నాయి. 2022 మార్చితో ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసే నాటికి ఈ సగటు రూ.1.15 లక్షల కోట్లుగా నమోదయ్యే వీలుంది. ► స్టాక్ మార్కెట్‌పై ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగింది. కంపెనీల లిస్టింగ్, సంబంధిత నిబంధనల్లో పారదర్శకత దీనికి ప్రధాన కారణం. అందువల్లే గతంలో మ్యూచువల్ ఫండ్స్‌పై మొగ్గుచూపే ఎక్కువగా రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు డీ మ్యాట్ అకౌంట్ ద్వారా ప్రత్యక్షంగా మార్కెట్‌పై కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ► పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) వల్ల వ్యవస్థలో నల్లధనం, నకిలీ కరెన్సీ కట్టడి జరిగింది. ► పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోనికి తెచ్చే అంశంపై పరోక్ష పన్నుల అత్యున్నత స్థాయి మండలే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ► రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుంది. ► ఆర్థిక కార్యకలాపాల విషయంలో ‘అందరితో కలిసి, అందరి సంక్షేమం కోసం, అందరి విశ్వాసంతో, అందరి కృషితో’ పనిచేయాలన్నది కేంద్రం విధానం. ఇదే విధానానికి కేంద్రం కట్టుబడి ఉంది. ► కరోనా విసిరిన సవాళ్ల నేపథ్యంలో వ్యాపార సంస్థలు సైతం తమ వ్యాపార విధానాలను మార్చుకుంటున్నాయి. ప్రత్యేకించి డిజిటలైజేషన్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ► జన్‌ధన్ పథకం వల్ల 80 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం కింద 40 కోట్లకుపైగా అకౌంట్లు ఉన్నాయి. -
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. స్విగ్గీ, జొమాటో ఇక రెస్టారెంట్లే
లక్నో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అత్యున్నత స్థాయి విధాన నిర్ణయ మండలి శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై ఇప్పుడేమీ చర్చించేది లేదన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎక్సైజ్ సుంకం, వ్యాట్‌ను ఒకే దేశీయ పన్ను రేటుగా మార్చితే అది ఇటు కేంద్రం అటు రాష్ట్రాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అభిప్రాయమే దీనికి కారణం. ఇక జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5% జీఎస్టీ పన్ను విధించింది. లక్నోలో శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రుల జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం జరిగింది. భేటీ అనంతరం సీతారామన్ తెలిపిన వివరాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► కొన్ని కోవిడ్–19 ఔషధాలపై రాయితీ పన్ను రేట్లను మూడు నెలలు అంటే డిసెంబర్ 31 వరకూ పొడిగించింది. ఖరీదైన జోల్జెన్సా్మ, విల్టెప్సో వంటి కండరాల క్షీణత ఔషధాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభించింది. సెపె్టంబర్ 30తో ముగిసే మెడికల్ పరికరాలపై మినహాయింపులు ఇక కొనసాగవు. ► కేన్సర్ సంబంధిత ఔషధాలపై రేటు 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు. ► బలవర్థకమైన బియ్యం విషయంలో 18 శాతం నుండి 5 శాతానికి జీఎస్టీ రేటు కోత. ► బయో–డీజిల్ బ్లెండింగ్‌కు సంబంధించి రేటు 12 శాతం నుంచి 5 శాతానికి కుదింపు. ► వస్తు రవాణా విషయంలో రాష్ట్రాలు విధించే నేషనల్ పరి్మట్ ఫీజు జీఎస్టీ నుంచి మినహాయింపు ► లీజ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ దిగుమతి ఐ–జీఎస్టీ చెల్లింపు మినహాయింపు. ► అన్ని రకాల పెన్నులపై 18% జీఎస్టీ. ► పునరుత్పాదక రంగ పరికరాలకు 12 శాతం పన్ను విధింపు. -
ప్రారంభమైన జీఎస్టీ మండలి సమావేశం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలి– జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం శుక్రవారం లక్నోలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన ప్రారంభమైంది. 20 నెలల తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇది. కోవిడ్–19 లాక్‌డౌన్‌కు ముందు 2019 డిసెంబర్ 18న జీఎస్టీ కౌన్సిల్ భౌతికంగా సమావేశం అయ్యింది. అన్ని పరోక్ష పన్నులను ఒకటిగా చేస్తూ, 2017 జూలై 1వ తేదీ నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువు, క్రూడ్‌ను ఈ విధానం నుంచి మినహాయించారు. ప్రస్తుతం నెలకు రూ.లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు జరుగుతున్నాయి. (చదవండి: పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా?) మండలి చర్చించే కీలక అంశాల్లో కొన్ని..! ► పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోనికి తేవడం. ► పలు కోవిడ్ ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వ్యాధి నిర్ధారణ కిట్లు తదితర పరికరాలు, ఉత్పత్తులపై ప్రస్తుతం అమలు జరుగుతున్న సుంకాలు, పన్ను మినహాయింపులను డిసెంబర్ 31 వరకూ పొడిగింపు ► పొగాకువంటి సిన్ అండ్ డీమెరిట్ గూడ్స్‌పై సెస్ కొనసాగింపు, విధివిధానాలు ► దాదాపు 50 వస్తువులపై పన్ను రేట్ల సమీక్ష. ► జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా తయారు చేసిన సరఫరాలపై ఐదు శాతం జీఎస్టీ పన్ను విధింపు. చదవండి: అనూహ్యం.. ఇక ఫుడ్ డెలివరీ యాప్‌లకూ జీఎస్టీ! -
అనూహ్యం.. ఇక ఫుడ్ డెలివరీ యాప్‌లకూ జీఎస్టీ!
జీఎస్టీ కౌన్సిల్ అనూహ్య నిర్ణయానికి సిద్ధమైంది. ఫుడ్ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్స్ పరిధిలోకి తీసుకురాబోతోంది. జీఎస్టీ విధించే ఉద్దేశంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇక మీదట ఫుడ్ డెలివరీ యాప్‌లకు 5 శాతం జీఎస్టీ విధించే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ-కామర్స్ ఆపరేటర్లైన ఫుడ్ డెలివరీ సర్వీసులు.. జొమాటో, స్విగ్గీలాంటి ఫుడ్ సర్వీస్ స్టార్టప్‌లకు జీఎస్టీ భారం తప్పేలా కనిపించడం లేదు. శుక్రవారం(సెప్టెంబర్ 17న) లక్నోలో జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించబోయే 48 ప్రతిపాదనల్లో.. ఫుడ్ డెలివరీ యాప్‌లపైనా జీఎస్టీ విధించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జీఎస్టీ కౌన్సిల్ గనుక ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపితే.. ఆన్లైన్ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్ పరిధిలోకి తీసుకొచ్చి మరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వసూలు చేస్తారు. భారీ నష్టం కారణంగానే.. ఒకవేళ ఈ నిర్ణయం గనుక అమలు చేస్తే.. సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసుకోవడానికి సదరు యాప్‌లకు కొంత టైం ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్ బావిస్తోంది. ఇక నిర్ణయం వల్ల కస్టమర్లపై ఎలాంటి భారం ఉండబోదని చెబుతోంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రూల్స్ ప్రకారం.. ఫుడ్ డెలివరీ యాప్‌లను ట్యాక్స్ కలెక్టర్స్ ఎట్ సోర్స్‌గా భావిస్తున్నారు. అయితే గత రెండేళ్లలో ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల అండర్-రిపోర్టింగ్ కారణంగా ఖజానాకు పన్ను నష్టం రూ .2,000 కోట్లు వాటిల్లినట్లు కేంద్రం లెక్కగట్టింది!. రెస్టారెంట్ కార్యకలాపాలను అన్‌రిజిస్ట్రర్ పద్ధతిలో నిర్వహించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ట్యాక్స్ తక్కువే అయినా.. డెలివరీ వాల్యూమ్స్ ఎక్కువ కాబట్టి పన్ను ఎగవేత మొత్తం కూడా గణనీయమైనదిగా భావిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అందుకే జీఎస్టీ విధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. చదవండి: జొమాటో అతలాకుతలం -
మూడంచెల జీఎస్టీ అవశ్యం: పీహెచ్‌డీసీసీఐ
న్యూఢిల్లీ: దేశంలో మూడంచెల వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని అమలు చేయాలని ఇండస్ట్రీ చాంబర్– పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ ఉద్ఘాటించారు. అలాగే అత్యధిక శ్లాబ్ 18 శాతానికి పరిమితం చేయాలని కూడా కూడా సూచించారు. 2017 జూలై నుంచీ అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రస్తుతం ప్రధానంగా ఐదు రేట్ల వ్యవస్థతో (0.25 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం) అమలు జరుగుతున్న సంగతి తెలసిందే. జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ ప్రభుత్వ అజెండాలో ప్రధానమైనదని, మూడు రేట్ల వ్యవస్థకు మార్చడం కీలకాంశమని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ ఇటీవలే పేర్కొన్నారు. పన్ను రేట్ల హేతుబద్దీకరణ వల్ల వినియోగం, పన్ను ఆదాయాలు పెరుగుతాయని, క్లిష్టతలు తగ్గుతాయని, పన్ను ఎగవేతల సమస్యను పరిష్కరించవచ్చని సంజయ్ అగర్వాత్ తాజాగా పేర్కొన్నారు. ఎకానమీ రికవరీ.. ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ప్రతికూలతలకు గురయిన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వేగంగా పురోగమిస్తోందని అగర్వాల్ పేర్కొన్నారు. స్థానికంగా విధించిన లాక్డౌన్లు, ఆంక్షలను రాష్ట్రాలు తొలగించడం, ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దీనికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. ఎకానమీలో డిమాండ్ పెంచడానికి గృహ వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద పట్టణ, గ్రామీణ పేదలకు సాధ్యమైనంత అధికంగా ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపులు అవసరమని ఆయన సూచించారు. ప్రయోజనాలు పక్కదారిపట్టకుండా ఈ విధానం రక్షణ కల్పిస్తుందన్నారు. -
జీఎస్టీ రేటు హేతుబద్దీకరణ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల హేతుబద్దీకరణ ప్రభుత్వ అజెండాలో ప్రధానమైనదని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ పేర్కొన్నారు. హేతుబద్దీకరణ త్వరలో వాస్తవరూపంలోకి వస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. జీఎస్టీ మూడు రేట్ల వ్యవస్థకు మార్చడం కీలకాంశమని ఆయన పేర్కొన్నారు. ఇండస్ట్రీ బాడీ– అసోచామ్ నిర్వహించిన మరో వెర్చువల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017 జూలై నుంచీ అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రస్తుతం ఐదు రేట్ల వ్యవస్థతో (0.25 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం) అమలు జరుగుతున్న సంగతి తెలసిందే. దీనితోపాటు జీఎస్టీకి సంబంధించినంతవరకూ స్థిర ఇన్వర్టెడ్ సుంకం వ్యవస్థ కూడా అవసరమని సుబ్రమణియన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పెద్ద బ్యాంకుల ఏర్పాటు అవశ్యం... ఎకానమీలో ఫైనాన్షియల్ రంగం ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావిస్తూ, భారత్‌లో ప్రపంచ స్థాయిలో పెద్ద బ్యాంకులు ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో భారత్ ఐదవ అతిపెద్ద ఎకానమీ అయినప్పటికీ, అంతర్జాతీయంగా టాప్ 50 బ్యాంకుల జాబితాలో లేదన్నారు. 55వ స్థానంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్–100 బ్యాంకుల జాబితాలో ఉందన్నారు. టాప్–100 జాబితాలో చైనా బ్యాంకులు 18 ఉండగా, అమెరికా బ్యాంకులు 12 ఉన్నాయని వివరించారు. సమావేశంలో పాల్గొన్న సెబీ హోల్ టైమ్ మెంబర్ జీ మహాలింగమ్ మాట్లాడుతూ, కార్పొరేట్ బ్యాంక్ మార్కెట్ విస్తరణకు ప్రభుత్వం, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పలు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ద్రవ్యలోటు లక్ష్యం దాటదు ఆదాయాల విషయంలో ఒత్తిడులు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ద్రవ్యలోటు లక్ష్యాల మేరకు నమోదవుతుందన్న విశ్వాసాన్ని మరో కార్యక్రమంలో సుబ్రమణియన్ వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయాలకు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. 2021–22లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.8 శాతంగా ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. కాగా 2022–23లో జీడీపీ 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో పురోగమిస్తుందన్న సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. తరువాతి ఆర్థిక సంవత్సరాల్లో ఇది 8 శాతానికి చేరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు ఇందుకు దోహదపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీఏఎస్ఈ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం, కార్మిక రంగాల్లో సంస్కరణలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నిర్వచనం మార్పు, బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలు దీర్ఘకాలంలో వృద్ధి పురోగతికి దోహదపడతాయని అన్నారు. అలాగే మౌలికంసహా వివిధ రంగాలపై ప్రభుత్వ వ్యయాలు వృద్ధికి దారితీస్తాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం దిగివస్తుంది... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ విధానానికి కీలకమైన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నిర్దేశిత శ్రేణికి దిగివస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. సరఫరాల వ్యవస్థ మెరుగుపడ్డం ఇందుకు కారణమవుందని ఫిక్కీ నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో విశ్లేషించారు. కేంద్రం నిర్దేశాల ప్రకారం ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం శ్రేణిలో కట్టడి చేయాల్సి ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 6.3 శాతంకాగా, జూన్‌లో స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా ఆరు ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ పరపతి విధాన కమిటీ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది. 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా కొనసాగుతుందని ఆర్బీఐ అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 5.4 శాతం, 4.7 శాతం, 5.3 శాతంగా కొనసాగుతాయన్నది ఆర్బీఐ అంచనా. ఈ కారణంగా వృద్ధికి దోహదపడే సరళతర ఆర్థిక విధానాల కొనసాగింపునకు ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. -
వివాదాలన్నీ సుప్రీం ఉత్తర్వుల పరిధిలోకి రావు!
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు విషయంలో సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులపై పరోక్ష పన్నులు, సుంకాల కేంద్ర బోర్డు (సీబీఐసీ) బుధవారం వివరణ ఇచ్చింది. అరెస్ట్, సెర్చ్, సమన్ల వంటివి సుప్రీంకోర్టు లిమిటేషన్ పొడిగింపు ఉత్తర్వుల పరిధిలోనికి రావని స్పష్టం చేసింది. కేవలం పిటిషన్లు, అప్లికేషన్లు, సూట్స్, అప్పీళ్లు వంటి ప్రొసీడింగ్స్‌కు మాత్రమే సుప్రీం ఉత్తర్వుల పరిధిలోనికి వస్తాయని తెలిపింది. పెండింగ్ కేసులను పన్నుల అధికారులు వేగవంతంగా పరిష్కరించడానికి తాజా సీబీఐసీ వివరణ దోహదపడుతుందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజిత్ మోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిఫండ్, రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ లేదా రద్దు అప్లికేషన్లపై అధికారులు నిర్ణయాలు తీసుకోవడంసహా డిమాండ్ నోటీసుల ప్రొసీడింగ్స్ నిర్వహణ, ఇప్పటికే దాఖలైన అప్పీళ్ల విచారణ వంటివి కొనసాగించడానికి అధికారులకు వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
జీఎస్టీ పరిహారంగా రాష్ట్రాలకు రూ.75,000 కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిహారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.75,000 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. లగ్జరీ, ఆల్కహాల్, పొగాకు వంటి సిన్ గూడ్స్ నుంచి వసూలు చేసే వాస్తవిక సెస్ (ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం లక్ష కోట్లు ఉంటుందని అంచనా) నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి విడుదల చేసే జీఎస్టీ పరిహారానికి ఇది అదనమని ప్రకటన వివరించింది. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం రూ.2.59 లక్షల కోట్లుగా ఉంటుందన్నది కేంద్రం అంచనా. ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రూ.1.59 లక్షల కోట్ల రుణ సమీకరణ జరిపి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయాలని మే 28వ తేదీన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. మిగిలిన పరిహారాన్ని స్థిర వాయిదాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ ఆరు నెలల కాలంలో విడుదల చేయనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు, కేంద్రం పాలిత ప్రాంతాలు కోల్పోయే ఆదాయాలను కేంద్రం భర్తీ చేయాలన్న నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. ‘‘అంగీకరించిన రూ.1.59 లక్షల కోట్ల బదలాయింపుల్లో దాదాపు సగం మొత్తాన్ని ఒకే ఇన్స్టాల్మెంట్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయడం జరిగింది’’ అని ఒక ట్వీట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
జీఎస్టీతో పన్ను చెల్లింపుదారులు రెట్టింపు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వల్ల నాలుగేళ్ల కాలంలో పన్ను చెల్లింపుదారులు రెట్టింపయ్యారని, 1.28 కోట్లకు చేరుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెరిగిన పన్నుల వసూలు ఇక మీదటా మెరుగ్గా ఉండడం సాధారణమేనని చెప్పారు. జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పన్ను అధికారులకు మంత్రి లిఖిత పూర్వక సందేశం ఇచ్చారు. ఈ తరహా సంస్కరణను భారత్ వంటి పెద్ద, వైవిధ్యమైన దేశంలో అమలు చేయడం అతిపెద్ద సవాలుగా పేర్కొన్నారు. జీఎస్టీ పన్ను చెల్లింపుదారులకు నిబంధనల అమలును సులభతరం చేయడమే కాకుండా సామాన్యులపై పన్నుల భారాన్ని తగ్గించినట్టు వివరించారు. జీఎస్టీ వసూళ్లు వరుసగా ఎనిమిదో నెలలోనూ రూ.లక్ష కోట్లకు పైనే ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రూ.1.41 లక్షల కోట్లు వసూలయ్యాయి. మోసపూరిత డీలర్లు, ఐటీసీకి సంబంధించి ఎన్నో కేసులను వెలుగులోకి తీసుకువచ్చినట్టు మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. నాలుగేళ్ల కాలంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 66.25 లక్షల నుంచి 1.28 కోట్లకు చేరుకున్నట్టు చెప్పారు. పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) 2020 నవంబర్ నుంచి పెద్ద ఎత్తున సోదాలు చేపట్టి నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ), రూ.29,000 కోట్ల జీఎస్టీ ఎగవేతలను గుర్తించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ చెప్పారు. జీఎస్టీ అమలులో ఎన్నో సవాళ్లను అధిగమించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పన్ను చెల్లింపుదారుల మద్దతు పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రాల మద్దతుతో జీఎస్టీలోకి పెట్రోలియం జీఎస్టీని ఎంతో అవసరమైన పన్నుల విధానంగా కేంద్ర ఉపరితల, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జీఎస్టీ దినోత్సవం రోజున ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించిన వెబినార్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. జీఎస్టీని ఇంకా మెరుగుపరచడానికి అవకాశాలున్నాయంటూ.. భాగస్వాముల మద్దతుతో ఈ పనిచేస్తామని చెప్పారు. సమాఖ్య దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రాల సమ్మతి అవసరమన్నారు. చదవండి: కరోనా కాలంలోనూ కరెంట్ ఖాతా మిగులు -
జీఎస్టీతో తగ్గిన పన్నుల భారం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో 66 కోట్లకు పైగా జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయని.. పన్ను రేట్లు తగ్గడంతో నిబంధనలను పాటించే వారు పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బహుళ పన్నుల విధానం స్థానంలో జీఎస్టీని కేంద్రం 2017 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పెట్రోలియం, లిక్కర్ తదితర కొన్ని మినహా అధిక శాతం వస్తు, సేవలను జీఎస్టీలో భాగం చేశారు. 1.3 కోట్ల పన్ను చెల్లింపుదారులు ‘‘వినియోగదారు, పన్ను చెల్లింపుదారులకూ జీఎస్టీ అనుకూలమైనదని నిరూపణ అయింది. జీఎస్టీకి పూర్వం అధిక పన్నుల రేట్లు నిబంధనల అమలు విషయంలో నిరుత్సాహకరంగా ఉండేవి. ప్రతీ రాష్ట్రం భిన్నమైన పన్ను రేటును వసూలు చేసేది. దీంతో అసమర్థత, వ్యయాలకు దారితీసింది. జీఎస్టీ æవిధానంలో తక్కువ రేట్ల కారణంగా పన్ను నిబంధనలను పాటించేవారి సంఖ్య క్రమంగా పెరిగింది’’ అని కేంద్ర ఆర్థిక శాఖ ట్విట్టర్‌పై పేర్కొంది. ఒక కంపెనీ వ్యాపారం చేయడం కోసం కరోనాకు ముందు నాటి విధానంలో కనీసం 495 భిన్నమైన పత్రాలను దాఖలు చేయాల్సి వచ్చేదంటూ.. జీఎస్టీలో ఇది 12కు తగ్గినట్టు వివరించింది. జీఎస్టీ కింద నాలుగు రకాల రేట్లు అమలవుతుండడం తెలిసిందే. నిత్యావసరాలపై 5 శాతం, విలాసవంతం, సమాజానికి చేటు చేసేవాటిపై 28 శాతం పన్ను అమలు చేస్తుండగా.. మిగిలిన వస్తు, సేవలపై 12, 18 శాతం పన్ను అమలవుతోంది. వీరికి పన్ను భారం తక్కువ వార్షికంగా రూ.40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న (విక్రయాల ఆదాయం) వ్యాపారాలు, పరిశ్రమలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. అలాగే వార్షికంగా రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్నవి కాంపోజిషన్ పథకాన్ని ఎంపిక చేసుకుని టర్నోవర్‌పై 1 శాతం జీఎస్టీ చెల్లిస్తే చాలు. సేవల వ్యాపారం నిర్వహించే సంస్థలకు వార్షికంగా రూ.20 లక్షల వరకు టర్నోవర్ ఉంటే జీఎస్టీ వర్తించదు. రూ.50లక్షల వరకు టర్నోవర్ ఉన్న సేవల సంస్థలు కాంపోజిషన్ స్కీమ్ కింద 6 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. 54,439 మందికి అభినందనలు జీఎస్టీ 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ విధానం విజయవంతం కావడంలో భాగమైన పన్ను చెల్లింపుదారులను గౌరవించాలని నిర్ణయించాం. సకాలంలో రిటర్నులను దాఖలు చేయడమే కాకుండా, గణనీయమైన పన్ను చెల్లింపులు చేసిన వారిని గుర్తించేందుకు పరోక్ష పన్నులు, కస్టమ్స్ విభాగం (సీబీఐసీ) డేటా అన్‌లిటిక్స్ (సమాచార విశ్లేషణ)ను చేపట్టింది. ఇందులో భాగంగా 54,439 మంది పన్ను చెల్లింపుదారులను గుర్తించింది. ఇందులో 88 శాతానికి పైగా ఎంఎస్ఎంఈలే ఉన్నాయి. సూక్ష్మ పరిశ్రమలు 36 శాతం, చిన్న తరహా పరిశ్రమలు 41 శాతం, మధ్య తరహా పరిశ్రమలు 11 శాతం చొప్పున ఎంపికైన వాటిల్లో ఉన్నాయి. వీటిని అభినందిస్తూ సర్టిఫికేట్లను సీబీఐసీ ఇవ్వనుంది. – కేంద్ర ఆర్థిక శాఖ మైలురాయి భారత ఆర్థిక ముఖచిత్రంలో జీఎస్టీ ఒక మైలురాయి. జీఎస్టీ పన్నుల సంఖ్యను తగ్గించింది. నిబంధనల అమలు భారాన్ని, సామాన్యునిపై మొత్తం మీద పన్ను భారాన్ని తగ్గించింది. పారదర్శక, నిబంధనల అమలు, పన్ను వసూలు గణనీయంగా పెరిగింది. – నరేంద్రమోదీ, ప్రధానమంత్రి -
జీఎస్టీ... రికార్డు వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను వసూళ్ల రికార్డులు కొనసాగుతున్నాయి. మార్చిలో వసూళ్లు రూ.1.23 లక్షలుగా నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారికాగా, 2020 ఇదే నెలతో పోల్చితే 27 శాతం అధికం. 2020 మార్చిలో జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.97,590 కోట్లు. ఎకానమీ వేగంగా పురోగమిస్తోందనడానికి జీఎస్టీ గణాంకాలు సంకేతమని ఆర్థికశాఖ తెలిపింది. నకిలీ బిల్లింగ్ నిరోధం, జీఎస్టీ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ ఐటీ వ్యవస్థలుసహా సూక్ష్మ స్థాయిలో డేటా విశ్లేషణ, పటిష్టమైన పన్ను యంత్రాంగం కూడా జీఎస్టీ వసూళ్లు క్రమంగా పురోగమించడానికి కారణమని ఆర్థికశాఖ వివరించింది. ముఖ్యాంశాలు చూస్తే... ► మార్చి నెలలో జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.1,23,902 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో సెంట్రల్ జీఎస్టీ రూ.22,973 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.29,329 కోట్లు. ఏకీకృత జీఎస్టీ రూ. 62,842 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.31,097 కోట్ల వసూళ్లు కలిపి), సెస్ రూ.8,757 కోట్లు (వస్తు దిగుమతులపై రూ. 935 కోట్ల వసూళ్లు కలిపి). ► వార్షికంగా 2020 మార్చితో పోల్చితే తాజా సమీక్షా నెలలో వస్తు దిగుమతల నుంచి ఆదాయం 70 శాతం పెరిగింది. దేశీయ లావాదేవీల నుంచి రెవెన్యూ 17 శాతం పెరిగింది. ► కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు 2020 మార్చి చివరి వారం నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్రం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ తర్వాతి నెల ఏప్రిల్‌కు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు రూ.32,172 కోట్లకు పడిపోయాయి. లాక్డౌన్ నియంత్రణలను క్రమంగా సడలిస్తూ రావడంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇదే జీఎస్టీ వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. ► పెద్ద రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్లలో 6–15 శాతం మధ్య వృద్ధిని చూపించాయి. వరుసగా జీఎస్టీ ఆదాయాలు వృద్ధిని చూపిస్తుండడం ఆర్థిక వ్యవస్థ సామర్థ్యంపై విశ్వాసాన్ని కలిగిస్తుంది. అలాగే, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా తిరిగి మొదలయ్యాయని, వస్తు, సేవలకు డిమాండ్ అధికంగా ఉండడాన్ని తెలియజేస్తోంది. పారిశ్రామిక రంగం తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కూడా జీఎస్టీ ఆదాయంలో వృద్ధి తెలియజేస్తోంది. ద్రవ్యలోటు కట్టడికి దోహదం 2020–21లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం(ద్రవ్యలోటు) రూ.18.5 లక్షల కోట్లు ఉంటుం దని (జీడీపీలో 9.5%) 2021 ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టిన బడ్జెట్ సవరించిన గణాంకాలు పేర్కొన్నాయి. మార్చిలో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్ల నేపథ్యంలో.. ద్రవ్యలోటు నిర్దేశిత స్థాయిలోనే ఉండొచ్చు. ప్రభుత్వ ఆదాయాలకు సంబంధించి తగిన నగదు సమతౌల్యతతో 2021–22 ప్రారంభం అవుతున్నట్లు తాజా పరిస్థితి సూచిస్తోంది. – అదితి నాయర్, ఇక్రా ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ -
జీఎస్టీ వసూళ్లలో నూతన రికార్డు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం నూతన గరిష్టాలకు చేరింది. 2021 జనవరి నెలకు రూ.1.20 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘2021 జనవరి నెలకు జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.1,19,847 కోట్లు (జనవరి 31 సాయంత్రం 6 గంటల సమయానికి) వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూ.21,923 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.29,014 కోట్లు ఐజీఎస్టీ రూ.60,288 కోట్లు (ఇందులో దిగుమతులపై వచ్చిన రూ.27,424 కోట్లు కూడా) వసూలైంది. మరో రూ.8,622 కోట్లు సెస్సు రూపంలో వచ్చింది’’ అంటూ ఆర్థిక శాఖ వెల్లడించింది. మరిన్ని జీఎస్టీ విక్రయ రిటర్నులు నమోదైతే వసూళ్ల ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉంది. గత 5 నెలలుగా జీఎస్టీ వసూళ్లు పుంజుకుంటున్న ధోరణి జనవరిలోనూ కొనసాగినట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. -
లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: అక్టోబర్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే జీఎస్టీ కలెక్షన్స్ లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం. గత నెలలో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,05,155 కోట్లు కాగా.. ఇందులో సీజీఎస్టీ రూ.19,193 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.5,411 కోట్లు, ఐజీఎస్టీ రూ.52,540 కోట్లు (ఇందులో రూ.23,375 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి), సెస్ ఆదాయం రూ.8,011 కోట్లు (ఇందులో రూ.932 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి) ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 అక్టోబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 10 శాతం ఆదాయం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది అక్టోబర్‌లో జీఎస్టీ ఆదాయం రూ.95,379 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ ఆదాయం రూ.1.05 లక్షల కోట్లు, మార్చిలో రూ.97,597 కోట్లు, ఏప్రిల్‌లో రూ.32,172 కోట్లు, మేలో రూ.62,151 కోట్లు, జూన్‌లోరూ.90,917 కోట్లు, జూలైలో రూ.87,422 కోట్లు, ఆగస్టులో రూ.86,449 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.95,480 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో గ్రాస్ జీఎస్టీ ఆదాయం రూ.5.59 లక్షల కోట్లుగా ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 20 క్షీణత నమోదైందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 31 నాటికి 80 లక్షల జీఎస్టీఆర్–3బీ రిటర్న్‌లు ఫైల్ అయ్యాయని ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ భూషన్ పాండే తెలిపారు. రూ.50 వేల కంటే విలువైన వస్తువుల రవాణాలో తప్పనిసరి అయిన ఈ–వే బిల్లుల చెల్లింపుల్లోనూ అక్టోబర్ నెలలో 21 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం రోజుకు 29 లక్షల ఈ–ఇన్వాయిస్ జనరేట్ అవుతున్నాయి. -
జీఎస్టీ బకాయిలు కేంద్రం చెల్లించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బకాయిలు చెల్లించకపోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జీఎస్టీ బకాయిలపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాలకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఎగ్గొట్టేందుకు పథకం వేస్తోందని వ్యాఖ్యానించారు. జీఎస్టీ చట్టంలో పండమిక్ యాక్ట్, కరోనా యాక్ట్ లాంటి ఏ ఇతర యాక్ట్‌లు లేవని అన్నారు. రాష్ట్రాలకు సెస్ చెల్లించమంటే ఎలా అని, అటార్నీ జర్నల్ ప్రకారం లీగల్‌గా అయిన ఏ విధంగా అయిన రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్లించాల్సిందే. కరోనా వచ్చింది, జీఎస్టీ ఇవ్వమంటే కుదరదని తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని స్పష్టం చేశారు. కోవిడ్ (కరోనా) అనేది ఒక్క కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాదని, అన్ని రాష్ట్రాలకు ఇదే పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కరోనాతో అన్ని రాష్ట్రాలు ఆదాయాలు కోల్పోయావని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదుకోవాలి, కానీ వచ్చే సెజ్‌ను ఇవ్వమంటే ఎలా అని ప్రశ్నించారు. మనది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కనుక, జీఎస్టీలో తెలంగాణ ప్రభుత్వం చేరేందుకు ఆలోచన చేసింది. కానీ గత మూడు సంవత్సరాలలో తెలంగాణ నుండి వసూలయింది 18 వేల 32 కోట్లయితే రిటర్న్ వచ్చింది మాత్రం రూ.3,200 కోట్లు మాత్రమే అని అన్నారు. కోవిడ్ వలన రాష్ట్రం 34 శాతం ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నారు. సీఎస్టీ ఉన్నప్పుడు జీఎస్టీలో చేరకపోతే 25 వేల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది. జీఎస్టీలో చేరడం వలన రూ.25వేల కోట్లు నష్టపోయామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్లు సెస్ లోన్ తీసుకొని చెల్లించాలి. అయితే 14 శాతం గ్రోత్ రేట్ ప్రకారం సెస్ చెలిస్తామని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఇప్పుడు దాన్ని పది శాతం తగ్గించే అధికారం ఎక్కడిదని హరీశ్ రావు విమర్శించారు.అయితే అప్పటి దివంగత కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ దీనిపై స్పందించిన విషయాన్ని హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రాల సెజ్ తగ్గినా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అరుణ్ జైట్లీ చెప్పారని.. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటని సూటిగా ప్రశ్నలు సంధించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలంగాణకు రావాల్సింది ఇవ్వలేదని, మీరు కూడా ఇవ్వరా అని జీఎస్టీ చట్టం చేసిన సమయంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ప్రశ్నిస్తూ.. జీఎస్టీ సమావేశాలలో అరుణ్ జైట్లీ అదేం లేదంటూ అందరికి న్యాయం చేస్తామని చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రాల హక్కులను ఒక్కొక్కటి కాలరాస్తున్నారని ఈటెల మండిపడ్డారు. ఇలా కేంద్ర ప్రభుత్వం అన్ని వారి ఆధీనంలోకి తీసుకుంటుందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడే చెప్పారని గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీలో విస్తృతమైన అధికారులు ఉన్నాయని, కానీ జీఎస్టీ సెజ్‌ను తగ్గించడాన్నిరాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని అన్నారు. కాగా చట్టానికి లోబడే రాష్ట్రాలకు జీఎస్టీ సెజ్ లు ఇవ్వాలని తెలిపారు. ఒకవేళ ఇవ్వకపోతే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. జీఎస్టీ అంశంపై ఆరు రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్ల సమావేశంలో కూడా చర్చించామని పేర్కొన్నారు. అవసరమైతే తాము లీగల్‌గా కూడా పోరాడతామని, పది శాతం ఏ రకంగా తగ్గిస్తారని అన్నారు. మరోవైపు పార్లమెట్లో చట్టం చేశాక మీరెలా తగ్గిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈటెల రాజేందర్ విమర్శించారు. చదవండి: జీఎస్టీ పరిహారం.. కేంద్రం బాధ్యతే -
రాష్ట్రాల కొంప ముంచిన ‘జీఎస్టీ’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఒక దేశం, ఒక పన్ను’ అన్న సరికొత్త నినాదంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. పన్ను విధించే అధికారాలను రాష్ట్రాల నుంచి లాక్కోవడం వల్ల దేశంలో సమాఖ్య భారత స్ఫూర్తి దెబ్బతింటుందని, పైగా తమ ఆర్థిక పరిస్థితి దిగజారి పోతుందని కొన్ని రాష్ట్రాలు ఎంత మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వం వినిపించుకోలేదు. జీఎస్టీ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయం లోటును ఐదేళ్ల పాటు కేంద్రం భరిస్తుందని, జీఎస్టీ పరిహారం సెస్సు కింద ఈ మొత్తాలను చెల్లిస్తామని, ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం భరోసా కూడా ఇచ్చింది. 2020–21 సంవత్సరానికి రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ మొత్తం అంచనాలకు, వసూళ్లకు మధ్య ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల తేడా వచ్చింది. రాష్ట్రాలకు ఇస్తానన్న పరిహారపు సెస్సు వసూళ్లు 65 వేల కోట్ల రూపాయలను దాట లేదు. అంటే పరిహారపు సెస్సుపోనూ రాష్ట్రాలకు 2.35 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఇదే విషయమమై గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించగా, కేంద్రం ఉచిత సలహాలతో చేతులు దులిపేసుకుంది. పన్నుల ఆదాయం తగ్గిన మొత్తాలకు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవాల్సిందిగా కేంద్రం సలహా ఇవ్వడంతో రాష్ట్రాలు బెంబేలెత్తి పోతున్నాయి. (చదవండి : ఎన్‌పీసీఐకి షాక్ : ఎస్బీఐ కొత్త సంస్థ) ఆశించిన స్థాయిలో జీఎస్టీ వసూలు కాకపోవడం, కోవిడ్ మహమ్మారి విజృంభణతో దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, ఈ కారణంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయాన్ని భర్తీ చేయలేక పోతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడంతో కొన్ని రాష్ట్రాలు మళ్లీ పాత పన్నుల విధానాన్నే ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడు ఆది నుంచి నేటి వరకు కూడా జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. జీఎస్టీ పన్ను విధానాన్ని రద్దు చేసి పాత పన్ను విధానాలనే తిరిగి ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పుదుచ్ఛేరి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తుండగా, జీఎస్టీ వల్ల పెద్దగా నష్టపోని బీహార్, బెంగాల్ ప్రభుత్వాలు మౌనం పాటిస్తున్నాయి. జీఎస్టీ కింద తమ రాష్ట్రానికి దాదాపు 5, 400 కోట్ల రూపాయలు రావాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. -
పన్నుల వ్యవస్థలో విప్లవాత్మకం... జీఎస్టీ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ ప్రవేశపెట్టడంతో పన్నుల భారం తగ్గిందని, దీనితో సరళతర పన్ను వ్యవస్థలో పన్నులు చెల్లించే వారి సంఖ్య దాదాపు రెట్టింపై 1.24 కోట్లకు పెరిగిందనీ ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. ఆర్థికశాఖ మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మొదటి వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ పలు ట్వీట్స్ చేసింది. దాదాపు 17 రకాల స్థానిక లెవీలు, 13 సెస్‌ల ఉపసంహరణలతో 2017 జూలై 1న జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు బాధ్యతల్లో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్‌జైట్లీ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ తాజా ట్వీట్స్ సారాంశాన్ని పరిశీలిస్తే... ► జీఎస్టీ ప్రవేశపెట్టకముందు అమల్లో ఉన్న బహుళ పరోక్ష పన్నుల వ్యవస్థ– వ్యాల్యూయాడెడ్ ట్యాక్స్ (వీఏటీ), ఎక్సైజ్, అమ్మకపు పన్ను వాటికి సంబంధించిన ఇతర చార్జీల వల్ల దేశ పౌరులపై అధిక పన్ను భారం ఉండేది. 31 శాతం వరకూ ఉన్న అధిక స్థాయి పన్ను రేటు ధరలపై ప్రభావం చూపేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి పోయింది. తాజా వస్తు,సేవల పన్ను విధానం అటు వినియోగదారుకు అటు పన్ను చెల్లింపుదారుకూ స్నేహపూర్వకమైంది. ► జీఎస్టీకి ముందు అధిక పన్ను భారం వల్ల ఈ చట్రంలోకి రావడానికి వెనుకడుగు వేసే పరిస్థితి. అయితే సరళతర జీఎస్టీ వ్యవస్థలో పన్ను భారం తగ్గింది. దీనితో పన్ను చెల్లింపుదారు బేస్ కూడా పెరిగింది. ► జీఎస్టీ తొలినాళ్లలో అసెస్సీల సంఖ్య 65 లక్షలయితే, ఇప్పుడు ఈ సంఖ్య 1.24 కోట్లను దాటింది. ► జీఎస్టీ అమల్లో అరుణ్‌జైట్లీ పాత్ర కీలకమైనది. భారత్ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక చరిత్రాత్మక సంస్కరణ. అప్పట్లో వివిధ రాష్ట్రాలు విధించే విభిన్న పన్ను రేట్లు తీవ్ర వ్యయ భరితంగా ఉండేవి. ప్రజలు పన్నులు చెల్లించే స్థాయికి రేట్లను జీఎస్టీ తగ్గించింది. అప్పట్లో రెవెన్యూ న్యూట్రల్ రేటు 15.3 శాతం అయితే, దానితో పోల్చితే ఇప్పుడు జీఎస్టీ రేటు 11.6 శాతానికి తగ్గింది. ► రూ.40 లక్షల వరకూ వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారాలపై ఇప్పుడు జీఎస్టీ మినహాయింపు ఉంది. ప్రారంభంలో ఇది రూ.20 లక్షలుగా ఉండేది. దీనికితోడు రూ.1.5 కోట్ల వరకూ టర్నోవర్ ఉన్న ఒక కంపెనీ కాంపోజిషన్ స్కీమ్ కింద కేవలం ఒక శాతం పన్నును మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది. ► జీఎస్టీ అమల్లోకి రావడంతోటే అనేక వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడం జరిగింది. 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న దాదాపు 230 వస్తువుల్లో దాదాపు 200 వస్తువులను తక్కువ స్లాబ్స్ రేట్లలోకి మార్చడం జరిగింది. హౌసింగ్ రంగాన్ని 5 శాతం శ్లాబ్‌లో ఉంచగా, చౌక గృహాలకు సంబంధించి జీఎస్టీ రేటును ఒక శాతానికి తగ్గింది. ► జీఎస్టీకి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తిగా ఆటోమేటెడ్ చేయడం మరో విషయం. ప్రస్తుతం 50 కోట్ల రిటర్న్స్‌ను ఆన్లైన్లో దాఖలు చేయడం జరిగింది. 313 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయి. స్థిరంగా పెరుగుతున్న రెవెన్యూ 2017 జూలై 1వ తేదీ అర్థరాత్రి నుంచీ భారత పన్నుల వ్యవస్థలో చరిత్రాత్మక మార్పు. ఒకే మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించింది. బహుళ పన్ను వ్యవస్థకు తెరపడింది. ప్రస్తుతం 480 వస్తువులు పన్ను రహిత లేదా 5 శాతంలోపు పన్ను రేట్లలో ఉన్నాయి. 221 వస్తువులు 12 శాతం రేటు వద్ద, 607 వస్తువులు 18 శాతం రేటు వద్ద ఉండగా, కేవలం 29 వస్తువులు మాత్రమే 28% రేటు వద్ద ఉన్నాయి. ఆయా సడలింపుల నేపథ్యంలో పన్ను గడచిన మూడేళ్లలో పన్ను బేస్ పెరిగింది. 2017–18 తొమ్మిది నెలల్లో (జూలై–మార్చి) సగటు రెవెన్యూ రూ.89,700 కోట్లు. 2018–19లో నెలకు సగటు రెవెన్యూ 10% పెరిగి మొత్తంగా ఆదాయాలు రూ.97,100 కోట్లకు చేరాయి. 2019–20లో ఈ ఆదాయం ఏకంగా రూ.1,02,000కోట్లకు ఎగసింది. రేట్ల తగ్గింపు, పలు సడలింపులు ఇస్తున్నప్పటికీ, జీఎస్టీ స్థిరంగా పెరుగుతూ వస్తున్న విషయం గమనార్హం. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో, జీఎస్టీ భారం తగ్గడానికి ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ప్రవేశపెట్టింది. – అరుణ్‌జైట్లీ వర్ధంతి సందర్భంగా రాసిన ఒక ఆర్టికల్‌లో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ -
జీఎస్టీ ఆదాయంలో వృద్ధి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం క్షీణించినా రాష్ట్రంలో మాత్రం వృద్ధి నమోదైంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలైలో జీఎస్టీ ఆదాయం గతేడాది కంటే రూ.35.35 కోట్లు పెరిగి రూ.1,998.12 కోట్లకు చేరుకుంది. ► గతేడాది ఇదే కాలానికి జీఎస్టీ ఆదాయం రూ.1,962.77 కోట్లుగా ఉంది. ► దేశవ్యాప్తంగా చూస్తే జూలైలో జీఎస్టీ ఆదాయం 14.36 శాతం క్షీణించి రూ.1,02,082 కోట్ల నుంచి రూ.87,422 కోట్లకు పడిపోయింది. ► రాష్ట్రంలో ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆహార పదార్థాల వినియోగం పెరగడంతో జీఎస్టీ ఆదాయం పెరిగిందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్ తెలిపారు. ► లాక్డౌన్ సమయంలో 75 శాతం ఆదాయం కోల్పోయినా ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలు గు నెలల్లో ఆ నష్టం 25 శాతానికి తగ్గిందన్నారు. ► ఈ నాలుగు నెలల కాలంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.5,508.49 కోట్లుగా ఉంటే గతేడాది ఇదే కాలానికి రూ.7,345.69 కోట్లుగా ఉంది. ► రీస్టార్ట్ తర్వాత రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో కూడా వృద్ధి నమోదవుతోంది. ► జూలైలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.852.97 కోట్లు వస్తే గతేడాది ఇదే కాలానికి రూ.859 కోట్లుగా ఉంది. ► కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ రూపంలో రూ.2,713 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయానికి ఈ ఆదాయం రూ.3,521 కోట్లుగా ఉంది. -
జీఎస్టీ రూపంలో 90 వేల కోట్లకు పైగా
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు గాడిన పడుతున్నాయి. వరుసగా రెండు నెలల లాక్‌డౌన్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో వసూళ్లు గణనీయంగా పడిపోగా.. జూన్‌లో తిరిగి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభం కావడంతో రూ.90,917 కోట్ల ఆదాయం జీఎస్టీ రూపంలో వచ్చింది. ఏప్రిల్‌లో నమోదైన రూ.32,294 కోట్లు, మే నెలలో వచ్చిన రూ.62,009 కోట్లతో పోలిస్తే గణనీయంగా పుంజుకున్నట్టే తెలుస్తోంది. కానీ, గతేడాది జూన్ నెలలో వచ్చిన ఆదాయంతో పోల్చి చూసుకుంటే ఈ ఏడాది జూన్ నెలలో ఆదాయం 9 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఇక 2020–21 తొలి త్రైమాసిక కాలంలో (ఏప్రిల్–జూన్ వరకు) వసూళ్లు గతేడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే 59 శాతం తగ్గాయి. తొలి త్రైమాసికంలో ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడం తెలిసిందే. (హైవే ప్రాజెక్టుల్లోకి చైనాకు నో వే!) ఏపీ, తెలంగాణలో పెరిగిన ఆదాయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, బిహార్, అసోమ్ వంటి రాష్ట్రాల్లో జీఎస్టీ ఆదాయం గతేడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే జూన్ నెలలో పెరిగినట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 6% వృద్ధి నమోదై రూ.2,367 కోట్లు వసూలయ్యాయి. తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈ జూన్‌లో 3 శాతం వృద్ధితో రూ. 3,276 కోట్ల జీఎస్టీ వసూలైంది. ‘‘ప్రభుత్వం రూ.90,917 కోట్ల స్థూల జీఎస్టీ ఆదాయాన్ని 2020 జూన్ నెలలో వసూలు చేసింది. 2019 జూన్ నెలలో వసూళ్లలో ఇది 91%’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. జూన్‌లో వచ్చిన రూ.90,917 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూపంలో రూ.18,980 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూపంలో రూ.23,970 కోట్లు, ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ రూ.40,302 కోట్లు వచ్చింది. సెస్సు రూపంలో రూ.7,665 కోట్లు వసూలైంది. -
కేంద్రం తీరుతో రాష్ట్రాలకు నష్టం
సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానంలో భాగంగా ఐజీఎస్టీ కింద రాష్ట్రాలకు రావాల్సిన నిధులను ఇవ్వడంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుతో రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిధుల్ని పంపిణీ చేయడంలో రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తిరోగమన ప్రభావాన్ని చూపుతున్నాయని విమర్శించారు. 2017–18 వరకు ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.2,812 కోట్లను వెంటనే ఇప్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు. ‘2017–18 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1,76,688 కోట్లు ఐజీఎస్టీ కింద కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాలి. అందులో రూ.67,988 కోట్లకు సంబంధిం చిన అంశాలను పరిష్కరించి అన్ని రాష్ట్రాలకు పంపకాలు చేశారు. ఈ పంపకాల కింద తెలంగాణకు రూ.1,652 కోట్లు (2.437%) కేటాయించారు. ఈ మొత్తం రాష్ట్రానికి వచ్చింది. ఐజీఎస్టీ పంపకాల విషయంలో కేంద్రం అనుసరి స్తున్న ఫార్ములా రాజ్యాంగ విరుద్ధమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చింది. ఈ మేరకు తమ ఆమోదం కోసం జీఎస్టీ కౌన్సిల్ పంపిన ప్రతిపాదనను కాగ్ ఒప్పుకోలేదు. కాగ్ లెక్క ప్రకారం ఐజీఎస్టీ కింద వసూలయ్యే మొత్తం పన్నులో రాష్ట్రాలకు 50% పంపిణీ చేయాలి కనుక గతంలో పరిష్కరించిన రూ.67,988 కోట్లు కాకుండా 88,344 కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అడ్హాక్ సెటిల్మెంట్ కింద ఈ మొత్తంలో 4.03% చొప్పు న రూ. 3,560 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం 50% రాష్ట్రాలకు పంపి ణీ చేయగా మిగిలిన మొత్తంలో కూడా 58:42% చొప్పున రాష్ట్రాలకు ఇవ్వాలి. ఈ లెక్కన వచ్చే రూ.904 కోట్లతో కలి పి తెలంగాణకు రూ.4,464 కోట్లు రావాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు వచ్చింది రూ. 1,652 కోట్లే. కేంద్రం తీరుతో మాతో పాటు చాలా రాష్ట్రాలు నష్టపోయాయి. రెండేళ్లుగా తెలంగాణకు జీఎస్టీ పరిహారం ఇవ్వడం లేదు. ఐజీఎస్టీ కింద మాకు రావాల్సిన మొత్తాన్ని త్వరలో ఇప్పించేలా చర్యలు తీసుకోండి’ అని లేఖలో కోరారు. -
జోరుమీదున్న లాజిస్టిక్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో లాజిస్టిక్, వేర్ హౌజ్ విభాగం ఫుల్ జోష్‌లో ఉంది. మౌలిక రంగ హోదా, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వంటి నిర్మాణాత్మక సంస్కరణల అమలు వల్ల దేశీయ లాజిస్టిక్ విభాగంలో డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది ముగిసే నాటికి దేశంలో 3.8 కోట్ల చదరపు అడుగుల లాజిస్టిక్ అండ్ వేర్ హౌజ్ స్థలం అందుబాటులోకి వస్తుందని కన్సల్టెన్సీ సంస్థ జోన్స్‌లాంగ్ లాసెల్లె (జేఎల్ఎల్) నివేదిక తెలియజేసింది. 215 బిలియన్ డాలర్లకు పరిశ్రమ.. ఏటా దేశీయ లాజిస్టిక్ విభాగం 33.81 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 2020 నాటికి ఈ పరిశ్రమ 215 బిలియన్ డాలర్లకు చేరుతుందని జేఎల్ఎల్ అంచనా వేసింది. ‘‘2018లో 3.2 కోట్ల చదరపుటడుగుల స్థలం లీజుకు తీసుకోగా.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి కాలంలో 84 లక్షల చ.అ. స్థలాన్ని తీసుకున్నారు. ఇంజనీరింగ్, ఆటో మరియు అనుబంధ సంస్థలు, ఈ–కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్, టెలికం విభాగాలు లాజిస్టిక్ వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నాయి’’ అని జేఎల్ఎల్ ఇండియా కంట్రీ హెడ్ అండ్ సీఈఓ రమేష్ నాయర్ చెప్పారు. లాజిస్టిక్ సప్లయి చైన్‌లో జీఎస్టీ రాకతో సవాళ్లు తొలిగాయని, ఒకే రకం పన్ను విధానం అమల్లోకి రావటంతో లావాదేవీలు, పన్ను వసూళ్లలో స్పస్టత ఏర్పడిందని చెప్పారాయన. అందుకే ఈ రంగంలో డిమాండ్ పెరిగిందన్నారు. హైదరాబాద్‌లో ఈ–కామర్స్‌దే హవా హైదరాబాద్‌లో గిడ్డంగులకు ప్రధానంగా ఈ–కామర్స్ రంగం నుంచే డిమాండ్ వస్తోంది. 2017లో నగరంలో 20 లక్షల చ.అ. వేర్ హౌజ్ లావాదేవీలు జరగగా.. 2018 నాటికి ఇది వంద శాతం వృద్ధితో 40 లక్షలకు చేరింది. మొత్తం లీజు/కొనుగోళ్ల లావాదేవీల్లో ఈ–కామర్స్ విభాగం వాటా 40 శాతం వరకూ ఉన్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఇందులోనూ 70 శాతం లావాదేవీలు జీడిమెట్ల – మేడ్చల్– కొంపల్లి క్లస్టర్‌లోనే జరిగాయని పేర్కొంది. శంషాబాద్, పటాన్చెరు క్లస్టర్స్ కూడా ముఖ్యమైనవేనని తెలిపింది. ఐదేళ్లలో రూ. 47,385 కోట్లు గిడ్డంగుల రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ జోరు నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక వెల్లడి న్యూఢిల్లీ: గిడ్డంగుల రంగంలో గత కొన్నేళ్లలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్, నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక పేర్కొంది 2014 నుంచి చూస్తే, ఇప్పటివరకూ మొత్తం 47,385 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించింది. జీఎస్టీ అమలు తర్వాత తయారీదారులు, ఈ–కామర్స్ సంస్థల నుంచి లాజిస్టిక్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోందని, అందుకే ఈ స్థాయి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని పేర్కొంది. ముఖ్యాంశాలు... ► గత ఏడాది వేర్ హౌజింగ్ స్పేస్ 77 శాతం వృద్ధితో 46.2 మిలియన్ చదరపుటడుగులకు పెరిగింది. ► 2014 నుంచి గిడ్డంగుల రంగంలో వచ్చిన రూ.47,385 కోట్ల పెట్టుబడుల్లో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల వాటా 49 శాతంగా ఉంది. సావరిన్ ఫండ్స్ పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు 31 శాతం, డెవలపర్ల ఇన్వెస్ట్మెంట్స్ 20 శాతంగా ఉన్నాయి. ► తయారీ రంగం నుంచి వేర్‌హౌసింగ్ స్పేస్ డిమాండ్ ప్రస్తుతం 74 కోట్ల చదరపుటడుగులుగా ఉంది. ఇది 5 శాతం చక్రగతి వృద్ధితో 2024 కల్లా 92 కోట్ల చదరపుటడుగులకు చేరుతుంది. -
పడిపోతున్న జీఎస్టీ రాబడి
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2017, జూలై ఒకటవ తేదీ నుంచి ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద ఆశించిన రెవెన్యూ రావడం లేదు. 2018–2019 కేంద్ర వార్షిక బడ్జెట్ అంచనాల ప్రకారం 13,48,000 కోట్ల రూపాయలను జీఎస్టీ కింద వసూలు చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. అంటే నెలకు 1,12,000 కోట్ల రూపాయలను వసూలు చేయాలన్న మాట. అయితే ఏ ఒక్క నెలకూడా ఈ లక్ష్యాన్ని అందుకోలేక పోయింది. 2018–2019 ఆర్థిక సంవత్సరం అంతానికి ఆశించిన రాబడిలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు తగ్గుతాయని ‘కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్’ అంచనా వేసింది. పర్యవసానంగా ద్రవ్యలోటు 3.5 శాతం కన్నా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జాతీయ స్థూల ఉత్పత్తిలో (జీడీపీ)లో ద్రవ్యోల్బణం 3.3 శాతానికి మించరాదన్నది మోదీ ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యం. ద్య్రవ్యలోటు (రెవెన్యూ, ఖర్చు మధ్యనుండే వ్యత్యాసం)ను తగ్గించేందుకు రిజర్వ్ నిధులను అందజేయాల్సిందిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్‌పై మోదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది. లక్షిత రాబడికి, వసూళ్లకు మధ్య ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చిందో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికీ అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వ పన్ను అధికారుల సామర్థ్యాన్ని ఓ సారి సమీక్షించాల్సిందిగా కోరుతూ కేంద్ర ఆర్థిక కార్యదర్శి హష్ముక్ అధియా కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డుకు గత జూన్ నెలలో ఓ లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాలు కేంద్రానికన్నా ఎక్కువ జీఎస్టీ వసూళ్లను రాబట్టాయని, రాష్ట్రాల అధికారుల కన్నా కేంద్రం అధికారుల తీరు అధ్వాన్నంగా ఉందా? అని కూడా ఆ లేఖలో ఆయన ప్రశ్నించారు. టర్నోవర్ ఏడాదికి కోటిన్నర తక్కువుండే వ్యాపార సంస్థలపై విధించే జీఎస్టీ పన్నులో 90 శాతం రాష్ట్రాలకు వెళుతుంది. మిగతా పది శాతం కేంద్రానికి వెళుతుంది. ఏడాదికి కోటిన్నర రూపాయలకు పైగా టర్నోవరుండే సంస్థలపై విధించే జీఎస్టీ పన్నులో కేంద్రానికి, రాష్ట్రానికి చెరి యాభై శాతం లభిస్తుంది. 2015–16 ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రతి రాష్ట్రానికి పన్ను రాబడి ఏటా 14 శాతం పెరగాలి. అలా పెరగక తగ్గినట్లయితే ఆ వ్యత్యాసాన్ని కేంద్రం భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2018–2019 సంవత్సరానికి కేంద్రం పలు రాష్ట్రాలకు 3,899 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. మరో రెండు నెలలు పోతే ఈ మొత్తం మరో నాలుగింతలు పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం ప్రతి రెండు నెలలకోసారి రాష్ట్రానికి రాబడి వ్యత్యాసాలను చెల్లించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే ఈ సారి రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గానే ఉంది. 2017–2018 సంవత్సరానికి రాష్ట్రాలకు జీఎస్టీ రాబడి 16 శాతం తగ్గగా, 2018–19 సంవత్సరానికి రాబడి 13 శాతం మాత్రమే తగ్గింది. -
జీఎస్టీ తగ్గింపు ఎన్నికల స్టంటేనా?
సాక్షి, న్యూఢిల్లీ : గతేడాది జూలై నెలలో ప్రవేశపెట్టిన వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)లో మరిన్ని సడలింపులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. విలాస వస్తువులను మినహా సామాన్య మానవులు ఉపయోగించే అన్ని వస్తువులపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తామని ఆయన మంగళవారం నాడు ప్రకటించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు కూలిపోవడం, రానున్న 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. మలేసియాలో గత ఆరు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బారిసన్ జాతీయ సంకీర్ణ (బీఎన్సీ) ప్రభుత్వం జీఎస్టీ కారణంగానే కుప్ప కూలిపోయిందన్న విషయాన్ని తెలుసుకొని కూడా మోదీ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. మలేసియాలో మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన జీఎస్టీలో ఒకే స్లాబ్ కింద ఆరు శాతం పన్నును మాత్రమే విధిస్తున్నారు. అయినప్పటికీ అక్కడి ప్రజలు జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారు ప్రభుత్వాన్ని కూల్చేశారు. భారత్‌లో మాత్రం జీఎస్టీని 0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం కింద ఐదు స్లాబులను అమలు చేస్తున్నారు. గతంలో కొన్ని వస్తువులపై పన్ను స్లాబులను తగ్గించినప్పటికీ ఇప్పటికీ సామాన్యులు ఉపయోగించే అనేక వస్తువులు 28 శాతం పన్ను స్లాబులోనే ఉన్నాయి. ఇప్పుడు వీటిలో సామాన్యులు ఉపయోగించే 99 శాతం వస్తువులపై పన్నులను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తామని మోదీ ప్రకటించారు. సిమ్మెంట్, మోటారు సైకిళ్ల లాంటివి 28 శాతం పన్ను స్లాబుల్లో ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, జీఎస్టీ ద్వారా ఆశించిన పన్ను రాబడి రానప్పుడు మోదీ ఇచ్చిన హామీ మేరకు పన్ను కుదింపులు అమలు చేయడం అంత ఈజీ కాదు. గత ఫిబ్రవరి నెలలో 2018–2019 ఆర్థిక బడ్జెట్ సందర్భంగా జీఎస్టీ కింద నెలకు 1.2 లక్షల కోట్ల రూపాయల చొప్పున పన్ను రాబడి వస్తుందని అంచనా వేశారు. ఒక్క నెల కూడా వసూళ్లు లక్ష కోట్లు దాటిన దాఖలాలు లేవు. ఈ ఏడాది మొత్తంగా ఆశించిన దానికన్నా 90 వేల కోట్ల రూపాయల వసూళ్లు తగ్గుతాయని భారతీయ స్టేట్ బ్యాంక్ అంచనా వేయగా, దాదాపు లక్ష కోట్ల రూపాయలు తగ్గుతాయని బ్రోకరేజ్ సంస్థ ‘సీఎల్ఎస్ఏ’ అంచనా వేసింది. జీఎస్టీ నుంచి కార్పొరేట్ సంస్థలు ఇప్పటికీ బాగానే కోలుకున్నాయిగానీ మధ్యతరహా, చిన్న పరిశ్రమలు ఇప్పటికీ తేరుకోలేక పోతున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని సూరత్, తమిళనాడులోని తిర్పూర్‌లో జౌళి పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నది. దేశవ్యాప్తంగా 6.30 కోట్ల మంది చిన్న పారిశ్రామిక వేత్తలు 20 శాతం లాభాలను కోల్పోయారని, పర్యావసానంగా ఐదు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) గత జూలైలో విడుదల చేసిన అధ్యయనంలో వెల్లడించింది. మైక్రో, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతినడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘం ఈ డిసెంబర్లో విడుదల చేసిన మరో అధ్యయనం పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం జీఎస్టీ దేశంలో పెద్ద విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆశించి, దేశ ప్రజలందరికి గుర్తుండేలా ప్రత్యేకంగా రాత్రి వేళ నిర్వహించిన పార్లమెంట్ సెషన్లో జీఎస్టీ బిల్లును ఆమోదింపచేశారు. నాటి సమావేశాన్ని కాంగ్రెస్, వామపక్షాలతోపాటు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు బహిష్కరించాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే జీఎస్టీని ఒకే స్లాబ్ కిందకు తెస్తామని, ఆ స్లాబు కూడా 18 శాతానికి మించదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. -
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్!
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు అనంతరం తొలిసారి కేంద్ర బడ్జెట్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే అవకాశముంది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో కొత్త ప్రజాకర్షక పథకాలు, ఆదాయపు పన్ను రేట్లలో మార్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి జనవరి 30న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఆర్థిక సర్వేను జనవరి 31న ప్రవేశపెట్టవచ్చని, ఆ తర్వాతి రోజు ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్‌ను సమర్పిస్తారని ఆయన చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈ ఏడాది నుంచి ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభ తేదీ ఏప్రిల్ 1 నాటికి బడ్జెట్ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చేలా కేంద్ర బడ్జెట్ సమర్పణను నెల రోజులు ముందుకు జరిపారు. దాదాపు శతాబ్దం పాటు కొనసాగిన రైల్వే బడ్జెట్‌ను.. ఈ ఏడాది నుంచి సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం 2019 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి 2018–19 కేంద్ర బడ్జెట్ చివరి పూర్తి స్థాయి బడ్జెట్. ఇంతవరకూ అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం ఎన్నికల సంవత్సరంలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పణ ఉండదు. ప్రభుత్వ ఖర్చుల కోసం ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో 2018–19 బడ్జెట్లో పలు కొత్త పథకాల ప్రకటనలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వేర్వేరుగా రాబడి లెక్కలు జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే తొలి బడ్జెట్ కావడం మరొక కీలకాంశం. ఎక్సైజ్, సేవా పన్నుల్ని జీఎస్టీలో కలపడంతో.. రాబోయే బడ్జెట్ సమర్పణలో అనేక మార్పులు చేర్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్యలో ఎక్సైజ్, కస్టమ్స్, సేవా పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని, జూలై–మార్చి మధ్య జీఎస్టీ, కస్టమ్స్ పన్నుల నుంచి వచ్చిన ఆదాయాన్ని వేర్వేరుగా పొందుపర్చవచ్చని సమాచారం. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్, కస్టమ్స్ పన్నుల్లో మార్పుల ప్రతిపాదనలు, కొత్త ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రకటనలు మాత్రమే రాబోయే బడ్జెట్లో కీలకం కానున్నాయి. జనవరి 5 వరకూ శీతాకాల సమావేశాలే.. శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలకు మధ్య నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో బడ్జెట్ కసరత్తుపై ఉత్కంఠ ఏర్పడింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 15న ప్రారంభమై వచ్చే ఏడాది జనవరి 5తో ముగియనున్నాయి. 1976లో కూడా జనవరిలోనే శీతాకాల సమావేశాలు జరిగినా అప్పుడు ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ సమర్పణతో రెండింటికి మధ్య నెలకుపైగా సమయముందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
భారత్‌లో అలా ఉండటం చాలా కష్టం
సాక్షి, రాజ్‌కోట్: నిజాయితీ పరుడైన రాజకీయ నాయకులే అందరికంటే ఎక్కువగా కష్టాలు ఎదుర్కొంటారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గుజరాత్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా పటీదార్లు ఎక్కుగా ఉండే సౌరాష్ట్ర ప్రాంతంలో మంగళవారం రాహుల్ పర్యటించి వారిని ఆకట్టుకునేందుకు యత్నించారు. రాజ్‌కోట్‌లో రాహుల్ మాట్లాడుతూ.. 'నిజాయితీగల రాజకీయ నేతగా ఉండటమే భారత్‌లో అత్యంత కష్టమైన పని. నిజాయితీ ఉంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్వయంగా నేను అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. సరైన విధివిధానాలు లేకుండా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను బీజేపీ దేశ ప్రజలపై రుద్దింది. ఈ విషయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా తెలిపారు. జీఎస్టీని ప్రకటించి వెంటనే.. 'ఇది క్రిమినల్ చర్య' అంటూ మన్మోహన్ చేసిన వ్యాఖ్యలును ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేస్తున్నా. మేం అధికారంలోకి వస్తే రైతులు, ఇతర బలహీన వర్గాల వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పథకాలు ప్రవేశపెడతాం. ఇంకా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్ విఫలమైంది. సామాన్య ప్రజలను పక్కనపెట్టి.. ధనిక వర్గాల కోసం బీజేపీ పాకులాడుతోంది. కేవలం ప్రసంగాలకే బీజేపీ నేతలు పరిమితమయ్యారంటూ' రాహుల్ గాంధీ మండిపడ్డారు. ధరోల్ నుంచి రాజ్‌కోట్ వరకు జరిగిన పర్యటనలో హర్దిక్ పటేల్ ఆధ్వర్యంలోని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) అందజేసిన ‘జై సర్దార్.. జై పటీదార్’ అని రాసి ఉన్న టోపీని రాహుల్ ధరించారు. పటీదార్లపై బీజేపీ అన్యాయంగా కేసులు పెట్టిందని.. కానీ కాంగ్రెస్ మీ వర్గంపై ఎప్పుడూ తూటాలు పేల్చలేదన్నారు. -
జీఎస్టీ.. కాస్త టైమ్ పడుతుంది: కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల వ్యవస్థకు పుల్ స్టాప్ పెడుతూ ఒక దేశం ఒక పన్ను విధానం పేరిట కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సేల్స్ టాక్స్-జీఎస్టీ) జూలై 1 నుంచి అమలులోకి తెచ్చింది. సత్ఫలితాల మాట ఏమోగానీ గందరగోళంగా ఉందంటూ ఇప్పటికీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కొత్త కోడలు లాంటి జీఎస్టీ అలవాటు పడాలంటే కొంత సమయం పడుతుందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో నారెడ్కో(NAREDCO) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి కోసమే జీఎస్టీని మోదీ సర్కార్ తీసుకొచ్చిందని తెలిపారు. ‘కొత్తగా ఓ కుటుంబంలోకి వచ్చిన కోడలికి సర్దుకుపోవటానికి కాస్త సమయం పడుతుంది. తర్వాతే ఆ కుటుంబం అభివృద్ధి చెందటం ప్రారంభిస్తుంది. అలాగే జీఎస్టీ కూడా దేశానికి కొత్త కోడలు లాంటిదే. ఆర్థిక పురోగతి కోసమే సరైన సమయంలో జీఎస్టీని కేంద్రం తీసుకొచ్చింది. దాని ఫలితం మున్ముంది కనిపిస్తుంది’ అని అర్జున్ రామ్ తెలిపారు. జీఎస్టీ గురించి ప్రజలకు ఇంకా స్పష్టమైన అవగాహన రాలేదని ఎస్బీఐ మేనేజింగ్ డైరక్టర్ రజనీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్పందించారు. నోట్ల రద్దుతో ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టిన కేంద్రం జీఎస్టీతో ఈ యేడాది మరో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. జీఎస్టీతో పరోక్షంగా ప్రజలపై భారం పడకుండానే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టార్ లో అది ఎక్కువగా ఉండబోతుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో బ్యాంకర్లు చేసిన పలు సూచనలను జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అర్జున్ రామ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
టెక్స్‌టైల్స్‌పై పన్ను పోటు
చీరాల అర్బన్/ మార్కాపురం : కేంద్ర ప్రభుత్వం వస్త్ర వ్యాపారంపై జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) విధించడాన్ని వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వ్యాపారాలు దెబ్బతిని దుకాణాలు మూతపడే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీఎస్టీని నిరసనగా ఆలిండియా టెక్స్టైల్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు వ్యాపారులు నాలుగురోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా మార్కాపురం, చీరాల, ఒంగోలు, కందుకూరు, గిద్దలూరు, కనిగిరి, పర్చూరు, సింగరాయకొండ, అద్దంకి తదితర ముఖ్య పట్టణాల్లో వస్త్ర దుకాణాలు మూత పడనున్నాయి. క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్‌లో 21 సంఘాలు ఉండగా.. ఇందులో సుమారు రెండు వేల వస్త్ర దుకాణాల యజమానులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా జీఎస్టీకి నిరసనగా సమ్మెలో పాల్గొంటున్నారు. చిన్న బొంబాయిగా పేరొందిన చీరాల వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరు. సూరత్ నుంచి నేరుగా వస్త్రాలు ఇక్కడికి దిగుమతి అవుతుంటాయి. చీరాల కేంద్రంగా జరుగుతున్న వస్త్ర వ్యాపారంపై ఎంతోమంది చిన్న చిన్నవ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ కారణంగా చిన్న వ్యాపారులకు తీవ్ర నష్టం జరగనుంది. ప్రతి 15 రోజులకు జరిగిన వ్యాపారంపై లెక్కలు చూపించి వివరాలను అందించా లని కేంద్రం సూచించడం వీరికి మరింత భారంగా మారింది. గతంలో వ్యాట్‌ను తొలగించాలని కోరుతూ వ్యాపారులు చేసిన ఆందోళనతో ఆ విధానాన్ని నిలుపుదల చేశారు. ఇప్పుడు వ్యాట్ నుంచి జీఎస్టీకి మారాలంటే 17 రకాల డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతినెలా బిల్లులు జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌లో ఆన్లైన్ చేయాలంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకోవాల్సి ఉంటుందని, ఇదంతా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు సాధ్యమవుతుందే గాని, చిన్న వ్యాపారులకు సాధ్యమయ్యే పని కాదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీరాలలో రిలే నిరాహార దీక్షలు.. చీరాల టెక్స్టైల్స్ మర్చంట్స్ అసోసియేషన్ (టీటీఎంఏ) ఆధ్వర్యంలో మంగళవారం నుంచి నాలుగు రోజులు రోజులు పాటు స్థానిక ఆర్.ఆర్.రోడ్డులో రిలే నిరాహారదీక్ష చేపడుతున్నట్లు టీటీఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని లీలాధరరావు, ఎ.శ్రీనివాసరావులు తెలిపారు. స్థానిక మహాత్మాగాంధీ క్లాత్ (ఎంజీసీ)మార్కెట్లోని టీటీఎంఏ కార్యాలయంలో సమావేశమైన ప్రతినిధులు నాలుగు రోజుల కార్యాచరణ ప్రకటించారు. ప్రతిరోజు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి నిరాహారదీక్ష శిబిరంలో పాల్గొనడం, ఈనెల 30న బ్లాక్ డేగా ప్రకటించి నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఇటీవల జీఎస్టీ విధింపుపై వస్త్ర వ్యాపారులు ఒక్కరోజు బంద్ పాటించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. భారమంతా ప్రజలపైనే.. వస్త్రాలపై జీఎస్టీ విధించడం వలన భారం మొత్తం ప్రజలపైనే పడుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా చదువు, వస్త్రాలు, మందులు, వృత్తి సేవలపై పన్ను విధించారు. వెయ్యి రూపాయలు విలువ గల చీర కొంటే 5శాతం, వెయ్యి పైన కొంటే 12శాతం పన్ను చెల్లించాలి. ఆ భారమంతా ప్రజలపైనే పడుతుంది. ప్రతి బిల్లు ఆన్లైన్ చేయాలంటే చిన్న చిన్న వ్యాపారులకు ఇబ్బందికరం. చదువుకున్న వారు, చదువుకోని వారు ఉంటారు. జీఎస్టీ ఎత్తివేయాలని కోరుతూ బంద్ పాటిస్తున్నాం. ప్రజలందరూ సహకరించాలి. – చిన్ని లీలాధరరావు, టీటీఎంఏ అధ్యక్షుడు, చీరాల వస్త్రాలకు మినహాయింపు ఇవ్వాలి.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో వస్త్రాలకు మినహాయింపు ఇవ్వాలి. వస్త్రాలను నిత్యావసర వస్తువులుగా గుర్తించాలి. వినియోగదారులపై పన్ను భారం వేయాలంటే మాకు బాధగా ఉంది. ఇటీవల కాలంలో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవటంతో వస్త్ర దుకాణాల్లో వ్యాపారాలు లేక, పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం పునరాలోచించి వస్త్రాలపై పన్ను ఎత్తివేయాలి. – పి.కేశవరావు, కమలా వెడ్డింగ్ మాల్ అధినేత, మార్కాపురం వినియోగదారులకూ భారమే.. జీఎస్టీ అమలుతో వస్త్ర దుకాణాలపై 12శాతం వరకు పన్ను పడుతుంది. ఈ భారం వినియోగదారులు భరించాల్సి వస్తోంది. జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి రావటంతో 12శాతం వరకు ధరలు పెరగనున్నాయి. వెయ్యి రూపాయల లోపు 5శాతం, ఆ మొత్తం దాటితే 12శాతం వరకు పన్ను విధిస్తారు. ఇవి కాక మేకింగ్, వర్కింగ్, డైయింగ్ చార్జిల పేరుతో వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు రూ.5వేల లోపు కొనుగోళ్లకు అదనపు చార్జిలు లేవు. ఇప్పటి నుంచి ప్రతి రూ.5 వేలకు రూ.600 అదనపు భారం పడనుంది. ఇప్పటికే అధిక శాతం ప్రజలు రేడీమేడ్ వస్త్రాలపై ఆసక్తి చూపుతూ క్లాత్ కొనుగోలుకు ముందుకు రాక వ్యాపారాలు సాగడం లేదని, ఇక జీఎస్టీ రాకతో తమ పరిస్థితి మరింత కష్టంగా మారనుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జీఎస్టీ అమలు రెండునెలలు వాయిదా!
కేంద్ర ఆర్థికశాఖను కోరిన పౌరవిమానాయానశాఖ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలును రెండు నెలలపాటు వాయిదా వేయాలని పౌరవిమానాయానశాఖ కోరుతోంది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను వ్యవస్థ ఉండేందుకు జూలై 1 నుంచి కేంద్రం జీఎస్టీని అమలోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జూలై 1లోగా తమ వ్యవస్థను పూర్తిగా మార్చుకొని జీఎస్టీని అమలుచేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని, కాబట్టి సెప్టెంబర్ 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలని కోరుతూ కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖకు పౌరవిమానాయానశాఖ లేఖ రాసింది. ఇప్పటికిప్పుడు విమానాయాన సంస్థలు జీఎస్టీని అమలుచేయలేవు కాబట్టి తమకు మినహాయింపునివ్వాలని కోరుతున్నాయని ఆ శాఖ పేర్కొంది. -
గ్రానైట్‌కు జీఎస్టీ పాలిష్
►ఫినిష్డ్ గ్రానైట్ మార్బల్‌పై 28శాతం పన్ను ►రా మెటీరియల్‌పై 12 శాతం ►రిటైల్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం ►ఆందోళనలో పరిశ్రమ వర్గాలు పాలిష్ చేసిన గ్రానైట్‌కు జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) పెనుభారంగా మారింది. ఫినిష్డ్ గ్రానైట్‌పై 28 శాతం పన్ను విధించడంతో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు 2.5 శాతం మాత్రమే టాక్స్ రూపంలో చెల్లించేవారు. అధిక పన్ను విధించడం వల్ల గ్రానైట్‌కు డిమాండ్ తగ్గి మార్కెట్ కుప్పకూలుతుందని ఫ్యాక్టరీ యాజమాన్యాలు వాపోతున్నాయి. చిత్తూరు, సాక్షి: పాలిష్ చేసిన గ్రానైట్‌కు జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) పెంచ డం అటు యాజమాన్యాలకు, ఇటు కొనుగోలుదారులకు గుదిబండగా మారింది. గ్రానైట్ రా మెటీరియల్ (క్వారీ నుంచి తీసిన బండ)పై 12 శాతం, ఫినిష్డ్ గ్రానైట్ మార్బుల్ అమ్మకాలపై 28శాతం పన్ను శ్లాబులో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ అమల్లోకి రాక ముందు వ్యాట్ కింద కేవలం 14.5 శాతం మాత్రమే పన్ను చెల్లించేవారు. రాష్ట్రంలో అమ్మకాలు సాగిస్తే 14.5 వ్యాట్‌లో 12 శాతం ఇన్పుట్ సబ్సిడీగా తిరిగొస్తుంది. అంటే 2.5 శాతం మాత్రమే టాక్స్ రూపంలో యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వం గుది బండ మోపడంతో గ్రానైట్ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గ్రానైట్ యాజమాన్యాల ఆందోళన ఎందుకంటే.. ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చిన రా మెటీరియల్‌ను ప్రాసెస్ చేసి తిరిగి మార్కెట్లో రీటైల్ లెక్కన విక్రయించాలంటే కొనుగోలుదారులు కచ్చితంగా 28 శాతం పన్ను చెల్లించాల్సిందే. ఒక ఇంటి యజమాని రూ.2 లక్షల పాలిష్ చేసిన గ్రానైట్‌ను కొనుగోలు చేస్తే దానిపై రూ.5వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో టాక్స్ రూపంలో చెల్లించాలంటే సామాన్యుడు వెనకడుగువేసే అవకాశం ఉంది. పాలిషింగ్ యూనిట్ల నుంచి మెటీరియల్ ఎలా కదులుతుం దని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. అధిక పన్ను విధించడం వల్ల సరుకు పేరుకుపోయి.. గ్రానైట్‌కు డిమాండ్ తగ్గి మార్కెట్ కుప్పకూలుతుందని ఫ్యాక్టరీ యాజమాన్యాలు పేర్కొం టున్నాయి. దీని ప్రభావం జిల్లాలోని దాదాపు 1000 గ్రానైట్ ఫ్యాక్టరీలపై పడనుందని అంటున్నారు. అసంబద్ధ నిర్ణయం.. ఎగుమతి చేసే గ్రానైట్‌పై 28 శాతం జీఎస్టీ విధిస్తే పన్ను కట్టేందుకు రెడీగా ఉన్నాం. కానీ జిల్లాలో లభించేది నాసిరకం గ్రానైట్. దీనివల్ల గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు పెద్దగా మిగిలేదేమీ ఉండదు. ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం వల్ల ఫ్యాక్టరీలు మూసుకునే పరిస్థితి దాపురిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని చిన్నాచితక ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. కార్మికులు రోడ్డు న పడే అవకాశం ఉంది. ప్రభుత్వం పునరాలోచించాలి. తగిన కసరత్తు లేకుండా తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – విజయానందరెడ్డి, మ్యాక్గ్రానైట్స్ అధినేత, చిత్తూరు -
జీఎస్టీతో జీరోదందాకు చెక్
వ్యాట్, టీఓటీ చెల్లించేవారే జీఎస్టీ పరిధిలోకి.. ఇంకా చేరాల్సిన వ్యాపారులు 3,382 మంది పట్టుబడితే క్రిమినల్ కేసులే మహబూబాబాద్ : మరికొద్ది రోజుల్లో జీఎస్టీ (వస్తు సేవల పన్ను) అమల్లోకి రానుండటంతో జీరో దందా ఇక బంద్ కానుంది. సరుకులను అంతర్రాష్ట్ర జిల్లా సరిహద్దులు దాటిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వ్యాపారుల దందాకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. వరంగల్ డివిజన్ పరిధిలో 23,140 మంది వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి మారాల్సి ఉండగా 19,758 మంది ఇప్పటికే మారారు. ఈ నెల చివరికి మిగతా వారందరిని వస్తుసేవల పన్ను పరిధిలోకి మార్చేపనిలో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు తలమునకలయ్యారు. వ్యాట్(వాల్యూ ఆడెడ్ ట్యాక్స్) టర్నోవర్ ట్యాక్స్(టీఓటీ) పన్నులు చెల్లించే వ్యాపారులు జీఎస్టీ పరిధిలో మారేందుకు కేంద్రం మార్చి 31 వరకు గడువు విధించింది. వస్తుసేవల పన్ను విధానం అమలులోకి రానుండడంతో జిల్లాలో జీరో వ్యాపారానికి చెక్ పడే అవకాశముంది. ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడుస్తున్న వ్యాపారులు ఇక నుంచి పన్ను చెల్లింపు పరిధి నుంచి తప్పించుకోలేరు. వ్యాట్, టీఓటీ చెల్లించే వారే జీఎస్టీ పరిధిలోకి.. రూ.10 లక్షల వ్యాపారం చేసేవారు వ్యాట్ పరిధిలోకి వస్తుండగా అంతకు తక్కువ వ్యాపారం చేసే వారు టీవోటీ పరిధిలోకి వస్తారు. నిబంధనల ప్రకారం సంవత్సరానికి రూ.20 లక్షల వ్యాపారం దాటితే జీఎస్టీ పరిధిలోకి వస్తారు. వరంగల్ డివిజన్ పరిధిలో 11 సర్కిళ్లు ఉన్నాయి. వరంగల్ డివిజన్ పరిధిలో టీఓటీలు 7,206, వ్యాట్ చెల్లించే వ్యాపారులు 20,019 మంది ఉన్నారు. వరంగల్ డివిజన్ పరిధిలోకి వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు రానున్నాయి. వరంగల్ డివిజన్ పరిధిలో జీఎస్టీ పరిధిలోకి 23,140 వ్యాపారులు వస్తుండగా అందులో 19,758 మంది వ్యాపారులు జీఎస్టీలోకి మారారు. ఇంక 3382 మంది వ్యాపారులు జీఎస్టీలోకి మారాల్సి ఉంది. పట్టుబడితే క్రిమినల్ కేసులే.... జీఎస్టీ పరిధిలోకి మారకుంటే పన్ను అమల్లోకి వచ్చాక సరుకులు పట్టుబడితే ఏడు రెట్లు అపరాధ రుసుం, క్రిమినల్ కేసులు తప్పవంటున్నారు అధికారులు. రూ.20 లక్షలు దాటిన వ్యాపారులు మాత్రమే జీఎస్టీ పరిధిలోకి వస్తారు. జీఎస్టీ విధానంలో వచ్చిన వారు ఆదాయ పన్నుకు ఇచ్చే కార్డు నం బర్ ఆధారంగా సభ్యత్వ సంఖ్య ఉంటోంది. దీం తో పాన్‌కార్డు నంబర్ కొట్టగానే సదరు వ్యాపారి వాణిజ్య, ఆదాయ పన్ను వివరాలు స్పష్టంగా కన్పిస్తాయి. దీంతో పన్ను ఎగవేతకు బ్రేక్ పడనుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నారు. గతంలో అనేక మంది వ్యాపారులు అంకెల గారడీతో లెక్కలు చూపి పెద్దమొత్తంలో పన్నులు ఎగవేసేవారు. మరి కొందరు వ్యాపారులు ఆదాయపన్ను చెల్లించి, వాణిజ్య పన్నులు ఎగవేసేవారు. ఇకపై జీఎస్టీ విధానంతో పూర్తిస్థాయిలో అరికట్టనున్నారు. వాణిజ్య ఆదాయ పన్నుల చెల్లింపులు జరిపి ప్రభుత్వానికి వేల కోట్ల ఖజానా చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
60 వేల మందికి పన్ను లేనట్లే!
-
60 వేల మందికి పన్ను లేనట్లే!
జీఎస్టీలో చిన్న వ్యాపారులకు ఉపశమనం రూ.20 లక్షల పైన టర్నోవర్ ఉంటేనే పన్ను రాష్ట్రంలో 2.2 లక్షల మంది ట్రేడర్లకు జీఎస్టీ నంబర్ వస్తు సేవల పన్నుపై జోరందుకున్న కసరత్తు సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) అమలుతో రాష్ట్రంలో దాదాపు 60 వేల మందికిపైగా వ్యాపారులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం వ్యాట్ చెల్లిస్తున్న వీరందరూ జీఎస్టీ అమల్లోకి వచ్చాక.. జీరో ట్యాక్స్ (పన్ను వర్తించని) పరిధిలో చేరనున్నారు. వ్యాట్, సీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, సర్వీసు ట్యాక్స్‌లన్నింటి బదులుగా ఈ ఏడాది జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. వ్యాట్‌తో పోలిస్తే జీఎస్టీ కనిష్ట టర్నోవర్ పరిమితిని పెంచటంతో చిన్న వ్యాపారులకు ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం ఏడాదికి రూ.7.5 లక్షల టర్నోవర్ దాటిన అన్ని వ్యాపారాలు, ఉత్పత్తులు, సేవలపై వ్యాట్ అమల్లో ఉంది. అదే జీఎస్టీలో రూ.20 లక్షల టర్నోవర్ దాటిన వ్యాపారులపైనే పన్ను విధిస్తారు. దీంతో రూ.7.5 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య టర్నోవర్ ఉన్న వ్యాపార, వాణిజ్య వర్గాలకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 2.4 లక్షల మంది వ్యాట్ చెల్లించే డీలర్లు ఉండగా... ఇటీవల కేంద్రం నిర్దేశించిన గడువులోగా దాదాపు 2.2 లక్షల మంది తమ వ్యాపార లావాదేవీలను జీఎస్టీలో నమోదు చేసుకున్నారు. వారికీ ప్రొవిజనల్ గుర్తింపు నంబర్లను కూడా జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సంపన్న వ్యాపార వాటా తక్కువ బడా వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి వ్యాట్ ఆదాయం తక్కువగా వస్తోందని.. చిన్న వ్యాపారులతోనే ఎక్కువ ఆదాయం వస్తోందని ఆర్థిక శాఖ విశ్లేషిస్తోంది. రూ.1.5 కోట్ల టర్నోవర్ మించిన డీలర్ల నుంచి కేవలం ఏడు నుంచి ఎనిమిది శాతం ఆదాయం వస్తే... మిగతా డీలర్ల నుంచి 93 శాతం ఆదాయం సమకూరుతోందని పేర్కొంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ద్వారా రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. గతేడాదితో పోలిస్తే దాదాపు 16 శాతం వృద్ధి ఉన్నట్లుగా లెక్కలేసుకుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ ఆదాయం కొంతమేర తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అంతమేరకు లోటును కేంద్రం పరిహారంగా చెల్లించనుండటంతో జీఎస్టీ అమలుతో రాష్ట్రానికి లాభ నష్టాలేమీ ఉండవని భావిస్తున్నారు. నోట్ల రద్దుతో జీరో దందాకు చెక్ నోట్ల రద్దు ప్రభావంతో బ్యాంకు లావాదేవీలు పెరగడంతో.. జీఎస్టీలో నమోదు చేసుకునే వ్యాపారుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అం చనా వేస్తున్నాయి. గతంలో విచ్చలవిడిగా జీరో దందా చేసిన వ్యాపారు లు సైతం జీఎస్టీ గుర్తింపు పొందేందు కు దరఖాస్తు చేసుకుంటున్నారని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో జీఎస్టీలో నమోదు చేసుకునే డీలర్ల సంఖ్య ఈ ఏడాది 3 లక్షలు దాటుతుందని భావి స్తున్నారు. అందులో రూ.20 లక్షల లోపు టర్నోవర్ చేసే వ్యాపారులు దాదాపు 20% మేరకు ఉంటారని అంచనా. గత రెండేళ్ల వ్యాట్ చెల్లింపు గణాంకాల ప్రకారం 60 వేల మంది జీఎస్టీ కనిష్ట స్లాబ్‌కు దిగువన ఉంటారని.. వారంతా పన్ను మినహాయింపు పొందనున్నారని భావిస్తున్నారు. -
జీఎస్టీ పన్ను రేట్లకు ఆమోదం
5, 12, 18, 28 శాతం వసూలుకు నిర్ణయం - వినియోగదారుడి ధరల సూచీలో 50 శాతం వస్తువులపై పన్ను నిల్ - నిత్యావసర వస్తువులపై 5 శాతం పన్ను.. ప్రామాణిక రేట్లుగా 12, 18 శాతాలు - లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై అదనంగా సెస్సు వసూలు, 40-65% పన్ను - ఏ వస్తువులపై ఎంతో త్వరలో వెల్లడిస్తాం: అరుణ్ జైట్లీ జీఎస్టీ అమలైతే.. 0% వినియోగదారుడి ధరల సూచీలో 50 శాతం వస్తువులు ఆహార ధాన్యాలు, పాలు,కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికె న్, మటన్ వంటివి 5% రోజూ వినియోగించే వస్తువులు మసాలా దినుసులు, వంట సామగ్రి వస్తువులు వంటివి 12, 18% ఎక్కువ శాతం వస్తువులు ఈ రెండు శ్లాబ్‌ల కిందకే వస్తాయి. వాషింగ్ మెషీన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ (సబ్బులు, షాంపూలు, టూత్ పేస్టులు), స్టీల్, సిమెంట్ 28% లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, కూల్ డ్రింక్స్ (సెస్సులు విధిస్తే 40-65 శాతం వరకూ పన్ను వసూలు చేయవచ్చు) ప్రస్తుతం 30-31% పన్ను వసూలు చేస్తోన్న వాటిపై అత్యధిక రేటు (28%) అమలు చేస్తాం. ఈ విభాగంలో అధిక శాతం వస్తువుల్ని ఎక్కువ మంది వాడుతున్నారు. అందుకే వీటిలో కొన్ని వస్తువులకు 18% వసూలు చేస్తాం. - అరుణ్ జైట్లీ బంగారంపై ఇంకా పన్ను రేటు నిర్ధారించలేదు. న్యూఢిల్లీ: ఎట్టకేలకు జీఎస్టీ పన్ను రేటుపై సందిగ్ధానికి తెరపడింది. నాలుగు శ్లాబులుగా 5, 12, 18, 28 శాతం పన్ను రేట్లు వసూలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ గురువారం నిర్ణయించింది. ఎక్కువ శాతం వస్తువులు తక్కువ పన్ను పరిధిలోకి తీసుకురావడం... ఆవశ్యక వస్తువులపై(ఆహార ధాన్యాలు వంటివి) ఎలాంటి పన్ను విధించకూడదన్న ప్రతిపాదనల్ని భేటీలో ఏకగ్రీవంగా అంగీకరించారు. భేటీలో నిర్ణయించిన ప్రకారం నిత్యావ సర వస్తువులపై తక్కువ పన్ను రేటు... విలాస వస్తువులు, ఆరోగ్యానికి హాని చేసే పొగాకు, పాన్ మసాలపై అధిక రేటు వసూలు చేస్తారు. అలాగే వాటిపై అదనపు సెస్సు విధిస్తారు. రెండ్రోజుల పాటు నిర్వహిస్తోన్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మొదటి రోజు పన్ను రేట్లపై ఏకాభిప్రాయం కుదిరింది. పేదల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ద్రవ్యోల్బణం అదుపులోకి ఉంచేందుకు వినియోగ ధరల సూచీ (సీపీఐ)లోని సగం పైగా వస్తువులపై పన్ను విధించరు. మొత్తం నాలుగు శ్లాబులుగా జీఎస్టీ రేట్లను పేర్కొన్నా... ప్రామాణిక పన్ను రేట్లుగా 12, 18 శాతాల్ని వసూలు చేస్తారు. బంగారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 28% కేటగిరిలో ఉన్నా 18% వసూలు సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ... ‘ప్రస్తుతం 30-31 శాతం పన్ను వసూలు చేస్తోన్న వాటిపై అత్యధిక రేటు (28 శాతం) అమలు చేస్తాం. అయితే కొన్ని అదనపు నిబంధనలు కూడా చేరుస్తున్నాం. ఈ విభాగంలో అధిక శాతం వస్తువుల్ని ఎక్కువ మంది వాడుతున్నారు. ఇటీవలికాలంలో ఆ వస్తువుల్ని దిగువ మధ్యతరగతి ఎక్కువగా కొంటున్నారు. వారికి 28, 30 లేదా 31 శాతం పన్ను అంటే చాలా ఎక్కువ. అందుకే కొన్ని వస్తువులకు 18 శాతం వసూలు చేస్తాం. ఏ పన్ను పరిధిలోకి ఏ వస్తువు వస్తుందనేది కమిటీ నిర్ణయిస్తుంది. ఏసీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటివి 28% కిందికి వచ్చినా 18% వసూలు చేసే అవకాశముంది. సబ్బులు, నూనె, షేవింగ్ కిట్, టూత్ పేస్టు వంటి ఉత్పత్తులు 18 శాతం పరిధిలోకి వస్తాయి’ అని చెప్పారు. సెస్సు అవసరమే.. లగ్జరీ కార్లు, పొగాకు, శీతల పానియాలపై అదనపు సెస్సు అవసరంపై మాట్లాడుతూ... ‘ఈ సెస్సుతో పాటు బొగ్గు వినియోగంపై క్లీన్ ఎనర్జీ సెస్సుతో వచ్చే మొత్తంతో ఒక నిధి ఏర్పాటు చేస్తాం. జీఎస్టీ అమలు వల్ల మొదటి ఐదు సంవత్సరాలు ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తాం. ఐదేళ్ల అనంతరం ఈ సెస్సు రద్దవుతుంది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయం చెల్లించేందుకు మొదటి సంవత్సరం రూ. 50 వేల కోట్లు అవసరం. ఈ డబ్బును పన్ను రూపంలో వసూలు చేయాలంటే మనకు రూ. 1,72,000 కోట్లు కావాలి. రాష్ట్రాలకు పరిహారంపై ప్రతి ఏడాది సమావేశమై సమీక్షిస్తాం’ అని జైట్లీ వెల్లడించారు. ముఖ్య ఆర్థిక సలహదారు అర్వింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ... జీఎస్టీ పన్ను విధానం తప్పకుండా ద్రవ్యోల్బణం తగ్గేందుకు సాయపడుతుందన్నారు. నిత్యావసర వస్తువులపై 5 శాతం పన్ను వల్ల ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి సీజీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాలు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందుతాయని... జీఎస్టీ 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు. జీఎస్టీ రేట్లపై అంగీకారం రావడం శుభ పరిణామమంటూ నీతి ఆ యోగ్ వైస్ చైర్మన్ పనగారియా చెప్పారు. -
జీఎస్టీ ఫైనల్ పన్నురేట్లు ఇవే!
-
జీఎస్టీ ఫైనల్ పన్నురేట్లు ఇవే!
న్యూఢిల్లీ: నాలుగు రకాల శ్లాబులతో పన్నురేట్లను ఖరారుచేస్తూ జీఎస్టీ మండలి గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రేట్లు 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం తదితర నాలుగు శ్లాబులుగా ఉండనుంది. ఇందులో నిత్యావసర వస్తువులకు కనీస పన్ను విధించనుండగా, విలాసవంతమైన వస్తువులు, ఇతరత్రా వస్తువులకు గరిష్ఠామొత్తం పన్నురేటు వర్తించ నుంది. ఇక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ఉద్దేశంతో ఆహార పదార్థాలు వంటి నిత్యావసర వస్తువులకు సున్నాశాతం పన్ను వర్తింపజేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం సామాన్య వినియోగదారులు తమ ఆదాయంలో సగం మొత్తానికి ఆహార పదార్థాలకే ఖర్చుచేస్తున్న సంగతి తెలిసిందే. సహజంగా అందరూ వాడే నిత్యావసర వస్తువులకు 5శాతం పన్ను విధించనుండగా, మిగతా వస్తువులకు జీఎస్టీ ప్రామాణిక రేటు 12శాతం, 18శాతంగా ఉండనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ విధానాన్ని అమలుచేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సభ్యులుగా ఉన్న సర్వోన్నతమైన జీఎస్టీ మండలి గురువారం సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ జీఎస్టీ పన్నురేట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్‌తో కలిపి 30-31శాతంగా పన్ను విధిస్తున్న వస్తువులకు జీఎస్టీ రాకతో గరిష్టశ్లాబు (28శాతం)ను వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. -
ఐదేళ్లపాటు వందశాతమివ్వాలి
జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఏర్పడే నష్టం భర్తీపై విజయసాయిరెడ్డి సూచన న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను(జీఎస్టీ) అమలు వల్ల ఏర్పడే నష్టాన్ని పూడ్చడానికి రాష్ట్రాలకిచ్చే నష్ట పరిహారాన్ని తొలి ఐదేళ్లపాటు 100 శాతం, 6వ ఏడాది 50 శాతం, 7వ ఏడాది 25 శాతం చొప్పున అందించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సూచించారు. జీఎస్టీ సవరణ బిల్లుకు తాము మద్దతిస్తున్నామన్నారు. జీఎస్టీ పన్ను సంస్కరణల అమలుకు చెందిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లులో క్లాజ్ 12, సబ్‌క్లాజ్ 4 ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేక నిబంధనలను సిఫార్సులు చేస్తుందని,ఏపీని కూడా ఈ కేటగిరీలోని రాష్ట్రాల జాబితాలో చేర్చాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఆయన కోరారు. జీఎస్టీ అమలువల్ల రాష్ట్రానికి రూ.4,700 కోట్ల మేరకు రెవెన్యూ నష్టమని ఏపీ ఆర్థికమంత్రి పేర్కొన్నారని చెబుతూ.. ఏపీని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా పరిగణిస్తే సమస్య పరిష్కారమవుతుందని, ఏపీకి వాటిల్లే నష్టం తగ్గుతుందని విజయసాయిరెడ్డి అన్నారు.జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు ఏర్పడే నష్టాన్ని అంచనా వేయాలని, ఆ పద్ధతిని నిబంధనల్లో పేర్కొనాలని సూచించారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాల్‌కు ఈ బిల్లులో మినహాయింపు ఇచ్చారని, దాదాపుగా అన్నిరాష్ట్రాల విద్యుత్ బోర్డులు నష్టాల్లో ఉన్నాయని, అందువల్ల రాష్ట్రప్రభుత్వాలు వసూలు చేస్తున్న విద్యుత్ సుంకానికి కూడా మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు. -
'రాహుల్‌తో మాట్లాడేందుకు సిద్ధమే'!
న్యూఢిల్లీ: కీలకమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో రాజీకి సిద్ధమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ విషయంలో రాహుల్‌తో మాట్లాడేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణ చర్యల్లో అత్యంత కీలకమైన జీఎస్టీ బిల్లు ప్రతిపక్షాల వ్యతిరేకతతో పార్లమెంటులో నిలిచిపోయింది. మరోవైపు దేశంలో మత అసహనం పెరిగిపోతున్నదని కేంద్రంపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీపై కాంగ్రెస్ నేతలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని జైట్లీ చెప్పారు. 'వారికి (కాంగ్రెస్) సంబంధించిన ఏ నాయకులతోనైనా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం' అని జైట్లీ పేర్కొన్నట్టు బ్లూమ్‌బర్గ్ న్యూస్ తెలిపింది. రాహుల్ గాంధీతో కూడా మాట్లాడుతారా? అన్న ప్రశ్నకు తప్పకుండా అని ఆయన బదులిచ్చారు. వస్తు సేవల పన్ను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఇది అమలైతే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న 11 లెవీ పన్నులు రద్దవుతాయి. దేశమంతా ఒకే మార్కెట్‌గా భావించి పన్ను విధించడానికి వీలు పడుతుంది. అయితే కీలకమైన ఈ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందకపోతే గడువులోగా ఇది అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను ఒప్పించే ప్రయత్నంలో కేంద్రం తలమునకలైంది. జీఎస్టీ బిల్లుపై ప్రతిపక్ష నేతలందరినీ సాధ్యమైనంత తొందరలో ఒప్పించే ప్రయత్నం చేస్తామని ఆర్థికమంత్రి జైట్లీ పేర్కొన్నారు. -
20న జీఎస్టీపై ఆర్థిక మంత్రుల భేటీ
న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను(జీఎస్టీ) చట్టాల ముసాయిదాపై చర్చించేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు నవంబర్ 20న ఢిల్లీలో భేటీ కానున్నారు. కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ, అంతరాష్ట్ర వస్తుసేవలకు సంబంధించిన ఏకీకృత జీఎస్టీ(ఇంటిగ్రేటెడ్)ల ముసాయిదాలను కేంద్రం ఈ నెల మొదట్లో అభిప్రాయాల కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రులకు పంపింది. ఆదర్శ జీఎస్టీ చట్టం ఆధారంగా కేంద్ర జీఎస్టీని రూపొందిస్తారని, రాష్ట్రాలూ దాని ఆధారంగా తమ మినహాయింపుల తగ్గట్టు చిన్నచిన్న మార్పులతో తమ జీఎస్టీలను రూపొందించుంటాయి. -
జీఎస్టీ అమలుకు ఆర్బీఐ ‘ఈ-కుబేర్’ బ్యాంకింగ్ విధానం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) అమలుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ ఈ-కుబేర్‌ను ఉపయోగించవచ్చని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ సూచించింది. జీఎస్టీ ఖాతాల కన్సాలిడేషన్, సెటిల్మెంట్కి ఆర్బీఐ అనుసంధానకర్తగా వ్యవహరించిన పక్షంలో మరిన్ని బ్యాంకులు వస్తు, సేవల పన్నులను స్వీకరించే వీలుంటుందని, తద్వారా పన్ను చెల్లింపుదారులకూ వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. సమాచారమంతా ఒకే దగ్గర లభ్యమవుతుంది కనుక అటు ప్రభుత్వానికి కూడా అకౌంటింగ్ భారం తగ్గుతుందని కమిటీ అభిప్రాయపడింది. రిజిస్ట్రేషన్, పేమెంట్.. రీఫండ్ ప్రక్రియలకు సంబంధించి సాధికారిక కమిటీ మూడు నివేదికలు ఇచ్చింది. చెల్లింపుల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్, నె ఫ్ట్.. ఆర్టీజీఎస్, ఓవర్ ది కౌంటర్ తదితర మార్గాలను అందుబాటులో ఉంచాలని సూచించింది. ఇక, రిజిస్ట్రేషన్ ప్రక్రియ విషయంలో.. పన్నుల పరిధిలోకి వచ్చే వారు జీఎస్టీ కామన్ పోర్టల్ ద్వారా పన్నుల విభాగాన్ని సంప్రదించవచ్చని కమిటీ పేర్కొంది. ఇటు కేంద్రం, అటు రాష్ట్రాల స్థాయి ఐటీ సిస్టమ్స్‌తో ఈ పోర్టల్ అనుసంధానమై ఉండాలని తెలిపింది. -
జీఎస్టీపై షరతులకు నో
- అవి కాంగ్రెస్ బిల్లులోనే లేవన్న అరుణ్ జైట్లీ - ఆమోదంపై ప్రభుత్వం ధీమా న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను కోసం ఉద్దేశించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లును పార్లమెంటులో ఆమోదించడానికి కాంగ్రెస్ పెట్టిన ముందస్తు షరతులను ప్రభుత్వం తోసిపుచ్చింది. 2011లో కాంగ్రెస్ హయాంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అందులో అవి లేవని, వాటిని తర్వాత చెప్పారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ‘ఏ పార్టీ అయినా ముందస్తు షరతులు పెట్టడం రాజకీయంగా వివేకం అనిపించుకోదు. ముఖ్యంగా కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక అంశాల్లో..’ అని శుక్రవారం ఢిల్లీలో విలేకర్లతో అన్నారు. జీఎస్టీకి మద్దతుపై కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం పేర్కొన్న షరతులపై ఆయన స్పందించారు. గరిష్ట జీఎస్టీ 18 శాతానికి మించకూడదని, ఒక శాతం అదనపు పన్ను ఉండకూడదని, వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని.. వీటికి అంగీకరిస్తే బిల్లు ఆమోదానికి మద్దతుపై పరిశీలిస్తామని చిదంబరం గురువారం తెలిపారు. ఈ షరతులు ఆనాడు ఆర్థిక మంత్రిగా చిదంబరం తీసుకున్న వైఖరికి విరుద్ధమని జైట్లీ అన్నారు. పన్ను శాతాలు ఆర్థిక స్థితిగతుల ఆధారంగా నిర్ణయమవుతాయని, దాని కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని అన్నారు. వివాదాల పరిష్కార యంత్రాంగం వద్దని పార్లమెంటు స్థాయీసంఘం 2013లో సిఫార్సు చేసిందని, దాని నివేదికను చిదంబరం ఆమోదించారని గుర్తుచేశారు. వివాదాలను జీఎస్టీ కౌన్సిల్లో పరిష్కరించుకోవడానికీ ఒప్పుకున్నారన్నారు. రాష్ట్రాల మధ్య వస్తువుల రవాణాపై ఒక శాతం అదనపు పన్ను కేంద్రం, రాష్ట్రాల మధ్య సర్దుబాటుకు సంబంధించినదని అన్నారు. కచ్చితంగా పాసవుతుంది.. జీఎస్టీ బిల్లుకు పార్లమెంటులో కచ్చితంగా ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. దీనికి అన్ని పార్టీలూ సహకరించాలని కోరింది. పార్లమెంటులో కాంగ్రెస్ అడ్డుకోవడం వల్లే ఆమోదం జాప్యమవుతోందని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జవదేకర్ తదితరులు విమర్శించారు. బిల్లును గట్టెక్కించడానికి అన్ని పార్టీలతో చర్చిస్తామని నిర్మల చెన్నైలో చెప్పారు. బిల్లుకు సంబంధించి రాజ్యసభలో తమకు మెజారిటీ ఉందని జవదేకర్ తెలిపారు. జీఎస్టీ అమలుకు సంబంధించి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తామని గోయల్ చెప్పారు. బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశముందని ఆయనతో పాటు పలువురు మంత్రులు సంకేతమిచ్చారు. వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయే కానీ ప్రొరోగ్ కాలేదని వారు చెప్పారు. -
జీఎస్టీ బిల్లుపై ఏకాభిప్రాయం
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభనకు తెర జీఎస్టీ నుంచి పెట్రోలియం ఉత్పత్తులకు మినహాయింపు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు న్యూఢిల్లీ: ప్రతిపాదిత వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. సోమవారం నాటి చర్చల్లో జీఎస్టీ నుంచి పెట్రోలియంను మినహాయించేందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఈ అంశంలోనే బిల్లును వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు దిగివచ్చి.. జీఎస్టీకి మద్దతు తెలిపాయి. ప్రవేశ పన్నును జీఎస్టీలో కొనసాగించేందుకు అంగీకరించాయి. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లు పార్లమెంట్ ముందుకు రావడానికి మార్గం సుగమమైంది. అయితే ఈ బిల్లును మొదట కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంది. కొత్త పన్నుల విధానం 2016 ఏప్రిల్ నుంచి అమలులోకి రానుంది.సోమవారం పంజాబ్, హరియాణా, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చర్చలు జరిపారు. జీఎస్టీ బిల్లుపై ఏకాభిప్రాయం కుదిరింది. పెట్రోలియం ఉత్పత్తులను కొన్నేళ్ల పాటు జీఎస్టీ బిల్లు నుంచి మినహాయించడానికి ఏకాభిప్రాయం కుదిరిందని, కొత్త పన్నుల విధానంలో దీన్ని చేర్చే అంశంపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జీఎస్టీ అమలులోకి రావడం వల్ల రాష్ట్రాలకు కలిగే రెవెన్యూ నష్టాలను మూడేళ్ల పాటు భర్తీ చేసేందుకు, ఆ తర్వాత రెండేళ్ల కాలానికి కొంత మొత్తాన్ని పరిహారంగా చెల్లించేందు కేంద్రం అంగీకరించినట్టు తెలిపాయి. -
జెట్‌స్పీడ్‌లో సర్వీసులు
న్యూఢిల్లీ: దేశీ సర్వీసుల రంగం ప్రపంచంలోనే వేగవంత వృద్ధిని సాధిస్తున్నదని ఆర్థిక సర్వే పేర్కొంది. 2001-2012 కాలంలో వార్షికంగా 9% చొప్పున దూసుకెళుతూ వేగవంత వృద్ధిని అందుకుంటున్న రంగాలలో రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఈ కాలంలో 10.9% వృద్ధితో చైనా సర్వీసుల రంగం అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఇక జీడీపీ విషయానికివస్తే ప్రపంచంలోని టాప్ 15 దేశాలలో ఇండియా 10వ ర్యాంక్‌లో ఉన్నట్లు వెల్లడించింది. సర్వీసుల జీడీపీ రీత్యా అయితే 12వ స్థానాన్ని పొందినట్లు పేర్కొంది. ప్రపంచ జీడీపీలో సర్వీసుల రంగం వాటా 65.9% అయినప్పటికీ, 2012లో ఉద్యోగ కల్పన విషయంలో ఈ వాటా 44% మాత్రమేనని పేర్కొంది. ఇదే కాలంలో ఇండియా జీడీపీలో సర్వీసుల రంగానికి 56.9% వాటా ఉండగా, ఉద్యోగ కల్పన రీత్యా కేవలం 28.1% వాటాను పొందినట్లు వివరించింది. అత్యంత ప్రాధాన్యత 2012-13తో పోలిస్తే 2013-14లో సర్వీసుల రంగ వృద్ధి నామమాత్రంగా తగ్గి 6.8%కు పరిమితమైనట్లు వెల్లడించింది. వాణిజ్యం హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వలు, కమ్యూనికేషన్స్ వంటి విభాగాలు మందగించడం దీనికి కారణమైనట్లు తెలిపింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల ఆదాయాలతోపాటు, వాణిజ్యం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు), ఉద్యోగ కల్పనకు సంబంధించి ఇండియాలో సర్వీసుల రంగం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదని వివరించింది. 2005-06లో 10% చొప్పున నిలకడగా దూసుకెళ్లిన ఈ రంగం గత మూడేళ్లుగా కొంతవెనకబడిందని తెలిపింది. సంస్కరణలకు తెర లేపడం, విధాన నిర్ణయాలను వేగంగా తీసుకోవడం, లక్ష్యాలు నిర్దేశించుకోవడం వంటి చర్యల ద్వారా ఈ రంగానికి జోష్ తీసుకురావలసి ఉన్నదని వివరించింది. ఇండియాకు గుర్తింపును తీసుకువచ్చిన సాఫ్ట్వేర్, టెలికం వంటి రంగాలపై ప్రత్యేక దృష్టిని పెట్టాల్సి ఉన్నదని సర్వే తెలిపింది. తయారీకి 16 ప్రత్యేక జోన్లు తయారీ రంగానికి జోష్‌నిస్తూ ప్రభుత్వం జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్లు(ఎన్ఐఎంజెడ్లు) పదహారింటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. జాతీయ తయారీ విధానాల్లో భాగంగా ప్రభుత్వం ఎన్ఐఎంజెడ్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు వెల్లడించింది. దశాబ్ద కాలంలో జీడీపీలో తయారీ రంగ వాటాను 25%కు పెంచడం పాలసీ లక్ష్యమని తెలిపింది. తద్వారా 10 కోట్ల ఉద్యోగాల కల్పనను సాధించాలని భావిస్తున్నట్లు తెలిపింది. 16 ఎన్ఐఎంజెడ్లలో ఎనిమిదింటిని ఢిల్లీ-ముంబై కారిడార్(డీఎంఐసీ)లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మరో 8 ఎన్ఐఎంజెడ్లకు ముందస్తు అనుమతి మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఇవి నాగ్‌పూర్, చిత్తూరు, మెదక్, టుమ్కూర్, కోలార్, బీదర్, గుల్బ ర్గాలలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కనీసం 50 చదరపు కిలోమీటర్ల (5,000 హెక్టార్లు) పరిధిలో సమీకృత టౌన్‌షిప్‌ల తరహాలో వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపింది. డీఎంఐసీ ప్రాజెక్ట్‌ను జపాన్ సహకారంతో అభివృద్ధి చేయనున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలతోపాటు పశ్చిమ రైల్వే కారిడార్లను కలుపుతూ ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. ఆగ్రోప్రాసెసింగ్, జౌళి, దుస్తులు, తోలు ఉత్పత్తులు, పాదరక్షల రంగాలను పటిష్టపరచడం ద్వారా తయారీ రంగాన్ని మరింత పురోభివృద్ధిలో నిలపవచ్చునని తెలిపింది. చెన్నై-బెంగళూరు-చిత్రదుర్గ పారిశ్రామిక కారిడార్‌వల్ల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు లబ్ది చేకూరుతుందని తెలిపింది. ఎగుమతుల వాటా 4 శాతానికి పెంచాలి... ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటాను వచ్చే ఐదేళ్లలో కనీసం 4 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే సూచించింది. 2013-14లో దేశ ఎగుమతుల వాటా 1.7 శాతంగా ఉంది. దీన్ని 4 శాతానికి పెంచాలంటే ఏటా ఎగుమతుల్లో 30 శాతం వృద్ధిని సాధించాలని కూడా పేర్కొంది. 2003-04 నుంచి 2007-08 మధ్య ఎగుమతుల్లో 20 శాతం వృద్ధి నమోదైందని.. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే లక్ష్యం అసాధ్యమేమీ కాదని కూడా సర్వే తెలిపింది. ప్రపంచ ఎగుమతుల్లో మన వాటా 1990లలో 0.5 శాతం మాత్రమే ఉందని.. 2013 నాటికి ఇది 1.7 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది. ఇదే సమయంలో చైనా ఎగుమతుల వాటా 1.8 శాతం నుంచి ఏకంగా 11.8 శాతానికి ఎగబాకడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 325 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా... 312 బిలియన్ డాలర్లు మాత్రమే జరిగాయి. అంటే లక్ష్యానికి 13 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఇక ఆర్థిక సంవత్సరం మే నెలలో 12.4 శాతం వృద్ధితో 24.9 డాలర్లకు ఎగబాకాయి. గడిచిన ఏడు నెలల్లో మళ్లీ దేశీ ఎగుమతులు రెండంకెల వృద్ధిని అందుకోవడం గమనార్హం. కార్మిక సంస్కరణలు రావాలి కొత్త సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించేందుకు రెండో తరం కార్మిక సంస్కరణలను అమలు చేయాలి... అపారంగా ఉన్న మానవ వనరులను వినియోగించుకోవాలని సర్వే సూచించింది. 2000-2005 మధ్యకాలంలో 2.8 శాతంగా ఉన్న ఉద్యోగావకాశాల వృద్ధి రేటు 2005-2012 లో 0.5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఈ సూచనకు ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు 125 కోట్లుగా ఉన్న భారత జనాభా సగటు వయసు 2020లో 29 ఏళ్లుగా ఉంటుందని అంచనా. చైనా, అమెరికా(సగటు వయసు 37 ఏళ్లు)లతో పోలిస్తే ఇండియాలో పిన్నవయస్కులు అధికంగా ఉంటారు. పనిచేసే వయసులో ఉండే జనాభా సంఖ్య 2001లో 58% ఉండగా 2021 నాటికి 64%కి పెరగనుంది. స్పెక్ట్రం పాలసీని మెరుగుపరచాలి... టెలికం స్పెక్ట్రం నిర్వహణకు సంబంధించి మరింత మెరుగైన పాలసీని రూపొందించాలి. ముఖ్యంగా స్పెక్ట్రం ట్రేడింగ్, షేరింగ్‌కు కంపెనీలను అనుమతించడంద్వారా వ్యయాలు తగ్గించుకునేందుకు దోహదం చేస్తుంది. జతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్(ఎన్ఓఎఫ్ఎన్), దేశవ్యాప్తంగా నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ), గ్రామీణ టెలికం వినియోగదారుల సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం దృష్టిసారించాలి. ఎన్ఓఎఫ్ఎన్ కింద దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలను హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల నెట్‌వర్క్‌తో అనుసంధానించాలన్న లక్ష్యాన్ని ఆర్థిక స్పష్టంగా నిర్ధేశించింది. దీనిప్రకారం... వచ్చే ఏడాది మార్చినాటికి 50 వేల పంచాయతీలను, 2016 మార్చికల్లా మరో లక్ష, 2017 మార్చినాటికి పూర్తిగా 2.5 లక్షల పంచాయతీల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. భారీ వృద్ధికి మూడంచెల వ్యూహం దేశం 7 నుంచి 8 శాతం శ్రేణిలో భారీ వృద్ధి రేటు బాటకు మళ్లడానికి మూడంచెల వ్యూహాన్ని అవలంబించాలి. ద్రవ్యోల్బణం కట్టడి-పన్నుల వసూళ్ల పెంపు, వ్యయ సంస్కరణలు, మార్కెట్ ఎకానమీకి సంబంధించి న్యాయ-నియంత్రణ వ్యవస్థలను మరింత మెరుగుపరచడం ద్వారా మళ్లీ వృద్ధికి ఊపును అందించవచ్చు. పెట్టుబడుల పునరుద్ధరణ, ఉపాధి, ఆదాయాల్లో వృద్దికి ఈ మూడంచెల విధానం దోహదపడుతుంది. ద్రవ్యోల్బణం కట్టడికి తగిన చర్యలతో పాటు, జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) అమలుసహా పన్నుల వ్యవస్థ సంస్కరణలపై దృష్టి సారించాలి. సబ్బిడీల వ్యవస్థ హేతుబద్దీకరణ వ్యయ నియంత్రణలో కీలకపాత్రను పోషిస్తుంది. కొంచెం పెరగనున్న క్యాడ్..! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య ఉన్న వ్యత్యాసం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) జీడీపీతో పోల్చితే 2.1 శాతంగా (45 బిలియన్ డాలర్లు) నమోదయ్యే అవకాశం ఉంది. భారత్ ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలిగిన స్థాయిలో ఈ రేటు ఉంది. 2012-13లో క్యాడ్ 4.7 శాతం (88.2 బిలియన్ డాలర్లు)కాగా, 2013-14లో 1.7 శాతంగా (32.4 బిలియన్డాలర్లు) ఉంది. మొత్తంగా చూస్తే- క్యాడ్ పరిమాణం దిగిరావడం, తగిన స్థాయిల్లో కొనసాగడం భారత్ ఆర్థిక వ్యవస్థకు కలిసివస్తున్న అంశం. కొత్త ఎఫ్ఆర్బీఎం చట్టం అవసరం... ప్రభుత్వ వ్యయాలు, అకౌంటింగ్ ప్రమాణాలు, బడ్జెటరీ నిధుల నిర్వహణ తత్సంబంధ అంశాల్లో మరింత మెరుగుదల, పటిష్టత అవసరం ఉంది. ఈ దిశలో కొత్త ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ(ఎఫ్ఆర్బీఎం) చట్టానికి రూపకల్పన చేయాలి. బాధ్యతాయుతమైన ద్రవ్య విధాన రూపకల్పన ప్రక్రియలో తాజా ఆలోచనా ధోరణి అవసరం. గడచిన ఎనిమిదేళ్ల కాలంలో ద్రవ్యోల్బణం భారీగా పెరగడం ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ తత్సంబంధ అంశాలపై తీవ్ర ప్రతికూలత చూపుతోంది. అధిక నాణ్యతా ప్రమాణాలు కలిగిన ద్రవ్య సమతౌల్యతను సాధించడానికి అటు పన్నులు, ఇటు వ్యయ వ్యవస్థలను మెరుగుపరచాలి. పన్నుల వ్యవస్థ సరళతరంగా, అమలుకు సాధ్యమయ్యేలా పారదర్శకత, స్థిరత్వంగా ఉండాలి. రైల్వేల్లో ఎఫ్‌డీఐలపై త్వరిత నిర్ణయం రైల్వేల ప్రైవేటీకరణ, రైల్వే రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను అనుమతించడం అతి పెద్ద సంస్కరణలు కానున్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది. రైల్వే రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను జాగ్రత్తగా అధ్యయనం చేయాలని, ఈ విషయమై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. భారత రైల్వేలు ప్రపంచ స్థాయి ప్రమాణాలనందుకోవాలంటే ఎఫ్‌డీఐలు తప్పనిసరని, అందుకే రైల్వే అధికారులు ప్రస్తుతమున్న ఎఫ్‌డీఐ విధానంలో తగిన మార్పులు చేయడానికి కసరత్తు చేస్తున్నారని పేర్కొంది. నిర్వహణలో తప్ప అన్ని విభాగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించాలనే ప్రతిపాదన ఉంది. ఎఫ్‌డీఐలను అనుమతించడంపై అధ్యయనం చేయాలని పేర్కొంది. ద్రవ్యోల్బణం అదుపుతో వడ్డీరేట్లు కిందకు... ద్రవ్యోల్బణం అదుపునకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2014 యేడాది చివరినాటికి ఈ సమస్య అందుపులోనికి వస్తుందన్న విశ్వాసముంది. ద్రవ్యోల్బణం తగ్గితే ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది వర్షపాతం కొరత, ఇరాక్ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అధిక క్రూడ్ ధరలు వంటి అంశాలు ప్రతికూలతలుగా కనబడుతున్నాయి. ద్రవ్యోల్బణం కాస్త శాంతించినప్పటికీ.. ఇంకా తగ్గాల్సి ఉంది. ప్రత్యేకించి సరఫరాల వైపు సమస్యలు ఆహార ద్రవ్యోల్బణం కట్టు తప్పడానికి కారణమవుతున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడికి రైతులకు ప్రభుత్వ మద్దతు వంటి అంశాల్లో హేతుబద్ధీకరణ వంటి చర్యలు అవసరం. వీటితోపాటు డీజిల్ ధరలపై నియంత్రణల ఎత్తివేత, ద్రవ్యలోటు కట్టడికి ప్రాధాన్యత ఇవ్వాలి. సెజ్‌లను పునరుద్ధరించాలి.. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్‌లు) తాజా పెట్టుబడులు ఇటీవలి కాలంలో మందగించిన నేపథ్యంలో వాటి పునరుద్ధరణపై డెవలపర్లకు, యూనిట్లకు స్పష్టమైన సంకేతాలివ్వాలని ఆర్థిక సర్వే కోరింది. తయారీ, ఎగుమతి కేంద్రాలుగా ఒకనాడు విలసిల్లిన సెజ్‌లు 2011లో కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్), డివిడెండ్ పంపణీ పన్నుల (డీడీటీ) విధింపుతో తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయని పేర్కొంది. సెజ్‌లపై మ్యాట్‌ను ఉపసంహరించాలని వాణిజ్య శాఖ ఇప్పటికే ఆర్థిక శాఖను కోరింది. సెజ్‌ల డెవలపర్లు, యూనిట్ల బుక్ ప్రాఫిట్స్‌పై 18.5 శాతం మ్యాట్‌ను 2011లో విధించారు. జీఎస్టీ, డీటీసీలే కీలకం... న్యూఢిల్లీ: ప్రస్తుతం సంక్లిష్టంగా ఉన్న దేశీయ పన్నుల విధానాన్ని పూర్తిగా సంస్కరించాలని, అలాగే అనవసర పన్నులను తొలగించాలని ఎకనామిక్ సర్వే పేర్కొంది. పరోక్ష పన్నుల సంస్కరణల్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) ఎంతో కీలకమైనదన్న విషయంపై ఇప్పటికే ఏకాభిప్రాయం ఏర్పడిందన్నారు. జీఎస్టీ అమల్లోకి వస్తే ద్వంద పన్నుల విధానం తొలిగిపోవడమే కాకుండా, ఎగుమతులు, దిగుమతుల పన్నులు కూడా ఒకే పరిధిలోకి వస్తాయి. దీంతో కంపెనీలకు పోటీ సామర్థ్యం పెరిగి ఎగుమతులు వృద్ధి చెందుతాయని పేర్కొంది. అలాగే ప్రస్తుతం విధానంలో ఉన్న సర్ చార్జీలు, సుంకాలు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ వంటి అనవసర పన్నులు (బ్యాడ్ ట్యాక్స్) తొలగించాల్సిన అవసరం ఉందని సర్వే పేర్కొంది. ఎంతో సంక్లిష్టంగా ఉన్న ఆదాయ పన్నుల చట్టం స్థానంలో డెరైక్ట్ ట్యాక్స్ కోడ్ (డీటీసీ)ని ప్రవేశపెట్టాలని సూచించింది. దీంతో వ్యక్తిగత, వ్యాపార వర్గాల్లో ఆదాయపు పన్నుల సమస్యలు తగ్గి పన్ను వసూళ్లు పెరుగుతాయని పేర్కొంది. మొండిబకాయిల సెగ.. గడచిన రెండేళ్లలో బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్పీఏలు) నాలుగు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ సవాలును అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2008-09లో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం రుణాల్లో ఎన్పీఏల రేటు 2.09% కాగా, ఇది 2014 మార్చి నాటికి 4.4%కి ఎగసింది. నిధుల రూపంలో చూస్తే 2010 మార్చి నాటికి స్థూలంగా ఈ మొత్తం రూ.59,972 కోట్లుకాగా 2014 మార్చికి రూ.2,04,249 కోట్లకు చేరింది. ఆర్థిక వ్యవస్థ బాగున్నరోజుల్లో భారీ రుణాల మంజూరు.. అనంతర కాలాల్లో మందగమనం వంటి అంశాలు ఎన్పీఏలు ఎగసేందుకు కారణం. ప్రైవేటురంగం సహా అన్ని బ్యాంకుల ఎన్పీఏల రేటు 2.36% నుంచి 3.90%కి చేరింది. అందరికీ బ్యాంకింగ్ సేవలు..: మారుమూల ప్రాంతాలన్నింటికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోనికి తీసుకురావడం, తద్వారా వృద్ధికి చేయుతనివ్వడం లక్ష్యంగా తగిన అన్ని ప్రయత్నాలను కేంద్రం తీసుకుంటోంది. ప్రస్తుత భారత్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను వచ్చే 30 ఏళ్లలో అధిగమించాల్సి ఉంది. -
రంగంలోకి మోడీ జట్టు...కార్పొరేట్లు ఖుషీఖుషీ
న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం .. రాజకీయ నేతలతో పాటు పారిశ్రామిక దిగ్గజాలతో కళకళ్లాడింది. కార్పొరేట్ ప్రపంచ ప్రముఖుల్లో చాలా మంది ఇందులో పాల్గొన్నారు. అంబానీ సోదరులు, హిందుజా, అదానీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. సంస్కరణల ఆర్కిటెక్ట్‌గా మోడీని ఈ సందర్భంగా సుజ్లాన్ గ్రూప్ చైర్మన్ తులసి తంతి అభివర్ణించారు. ఆయన సారథ్యంలో దేశ ఎకానమీ మళ్లీ కోలుకోగలదని ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య భారత దేశంలో అద్భుత ఘట్టమని అంబుజా న్యోతియా గ్రూప్ చైర్మన్ హర్ష్ న్యోతియా పేర్కొన్నారు. వృద్ధి, అభివృద్ధి అవసరాన్ని మోడీ గట్టిగా చెప్పగలిగారని, దేశాన్ని ముందుకు నడిపించే విషయంలో ఆయనపై భారీ అంచనాలు ఉన్నాయని హర్ష్ తెలిపారు. దేశానికి మంచి రోజులు రానున్నాయని నిక్కో గ్రూప్ చైర్మన్ రాజీవ్ కౌల్ వ్యాఖ్యానించారు. వృద్ధిని సాధిస్తూ, ఉపాధి కల్పిస్తూ, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ.. దేశాన్ని సంస్కరణల పథంలో నడిపించే దార్శనికత గల ప్రభుత్వం కోసం ప్రజలంతా ఎదురుచూశారని కౌల్ పేర్కొన్నారు. మోడీ ప్రధాని కావడం దేశానికి మేలు చేయగలదని, ఆయన ఇచ్చిన హామీల్లో కనీసం యాభై శాతం నెరవేర్చినా.. ఎంతో మేలు జరగగలదని ఆండ్రూ యూల్ సీఎండీ కల్లోల్ దత్తా అభిప్రాయపడ్డారు. హాజరైన ప్రముఖులు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా..కుమారులు, ఆయన సోదరుడు..అడాగ్ అధినేత అనిల్ అంబానీ, ఆయన కుటుంబం, తల్లి కోకిలాబెన్ అంబానీ హాజరయ్యారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఆయన సతీమణి వచ్చారు. అటు, హిందుజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (ఇండియా) చైర్మన్ అశోక్ హిందుజా, ఎస్సార్ అధినేత శశి రుయా, భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ .. ఆయన సోదరులు, హీరో గ్రూప్ ఎండీ పవన్ ముంజల్ తదితరులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఏవియేషన్ రంగానికి సంబంధించి జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేశ్ గోయల్, ఎయిర్ఏషియా ఇండియా సీఈవో మిట్టు చాండిల్య.. ఫైనాన్షియల్ రంగం నుంచి యస్ బ్యాంక్ చీఫ్ రాణా కపూర్, ఐటీ రంగం తరఫున నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్.. హాజరైన వారిలో ఉన్నారు. కాగా, కొందరు దిగ్గజాలు విదేశీ పర్యటనల్లో ఉన్నందువల్ల హాజరుకాలేదు. ఇందులో టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఎంఅండ్ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్రా, యూబీ గ్రూప్ చీఫ్ విజయ్ మాల్యా తదితరులు ఉన్నారు. -
ప్చ్.. వ్యాపారంపై నమ్మకం పోతోంది
న్యూఢిల్లీ: భారత కార్పొరేట్లలో వ్యాపరంపై నమ్మకం అంతకంతకూ దిగజారుతోంది. కంపెనీల వ్యాపార విశ్వాసం 17 క్వార్టర్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని ఫిక్కీ తాజా సర్వే పేర్కొంది. ఈ ఏడాది జూలై, ఆగస్టుల్లో ఫిక్కి ఈ సర్వే నిర్వహించింది. డిమాండ్ బలహీనంగా ఉండడం, రుణ లభ్యత దుర్లభం కావడం, అధిక వడ్డీరేట్లు.... ఫలితంగా వృద్ధి ప్రభావితం కావడం వంటి అంశాల కారణంగా వ్యాపార విశ్వాసం క్షీణించిందంటున్న ఫిక్కీ బిజినెస్ కాన్ఫిడెన్స్ సర్వే పేర్కొన్న ఇతర ముఖ్యాంశాలు..., వ్యాపార విశ్వాసం క్షీణించడం ఇది వరుసగా నాలుగో క్వార్టర్. ఓవరాల్ బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 49 పాయింట్లకు పడిపోయింది. సమీప భవిష్యత్తులో కూడా మంచి పనితీరు కనబరుస్తామన్న ఆశాభావాన్ని చాలా కంపెనీలు వ్యక్తం చేయలేకపోయాయి. వడ్డీరేట్లు అధికంగా ఉన్నాయన్న కంపెనీలు 72 %. రుణాలు లభించడం దుర్లభంగా ఉందని 38 శాతం కంపెనీలు ఆవేదన వ్యక్తం చేశాయి. జీఎస్టీ అమలు, మౌలిక ప్రాజెక్టులకు ఊపు, వడ్డీరేట్ల తగ్గింపు, నిబంధనల సరళీకరణ వంటి చర్యలు తీసుకోవాలి. కొత్త ఉద్యోగాలిచ్చే స్థితిలో లేమని 67 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. అమ్మకాలు, ఎగుమతులు, లాభాలు పరిస్థితి ఏమంత ఆశావహంగా లేదు. మరో ఆర్నెల్ల వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. రూపాయి పతనం కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని, ఫలితంగా లాభదాయకత తగ్గుతోందని కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి.