జీఎస్టీ ఫైనల్ పన్నురేట్లు ఇవే!
జీఎస్టీ ఫైనల్ పన్నురేట్లు ఇవే!
Published Thu, Nov 3 2016 6:52 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
న్యూఢిల్లీ: నాలుగు రకాల శ్లాబులతో పన్నురేట్లను ఖరారుచేస్తూ జీఎస్టీ మండలి గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రేట్లు 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం తదితర నాలుగు శ్లాబులుగా ఉండనుంది. ఇందులో నిత్యావసర వస్తువులకు కనీస పన్ను విధించనుండగా, విలాసవంతమైన వస్తువులు, ఇతరత్రా వస్తువులకు గరిష్ఠామొత్తం పన్నురేటు వర్తించ నుంది.
ఇక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ఉద్దేశంతో ఆహార పదార్థాలు వంటి నిత్యావసర వస్తువులకు సున్నాశాతం పన్ను వర్తింపజేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం సామాన్య వినియోగదారులు తమ ఆదాయంలో సగం మొత్తానికి ఆహార పదార్థాలకే ఖర్చుచేస్తున్న సంగతి తెలిసిందే. సహజంగా అందరూ వాడే నిత్యావసర వస్తువులకు 5శాతం పన్ను విధించనుండగా, మిగతా వస్తువులకు జీఎస్టీ ప్రామాణిక రేటు 12శాతం, 18శాతంగా ఉండనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ విధానాన్ని అమలుచేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సభ్యులుగా ఉన్న సర్వోన్నతమైన జీఎస్టీ మండలి గురువారం సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ జీఎస్టీ పన్నురేట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్‌తో కలిపి 30-31శాతంగా పన్ను విధిస్తున్న వస్తువులకు జీఎస్టీ రాకతో గరిష్టశ్లాబు (28శాతం)ను వర్తింపజేస్తామని ఆయన చెప్పారు.
Advertisement