జీఎస్టీ పన్ను రేట్లకు ఆమోదం
5, 12, 18, 28 శాతం వసూలుకు నిర్ణయం
- వినియోగదారుడి ధరల సూచీలో 50 శాతం వస్తువులపై పన్ను నిల్
- నిత్యావసర వస్తువులపై 5 శాతం పన్ను.. ప్రామాణిక రేట్లుగా 12, 18 శాతాలు
- లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై అదనంగా సెస్సు వసూలు, 40-65% పన్ను
- ఏ వస్తువులపై ఎంతో త్వరలో వెల్లడిస్తాం: అరుణ్ జైట్లీ
జీఎస్టీ అమలైతే..
0% వినియోగదారుడి ధరల సూచీలో 50 శాతం వస్తువులు
ఆహార ధాన్యాలు, పాలు,కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికె న్, మటన్ వంటివి
5% రోజూ వినియోగించే వస్తువులు
మసాలా దినుసులు, వంట సామగ్రి వస్తువులు వంటివి
12, 18%
ఎక్కువ శాతం వస్తువులు ఈ రెండు శ్లాబ్‌ల కిందకే వస్తాయి.
వాషింగ్ మెషీన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ (సబ్బులు, షాంపూలు, టూత్ పేస్టులు), స్టీల్, సిమెంట్
28% లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, కూల్ డ్రింక్స్ (సెస్సులు విధిస్తే 40-65 శాతం వరకూ పన్ను వసూలు చేయవచ్చు)
ప్రస్తుతం 30-31% పన్ను వసూలు చేస్తోన్న వాటిపై అత్యధిక రేటు (28%) అమలు చేస్తాం. ఈ విభాగంలో అధిక శాతం వస్తువుల్ని ఎక్కువ మంది వాడుతున్నారు. అందుకే వీటిలో కొన్ని వస్తువులకు 18% వసూలు చేస్తాం. - అరుణ్ జైట్లీ
బంగారంపై ఇంకా పన్ను రేటు నిర్ధారించలేదు.
న్యూఢిల్లీ: ఎట్టకేలకు జీఎస్టీ పన్ను రేటుపై సందిగ్ధానికి తెరపడింది. నాలుగు శ్లాబులుగా 5, 12, 18, 28 శాతం పన్ను రేట్లు వసూలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ గురువారం నిర్ణయించింది. ఎక్కువ శాతం వస్తువులు తక్కువ పన్ను పరిధిలోకి తీసుకురావడం... ఆవశ్యక వస్తువులపై(ఆహార ధాన్యాలు వంటివి) ఎలాంటి పన్ను విధించకూడదన్న ప్రతిపాదనల్ని భేటీలో ఏకగ్రీవంగా అంగీకరించారు. భేటీలో నిర్ణయించిన ప్రకారం నిత్యావ సర వస్తువులపై తక్కువ పన్ను రేటు... విలాస వస్తువులు, ఆరోగ్యానికి హాని చేసే పొగాకు, పాన్ మసాలపై అధిక రేటు వసూలు చేస్తారు. అలాగే వాటిపై అదనపు సెస్సు విధిస్తారు.
రెండ్రోజుల పాటు నిర్వహిస్తోన్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మొదటి రోజు పన్ను రేట్లపై ఏకాభిప్రాయం కుదిరింది. పేదల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ద్రవ్యోల్బణం అదుపులోకి ఉంచేందుకు వినియోగ ధరల సూచీ (సీపీఐ)లోని సగం పైగా వస్తువులపై పన్ను విధించరు. మొత్తం నాలుగు శ్లాబులుగా జీఎస్టీ రేట్లను పేర్కొన్నా... ప్రామాణిక పన్ను రేట్లుగా 12, 18 శాతాల్ని వసూలు చేస్తారు. బంగారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
28% కేటగిరిలో ఉన్నా 18% వసూలు
సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ... ‘ప్రస్తుతం 30-31 శాతం పన్ను వసూలు చేస్తోన్న వాటిపై అత్యధిక రేటు (28 శాతం) అమలు చేస్తాం. అయితే కొన్ని అదనపు నిబంధనలు కూడా చేరుస్తున్నాం. ఈ విభాగంలో అధిక శాతం వస్తువుల్ని ఎక్కువ మంది వాడుతున్నారు. ఇటీవలికాలంలో ఆ వస్తువుల్ని దిగువ మధ్యతరగతి ఎక్కువగా కొంటున్నారు. వారికి 28, 30 లేదా 31 శాతం పన్ను అంటే చాలా ఎక్కువ. అందుకే కొన్ని వస్తువులకు 18 శాతం వసూలు చేస్తాం. ఏ పన్ను పరిధిలోకి ఏ వస్తువు వస్తుందనేది కమిటీ నిర్ణయిస్తుంది. ఏసీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటివి 28% కిందికి వచ్చినా 18% వసూలు చేసే అవకాశముంది. సబ్బులు, నూనె, షేవింగ్ కిట్, టూత్ పేస్టు వంటి ఉత్పత్తులు 18 శాతం పరిధిలోకి వస్తాయి’ అని చెప్పారు.
సెస్సు అవసరమే..
లగ్జరీ కార్లు, పొగాకు, శీతల పానియాలపై అదనపు సెస్సు అవసరంపై మాట్లాడుతూ... ‘ఈ సెస్సుతో పాటు బొగ్గు వినియోగంపై క్లీన్ ఎనర్జీ సెస్సుతో వచ్చే మొత్తంతో ఒక నిధి ఏర్పాటు చేస్తాం. జీఎస్టీ అమలు వల్ల మొదటి ఐదు సంవత్సరాలు ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తాం. ఐదేళ్ల అనంతరం ఈ సెస్సు రద్దవుతుంది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయం చెల్లించేందుకు మొదటి సంవత్సరం రూ. 50 వేల కోట్లు అవసరం. ఈ డబ్బును పన్ను రూపంలో వసూలు చేయాలంటే మనకు రూ. 1,72,000 కోట్లు కావాలి. రాష్ట్రాలకు పరిహారంపై ప్రతి ఏడాది సమావేశమై సమీక్షిస్తాం’ అని జైట్లీ వెల్లడించారు. ముఖ్య ఆర్థిక సలహదారు అర్వింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ... జీఎస్టీ పన్ను విధానం తప్పకుండా ద్రవ్యోల్బణం తగ్గేందుకు సాయపడుతుందన్నారు. నిత్యావసర వస్తువులపై 5 శాతం పన్ను వల్ల ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని చెప్పారు.
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
సీజీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాలు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందుతాయని... జీఎస్టీ 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు. జీఎస్టీ రేట్లపై అంగీకారం రావడం శుభ పరిణామమంటూ నీతి ఆ యోగ్ వైస్ చైర్మన్ పనగారియా చెప్పారు.