GST rates
-
Group of ministers: జీఎస్టీ రేట్లలో సెస్సు విలీనం!
న్యూఢిల్లీ: జీఎస్టీ కాంపెన్సేషన్ (పరిహారం) సెస్సును జీఎస్టీ రేట్లలో విలీనం చేసే ప్రతిపాదనపై మంత్రుల బృందం (జీవోఎం) చర్చించింది. జీఎస్టీ ఆరంభంలో రాష్ట్రాలు కోల్పోయే పన్నును భర్తీ చేసేందుకు వీలుగా సెస్సును ప్రవేశపెట్టడం తెలిసిందే. ఒక్కసారి విలీనంపై నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ సెస్సు నుంచి మళ్లే క్రమంలో మరే వస్తువును లగ్జరీ లేదా సిన్ విభాగం కిందకు చేర్చకూడదని రాష్ట్రాలు సూచించాయి. 2026 మార్చిలో కాంపెన్సేషన్ సెస్సు ముగిసిన అనంతరం దాన్ని జీఎస్టీ రేట్లలో కలిపేయాలని.. అప్పటి వరకు ఏ వస్తువులకు సెస్సు అమలు చేశారో వాటికి సంబంధించి ప్రత్యేక రేటును జీఎస్టీలో ప్రవేశపెట్టాలన్నది రాష్ట్రాల అభిప్రాయంగా ఉంది. ‘‘జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సు ముగింపునకు వస్తోంది. దీని భవిష్యత్ ఏంటన్న దానిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రం తమ అభిప్రాయాలను తెలియజేసింది. ఇందుకు సంబంధించి ఇది తొలి సమావేశం’’అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. మంత్రుల బృందానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. సెస్సును కొనసాగించాలా లేదంటే దాన్ని పన్ను కిందకు మార్చాలా? లగ్జరీ విభాగంలో మార్పులు చేయాలా? అన్న దానిపై చర్చలు కొనసాగుతున్నట్టు చెప్పారు. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సుపై నవంబర్ రెండో వారంలో జీవోఎం మరోసారి సమావేశమై చర్చించనుంది. అసోం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల మంత్రులు జీవోఎంలో సభ్యులుగా ఉన్నారు. -
GST Council: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో వారి అభిప్రాయాలను తీసుకోవడానికి బడ్జెట్‌కు ముందు సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత నేడు జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) కౌన్సిల్ 53వ సమావేశం జరిగింది. ఇందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.చదువుకునే వారు కాలేజీలో కాకుండా.. బయట హాస్టల్ వసతి పొందుతున్నప్పుడు నెలకు 20వేల రూపాయలు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పాలకమండలి సిఫార్సు చేసింది. అయితే విద్యార్ధి తప్పనిసరిగా 90 రోజులు హాస్టల్లో ఉండాలి. ఈ ప్రయోజాన్ని హోటళ్లు ఉపయోగించకుండా ఉండటానికి ప్రవేశపెట్టారు.#WATCH | On the 53rd GST Council Meeting, Union Finance Minister Nirmala Sitharaman says "Council recommended to prescribe 12% GST on all solar cookers whether it has single or dual energy source. Services provided by Indian Railways to the common man, sale of platform tickets,… pic.twitter.com/pJGBydgVz5— ANI (@ANI) June 22, 2024ప్రయాణికులకు రైల్వే అందించే పలు సర్వీసుల్లో కూడా జీఎస్టీ మినహాయిపు ఉంటుంది. ఇందులో రైల్వే ఫ్లాట్‌ఫామ్ టికెట్స్, ప్రయాణికులు ఉండటానికి కేటాయించిన గదులు, లగేజీ సర్వీసులకు, బ్యాటరీతో నడిచే వాహనాలు, ఇంట్రా-రైల్వే వంటి సేవలపై కూడా జీఎస్టీ మినహాయింపు ఉంటుంది.అన్ని రకాల పాల క్యాన్లపైన, కార్టన్ బాక్సులపైన జీఎస్టీ 12 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కార్టన్ బాక్సులపై జీఎస్టీ తగ్గింపు యాపిల్, ఇతర పండ్ల వ్యాపారాలకు మేలు చేస్తుంది. వీటితో పాటు అంతే కాకుండా అన్నిరకాల స్ప్రింకర్లను 12 శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. అన్నిరకాల సోలార్ కుక్కర్ల మీద 12 శాతం జీఎస్టీ విధించారు.నిర్దిష్ట సంస్కరణలు చేపట్టేందుకు రాష్ట్రాలకు కేంద్రం 50 ఏళ్ల వడ్డీ లేని రుణం ఇచ్చే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్మల సీతారామన్ రాష్ట్రాలను కోరారు. ఈ మొత్తాన్ని విద్య, వైద్య, నీటి పారుదల, మంచి నీటి సరఫరా వంటి వాటికి ఉపయోగిపొంచుకోవచ్చు. రాష్ట్రాల మూల ధన వ్యయాలను పెంచాలనే ఉద్దేశ్యంతో 2020-21లో ఈ పథకాన్ని మొదటిసారి ప్రవేశపెట్టారు.ఇంధనాన్ని (పెట్రోల్ & డీజిల్) జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం గురించి అడిగినప్పుడు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీసుకొచ్చిన జీఎస్టీ ఉద్దేశం పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చడమే. రాష్ట్రాలే దీనిపైనా ఒక నిర్ణయానికి వస్తే.. జిఎస్టిలో పెట్రోల్ మరియు డీజిల్‌ను చేర్చాలని మేము కోరుకుంటున్నామని అన్నారు.#WATCH | On being asked about bringing fuel under GST, Union Finance Minister Nirmala Sitharaman says "...At the moment, the intention of the GST as it was brought in by former Finance Minister Arun Jaitley is to have the petrol and diesel in GST. It is up to the states to decide… pic.twitter.com/SoKpm3hlbI— ANI (@ANI) June 22, 2024 -
పెరుగు, లస్సీపై జీఎస్టీ విషయంలో వెనక్కి తగ్గిన కేంద్రం
-
బీమా రంగం.. 80సీ పరిమితి పెంచాలి
న్యూఢిల్లీ: బీమా పథకాలను మరింత మందికి చేరువ చేయడానికి వీలుగా పరిశ్రమ కీలకమైన సూచనలను కేంద్రానికి తెలియజేసింది. సెక్షన్ 80సీ కింద బీమా ప్రీమియంకు ప్రత్యేకంగా రూ.లక్ష పరిమితిని ఏర్పాటు చేయాలని కోరింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై జీఎస్టీ రేటు ప్రస్తుతం 18 శాతంగా అమలవుతోందని, ఇవి మరింత అందుబాటు ధరలకు దిగిరావడానికి 5 శాతం శ్లాబులోకి మార్చాలని పరిశ్రమ డిమాండ్ చేసింది. 2022–23 బడ్జెట్లో ఇందుకు సంబంధించి ప్రతిపాదనలకు చోటు కల్పించాలని కోరింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. ప్రజలను ప్రోత్సహించేందుకు సెక్షన్ 80సీ కింద అదనంగా రూ.లక్ష పన్ను మినహాయింపు పరిమితిని బీమా ప్రీమియం చెల్లింపులకు కల్పించాలని పరిశ్రమ ఎప్పటి నుంచో కోరుతోందని కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ సీఎఫ్‌వో తరుణ్ రస్తోగి తెలిపారు. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు పన్ను మినహాయింపు కోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నట్టు ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీ సుబ్రజిత్ ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. అప్పుడు కస్టమర్ల డబ్బులు దీర్ఘకాల సాధనాల్లోకి వెళతాయన్నారు. ప్రత్యేక ప్రోత్సాహకం ‘‘సెక్షన్ 80సీ ఇప్పుడు ఎన్నో సాధనాలతో కలసి ఉంది. పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్ఎస్సీ అన్నీ ఇందులోనే ఉన్నాయి. కనీసం టర్మ్ పాలసీలకు అయినా ప్రత్యేక సెక్షన్ పేరుతో మినహాయింపు కల్పించాలి. అది దేశ ప్రజలకు బీమా రక్షణ పరంగా ఉన్న అంతరాన్ని కొంత పూడ్చడానికి సాయపడుతుంది’’ అని ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ సహానే చెప్పారు. ‘‘జీవిత బీమా అన్నది సామాజిక భద్రత కల్పించే సాధనం. కనుక సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మినహాయింపును పెంచాలి’’అని ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రొడక్ట్స్ హెడ్ చిన్మయ్ బదే పేర్కొన్నారు. 2020–21 సంవత్సరానికి సంబంధించి బీమా రంగం నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నివేదిక ప్రకారం జీడీపీలో బీమా వ్యాప్తి రేటు 4.2 శాతంగా ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ సగటు 7.4 శాతంగా ఉండడం గమనార్హం. 2021 మార్చి నాటికి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ విస్తరణ రేటు 1 శాతంగానే ఉంది. ఇది కూడా నిత్యావసరమే.. కరోనా మహమ్మారి కల్పించిన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఏర్పడినట్టు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రూపమ్ ఆస్తానా తెలిపారు. ‘‘హెల్త్ ప్లాన్లపై జీఎస్టీ రేటును గణనీయంగా తగ్గించడాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. దీంతో హెల్త్ ప్లాన్లను, అదనపు రైడర్లను తీసుకునే దిశగా ప్రజలను ప్రోత్సహించినట్టు అవుతుంది’’అని ఆస్తానా చెప్పారు. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘెల్ స్పందిస్తూ.. బీమా ప్లాన్ కొనుగోలులో ప్రీమియం ముఖ్య పాత్ర పోషిస్తుందని, తగినంత కవరేజీని ఎంపిక చేసుకుంటే దానిపై 18 శాతం జీఎస్టీ రేటు వల్ల భారం పెరిగిపోతున్నట్టు తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్‌ను నిత్యావసర వస్తువు మాదిరిగా పరిగణించాలని ఎడెల్వీజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ, సీఈవో స్నానయ్ ఘోష్ కోరారు. అధిక వైద్య ఖర్చుల నేపథ్యంలో సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ.50,000కు పెంచాలని నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో, ఎండీ కృష్ణన్ రామచంద్రన్ సూచించారు. -
జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్న నేతన్నలు
-
చేనేతకు ఊరట.. జీ ఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా
-
మూడంచెల జీఎస్టీ అవశ్యం: పీహెచ్‌డీసీసీఐ
న్యూఢిల్లీ: దేశంలో మూడంచెల వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని అమలు చేయాలని ఇండస్ట్రీ చాంబర్– పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ ఉద్ఘాటించారు. అలాగే అత్యధిక శ్లాబ్ 18 శాతానికి పరిమితం చేయాలని కూడా కూడా సూచించారు. 2017 జూలై నుంచీ అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రస్తుతం ప్రధానంగా ఐదు రేట్ల వ్యవస్థతో (0.25 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం) అమలు జరుగుతున్న సంగతి తెలసిందే. జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ ప్రభుత్వ అజెండాలో ప్రధానమైనదని, మూడు రేట్ల వ్యవస్థకు మార్చడం కీలకాంశమని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ ఇటీవలే పేర్కొన్నారు. పన్ను రేట్ల హేతుబద్దీకరణ వల్ల వినియోగం, పన్ను ఆదాయాలు పెరుగుతాయని, క్లిష్టతలు తగ్గుతాయని, పన్ను ఎగవేతల సమస్యను పరిష్కరించవచ్చని సంజయ్ అగర్వాత్ తాజాగా పేర్కొన్నారు. ఎకానమీ రికవరీ.. ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ప్రతికూలతలకు గురయిన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వేగంగా పురోగమిస్తోందని అగర్వాల్ పేర్కొన్నారు. స్థానికంగా విధించిన లాక్డౌన్లు, ఆంక్షలను రాష్ట్రాలు తొలగించడం, ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దీనికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. ఎకానమీలో డిమాండ్ పెంచడానికి గృహ వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద పట్టణ, గ్రామీణ పేదలకు సాధ్యమైనంత అధికంగా ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపులు అవసరమని ఆయన సూచించారు. ప్రయోజనాలు పక్కదారిపట్టకుండా ఈ విధానం రక్షణ కల్పిస్తుందన్నారు. -
పెరిగిన ఐఫోన్ ధరలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీ ఆపిల్ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెరగడమే ఈ ధరల సవరణకు కారణం. సవరించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. 64 జీబీ ఐఫోన్ 11 ధర రూ.64,900 నుంచి రూ.68,300లకు చేరింది. 64 జీబీ ఎక్స్ఆర్ మోడల్ రూ.2,600 అధికమై రూ.52,500లకు ఎగసింది. 64 జీబీ 11 ప్రో ధర రూ.1,06,600లుగా ఉంది. అంతక్రితం ఈ మోడల్ ధర రూ.1,01,200 ఉండేది. 64 జీబీ 11 ప్రో మ్యాక్స్ రూ.1,11,200 నుంచి రూ.1,17,100కు చేరింది. 32 జీబీ ఐఫోన్ 7 రూ.1,600 పెరిగి రూ.31,500లుగా ఉంది. రియల్మీ కూడా... స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ రియల్మీ తన ఉత్పత్తుల ధరను పెంచింది. జీఎస్టీ పెంపు, రూపాయి పతనం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. పాత, కొత్త మోడళ్లపై ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. 2018 తర్వాత ఇలా ధరలను పెంచడం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. కోవిడ్–19 ప్రభావం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమపై తీవ్రంగా పడిందని తెలిపింది. దీంతో సరఫరా కొరతతోపాటు విడిభాగాల ధర అధికమైందని వివరించింది. అటు రూపాయి పతనం కూడా మొబైల్ ధర పెరిగేందుకు కారణమైందని తెలిపింది. జీఎస్టీ పెంపుతో కస్టమర్లపై రూ.15,000 కోట్ల భారం పడుతుందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. -
ఆ వస్తువులు, సేవలు మరింత ప్రియం..
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ రాబడులను పెంచడం, దీటైన పన్ను వ్యవస్థగా మలచడం కోసం ఏర్పాటైన అధికారుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. విలాసవంతమైన వస్తువులపై అధిక పన్ను విధించాలని, జీఎస్టీలో ప్రస్తుతమున్న5 శాతం, 12, 18, 28 శాతం శ్లాబ్‌ల స్ధానంలో కొత్తగా 10 శాతం, 20 శాతంతో రెండు శ్లాబులనే తీసుకురావాలని సిఫార్సు చేసింది. కాస్మెటిక్స్, గ్యాంబ్లింగ్, రిక్రియేషనల్ సేవల వంటి వాటిపై సెస్ విధింపు, పాఠశాల విద్య, అత్యున్నత వైద్య సేవలు, ఏసీ ప్రజా రవాణాలకు ఇచ్చే మినహాయింపులను ఉపసంహరించాలని సూచించింది. జీఎస్టీ కౌన్సిల్‌కు గత వారం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో అధికారుల కమిటీ ఈ మార్పులను సూచించింది. ఇక లగ్జరీ వస్తువులపై ఎంత శాతం పన్ను విధిస్తారనే దానిపై కమిటీ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతమున్న 28 శాతం శ్లాబ్‌ను వీటికి వర్తింపచేయబోరని సమాచారం. సెస్రేట్లను పెంచాలని సైతం ఈ కమిటీ సూచించింది. తాము చేసిన సూచనలపై చర్చించి జీఎస్టీ కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ వ్యవస్థను సమర్ధంగా రూపొందేలా కమిటీ పలు సూచనలు చేసిందని, జీఎస్టీ లొసుగులతో ఏటా రూ 20,000 కోట్లకు పైగా వాటిల్లుతున్న నష్టాలను అధిగమించేలా దీటైన సిఫార్సులు చేసిందని అధికారులు తెలిపారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మందగమనంతో వినిమయం తగ్గడం వల్లే పన్ను రాబడులు గణనీయంగా తగ్గాయని జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు, జీఎస్టీ అధికారులు కొందరు చెబుతున్నారు. సెస్ ఫండ్ చాలినంత లేకపోవడంతో అక్టోబర్, నవంబర్‌లకు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారాన్ని కేంద్రం చెల్లించలేదని సమాచారం. -
జీఎస్టీలో మార్పులు ఉండకపోవచ్చు: సుశీల్
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం కారణంగా ఇప్పట్లో జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు ఉండకపోవచ్చని ఇంటిగ్రేటెడ్ గూడ్స్, సర్వీస్ ట్యాక్స్(ఐజీఎస్టీ) కన్వీనర్ సుశీల్ కుమార్ మోదీ శనివారం అన్నారు. కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు జీఎస్టీ పెంచడం సరైన నిర్ణయం కాదన్నారు. ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పుడు, జీఎస్టీ తగ్గించకపోతే.. పెంచడానికి కూడా అవకాశం ఉండదన్నారు. శనివారం ఆయన ‘భారత్: 5 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు పయనం’ అన్న అంశంపై ఎఫ్ఐసీసీఐ 92వ వార్షిక సమావేశంలో మాట్లాడారు. పన్ను రేట్లు పెంచడానికి ఏ రాష్ట్రమూ సిద్ధంగా లేదని చెప్పారు. -
షోకాజు నోటీసును పరిశీలిస్తున్నాం: నెస్లే
ముంబై: జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని నెస్లే ఇండియా వినియోగదారులకు వెంటనే బదిలీ చేయకుండా అక్రమంగా లాభాలను ఆర్జించిందంటూ లాభాపేక్ష నిరోధక విభాగం (ఎన్ఏఏ) జారీ చేసిన షోకాజు నోటీసును పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రకటించింది. రేట్ల తగ్గింపును వినియోగదారులకు బదిలీ చేయకుండా ప్రయోజనం పొందినందుకు రూ.90 కోట్లు చెల్లించాలని ఎన్ఏఏ ఈ నెల 12న జారీ చేసిన షోకాజు నోటీసులో నెస్లే ఇండియాను ఆదేశించడం గమనార్హం. గ్రాముల్లో చేసిన మార్పులకు సంబంధించిన ఆధారాలను సమర్పించినా గానీ ఈ ఆదేశాలు జారీ చేయడం ఎంతో దురదృష్టకరమని నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ బుధవారం సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ వార్తా సంస్థతో చెప్పారు. షోకాజు నోటీసును పరిశీలించాక అవసరమైతే తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేవారు. ‘‘రూ.2, రూ.5 ఉత్పత్తిపై జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం రూ.0.45, 0.55 పైసల చొప్పున బదిలీ చేయాలి. కాకపోతే కాయిన్లు అందుబాటులో లేవు. మరి ఈ ప్రయోజనాలను ఎలా బదిలీ చేస్తాం? అందుకే ఈ మేర గ్రాములను (బరువును) పెంచడం ద్వారా ప్రయోజనాన్ని బదిలీ చేశాం. అయినా ఈ ఆదేశాలు వెలువడ్డాయి’’ అని ఈ కేసు గురించి నారాయణన్ వివరించారు. -
10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమలో మందగమనం మరింత కాలం కొనసాగితే 10 లక్షల పైచిలుకు ఉద్యోగాలకు కోత పడే ముప్పు పొంచి ఉందని ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను పెంచే దిశగా జీఎస్టీ రేటు తగ్గింపు తదితర చర్యలతో ఆటోమొబైల్ రంగం కోలుకునేందుకు తోడ్పాటు అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గత పది నెలలుగా అమ్మకాలు క్షీణిస్తూనే ఉండటంతో ఆటోమొబైల్ పరిశ్రమ సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోందని పేర్కొంది. ‘గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని విభాగాల వాహనాల విక్రయాలు చాలా నెలలుగా పడిపోతున్నాయి. దీంతో పరికరాల తయారీ విభాగంపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. వాహనాల రంగంపైనే పరికరాల తయారీ విభాగం కూడా ఆధారపడి ఉంటుంది. వాహనాల తయారీ 15–20 శాతం పడిపోవడంతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సిబ్బందిని తొలగించక తప్పదు. కనీసం 10 లక్షల మంది పైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని అంచనా‘ అని ఏసీఎంఏ అధ్యక్షుడు రామ్ వెంకటరమణి పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్వాసనలు మొదలయ్యాయని చెప్పారు. పరికరాల తయారీ రంగంలో దాదాపు 70 శాతం మంది కాంట్రాక్టు వర్కర్లే ఉంటారని, డిమాండ్ లేకపోతే సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ స్థూల దేశీయోత్పత్తిలో 2.3 శాతం వాటాతో ఆటోమోటివ్ పరికరాల తయారీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ రేటు తగ్గించాలి.. డిమాండ్ లేకపోవడం, బీఎస్ సిక్స్ స్థాయి ఉద్గార ప్రమాణాల వాహనాల తయారీపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి రావడం, విద్యుత్ వాహనాల విధానంపై స్పష్టత కొరవడటం తదితర అంశాలు ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్‌కు ప్రశ్నార్థకంగా మారాయని రామ్ చెప్పారు. దీంతో భవిష్యత్ పెట్టుబడులన్నీ నిల్చిపోయాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిమాండ్‌కి ఎంతో కొంత ఊతమిచ్చేలా జీఎస్టీ రేటు తగ్గించాలని పేర్కొన్నారు. ఆటోమొబైల్, ఆటో పరికరాలన్నింటికీ ఒకే రకంగా 18 శాతం జీఎస్టీ రేటు పరిధిలోకే చేర్చాలని కోరారు. ప్రస్తుతం దాదాపు 70 శాతం ఆటో పరికరాలు 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోనే ఉన్నప్పటికీ.. మిగతా 30 శాతం మాత్రం గరిష్ట శ్లాబ్ అయిన 28 శాతం విభాగంలో ఉన్నాయి. పైగా వాహనాల పొడవు, ఇంజిన్ సామర్థ్యం తదితర అంశాలను బట్టి 28 శాతం జీఎస్టీకి అదనంగా 1–15 శాతం దాకా అదనపు సెస్సు భారం కూడా ఉంటోందని రామ్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విధానంపై కేంద్రం స్పష్టతనివ్వాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లే క్రమంలో నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాలు.. ఆటో పరిశ్రమను ఆందోళనకు గురి చేసేవిగా ఉన్నాయని ఏసీఎంఏ డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా చెప్పారు. 2018–19లో ఆటో పరికరాల వ్యాపార విభాగం 14.5 శాతం వృద్ధితో రూ. 3.95 లక్షల కోట్లుగా ఉందని తెలిపారు. చైనాకు అవకాశాలు ఇవ్వొద్దు స్వేచ్చా వాణిజ్యానికి సంబంధించిన ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సెప్)లో ఆటో పరికరాలను చేర్చకుండా ఉండటం మంచిదని మెహతా తెలిపారు. అలా చేస్తే భారత మార్కెట్లో చైనా దొడ్డిదారిన ప్రవేశించేందుకు అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. ఇప్పటికే చైనా నుంచే భారత్ అత్యధికంగా పరికరాలు దిగుమతి చేసుకుంటోందని మెహతా వివరించారు. 2018–19లో చైనా నుంచి దిగుమతులు 4.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని, మొత్తం ఆటోమోటివ్ పరికరాల దిగుమతుల్లో ఇది 27 శాతమని తెలిపారు. చైనాతో పాటు జపాన్, కొరియా వంటి దేశాలతో కూడా భారత వాణిజ్యం లోటులోనే ఉందని చెప్పారు. -
రెండేళ్ల జీఎస్టీ : సింగిల్ స్లాబ్ అసాధ్యం
సాక్షి, న్యూఢిల్లీ : ఒక దేశం ఒక పన్ను అంటూ బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తుల సేవల పన్ను (జీఎస్టీ ) రెండవ వార్షికోత్సవం సందర్భంగా మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘టూ ఇయర్స్ ఆఫ్టర్ జీఎస్టీ’ పేరుతో తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. జీఎస్టీ విధానంలో ఒక స్లాబ్ వుండటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. భారత్ లాంటి దేశాల్లో ఒకే పన్ను శ్లాబు విధానాన్ని అమలు చేయడం అసాధ్యమన్నారు. అఇయతే భవిష్యత్తులో శ్లాబుల సంఖ్య రెండుకు తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నూతన పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరవాత ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, దేశంలోని 20 రాష్ట్రాలు ఈ రెండేళ్లలో 14 శాతం అధిక రాబడి సాధించాయన్నారు జైట్లీ పేర్కొన్నారు. ఆదాయం మరింత పెరిగితే ప్రస్తుతం ఉన్న 12శాతం, 18శాతం శ్లాబులను కలిపేసే వెసులుబాటు ఉంటుందన్నారు. కాగా జూన్ మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల రూపాయల మార్క్ దిగువకు చేరాయి. -
జీఎస్టీ తగ్గింపు ఎఫెక్ట్... నేటి నుంచి ఇవన్నీ చౌక!
న్యూఢిల్లీ: జనవరి ఒకటి నుంచి 23 వస్తుసేవలపై తగ్గించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. డిసెంబర్ 22న జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో 23 రకాల వస్తు సేవలపై జీఎస్టీ శ్లాబులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తగ్గింపుతో సామాన్యుడికి అవసరమైన పలు వస్తు సేవల ఖరీదు తగ్గనుంది. పన్ను తగ్గింపుతో సినిమా టికెట్లు, టీవీలు, మానిటర్లు, పవర్‌బ్యాంకులు, నిల్వచేసిన కూరగాయలు ఇకపై చౌకగా లభిస్తాయి.పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన జాబితాలో కప్పీలు, ట్రాన్స్మిషన్ షాఫ్ట్, పునర్వినియోగ టైర్లు, లిథియం అయాన్ పవర్ బ్యాంకులు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్లు, వీడియో గేమ్ పరికరాలున్నాయి. దివ్యాంగుల ఉపకరణాలపై ప్రస్తుతం అమలవుతున్న పన్నును 28 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. సరకు రవాణా వాహనాల థర్డ్ పార్టీ బీమా ప్రీమియాన్ని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అత్యల్ప పన్ను శాతమైన 5 శాతం శ్లాబులోఊత కర్ర, ఫ్లైయాష్ ఇటుకలు, సహజ బెరడు, చలువరాళ్లను చేర్చారు. పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వం సమకూర్చే నాన్–షెడ్యూల్డ్, చార్టర్డ్ విమానాల సేవలపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. పునర్వినియోగ ఇంధన ఉపకరణాలు, వాటి తయారీపై కూడా 5 శాతం పన్ను విధించారు. శీతలీకరించిన, ప్యాక్ చేసిన కూరగాయలతో పాటు రసాయనాలతో భద్రపరచిన, తక్షణం తినడానికి సిద్ధంగా లేని కూరగాయలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. జన్‌ధన్ యోజన ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవలను కూడా పన్ను పరిధి నుంచి తప్పించారు. -
జీఎస్టీ మండలి నిర్ణయాలపై పరిశ్రమ వర్గాల హర్షం
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ 23 రకాల వస్తు, సేవలపై పన్ను రేటును తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై పారిశ్రామిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 32 అంగుళాల టీవీలు, కంప్యూటర్ మానిటర్లు, వీడియోగేమ్స్, లిథియం అయాన్ పవర్ బ్యాంకులు, రీట్రేడెడ్ టైర్లు, వీల్ చైర్లు, సినిమా టికెట్లు సహా 17 రకాల వస్తువులు, ఆరు సేవలపై పన్ను శ్లాబులను కౌన్సిల్ మార్చింది. 28 శాతం నుంచి 18 శాతానికి, కొన్ని 18 శాతం నుంచి 12, 5 శాతానికి మార్చిన విషయం గమనార్హం. ‘‘రేట్లను గణనీయంగా తగ్గించడం ద్వారా జీఎస్టీ కౌన్సిల్ ఆచరణాత్మక విధానాన్ని అనుసరించింది. ఈ నిర్ణయాలు జీఎస్టీ విధానాన్ని మరింత బలోపేతం, స్థిరపడేలా చేస్తాయి’’అని ఫిక్కీ తన ప్రకటనలో పేర్కొంది. ‘‘బలమైన వినియోగం వృద్ధిని వేగవంతం చేస్తుంది. వివిధ తరగతి ప్రజలు వినియోగించే వస్తువులపై పన్ను రేట్ల తగ్గింపుతో ఆ ర్థిక రంగానికి అవసరమైన ఊతం లభిస్తుంది’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. పరోక్ష పన్ను వసూళ్లలో స్థిరమైన వృద్ధికి తోడు అధిక జీఎస్టీ రేట్లను తగ్గించడం అనేవి... పన్ను చెల్లించే పరిధి పెరిగిందని, ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని తెలుస్తోందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. -
మరిన్ని ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు
న్యూఢిల్లీ : అధిక పన్ను రేట్లతో సతమవుతున్న సామాన్యులకు జీఎస్టీ కౌన్సిల్ ఉపశమనమిస్తూ వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్, మరికొన్ని ఉత్పత్తులపై కూడా పన్ను రేట్లను తగ్గించబోతుందట. ఒకవేళ రెవెన్యూలు పెరిగితే, మరిన్ని ఉత్పత్తులపై కూడా జీఎస్టీ రేట్ల కోత ఉంటుందని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జీఎస్టీ చట్టాల గురించి లోక్‌సభలో మాట్లాడిన పీయూష్ గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు. పీయూష్ గోయల్ ప్రసంగానికి విపక్షాలు పలుమార్లు అడ్డుపడినప్పటికీ, మంత్రి తన స్పీచ్‌ను కొనసాగించారు. ‘గత సమావేశాల్లో చాలా ఉత్పత్తులు, సర్వీసులపై జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లను తగ్గించింది. ఈ పరోక్ష పన్ను విధానం ద్వారా వినియోగదారులపై ఉన్న పన్ను భారాన్ని కాస్త తగ్గించాలనుకుంటున్నాం. గత ఏడాదిగా జీఎస్టీ కౌన్సిల్ 384 ఉత్పత్తులు, 68 సర్వీసులపై పన్ను రేట్లను తగ్గించింది. 186 ఉత్పత్తులు, 99 సర్వీసులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చింది. శానిటరీ ప్యాడ్స్ కూడా జీఎస్టీ మినహాయింపు పొందిన ఉత్పత్తుల్లో ఉన్నాయి’ అని పీయూష్ గోయల్ తెలిపారు. దేశీయ ఆర్థిక లోటుకు అనుగుణంగా జీఎస్టీని సేకరిస్తున్నామని చెప్పారు. అంచనావేసిన దానికంటే భారత వృద్ధి మెరుగ్గానే ఉందని ఆయన పేర్కొన్నారు. ఐఎంఎఫ్ విడుదల చేసిన రిపోర్టులో కూడా 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7.5 శాతంగా ఉంటుందని అంచనావేసింది. తన ప్రసంగం సమయంలో కాంగ్రెస్ చేసిన నిరసనలపై స్పందించిన పీయూష్ గోయల్, ‘మీ పార్టీని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. సభను నిర్వహించకుండా కాంగ్రెస్ నేతలు అంతరాయం సృష్టిస్తూనే ఉన్నారు. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ నేతలు అంత సీరియస్‌గా లేరని తెలుస్తోంది. మీరు విఫలమైన వాటిని మోదీ పూరించారు. తర్వాత సాధారణ ఎన్నికల్లో మీకు 4 సీట్లు కూడా రావంటూ’ మండిపడ్డారు. అయితే జీఎస్టీ ఎలా అమలు చేయాలో కేంద్ర ప్రభుత్వానికి తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు. జీఎస్టీ అమలు సరిగ్గా లేకపోవడంతో, తమిళనాడులో 50వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శించారు. -
జీఎస్టీ రేట్ల కోత : ఈ-కామర్స్ దిగ్గజాలకు ఝలక్
న్యూఢిల్లీ : పలు ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గించి శనివారం జీఎస్టీ కౌన్సిల్ గుడ్‌న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ రేట్ల కోత చేపట్టిన జీఎస్టీ కౌన్సిల్ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి కంపెనీలకు ఝలకిచ్చింది. ఉత్పత్తులపై తగ్గించిన పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు జీఎస్టీ అథారిటీలు ఆడిట్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎకానమిక్ టైమ్స్ రిపోర్టు ప్రకారం, ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలపై ఆడిట్ చేపట్టాలని నేషనల్ యాంటీ-ప్రాఫిటరింగ్ అథారిటీ, డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. గతేడాది నవంబర్లోనే జీఎస్టీ కౌన్సిల్, 178 ఉత్పత్తులపై పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అదే నెలలో ప్రభుత్వం నేషనల్ యాంటీ-ప్రాఫిటరింగ్ అథారిటీని ఏర్పాటు చేసింది. జీఎస్టీలో తగ్గిన పన్ను ప్రయోజనాలను పర్యవేక్షించేందుకు కేంద్రం దీన్ని ఏర్పాటు చేసింది. వినియోగదారుల నుంచి పన్ను రేట్లకు విరుద్ధంగా వ్యాపారులు వసూలు చేసినా.. పన్ను తగ్గిన తర్వాత ధరలు తగ్గించకపోయినా ఈ సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదుల్లో మెరిట్ ఉంటే, వాటిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేఫ్‌గార్డ్స్‌కు తదుపరి విచారణకు పంపిస్తోంది. డైరెక్టర్ జనరల్ సేఫ్‌గార్డ్స్ మూడు నెలలో విచారణను పూర్తి చేస్తుంది. ఆ తర్వాత యాంటీ-ఫ్రాపిటరింగ్ అథారిటీకి రిపోర్టును పంపిస్తుంది. ఒకవేళ కంపెనీ జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందజేయడం లేదని అథారిటీ గుర్తించి.. లబ్దిదారుడు ఎవరో తెలియని పక్షంలో, ఈ మొత్తాన్ని కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్‌కు బదిలీ చేయాలని ఆదేశిస్తుంది. తక్కువ పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకపోతే, సంస్థ లేదా వ్యాపార రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం కూడా అథారిటీకి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు స్టాండింగ్ కమిటీ ముందుకు మొత్తం 354 ఫిర్యాదులు వచ్చాయి. తమకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను లేదా పన్ను కోత ప్రయోజనాలను అందజేయడం లేదని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. -
కస్టమర్లకు ఫెస్టివల్ చీర్ : వాటిపై ధరల తగ్గింపు
న్యూఢిల్లీ : పండుగ సీజన్‌కు ముందు కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బొనాంజ అందించిన సంగతి తెలిసిందే. పలు వైట్ గూడ్స్ ఉత్పత్తులపై పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించేసింది. దీంతో గృహోపకరణాల ధరలు 8 శాతం నుంచి 10 శాతం తగ్గబోతున్నాయి. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, మిక్స్డ్ గ్రైండర్లు, వాషింగ్ మిషన్ల ధరలు 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించింది. చాలా లగ్జరీ ఉత్పత్తులను దేశీయ గృహ అవసర కేటగిరీ వస్తువులుగా తీసుకొచ్చింది. ఈ ప్రయోజనాలను ప్రస్తుతం కంపెనీలు కస్టమర్లకు బదిలీ చేయాలని నిర్ణయించాయి. జూలై 28 నుంచి వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలను 7 శాతం నుంచి 8 శాతం మధ్యలో తగ్గిస్తున్నట్టు గోద్రేజ్ అప్లియెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ కమల్ నంది చెప్పారు. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. మంచి రుతుపవనాలతో, డిమాండ్ కూడా పెరుగుతుందని తెలిపారు. జూలై 27 నుంచి తగ్గిన జీఎస్టీ రేట్లు అమలు కాబోతున్నాయి. అయితే జీఎస్టీ రేట్లకు అనుగుణంగా అన్నింటిపై ఒకే విధంగా ధరలు తగ్గించకుండా.. గ్లోబల్ ధరలు పెరగడంతో మెటరీయల్ ఖర్చులు ఎగియడం, రూపాయి క్షీణించడం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని.. గృహోపకరణాలపై తగ్గింపు చేపడతామని కంపెనీ తెలిపాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, మిక్సర్ గ్రైండర్లు, ఇతర చిన్న చిన్న ఉపకరణాలను రెగ్యులర్ గా వాడుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రస్తుతం ప్రతి ఇంటికి ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయాయి. కాగ, వైట్ గూడ్స్‌పై అంతకముందు 28 శాతం జీఎస్టీ విధించడంతో, వీటి ఎంఆర్పీ ధరలన్నీ అప్పట్లో 10 శాతం నుంచి 15 శాతం పెరిగాయి. త్వరలోనే దివాళి, క్రిస్టమస్ పండుగలు ఉండటంతో, కన్జ్యూమర్ డ్యూరబుల్ సంస్థలకు ఇది అత్యధిక మొత్తంలో విక్రమయ్యే కాలమని ఇండస్టి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జీఎస్టీ రేట్ల తగ్గింపు ఈ పండుగ సీజన్‌కు మరింత సహకరించనుందని పేర్కొంటున్నాయి. -
జీఎస్టీ బొనాంజా..
న్యూఢిల్లీ: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి మరోసారి తీపి కబురు చెప్పింది. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు (27 అంగుళాలు, అంతకంటే చిన్నవి) సహా వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అలాగే శానిటరీ న్యాప్కిన్లపై పన్నును పూర్తిగా ఎత్తివేసి దాదాపు ఏడాది కాలంగా ఉన్న డిమాండ్‌ను నెరవేర్చింది. మొత్తం 88 రకాల వస్తువులపై పన్ను రేట్లను తగ్గించినట్లు కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. కొత్త పన్ను రేట్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. గోయల్ అధ్యక్షతన జీఎస్టీ మండలి 28వ సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. జీఎస్టీ రిటర్నులను దాఖలు చేసే విధానంలో వ్యాపారులకు జీఎస్టీ మండలి కొంత సడలింపునిచ్చింది. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలు ప్రస్తుతం ప్రతి నెలా రిటర్నులు దాఖలు చేస్తుండగా, వారు ఇకముందు మూడు నెలలకోసారి మాత్రమే రిటర్నులు సమర్పిచేలా విధానాన్ని సరళీకరించింది. పన్నులు మాత్రం ప్రతి నెలా కట్టాల్సిందే. దీనివల్ల 93 శాతం మంది వ్యాపారులు, చిన్న వాణిజ్య సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందనీ, అయితే కొత్త విధానం అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని గోయల్ చెప్పారు. కాగా, గుజరాత్ ఎన్నికలకు ముందు గతేడాది నవంబరులోనూ 178 వస్తువులపై 28 శాతంగా ఉన్న పన్ను రేటును తగ్గించడం తెలిసిందే. ఆదాయం తగ్గడంపై చింత లేదు పన్ను రేటు తగ్గడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గడం గురించి పట్టించుకోకుండా, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని జీఎస్టీ మండలి నిర్ణయించిందని గోయల్ చెప్పారు. తాజా రేట్ల తగ్గింపుతో ప్రభుత్వానికి ఏడాదికి 8 నుంచి 10 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని అంచనా. ఈ విషయాన్ని ప్రస్తావించగా, రిటర్నుల దాఖలును సరళీకరించినందున మరింత ఎక్కువ మంది పన్నులు కడతారనీ, ఆదాయం తగ్గినా ఆ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. ‘ఈరోజు సమావేశంలో అనేక నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నాం. సరళీకరణ, హేతుబద్ధీకరణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చాం. మొత్తం 88 వస్తువులపై పన్ను రేట్లు తగ్గించాం’ అని గోయల్ చెప్పారు. కేంద్ర మంత్రి జైట్లీ ఓ ట్వీట్ చేస్తూ ఇక 28 శాతం పన్ను శ్లాబులో కొన్ని ఉత్పత్తులే మిగిలాయనీ, ఉత్పాదకత పెరగడానికి పన్ను రేట్ల తగ్గింపు దోహదపడుతుందని పేర్కొన్నారు. పన్ను ఎగవేతలను నియంత్రించేందుకు ఉద్దేశించిన ఆర్సీఎం (రివర్స్ చార్జ్ మెకానిజం) అమలును వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు వాయిదా వేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. కాంపొజిషన్ పథకం పరిమితిని రూ. 1.5 కోటికి పెంచడం సహా జీఎస్టీ చట్టంలో మొత్తం 40 సవరణలకు ఆమోదం తెలిపింది. జీఎస్టీ మండలి 29వ సమావేశం ఆగస్టు 4న జరగనుంది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రూపే, భీమ్ యాప్ ద్వారా చేసే చెల్లింపులకు ప్రోత్సాహకాలు తదితరాలను ఆ భేటీలో చర్చించనున్నారు. రేట్లు తగ్గనున్న వస్తువులు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గేవి ► వాషింగ్ మెషీన్లు ► రిఫ్రిజిరేటర్లు ► టీవీలు (27 అంగుళాలు, అంతకంటే చిన్నవి) ► విద్యుత్తు ఇస్త్రీ పెట్టెలు ► వీడియో గేమ్స్ పరికరాలు ► వ్యాక్యూమ్ క్లీనర్లు ► లారీలు, ట్రక్కుల వెనుక ఉండే కంటెయినర్లు ► జ్యూసర్ మిక్సర్లు, గ్రైండర్లు ► షేవింగ్ పరికరాలు ► హెయిర్, హ్యాండ్ డ్రయ్యర్లు ► వాటర్ కూలర్లు, స్టోరేజ్ వాటర్ హీటర్లు ► పెయింట్లు, వాల్‌పుట్టీలు, వార్నిష్లు ► లిథియం–అయాన్ బ్యాటరీలు ► పర్ఫ్యూమ్లు, టాయిలెట్ స్ప్రేలు 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గేవి ► ఇథనాల్ ► పాదరక్షలు (రూ. 500–1,000 ధరలోనివి) ► ఈ–పుస్తకాలు ► శానిటరీ న్యాప్కిన్లు (ప్రస్తుతం 12 శాతం), పోషకాలు కలిపిన పాలు (ప్రస్తుతం 18 శాతం), స్మారక నాణేలపై పన్నును పూర్తిగా ఎత్తివేశారు. ► హోటళ్లలో రూములు తీసుకున్నప్పుడు బిల్లు రూ. 7,500 కన్నా ఎక్కువ ఉంటే 28 శాతం, రూ. 2,500–రూ.7,500 మధ్య ఉంటే 18 శాతం, రూ. 1,000–రూ. 2,500 మధ్య ఉంటే 12 శాతం పన్ను వర్తిస్తుంది. ► హస్తకళతో తయారైన చిన్న వస్తువులు, రాతి, చెక్క, పాలరాతితో తయారైన విగ్రహాలు, రాఖీలు, చీపురు కట్టలు, చెట్టు ఆకుల నుంచి తయారైన విస్తర్లపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేశారు. ► హ్యాండ్ బ్యాగులు, నగలు దాచుకునే పెట్టెలు, ఆభరణాల వంటి ఫ్రేమ్ కలిగిన అద్దాలు, చేతితో తయారైన ల్యాంపులపై పన్ను రేటు 12 శాతానికి తగ్గింది. ► వెయ్యి రూపాయల లోపు విలువైన అల్లిక వస్తువులపై పన్ను 5 శాతానికి తగ్గింపు -
జీఎస్టీ రేట్లు : ఆమ్ ఆద్మీకి మరో గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : సామాన్యులకు(ఆమ్ ఆద్మీ) కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. మరికొన్ని ఉత్పత్తులపై కూడా జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించేందుకు సిద్దమవుతోంది. శనివారం జరుగబోయే తదుపరి సమావేశంలో జీఎస్టీ విధానంలో పలు మార్పు చేసి, 30 నుంచి 40 రకాల వస్తువులపై పన్ను రేట్లు తగ్గించేందుకు చూస్తుందని తెలుస్తోంది. పన్ను రేట్లు తగ్గబోయే ఉత్పత్తుల్లో శానిటరీ న్యాప్కిన్లు, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్‌లు వంటివి ఉన్నట్టు సమాచారం. వీటన్నింటిన్నీ తక్కువ పన్ను శ్లాబులోకి తీసుకొస్తున్నట్టు సంబంధిత అధికారులు చెప్పారు. వీటిపై తుది నిర్ణయాన్ని 28న న్యూఢిల్లీలో జరుగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ రేటు కోతతో రెవెన్యూలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. పన్ను రేట్లను హేతుబద్ధం చేస్తామని గతవారం ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్ 328 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించింది. అయితే అవకాశం ఉన్నట్టయితే మరికొన్ని వస్తువులపై ఈ రేట్లను తగ్గించనున్నామని తెలిపారు. కాగ, బంగారంపై మూడు శాతం పన్ను శ్లాబును తీసేస్తే, జీఎస్టీ పరిధిలో నాలుగు రకాల పన్ను శ్లాబులున్నాయి. అవి 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. ప్రస్తుతం కేవలం 49 రకాల ఉత్పత్తులే 28 శాతం పన్ను శ్లాబులో ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరిగిన సమావేశంలో పలు ఉత్పత్తులు, సర్వీసులపై పన్ను రేట్లను తగ్గించుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. -
'28 శాతం జీఎస్టీని తొలగించండి'
న్యూఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారుగా గత కొన్ని రోజుల క్రితమే రాజీనామా చేసిన అరవింద్ సుబ్రమణియన్ ఓ పెద్ద డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) రూపాన్ని సులభతరం చేసేందుకు అత్యధిక శ్లాబు అయిన 28 శాతాన్ని తొలగించాలని అరవింద్ సుబ్రమణియన్ డిమాండ్ చేశారు. అంతేకాక అన్ని ఉత్పత్తులు, సర్వీసులపై ఒకే విధమైన సెస్ రేటును కొనసాగించాలని కూడా కోరారు. ‘28 శాతం రేటును తొలగిస్తే మంచిదని నేను అనుకుంటున్నా. సెస్‌లు ఉండాలి. కానీ సెస్‌ల రేట్లన్నీ ఒకే విధంగా ఉంటే మంచిది. ప్రస్తుతం జీఎస్టీ రేట్లు జీరోగా, 3 శాతంగా(బంగారంపై), 5 శాతంగా, 12 శాతంగా, 18 శాతంగా, 28 శాతంగా ఉన్నాయి. వీటిని హేతుబద్ధం చేయాల్సినవసరం ఉంది. తొలుత 28 శాతం రేటును తొలగించాలి’ అని సుబ్రమణియన్ అన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా అరవింద్ సుబ్రమణియన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. గత వారం క్రితమే సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో తిరిగి అమెరికా వెళ్లేందుకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్‌లో తనకు మనవడు/మనవరాలు పుట్టబోతున్నారని, ఈ క్రమంలోనే తాను కుటుంబంతా సమయం కేటాయించడానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఏడాది వ్యవధిలో ఉన్నత స్థాయి పదవిలో ఉన్న వారు వైదొలగడం ఇది రెండో సారి. -
జీఎస్టీ రేట్లపై గుడ్‌న్యూస్?
న్యూఢిల్లీ : జీఎస్టీ రేట్లపై మరో గుడ్‌న్యూస్ వినబోతున్నారు. జీఎస్టీ పన్ను రేట్లు అత్యధికంగా ఉన్నాయంటూ.. ఇప్పటికే పలు వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతుండటంతో ఆ పన్ను రేట్లను తగ్గించేందుకు జీఎస్టీ కౌన్సిల్ కృషిచేస్తోంది. జీఎస్టీ రేట్లను హేతుబద్ధం చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ కృషిచేస్తుందని తెలిసింది. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చేపట్టిన 7వ ఎడిషన్ ఢిల్లీ ఎస్ఎంఈ ఫైనాన్స్ సమిట్‌లో ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా చెప్పారు. జీఎస్టీ రేట్లను హేతుబద్ధం చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ పనిచేస్తోంది.. దీనిపై ప్రభుత్వం నుంచి ఓ పెద్ద ప్రకటన వచ్చేస్తోంది అని శివ్ ప్రతాప్ అన్నారు. ప్రస్తుతం జీఎస్టీ నాలుగు శ్లాబుల్లో అమలవుతోంది. అవి 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. కానీ ఈ రేట్లు అత్యధిక మొత్తంలో ఉన్నాయని నిరసన వ్యక్తమవుతోంది. జనవరి నెల ప్రారంభంలో జీఎస్టీ కౌన్సిల్ 54 సర్వీసులు, 24 ఉత్పత్తుల రేట్లను తగ్గించింది. వీటిలోముఖ్యంగా హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. అంతేకాక 2017 నవంబర్ సమావేశంలో కూడా 28 శాతం కేటగిరీలో ఉన్న 178 ఉత్పత్తులను, ఆ శ్లాబు నుంచి తొలగించింది. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పెద్ద ఎత్తున్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ధరలను అదుపులో ఉంచవచ్చని పలువురు పేర్కొంటున్నారు. కేంద్రం సైతం పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. -
జీఎస్టీ రేట్లలో మరిన్ని మార్పులు: జైట్లీ
న్యూఢిల్లీ: భవిష్యత్తులో జీఎస్టీ రేట్లలో మరిన్ని మార్పులు జరుగుతాయని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అమల్లోకి వచ్చిన ఏడాదిలోనే ఈ విధానానికి స్థిరత్వం వచ్చిందని తెలిపారు. దీని పరిధిని విస్తరించటంతోపాటు రేట్లలో హేతుబద్ధత సాధిస్తామని చెప్పారు. జీఎస్టీతో పరోక్ష పన్నుల విధానంలో సమూల మార్పులు వచ్చాయని జైట్లీ తెలిపారు. జీఎస్టీకి తుదిరూపు తెచ్చేందుకు మిగతా దేశాలతో పోలిస్తే చాలా స్వల్ప సమయం పట్టిందన్నారు. -
29 వస్తువులపై జీరో జీఎస్టీ
న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 53 వస్తువులపై రేట్లను తగ్గించినట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వీటిలో ముఖ్యంగా హస్తకళల వస్తువులున్నట్టు పేర్కొన్నారు. 29 రకాల హస్తకళ వస్తువులను 0% శ్లాబులోకి తెచ్చామని, మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై రేట్లను తగ్గించినట్టు ప్రకటించారు. మార్పులు చేసిన జీఎస్టీ రేట్లను జనవరి 25 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ సమావేశం నిర్వహించింది. అంతేకాక ఈ సమావేశంలో రిటర్న్స్, ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేసే అంశంపై కూడా చర్చించినట్టు తెలిసింది. ఈ-వే బిల్లు ఫిబ్రవరి 1 నుంచి కచ్చితంగా అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే నేడు నిర్వహించిన ఈ సమావేశంలో కీలక అంశమైన పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై చర్చించలేదు. బీడీలపై జీఎస్టీ తగ్గించాలని కోరినా.. కౌన్సిల్ ఆమోదించలేదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ వస్తువులపై మాత్రం జీఎస్టీ 18 శాతం నుంచి 12 శాతం తగ్గింపుకు ఆమోదం లభించిందన్నారు. -
భారీగా తగ్గిన జీఎస్టీ ..!
18 శాతం: చూయింగ్ గమ్, చాకొలెట్లు, కాఫీ, మార్బుల్స్, గ్రానైట్లు, దంత సంబంధిత ఉత్పత్తులు, క్రీమ్‌లు, శానిటరీ ఉత్పత్తులు, లెదర్ వస్తువులు, కృత్రిమ ఉన్ని, విగ్గులు, కుక్కర్లు, స్టవ్‌లు, డిటర్జెంట్, వాషింగ్ పౌడర్, రేజర్లు, బ్లేడ్లు, కత్తులు, స్టోరేజ్ వాటర్ హీటర్లు, బ్యాటరీలు, చేతి వాచీలు, పరుపులు, వైర్లు, కేబుళ్లు, ఫర్నిచర్, షాంపూ, హెయిర్ క్రీమ్, హెయిర్ డై, మేకప్ వస్తువులు, ఫ్యాన్లు, ల్యాంపులు, రబ్బరు ట్యూబులు 28 నుంచి 18 శాతానికి చేరాయి. 12 శాతం: కండెన్స్డ్ మిల్క్, రిఫైన్డ్ చక్కెర, పాస్తా కర్రీ పేస్టు, మధుమేహ ఆహారం, మెడికల్ స్థాయి ఆక్సిజన్, ప్రింటింగ్ ఇంక్, హ్యాండ్ బ్యాగ్‌లు, టోపీలు, కళ్లద్దాల ఫ్రేమ్‌లు, వెదురు ఫర్నిచర్ మొదలైనవి 18 నుంచి 12 శాతానికి చేరాయి. 6 శాతం: ఆలూ పిండి, చట్నీ పౌడర్, పేలాల ఉండలు, చమురు వెలికితీతలో వెలువడే పొడి సల్ఫర్, ఫ్లై యాష్ 18 నుంచి 6 శాతానికి వచ్చాయి. 5 శాతం: ఇడ్లీ, దోశ తయారీ వస్తువులు, లెదర్, కొబ్బరి పీచు, చేపలు పట్టే వల, ఉన్ని దుస్తులు, కొబ్బరి తురుము 12 నుంచి 5 శాతానికి చేరాయి. గువార్ మీల్, హాప్కోన్, కొన్ని ఎండబెట్టిన కూరగాయలు, చేపలు, కొబ్బరి చిప్పలు, 5 శాతం నుంచి పన్ను రహిత పరిధిలోకి చేరాయి గువాహటి: వస్తు, సేవల పన్ను శ్లాబుల్లో జీఎస్టీ కౌన్సిల్ కీలక మార్పులు చేసింది. 28% పన్ను భారాన్ని తగ్గించింది. ఇప్పటివరకు 28% పన్ను పరిధిలో 228 వస్తువులుండగా వాటిని 50కి కుదించింది. అంటే 178 వస్తు, సేవలపై పన్నును 18% పరిధిలోకి మార్చింది. ఇప్పటివరకు ఏసీ రెస్టారెంట్లపై 18%, నాన్ ఏసీ రెస్టారెంట్లపై 12% జీఎస్టీ విధిస్తుండగా ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లపై పన్ను భారాన్ని 5% తగ్గించింది. ఈ మార్పులతో వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఈ మార్పులు తమ ఒత్తిడి కారణంగానే అని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం పేర్కొనగా.. కేంద్రం అహంకారాన్ని తగ్గించుకుని వాస్తవ, సులభమైన పన్నును అందించాలని రాహుల్ సూచించారు. రెస్టారెంట్లకు భారీ లాభం ప్రస్తుతం నాన్–ఏసీ రెస్టారెంట్లలో భోజనంపై 12%, ఏసీ రెస్టారెంట్లలో 18% జీఎస్టీ అమలవుతోంది. వీటన్నింటికీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ఉంటుంది. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను రెస్టారెంట్లు వినియోగదారులకు ఇవ్వట్లేదు. దీనిపై గువాహటి సమావేశంలో చర్చించిన మండలి ఏసీ, నాన్–ఏసీ రెస్టారెంట్లను 5% పరిధిలోకి తీసుకొచ్చి ఐటీసీని ఎత్తేసింది. 28 శాతంలో 50 వస్తువులే జీఎస్టీలో తాజా మార్పులకు ముందు 228 వస్తువులు 28% పన్ను పరిధిలో ఉండేవి. ఇందులో చాలావరకు నిత్యావసర వస్తువలున్నందున తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ పన్ను పరిధిలోని మెజారిటీ వస్తువులను జీఎస్టీ మండలి 18% పరిధిలోకి తీసుకొచ్చింది. వెట్ గ్రైండర్లు, సాయుధ వాహనాలను 28 నుంచి 12%పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటుగా.. ఆరు వస్తువులను 18 నుంచి ఐదు శాతానికి, ఎనిమిది వస్తువులను 12 నుంచి ఐదు శాతానికి మార్చిన మండలి.. ఆరు వస్తువులను ఐదు నుంచి పన్ను పరిధిలోనే లేకుండా నిర్ణయించింది. ప్రస్తుతం 28% పరిధిలో లగ్జరీ వస్తువులతోపాటు పాన్‌మసాలా, సిగరెట్లు, సిగార్లు, పొగాకు ఉత్పత్తులు, సిమెంట్, పెయింట్లు, పర్ఫ్యూమ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలతోపాటుగా శీతల పానీయాలు మొదలైనవి మాత్రమే ఉన్నాయి. కొంతకాలంగా తగ్గించాలనుకుంటున్నాం జీఎస్టీ ద్వారా వ్యాపారులపై పడుతున్న భారం తగ్గించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు. ‘జీఎస్టీ వ్యవస్థను స్థిరీకరించే ప్రయత్నాల్లో భాగంగా.. వివిధ వస్తువుల రేట్లను జీఎస్టీ మండలి సమీక్షిస్తూ వస్తోంది. చివరి మూడు సమావేశాల్లోనూ 28 శాతం పన్ను పరిధిపై చర్చ జరిగింది. ఇందులోని కొన్ని వస్తువులను 28 నుంచి 18 శాతానికి లేదా అంతకన్నా తక్కువకు మార్చాలని అనుకున్నాం’ అని జైట్లీ తెలిపారు. మార్చిన పన్ను పరిధి వల్ల ఏడాదికి రూ.20వేల కోట్ల నష్టం కలుగుతుందని బిహార్ ఉప ముఖ్య మంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. పన్ను పరిధిలో లేని వారికి రిటర్న్స్ ఫైలింగ్ ఆలస్యమైతే ప్రస్తుతం రోజుకు రూ.200 జరిమానాను వసూలు చేస్తుండగా దీన్ని రూ.20 కు తగ్గిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. జీఎస్టీ అమలు భారాన్ని తగ్గించేందుకు రిటర్న్‌ల ఫైలింగ్ విధానంలోనూ మార్పులు తీసుకొచ్చామన్నారు మిగిలిన వారికి ఈ జరిమానాను రోజుకు రూ.50కి మార్చామన్నారు. తయారీదారులు, వ్యాపారులపై ఒక్కోశాతం పన్ను రేటు కొనసాగుతుందని అధియా తెలిపారు. గతంలో రూ. 75 లక్షలున్న కాంపోజిట్ స్కీమ్ పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. ఎమ్మార్పీపై అదనంగా జీఎస్టీ వసూలు చేయరాదన్నారు. విపక్షాలకు భయపడ్డారు: చిదంబరం న్యూఢిల్లీ: విపక్షాలు, ప్రజలనుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో భయపడిన కేంద్రం.. తప్పనిసరి పరిస్థితుల్లోనే జీఎస్టీలో మార్పులు చేసిందని కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శించారు. ‘నేటి జీఎస్టీ కౌన్సిల్ భేటీలో మార్పులుంటాయనేది ఊహించిందే ప్రభుత్వం భయపడింది. మా డిమాండ్లకు తలొగ్గింది’ అని అన్నారు. జీఎస్టీ కారణంగా మార్పు తీసుకొచ్చే మంచి అవకాశాన్ని దేశం కోల్పోయిందంటూ పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ బాదల్, కర్ణాటక మంత్రి కృష్ణగౌడ ఆరోపించారు. ‘మీ అసమర్థతను గుర్తించండి. పొగరును తగ్గించుకోండి. దేశ ప్రజల మాటను వినండి’ అని రాహుల్ విమర్శించారు. జీఎస్టీ విషయంలో కనీస ఆలోచన లేకుండా ఆర్థిక మంత్రి జైట్లీ నిర్ణయం తీసుకున్నారని యశ్వంత్ సిన్హా విమర్శించారు.