
న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీ ఆపిల్ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెరగడమే ఈ ధరల సవరణకు కారణం. సవరించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. 64 జీబీ ఐఫోన్ 11 ధర రూ.64,900 నుంచి రూ.68,300లకు చేరింది. 64 జీబీ ఎక్స్‌ఆర్ మోడల్ రూ.2,600 అధికమై రూ.52,500లకు ఎగసింది. 64 జీబీ 11 ప్రో ధర రూ.1,06,600లుగా ఉంది. అంతక్రితం ఈ మోడల్ ధర రూ.1,01,200 ఉండేది. 64 జీబీ 11 ప్రో మ్యాక్స్ రూ.1,11,200 నుంచి రూ.1,17,100కు చేరింది. 32 జీబీ ఐఫోన్ 7 రూ.1,600 పెరిగి రూ.31,500లుగా ఉంది.
రియల్‌మీ కూడా...
స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ రియల్‌మీ తన ఉత్పత్తుల ధరను పెంచింది. జీఎస్టీ పెంపు, రూపాయి పతనం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. పాత, కొత్త మోడళ్లపై ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. 2018 తర్వాత ఇలా ధరలను పెంచడం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. కోవిడ్–19 ప్రభావం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమపై తీవ్రంగా పడిందని తెలిపింది. దీంతో సరఫరా కొరతతోపాటు విడిభాగాల ధర అధికమైందని వివరించింది. అటు రూపాయి పతనం కూడా మొబైల్ ధర పెరిగేందుకు కారణమైందని తెలిపింది. జీఎస్టీ పెంపుతో కస్టమర్లపై రూ.15,000 కోట్ల భారం పడుతుందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది.