ప్రతిపాదనపై జీవోఎం చర్చ
న్యూఢిల్లీ: జీఎస్‌టీ కాంపెన్సేషన్ (పరిహారం) సెస్సును జీఎస్‌టీ రేట్లలో విలీనం చేసే ప్రతిపాదనపై మంత్రుల బృందం (జీవోఎం) చర్చించింది. జీఎస్‌టీ ఆరంభంలో రాష్ట్రాలు కోల్పోయే పన్నును భర్తీ చేసేందుకు వీలుగా సెస్సును ప్రవేశపెట్టడం తెలిసిందే. ఒక్కసారి విలీనంపై నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ సెస్సు నుంచి మళ్లే క్రమంలో మరే వస్తువును లగ్జరీ లేదా సిన్ విభాగం కిందకు చేర్చకూడదని రాష్ట్రాలు సూచించాయి.
2026 మార్చిలో కాంపెన్సేషన్ సెస్సు ముగిసిన అనంతరం దాన్ని జీఎస్‌టీ రేట్లలో కలిపేయాలని.. అప్పటి వరకు ఏ వస్తువులకు సెస్సు అమలు చేశారో వాటికి సంబంధించి ప్రత్యేక రేటును జీఎస్‌టీలో ప్రవేశపెట్టాలన్నది రాష్ట్రాల అభిప్రాయంగా ఉంది. ‘‘జీఎస్‌టీ కాంపెన్సేషన్ సెస్సు ముగింపునకు వస్తోంది. దీని భవిష్యత్ ఏంటన్న దానిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రం తమ అభిప్రాయాలను తెలియజేసింది.
ఇందుకు సంబంధించి ఇది తొలి సమావేశం’’అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. మంత్రుల బృందానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. సెస్సును కొనసాగించాలా లేదంటే దాన్ని పన్ను కిందకు మార్చాలా? లగ్జరీ విభాగంలో మార్పులు చేయాలా? అన్న దానిపై చర్చలు కొనసాగుతున్నట్టు చెప్పారు. జీఎస్‌టీ కాంపెన్సేషన్ సెస్సుపై నవంబర్ రెండో వారంలో జీవోఎం మరోసారి సమావేశమై చర్చించనుంది. అసోం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల మంత్రులు జీవోఎంలో సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment