Cess Charges
-
Group of ministers: జీఎస్టీ రేట్లలో సెస్సు విలీనం!
న్యూఢిల్లీ: జీఎస్టీ కాంపెన్సేషన్ (పరిహారం) సెస్సును జీఎస్టీ రేట్లలో విలీనం చేసే ప్రతిపాదనపై మంత్రుల బృందం (జీవోఎం) చర్చించింది. జీఎస్టీ ఆరంభంలో రాష్ట్రాలు కోల్పోయే పన్నును భర్తీ చేసేందుకు వీలుగా సెస్సును ప్రవేశపెట్టడం తెలిసిందే. ఒక్కసారి విలీనంపై నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ సెస్సు నుంచి మళ్లే క్రమంలో మరే వస్తువును లగ్జరీ లేదా సిన్ విభాగం కిందకు చేర్చకూడదని రాష్ట్రాలు సూచించాయి. 2026 మార్చిలో కాంపెన్సేషన్ సెస్సు ముగిసిన అనంతరం దాన్ని జీఎస్టీ రేట్లలో కలిపేయాలని.. అప్పటి వరకు ఏ వస్తువులకు సెస్సు అమలు చేశారో వాటికి సంబంధించి ప్రత్యేక రేటును జీఎస్టీలో ప్రవేశపెట్టాలన్నది రాష్ట్రాల అభిప్రాయంగా ఉంది. ‘‘జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సు ముగింపునకు వస్తోంది. దీని భవిష్యత్ ఏంటన్న దానిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రం తమ అభిప్రాయాలను తెలియజేసింది. ఇందుకు సంబంధించి ఇది తొలి సమావేశం’’అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. మంత్రుల బృందానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. సెస్సును కొనసాగించాలా లేదంటే దాన్ని పన్ను కిందకు మార్చాలా? లగ్జరీ విభాగంలో మార్పులు చేయాలా? అన్న దానిపై చర్చలు కొనసాగుతున్నట్టు చెప్పారు. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సుపై నవంబర్ రెండో వారంలో జీవోఎం మరోసారి సమావేశమై చర్చించనుంది. అసోం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల మంత్రులు జీవోఎంలో సభ్యులుగా ఉన్నారు. -
మూవీ టికెట్స్, ఓటీటీలపై పన్ను.. కాంగ్రెస్ సర్కార్ ఝలక్
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా అభిమానులకు భారీ షాకిచ్చింది. కర్ణాటకలో సినిమా టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లపై అదనపు పన్ను(సెస్ రూపంలో) వేసేందుకు రెడీ అవుతోంది. ఇక, దీనికి సంబంధించిన ప్రణాళికలు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ సినిమా అభిమానులకు ఊహించని షాకిచ్చింది. సినిమా టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లపై రెండు శాతం సెస్ రూపంలో డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమైంది. కాగా, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. అయితే.. సినిమా, సాంస్కృతిక కళాకారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇక, కళాకారుల సంక్షేమం బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది...ఇందులో సినిమా టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ ధరలతో పాటు సినీ రంగంలో ఇతర ఆదాయ వనరులపై సెస్ విధించే ప్రణాళికల అంశాన్ని ప్రతిపాదించింది. వీటిపై 1-2 శాతం సెస్ వసూలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అలాగే, ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ సెస్ రేటును సమీక్షించనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా.. రాష్ట్రం పరిధిలో ప్రదర్శించే నాటకాలపైనా ఈ సెస్‌ను విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కూడా తెలిపింది. ఇక, సినీ, సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమం కోసం ఏడుగురు సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేసే అంశాన్ని కూడా బిల్లులో ప్రస్తావించారు. సెస్ కింద వచ్చే మొత్తాన్ని ఈ బోర్డుకు బదిలీ చేస్తారని ప్రభుత్వం వెల్లడించింది.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో కర్ణాటలో అన్నింటిపై ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలను సైతం పెంచారు. అలాగే, కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలను కూడా పెంచనున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సెస్ రూపంలో ఇలా రెండు రూపాయలు వసూలు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. -
లక్షద్వీప్‌లో రూ.15 మేర తగ్గిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: లక్ష ద్వీప్‌లో శనివారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.15 మేర తగ్గాయి. దూరంగా ఉన్న దీవులకు ఇంధనం రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు గాను వసూలు చేస్తున్న ప్రత్యేక సెస్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తొలగించడంతో ఈ మేరకు ద్వీప వాసులకు ఊరట లభించింది. లక్షద్వీప్ సముదాయంలోని అండ్రోట్, కల్పెనీ దీవుల్లో పెట్రోల్, డీజిల్ లీటరుపై రూ.15.3 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్ దీవుల్లో రూ.5.2 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్ దీవుల్లో గతంలో లీటరు పెట్రోల్ ధర రూ.105.94 కాగా రూ.100.75కి తగ్గింది. అండ్రోట్, కల్పెనీ దీవుల్లో రూ.116.13గా ఉన్న పెట్రోల్ ధర రూ.100.75కి చేరింది. కవరట్టి, మినికాయ్ దీవుల్లో డీజిల్ ధర 110.91 నుంచి రూ.95.71కి, అండ్రోట్, కల్పెనీల్లో రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గింది. -
మొత్తం కేంద్రానికే.. రాష్ట్రాలు గగ్గోలు!
కేంద్రం నుంచి రాష్ట్రాలకు సక్రమంగా నిధుల బదిలీ జరగడం లేదని చాలాకాలంగా రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. నిధుల బదిలీలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ రాష్ట్రాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. పన్నులు, సెస్సుల రూపంలో కేంద్రం ఎక్కువ ఆదాయం ఆర్జిస్తోందని కథనాలు వస్తున్నాయి. పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ మొత్తం పన్ను వసూళ్లలో సెస్సుల ద్వారా సమకూరిన వాటా 18 శాతం. తాజాగా ఇప్పుడది 30శాతానికి పెరిగినట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. కేంద్రానికి పెరిగిన ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవడం లేదనే వాదనలున్నాయి. నిబంధనల ప్రకారం సెస్సుల ఆదాయంలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మొత్తం పన్ను వసూళ్లలో 50శాతాన్ని రాష్ట్రాలకు పంచాలి. మిగిలిన 50శాతం నిధుల్లో 10శాతాన్ని వివిధ రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్టులపై వెచ్చించాలి. ఇదీ చదవండి: ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ టు శ్రీకాకుళం! ఓటు బ్యాంకు రాజకీయాలు, ఉచిత వరాలు చాలా రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పెట్టుబడులకు వాటి వద్ద నిధులు ఉండటం లేదు. ఉత్పత్తి పెంపుదల, ఉపాధిపట్ల అధిక దృష్టి సారించే రాష్ట్రాలకు నిధుల బదిలీలో ఆర్థిక సంఘం ప్రాధాన్యమివ్వాలని నిపుణులు చెబుతున్నారు. -
సీఎం ప్రకటనతో ఆనందంలో అన్నదాతలు
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచి రైతులకు అండగా ఉంటామని అనేక పథకాలను ప్రవేశపెట్టారు. తాజాగా రైతుల నుంచి ట్రేడర్స్ వసూలు చేస్తున్న మార్కెట్ ఫీజు చెల్లించనవసరం లేదని ముఖ్యమంత్రి ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి దాకా రైతుల పండించి తీసుకొచ్చిన వివిధ రకాల పండ్లను, కూరగాయలను కొందరు 4 నుంచి 10 శాతం కమీషన్ తీసుకుని విక్రయాలు చేస్తున్నారు. ఇక నుంచి కమీషన్ పద్ధతి ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. దీంతో రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు తమకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో ప్రధాన పంట వరి సాగు. ఆ తరువాత వివిధ రకాల పంటలు ఉన్నాయి. వీటికిగాను పండ్లు, కూరగాయల విక్రయాలపై మార్కెట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కాకర, దొండ, బీర, వంగ తదతర కూరగాయల సాగు 17 వేల ఎకరాల్లో, నిమ్మ 42 వేలు, మామిడి 25 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జిల్లాలో వివిధ రకాల కూరగాయలు, పండ్లు కలసి మొత్తం 84 వేల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. ఏటా 65 లక్షల క్వింటాల్ కూరగాయలు, పండ్లు క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. వీటికి ఏటా మార్కెట్లోని ట్రేడర్స్, కొనుగోలుదారులు మార్కెట్ ఫీజు కింద సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏడాదికి రూ.కోటి వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ సెస్‌ను జిల్లాలోని 11 మార్కెట్ కమిటీలు ఉంటే ఆయా కమీటీలకు చెల్లిస్తారు. అయితే ట్రేడర్స్, కొనుగోలుదారులు చెల్లించే సెస్‌ను రైతుల వద్ద వసూలు చేస్తూ రైతులపై భారం మోపుతున్నారు. ట్రేడర్స్ చెల్లించాల్సిన దానికి కూడా రైతులపై భారం మోపడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఈ విషయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రైతులపై భారం పడకుండా ఉండే విధంగా సెస్‌ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్పష్టమైన ఆదేశాలు జారీ లైసెన్స్‌లు కలిగిన ట్రేడర్స్‌కు కూడా మార్కెట్ఫీజు కట్టనవసరం లేదని తెలిపారు. కొనుగోలు దారులు, ట్రేడర్స్ వారి లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఈ నామ్ ప్లాట్ఫారం ద్వారా వలంటరీగా చేయాలనుకునేవారు కూడా లైసెన్స్‌లు పొందాలని పేర్కొన్నారు. కమీషన్ ఏజెంట్లు వ్యాపారం చేయాలనుకుంటే ట్రేడర్స్‌గా మారి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రైతుల వద్ద నుంచి కమీషన్ తీసుకునే పద్ధతి పూర్తిగా తొలగనుంది. ఈ నిర్ణయం రైతులు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫీజు వసూలు చేయడం లేదు జిల్లాలోని 11 మార్కెట్ కమిటీ శాఖలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, పండ్లు, కూరగాయలకు, వీటిలో నిమ్మ కూడా వస్తుంది, వీటికి ఎటువంటి మార్కెట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మార్కెట్కమిటీలకు ఆదేశాలు కూడా జారీ చేశాం. ప్రభుత్వం చెప్పిన ప్రకారం అమలు చేస్తాం. – రావమ్మ, ఏడీఎం, మార్కెట్ శాఖ -
సెస్ నిధుల దారి మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: మీ సౌకర్యాల కోసమే అంటూ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న నిధులు దారిమళ్లుతున్నాయి. అదనంగా వసూలు చేస్తున్న మొత్తాన్ని ఆర్టీసీ పత్తాలేకుండా చేస్తోంది. ఏటా దాదాపు రూ.50 కోట్ల వరకు వసూలవుతున్నా.. బస్టాండ్లలో విరిగిన బల్లలు, పని చేయని ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి. పారిశుధ్యం పడకేసి కంపుకొడుతోంది. మరుగుదొడ్లు, మూత్రశాలలకు వెళితే ముక్కు తెరవలేని పరిస్థితి. ఏ నిధులు ఎటు పోతున్నాయో, వేటిని దేని కోసం ఖర్చు చేస్తున్నారో ఆర్టీసీలో పరిస్థితి అంతు చిక్కకుండా ఉంది. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురు కాకుండా బస్టాండ్లలో ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టేందుకు స్వయంగా ప్రయాణికుల జేబు నుంచి వసూలు చేసే విధానానికి రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. టికెట్ ధర కాకుండా అదనంగా ప్రతి ప్రయాణంపై ఒక్క రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. ప్యాసింజర్ సెస్ రూపంలో వీటిని వసూలు చేస్తున్నా చాలామందికి ఆ విషయమే తెలియదు. అది టికెట్ ధరగానే భావిస్తున్నారు. ప్రయాణికులకు అవగాహన లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఆర్టీసీ ఆ నిధులను దర్జాగా పక్కదారి పట్టిస్తోంది. ప్రతి బస్టాండ్‌లో నిత్యం రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఫ్యాన్లు పాడయిపోవటం, మంచినీటి నల్లాలు పనిచేయకపోవటం, బల్లలు,కుర్చీలు విరిగిపోవడం, ఫ్లోరింగ్ దెబ్బతినటం, పారిశుధ్య పనుల నిర్వహణ... తదితరాలు ఈ కోవలోకి వస్తాయి. వీటి కోసం బడ్జెట్ నిధులపై ఆధారపడితే పనులన్నీ నెలల తరబడి పడకేస్తాయి. దీంతో ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దేందుకు ఈ సెస్‌ను ప్రయోగిం చారు. ఆ అదనపు రుసుము వసూలు చేస్తున్నా పనులు మాత్రం జరగటం లేదు. తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ వెలుపల నిత్యం దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో సగానికంటే ఎక్కువ మంది పల్లె వెలుగు బస్సులను ఆశ్రయిస్తారు. దాదాపు 18 లక్షల నుంచి 20 లక్షల మంది ఎక్స్‌ప్రెస్ ఆ పై కేటగిరీ బస్సుల్లో తిరుగుతారు. వీరంతా ఈ సెస్ చెల్లించాల్సిందే. ఈ రూపంలో సాలీనా రూ.50 కోట్లకు తక్కువ కాకుండా వసూలవుతున్నాయి. కానీ ఏ బస్టాండులో కూడా ఎప్పటికప్పుడు పనులు జరగటం లేదు. ఈ సెస్ వసూలు కాకముందు ఇంజినీరింగ్ బడ్జెట్ నిధుల నుంచి పనులు నిర్వహించినట్టుగానే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మరి సెస్ నిధుల వసూలు ఉద్దేశం ఏమైనట్టో ఎవరికీ అంతుచిక్కటం లేదు. సాధారణ సివిల్ వర్క్స్‌తో కలిపి ఈ రెగ్యులర్ పనులు చేయొద్దన్న ఉద్దేశంతో ఈ సెస్ కోసం ప్రత్యేక ఖాతానే తెరవాలని అప్పట్లో నిర్ణయించారు. అలాగే వసూలు చేసి జమ చేస్తున్నారు. కానీ ఖర్చు వరకు వచ్చేవరకు మాత్రం వాటిని కేటాయించటం లేదు. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే... డబ్బులేవైతే ఏంటి పనులు చేస్తున్నాం కదా అంటూ దాటేస్తున్నారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా సెస్ వసూలు చేయటం ఎందుకంటే సమాధానం చెప్పటం లేదు. ప్రయాణికులు అవగాహన లేకపోవటాన్ని ఆసరా చేసుకుని ఆర్టీసీ వాటిని పక్కదారిపట్టిస్తున్నారు.