సెస్ నిధుల దారి మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: మీ సౌకర్యాల కోసమే అంటూ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న నిధులు దారిమళ్లుతున్నాయి. అదనంగా వసూలు చేస్తున్న మొత్తాన్ని ఆర్టీసీ పత్తాలేకుండా చేస్తోంది. ఏటా దాదాపు రూ.50 కోట్ల వరకు వసూలవుతున్నా.. బస్టాండ్లలో విరిగిన బల్లలు, పని చేయని ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి. పారిశుధ్యం పడకేసి కంపుకొడుతోంది. మరుగుదొడ్లు, మూత్రశాలలకు వెళితే ముక్కు తెరవలేని పరిస్థితి. ఏ నిధులు ఎటు పోతున్నాయో, వేటిని దేని కోసం ఖర్చు చేస్తున్నారో ఆర్టీసీలో పరిస్థితి అంతు చిక్కకుండా ఉంది.
ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురు కాకుండా బస్టాండ్లలో ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టేందుకు స్వయంగా ప్రయాణికుల జేబు నుంచి వసూలు చేసే విధానానికి రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. టికెట్ ధర కాకుండా అదనంగా ప్రతి ప్రయాణంపై ఒక్క రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. ప్యాసింజర్ సెస్ రూపంలో వీటిని వసూలు చేస్తున్నా చాలామందికి ఆ విషయమే తెలియదు. అది టికెట్ ధరగానే భావిస్తున్నారు. ప్రయాణికులకు అవగాహన లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఆర్టీసీ ఆ నిధులను దర్జాగా పక్కదారి పట్టిస్తోంది.
ప్రతి బస్టాండ్‌లో నిత్యం రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఫ్యాన్లు పాడయిపోవటం, మంచినీటి నల్లాలు పనిచేయకపోవటం, బల్లలు,కుర్చీలు విరిగిపోవడం, ఫ్లోరింగ్ దెబ్బతినటం, పారిశుధ్య పనుల నిర్వహణ... తదితరాలు ఈ కోవలోకి వస్తాయి. వీటి కోసం బడ్జెట్ నిధులపై ఆధారపడితే పనులన్నీ నెలల తరబడి పడకేస్తాయి. దీంతో ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దేందుకు ఈ సెస్‌ను ప్రయోగిం చారు.
ఆ అదనపు రుసుము వసూలు చేస్తున్నా పనులు మాత్రం జరగటం లేదు. తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ వెలుపల నిత్యం దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో సగానికంటే ఎక్కువ మంది పల్లె వెలుగు బస్సులను ఆశ్రయిస్తారు. దాదాపు 18 లక్షల నుంచి 20 లక్షల మంది ఎక్స్‌ప్రెస్ ఆ పై కేటగిరీ బస్సుల్లో తిరుగుతారు. వీరంతా ఈ సెస్ చెల్లించాల్సిందే. ఈ రూపంలో సాలీనా రూ.50 కోట్లకు తక్కువ కాకుండా వసూలవుతున్నాయి.
కానీ ఏ బస్టాండులో కూడా ఎప్పటికప్పుడు పనులు జరగటం లేదు. ఈ సెస్ వసూలు కాకముందు ఇంజినీరింగ్ బడ్జెట్ నిధుల నుంచి పనులు నిర్వహించినట్టుగానే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మరి సెస్ నిధుల వసూలు ఉద్దేశం ఏమైనట్టో ఎవరికీ అంతుచిక్కటం లేదు. సాధారణ సివిల్ వర్క్స్‌తో కలిపి ఈ రెగ్యులర్ పనులు చేయొద్దన్న ఉద్దేశంతో ఈ సెస్ కోసం ప్రత్యేక ఖాతానే తెరవాలని అప్పట్లో నిర్ణయించారు. అలాగే వసూలు చేసి జమ చేస్తున్నారు. కానీ ఖర్చు వరకు వచ్చేవరకు మాత్రం వాటిని కేటాయించటం లేదు.
ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే... డబ్బులేవైతే ఏంటి పనులు చేస్తున్నాం కదా అంటూ దాటేస్తున్నారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా సెస్ వసూలు చేయటం ఎందుకంటే సమాధానం చెప్పటం లేదు. ప్రయాణికులు అవగాహన లేకపోవటాన్ని ఆసరా చేసుకుని ఆర్టీసీ వాటిని పక్కదారిపట్టిస్తున్నారు.