బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా అభిమానులకు భారీ షాకిచ్చింది. కర్ణాటకలో సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లపై అదనపు పన్ను(సెస్ రూపంలో) వేసేందుకు రెడీ అవుతోంది. ఇక, దీనికి సంబంధించిన ప్రణాళికలు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ సినిమా అభిమానులకు ఊహించని షాకిచ్చింది. సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లపై రెండు శాతం సెస్ రూపంలో డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమైంది. కాగా, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. అయితే.. సినిమా, సాంస్కృతిక కళాకారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇక, కళాకారుల సంక్షేమం బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
..ఇందులో సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ధరలతో పాటు సినీ రంగంలో ఇతర ఆదాయ వనరులపై సెస్ విధించే ప్రణాళికల అంశాన్ని ప్రతిపాదించింది. వీటిపై 1-2 శాతం సెస్ వసూలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అలాగే, ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ సెస్ రేటును సమీక్షించనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా.. రాష్ట్రం పరిధిలో ప్రదర్శించే నాటకాలపైనా ఈ సెస్‌ను విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కూడా తెలిపింది. ఇక, సినీ, సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమం కోసం ఏడుగురు సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేసే అంశాన్ని కూడా బిల్లులో ప్రస్తావించారు. సెస్ కింద వచ్చే మొత్తాన్ని ఈ బోర్డుకు బదిలీ చేస్తారని ప్రభుత్వం వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో కర్ణాటలో అన్నింటిపై ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలను సైతం పెంచారు. అలాగే, కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలను కూడా పెంచనున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సెస్ రూపంలో ఇలా రెండు రూపాయలు వసూలు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment