
ఇండస్ట్రీ చాంబర్– పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్
న్యూఢిల్లీ: దేశంలో మూడంచెల వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధానాన్ని అమలు చేయాలని ఇండస్ట్రీ చాంబర్– పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ ఉద్ఘాటించారు. అలాగే అత్యధిక శ్లాబ్ 18 శాతానికి పరిమితం చేయాలని కూడా కూడా సూచించారు. 2017 జూలై నుంచీ అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ ప్రస్తుతం ప్రధానంగా ఐదు రేట్ల వ్యవస్థతో (0.25 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం) అమలు జరుగుతున్న సంగతి తెలసిందే. జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణ ప్రభుత్వ అజెండాలో ప్రధానమైనదని, మూడు రేట్ల వ్యవస్థకు మార్చడం కీలకాంశమని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ ఇటీవలే పేర్కొన్నారు. పన్ను రేట్ల హేతుబద్దీకరణ వల్ల వినియోగం, పన్ను ఆదాయాలు పెరుగుతాయని, క్లిష్టతలు తగ్గుతాయని, పన్ను ఎగవేతల సమస్యను పరిష్కరించవచ్చని సంజయ్ అగర్వాత్ తాజాగా పేర్కొన్నారు.
ఎకానమీ రికవరీ..
ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ప్రతికూలతలకు గురయిన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వేగంగా పురోగమిస్తోందని అగర్వాల్ పేర్కొన్నారు. స్థానికంగా విధించిన లాక్‌డౌన్లు, ఆంక్షలను రాష్ట్రాలు తొలగించడం, ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దీనికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. ఎకానమీలో డిమాండ్ పెంచడానికి గృహ వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద పట్టణ, గ్రామీణ పేదలకు సాధ్యమైనంత అధికంగా ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపులు అవసరమని ఆయన సూచించారు. ప్రయోజనాలు పక్కదారిపట్టకుండా ఈ విధానం రక్షణ కల్పిస్తుందన్నారు.