10 లక్షల ఉద్యోగాలకు ఎసరు.. | Auto component industry fears loss of 10 lakh jobs due to prolonged slowdown | Sakshi
Sakshi News home page

10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..

Published Thu, Jul 25 2019 5:50 AM | Last Updated on Thu, Jul 25 2019 5:50 AM

Auto component industry fears loss of 10 lakh jobs due to prolonged slowdown - Sakshi

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ పరిశ్రమలో మందగమనం మరింత కాలం కొనసాగితే 10 లక్షల పైచిలుకు ఉద్యోగాలకు కోత పడే ముప్పు పొంచి ఉందని ఆటోమోటివ్‌ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను పెంచే దిశగా జీఎస్‌టీ రేటు తగ్గింపు తదితర చర్యలతో ఆటోమొబైల్‌ రంగం కోలుకునేందుకు తోడ్పాటు అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గత పది నెలలుగా అమ్మకాలు క్షీణిస్తూనే ఉండటంతో ఆటోమొబైల్‌ పరిశ్రమ సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోందని పేర్కొంది. ‘గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని విభాగాల వాహనాల విక్రయాలు చాలా నెలలుగా పడిపోతున్నాయి. దీంతో పరికరాల తయారీ విభాగంపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది.

వాహనాల రంగంపైనే పరికరాల తయారీ విభాగం కూడా ఆధారపడి ఉంటుంది. వాహనాల తయారీ 15–20 శాతం పడిపోవడంతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సిబ్బందిని తొలగించక తప్పదు. కనీసం 10 లక్షల మంది పైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని అంచనా‘ అని ఏసీఎంఏ అధ్యక్షుడు రామ్‌ వెంకటరమణి పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్వాసనలు మొదలయ్యాయని చెప్పారు. పరికరాల తయారీ రంగంలో దాదాపు 70 శాతం మంది కాంట్రాక్టు వర్కర్లే ఉంటారని, డిమాండ్‌ లేకపోతే సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ స్థూల దేశీయోత్పత్తిలో 2.3 శాతం వాటాతో ఆటోమోటివ్‌ పరికరాల తయారీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.  

జీఎస్‌టీ రేటు తగ్గించాలి..
డిమాండ్‌ లేకపోవడం, బీఎస్‌ సిక్స్‌ స్థాయి ఉద్గార ప్రమాణాల వాహనాల తయారీపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి రావడం, విద్యుత్‌ వాహనాల విధానంపై స్పష్టత కొరవడటం తదితర అంశాలు ఆటోమొబైల్‌ పరిశ్రమ భవిష్యత్‌కు ప్రశ్నార్థకంగా మారాయని రామ్‌ చెప్పారు. దీంతో భవిష్యత్‌ పెట్టుబడులన్నీ నిల్చిపోయాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిమాండ్‌కి ఎంతో కొంత ఊతమిచ్చేలా జీఎస్‌టీ రేటు తగ్గించాలని పేర్కొన్నారు. ఆటోమొబైల్, ఆటో పరికరాలన్నింటికీ ఒకే రకంగా 18 శాతం జీఎస్‌టీ రేటు పరిధిలోకే చేర్చాలని కోరారు. ప్రస్తుతం దాదాపు 70 శాతం ఆటో పరికరాలు 18 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లోనే ఉన్నప్పటికీ.. మిగతా 30 శాతం మాత్రం గరిష్ట శ్లాబ్‌ అయిన 28 శాతం విభాగంలో ఉన్నాయి. పైగా వాహనాల పొడవు, ఇంజిన్‌ సామర్థ్యం తదితర అంశాలను బట్టి 28 శాతం జీఎస్‌టీకి అదనంగా 1–15 శాతం దాకా అదనపు సెస్సు భారం కూడా ఉంటోందని రామ్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల విధానంపై కేంద్రం స్పష్టతనివ్వాలన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు మళ్లే క్రమంలో నీతి ఆయోగ్‌ నిర్దేశించిన లక్ష్యాలు.. ఆటో పరిశ్రమను ఆందోళనకు గురి చేసేవిగా ఉన్నాయని ఏసీఎంఏ డైరెక్టర్‌ జనరల్‌ విన్నీ మెహతా చెప్పారు. 2018–19లో ఆటో పరికరాల వ్యాపార విభాగం 14.5 శాతం వృద్ధితో రూ. 3.95 లక్షల కోట్లుగా ఉందని తెలిపారు.

చైనాకు అవకాశాలు ఇవ్వొద్దు
స్వేచ్చా వాణిజ్యానికి సంబంధించిన ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్‌సెప్‌)లో ఆటో పరికరాలను చేర్చకుండా ఉండటం మంచిదని మెహతా తెలిపారు. అలా చేస్తే భారత మార్కెట్లో చైనా దొడ్డిదారిన ప్రవేశించేందుకు అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. ఇప్పటికే చైనా నుంచే భారత్‌ అత్యధికంగా పరికరాలు దిగుమతి చేసుకుంటోందని మెహతా వివరించారు. 2018–19లో చైనా నుంచి దిగుమతులు 4.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయని, మొత్తం ఆటోమోటివ్‌ పరికరాల దిగుమతుల్లో ఇది 27 శాతమని తెలిపారు. చైనాతో పాటు జపాన్, కొరియా వంటి దేశాలతో కూడా భారత వాణిజ్యం లోటులోనే ఉందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement