Automobile industry India
-
ఈవీ బైక్ కొనుగోలు దారులకు భారీ షాక్.. జులై 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు?
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు కేంద్రం షాకిచ్చింది. ఎలక్ట్రిక్ బైక్‌ల వినియోగాన్ని ప్రోత్సహించేలా కొనుగోలు దారులకు అందించే సబ్సీడీని భారీగా తగ్గించనుంది. దీంతో ఈవీ బైక్స్ ధరలు ఆకాశాన్నంటనున్నాయి. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేలా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-2) స్కీంను ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా విద్యుత్ వాహనాల కొనుగోలుపై ఒక కేడబ్ల్యూహెచ్‌కు రూ.10వేల సబ్సిడీని రూ. 15 వేలకు పెంచి వేసింది. వాహనం ఖరీదులో 20 శాతమే అందించే సబ్సిడీని సైతం 40 శాతానికి పెంచింది. ఇప్పుడా 40 శాతం సబ్సీడీని 15 శాతానికి తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక తగ్గించిన సబ్సీడీ జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నాయి. 21 శాతం వృద్దితో జేఎంకే రిసెర్చ్ అనలటిక్స్ నివేదిక ప్రకారం.. గత ఏప్రిల్ నెలలో ఈవీ వాహనాల కొనుగోళ్లు పెరిగినట్లు వెల్లడించింది. 21 శాతం వృద్దితో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు 1,10,503 యూనిట్లు అమ్ముడు పోయాయి. అదే నెలలో దేశంలోని ఉత్తర్ ప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో మొత్తం కలుపుకొని 21,845 వెహికల్స్‌ను కొనుగోలు చేశారు. ఎక్కువ వెహికల్స్‌ను కొనుగోలు చేసిన జాబితాలో ఓలా ప్రథమ స్థానంలో ఉండగా, టీవీఎస్, ఎథేర్ మోటార్స్‌లు వరుస స్థానాల్లో ఉన్నాయి. 10వేల కోట్లు కేటాయింపు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్‌లు, ఆటోలు, కార్లు, బస్సుల వినియోగానికి తోడ్పడేలా ఫేమ్ పథకంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రోత్సహకాలు అందిస్తుంది. ఇందుకోసం రూ.10,000 కోట్లను కేటాయించింది. ఏప్రిల్ 1, 2019 నుంచి మూడేళ్లకాలానికి ఇది వర్తిస్తుందని తెలిపింది. చదవండి👉 అమ్మకానికి సుందర్ పిచాయ్ ఇల్లు.. కొనుగోలు చేసిన యాక్టర్.. ఎవరో తెలుసా? -
ఆటో పీఎల్ఐ స్కీమ్‌కి 20 కంపెనీల ఎంపిక
న్యూఢిల్లీ: ఆటోమొబైల్, ఆటోమొబైల్ విడిభాగాల పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద 20 కంపెనీల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. టాటా మోటార్స్, మారుతి సుజుకీ, హ్యుందాయ్, కియా, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు ఈ అవకాశాన్ని సొంతం చేసుకున్నాయి. ఆమోదించిన దరఖాస్తుదారుల నుంచి రూ.45,016 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్టు భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. చాంపియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చురర్స్ (ఓఈఎం) ఇన్సెంటివ్స్ స్కీమ్ కింద అశోక్‌లేలాండ్, ఐచర్ మోటార్స్, ఫోర్డ్ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, కియా ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, పీసీఏ ఆటోమొబైల్స్, పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్, సుజుకీ మోటార్ గుజరాత్, టాటా మోటార్స్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కేటగిరీలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను కలపలేదు. ద్విచక్ర, త్రిచక్ర వాహనతయారీదారులకు ప్రోత్సాహకాల కింద బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, పియాజియో వెహికల్స్, టీవీఎస్ మోటార్ ఎంపికయ్యాయి. నాన్ ఆటోమోటివ్ ఇన్వెస్టర్ కేటగిరీ కింద యాక్సిస్ క్లీన్ మొబిలిటీ, భూమ ఇన్నోవేటివ్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్, ఎలెస్ట్, హోప్ ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓలా ఎలక్ట్రిక్ టక్నాలజీస్, పవర్‌హాల్ వెహికల్ కంపెనీలు రాయితీలకు అర్హత పొందాయి. 18 శాతం వరకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా దేశీయంగా విడిభాగాల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీల ఆవిష్కారానికి ఈ పథకం మద్దతుగా నిలవనుంది.మొత్తం రూ.25,938 కోట్లను ప్రోత్సాహకాలుగా ఇవ్వాలని గతంలోనే సర్కారు నిర్ణయించింది. -
ఆటో పీఎల్ఐ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ ఆధారిత వాహనాలు (ముందస్తు అనుమతి కలిగిన), అన్ని రకాల ఆటో విడిభాగాల తయారీపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ పథకం) అందుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఆటోమొబైల్ రంగానికి రూ.25,938 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇందుకు సంబంధించి పీఎల్ఐ పథకం కింద రాయితీలు కలి్పంచే నోటిఫికేషన్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం జారీ చేసింది. సైనిక వినియోగానికి సంబంధించిన వాహనాలకూ ఈ పథకం కింద ప్రయోజనాలు లభించనున్నాయి. సీకేడీ/ఎస్కేడీ కిట్లు, ద్విచక్ర, త్రిచక్ర, ప్యాసింజర్, వాణిజ్య, ట్రాక్టర్ల అగ్రిగేట్స్ సబ్సిడీలకు అర్హతగా నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆటోమొబైల్ కంపెనీలతోపాటు.. కొత్త నాన్ ఆటోమోటివ్ పెట్టుబడి సంస్థలూ పథకం కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. ఛాంపియన్ ఓఈఎం, కాంపోనెంట్ చాంఫియన్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే రెండు భాగాల కింద ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఒక గ్రూపు పరిధిలోని కంపెనీలకు మొత్తం ప్రోత్సాహకాల్లో 25 శాతానికి మించకుండా (అంటే రూ.6,485 కోట్లకు మించకుండా) ప్రోత్సాహకాలు లభిస్తాయి. చాంపియన్ ఓఈఎం పథకం కింద విక్రయాలు కనీసం రూ.125 కోట్లుగాను, కాంపోనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద విక్రయాలు కనీసం రూ.25 కోట్లుగాను ఉండాలని ఈ నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది. -
దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వండి
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వాలని ఆటో విడిభాగాల పరిశ్రమకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే సూచించారు. క్షేత్రస్థాయిలో స్థానికీకరణపై దృష్టి పెట్టాలని.. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. అలాగే సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిప్పించడంపైనా ఇన్వెస్ట్ చేయాలని తెలిపారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల అసోసియేషన్ ఏసీఎంఏ 61వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు పేర్కొన్నారు. ‘‘స్థానికంగా తయారీకి ప్రాధాన్యం లభించాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశ్యం. పరిశ్రమ కూడా స్థానికీకరణ ప్రక్రియపై కసరత్తు చేస్తోందని నాకు తెలుసు. సియామ్ (వాహనాల తయారీ సంస్థల సమాఖ్య), ఏసీఎంఏ స్థానికీకరణ మార్గదర్శ ప్రణాళికను కూడా రూపొందించాయి. దాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని పరిశ్రమను కోరుతున్నాను’’ అని ఆయన తెలిపారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఆర్అండ్డీ కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. ఆటో విడిభాగాల పరిశ్రమకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం వాటా ఉందని, 50 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 60 శాతం ఆటో విడిభాగాల ఎగుమతులు ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకు వెడుతున్నాయని తెలిపారు. వచ్చే అయిదేళ్లలో 2025–26 నాటికి ఎగుమతులను 30 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో దేశీ పరిశ్రమ వాటా 3 శాతానికి చేరగలదని వివరించారు. అలాగే 2025 నాటికి ఆటో విడిభాగాల రంగంలో ఉద్యోగాల సంఖ్య 70 లక్షలకు చేరగలదన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆటోమోటివ్ ఎగుమతులు 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, 1.3 లక్షల కోట్ల డాలర్ల అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌కు 1.2 శాతం వాటా ఉంది. ఏసీఎంఏలో 800 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. వీటికి సంఘటిత ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరులో 85 శాతం పైగా వాటా ఉంది. ఎలాంటి టెక్నాలజీలనైనా స్థానికంగా వినియోగంలోకి తెచ్చేందుకు తగినంత సమయం లభించేలా దీర్ఘకాలికమైన, స్థిరమైన మార్గదర్శ ప్రణాళిక అవసరమని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ అభిప్రాయపడ్డారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: కాంత్ దేశీ ఆటోమొబైల్, విడిభాగాల రంగాలు చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటం నుంచి పూర్తిగా బైటికి రావాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సూచించారు. ఆటో విడిభాగాలు మొదలైన వాటన్నింటినీ దేశీయంగా తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఫేమ్ 2 పథకం కింద ఎంపికైన తొమ్మిది నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత నాలుగు చక్రాల వాహనాలకు (కార్లు మొదలైన వాటికి) కూడా స్కీమును వర్తింపచేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. 2030 నాటికి కార్లన్నీ ఎలక్ట్రిక్: నిస్సాన్ వాహన తయారీ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహన విభాగం కారణంగా పరిశ్రమలో సమూల మార్పులు వస్తాయని కంపెనీ సీవోవో అశ్వని గుప్తా అన్నారు. 2030 నాటికి కంపెనీ కార్లన్నీ ఎలక్ట్రిక్ ఆప్షన్స్‌తో ఉంటాయని వెల్లడించారు. ‘భారత వాహన పరిశ్రమ ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. అయిదారేళ్లలో మూడవ స్థానానికి చేరడం ఖాయం. దేశంలో 1,000 మంది జనాభాకు 20 కార్లు మాత్రమే ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఎలా చేజిక్కించుకోవాలన్నదే పెద్ద సవాల్’ అని అన్నారు. -
ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతుగా నిలవాలి
న్యూఢిల్లీ: స్వావలంబన భారత్ లక్ష్య సాధనలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషించగలదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే చెప్పారు. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రూపంలో పరిశ్రమ ముందు చక్కని అవకాశం ఉందని, దీనికి మద్దతుగా నిలవాలని ఆయన సూచించారు. ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్ఏడీఏ) నిర్వహించిన 3వ ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్వావలంబన లక్ష్యాల విషయంలో ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి భారీగా పెరగాలని, ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులు ఎగుమతవ్వాలన్నది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వృద్ధి చెందడంలో డీలర్లు, విడిభాగాల తయారీ సంస్థలు, వాహనాల తయారీ సంస్థల పాత్ర కీలకంగా ఉంటుందని పాండే పేర్కొన్నారు. మరోవైపు, ఆటో రిటైల్ రంగం 45 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని, ప్రత్యక్ష–పరోక్ష పన్నులు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వానికి రూ. 95,000 కోట్లు కడుతోందని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ తెలిపారు. ఈ నేపథ్యంలో దీనికి పరిశ్రమ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భారీగా పెట్టుబడులు అవసరమైన ఈ రంగంలోని సంస్థలు నిధులు సమీకరించుకునేందుకు దీనితో మరిన్ని అవకాశాలు లభించగలవని ఆయన పేర్కొన్నారు. అటు, విదేశీ ఆటోమొబైల్ సంస్థలు అర్ధాంతరంగా నిష్క్రమించడం వల్ల డీలర్లు నష్టపోకుండా తగు రక్షణాత్మక చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని గులాటీ విజ్ఞప్తి చేశారు. తుక్కు సర్టిఫికేషన్ కేంద్రాలుగా డీలర్ వర్క్‌షాప్‌లు.. వాహనాల తుక్కు (స్క్రాపేజీ) విధానానికి సంబంధించి డీలర్ల వర్క్‌షాపులే తనిఖీ, సర్టిఫికేషన్ కేంద్రాలుగా వ్యవహరించేందుకు ప్రభుత్వం అనుమతించాలని ప్రభుత్వానికి ’సియామ్’ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా తనిఖీ కేంద్రాలను ప్రారంభించాలంటే చాలా సమయం పట్టేయవచ్చని, ఇవి అంత లాభసాటిగా కూడా ఉండకపోవచ్చని పేర్కొంది. ఎఫ్ఏడీఏ సదస్సులో పాల్గొన్న సందర్భంగా దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకావా ఈ విషయాలు తెలిపారు. ‘వాహనాలను పరీక్షించేందుకు అవసరమైన పరికరాలు, పెట్టుబడులు, నైపుణ్యాలు డీలర్ల దగ్గర ఎలాగూ ఉంటాయి కాబట్టి ప్రతిపాదిత విధానం ఉపయోగకరంగా ఉంటుంది. పైగా ఈ డీలర్‌షిప్‌లు చాలా మటుకు కస్టమర్లకు దగ్గర్లోనే ఉండటమనేది మరో సానుకూలాంశం‘ అని ఆయన వివరించారు. అటు, వాహనాల ఫిట్నెస్ పరీక్షలకు నిర్దేశించిన 15–20 ఏళ్ల వ్యవధి చాలా సుదీర్ఘమైనదని, అంతకన్నా ముందుగానే టెస్ట్ నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. చదవండి: ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్ -
వాహనాల డిమాండ్ పెరిగింది, ఆటో మొబైల్ రంగం పుంజుకుంది
న్యూఢిల్లీ: దేశీయ ఆటో పరిశ్రమ భవిష్యత్తు ఆశాజనకంగా మారింది. ముడి సరుకుల ధరల పెరుగుదల, లాజిసిక్ట్ సవాళ్ల నేపథ్యంలోను దేశీయ ఆటో పరిశ్రమ క్రమంగా కోలుకుంటుందని ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) తెలిపింది. ఆర్ధిక వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవటం, వాహనాల డిమాండ్ పెరగడంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో పరిశ్రమ పనితీరు ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేసింది. కోవిడ్ థర్డ్ వేవ్‌పై ఆధారపడి పరిశ్రమ పనితీరు ఆధారపడి ఉంటుందని తెలిపింది. గత ఫైనాన్షియల్ ఇయర్లో పరిశ్రమ టర్నోవర్‌లో 3 శాతం క్షీణతతో రూ.3.40 లక్షల కోట్లకు చేరిందని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ తెలిపారు. సెమీకండక్టర్ల లభ్యత, ముడిసరుకుల ధరల వృద్ధి, లాజిస్టిక్స్ ఇబ్బందులు, కంటైనర్ల అధిక ధరలు వంటివి పరిశ్రమ రికవరీకి అడ్డంకులుగా మారాయని చెప్పారు. వివిధ సవాళ్ల కారణంగా నిలిచిపోయిన పెట్టుబడులు పరిశ్రమ వృద్ధితో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఆటో పరిశ్రమ బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాలను కోల్పోయిందని.. ఇది ఇండస్ట్రీ వృద్ధిని చూసినప్పుడు 2018–19లో మొత్తం క్యాపెక్స్‌గా ఉండేదని ఆయన తెలిపారు. పరిశ్రమ వ్యయాల తగ్గింపు, స్థానికీకరణ చర్యలపై దృష్టిపెడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఆటోమోటివ్ పరిశ్రమలో 60–70 శాతం సామర్థ్య వినియోగం ఉన్పప్పటికీ ఉద్యోగుల పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. తక్కువ దిగుమతి సుంకాలు కోరుకుతున్న టెస్లా.. స్థానిక తయారీపై దృష్టి సారిస్తే ఏసీఎంఏ మద్దతు ఇస్తుందని చెప్పారు. హర్యానాలో స్థానికులకు 75 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఉండటంతో పరిశ్రమపై ప్రభావం చూపించిందని.. ఇలాంటి నిర్ణయాలు పోటీతత్వాన్ని తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
కరోనా గండం: ఆ పరిశ్రమ డిమాండ్ క్షీణించే అవకాశం
ముంబై : కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో సమీప భవిష్యత్తులో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ డిమాండ్ క్షీణించే రిస్కులు ఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఒక నివేదికలో తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విభాగం అమ్మకాలు పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టేస్తుందని పేర్కొంది. అయితే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ వాణిజ్య వాహనాలకు (సీవీ) డిమాండ్ 2021–22 ద్వితీయార్థంలో మెరుగుపడొచ్చని నివేదిక పేర్కొంది. ఎకానమీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం పలు తీసుకునే పలు చర్యలు కూడా సీవీల విక్రయాలు.. ముఖ్యంగా మీడియం, హెవీ సీవీల అమ్మకాలకు దోహదపడగలవని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ విక్రయాలు మొత్తం మీద 14 శాతం క్షీణించాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు 2 శాతం, సీవీల అమ్మకాలు 21 శాతం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13 శాతం పడిపోయాయి. 2021 మార్చి గణాంకాలు చూస్తే పీవీలు మినహా రిటైల్ విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణించడం చూస్తే కన్జూమర్ సెంటిమెంటు ఇంకా పూర్తిగా మెరుగుపడినట్లు కనిపించడం లేదని ఇండ్–రా నివేదికలో తెలిపింది. నివేదిక ఇతర విశేషాలు.. ►2021 మార్చి దాకా దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ వరుసగా ఎనిమిదో నెల సానుకూల వృద్ధి నమో దు చేసింది. 2020 మార్చి నాటి లో బేస్ ఎఫెక్ట్ కారణంగా 2021 మార్చిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 115 శాతం, ద్విచక్ర వాహనాల విక్రయాలు 73 శాతం వృద్ధి కనపర్చాయి. ►ఎగుమతుల పరిమాణం 2020 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 57 శాతం పెరిగింది. ద్విచక్ర వాహనాల ఎగుమతులు 63 శాతం పెరిగాయి. ►2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం ఎగుమతుల పరిమాణం 13 శాతం క్షీణించింది. ►కరోనా పరిస్థితులతో వ్యక్తిగత రవాణా వాహనాలకు డిమాండ్ పెరగడం వల్ల ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్‌కు కాస్త ప్రయోజనం చేకూరింది. మిగతా విభాగాలతో పోలిస్తే తక్కువ క్షీణత నమోదైంది. మధ్య స్థాయి, ఎగ్జిక్యూటివ్, ప్రీమియం కార్లు.. వ్యాన్ల సెగ్మెంట్‌తో పోలిస్తే కాంపాక్ట్, సూపర్ కాంపాక్ట్, మినీ, మైక్రో కార్ల అమ్మకాలు మెరుగ్గా నమోదయ్యాయి. తొలిసారిగా కారు కొనుగోలు చేస్తున్న వారు వీటికి ప్రాధాన్యమివ్వడం ఇందుకు కారణం. ►యుటిలిటీ వాహనాలకు డిమాండ్ కొనసాగింది. కొత్త వాహనాల ఆవిష్కరణ కారణంగా ఈ విభాగం 12 శాతం వృద్ధి చెందింది. ►గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ .. ద్విచక్ర వాహనాల విభాగానికి సానుకూలంగా దోహదపడింది. అయితే, విద్యా సంస్థలను తెరవడంలో జాప్యం జరగడం, ఇంధన ధరల పెరుగుదలతో వాహనాల నిర్వహణ వ్యయం పెరిగిపోవడం, కోవిడ్ సంబంధ లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి కొంత మేర ప్రతికూల ప్రభావమైతే పడింది. ముఖ్యంగా ఎంట్రీ స్థాయి మోడల్స్‌పై ఇది కనిపించింది. -
ఆటోకు ఆర్థిక శాఖ తోడ్పాటు..
గ్రేటర్ నోయిడా: కొంగొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఆటోమొబైల్ పరిశ్రమకు తగు తోడ్పాటు అందించాలని ఆర్థిక శాఖను కోరినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విద్యుత్ వాహనాల తయారీకి, ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్‌గా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆటో ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘కొన్నాళ్ల క్రితం రెండు ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. వాటి నాణ్యత చూశాక, రాబోయే రోజుల్లో ద్విచక్ర వాహనాలైనా.. కార్లయినా.. బస్సులైనా.. విద్యుత్ వాహనాల తయారీ, ఎగుమతుల్లో మనం కచ్చితంగా నంబర్ వన్ కాగలమని నాకు అనిపించింది‘ అని ఆయన చెప్పారు. వాహనాల తుక్కు పాలసీ తుది దశల్లో ఉందని, ఆటోమొబైల్ పరిశ్రమకు ఇది గణనీయంగా మేలు చేయగలదని గడ్కరీ తెలిపారు. మరోవైపు వాహనాలపై జీఎస్టీ తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌పై స్పందిస్తూ.. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు చెప్పారు. భారత దిగుమతుల భారాన్ని, కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయ టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు. ‘శాంత్రోవాలా’.. షారుఖ్.. దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ఇప్పటిదాకా అనేక కొత్త కార్లు ప్రవేశపెట్టినా.. ఇప్పటికీ తనకు శాంత్రో కారన్నా, శాంత్రో వాలా ప్రకటన అన్నా తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ చెప్పారు. ఆటో ఎక్స్‌పోలో కొత్త క్రెటా ఎస్‌యూవీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 22 సంవత్సరాలుగా హ్యుందాయ్‌కి షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. గ్రేట్ వాల్ మోటర్స్ ఉత్పత్తి హవల్ ఎఫ్5 ఎస్‌యూవీతో మోడల్స్ ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు ‘ఐడీ క్రాజ్’తో సంస్థ ప్రతినిధులు జేకే మోటర్ స్పోర్ట్స్ పెవిలియన్‌లో రేసింగ్ కారుతో మోడల్స్ ఆటో ఎక్స్‌పోలో సుజుకీ హయబుసా బైక్‌తో మోడల్ -
ముంచుకొస్తున్న ముప్పు!
-
ఆదుకోండి మహాప్రభో!!
న్యూఢిల్లీ: అమ్మకాలు లేకపోవడంతో పాటు పలు సవాళ్లతో సతమతమవుతున్న ఆటోమొబైల్ సంస్థలు ఆపన్న హస్తం అందించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని, వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలని కోరాయి. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ, ఎంఅండ్ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం).. ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ కూడా అయిన రాజన్ వధేరాతో పాటు ఆటో పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ‘ఆటో పరిశ్రమకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ మేం కోరాము. డిమాండ్‌ను పెంచే దిశగా వాహనాలపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశాము. ప్రభుత్వానికి కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆటో రంగానికి త్వరలో ఉద్దీపన ప్యాకేజీ లభించగలదని ఆశిస్తున్నాను‘ అని భేటీ అనంతరం రాజన్ వధేరా చెప్పారు. ఆటోమొబైల్ రంగ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం తప్పక చర్యలు తీసుకుంటుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ తెలిపారు. ‘చర్చల ప్రక్రియలో భాగంగానే ఈ సమావేశం జరిగింది. వారు చెప్పిన విషయాలన్నింటినీ పరిశీలిస్తాం. తాజాగా రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం సానుకూలాంశం. ఇక ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది‘ అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. దాదాపు ఏడాదికాలంగా అమ్మకాలు క్షీణించి వాహన సంస్థలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సియామ్ గణాంకాల ప్రకారం ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 60,85,406 యూనిట్లే అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 69,47,742 వాహన విక్రయాలతో పోలిస్తే ఇది 12.35 శాతం తగ్గుదల. మందగమనం కారణంగా గడిచిన మూడు నెలల్లో దాదాపు రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాల్లో కోత విధించాల్సి వచ్చిందని ఎఫ్ఏడీఏ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ఇప్పుడే వద్దు.. రుణ లభ్యత, అధిక వడ్డీ రేట్లపరమైన సమస్యలు, వాహనాల కొనుగోలు ఖర్చులు పెరిగిపోతుండటం, వాణిజ్య వాహనాల యాక్సి లోడ్ సామర్థ్యం లో మార్పులు చేయడం తదితర అంశాలు డిమాండ్‌ను దెబ్బతీశాయని వివరించినట్లు వధేరా చెప్పారు. ఇప్పటికే పలు సవాళ్లతో సతమతమవుతున్న నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనలను సత్వరం అమల్లోకి తెస్తే మరిన్ని సమస్యలు ఎదురవుతాయని పరిశ్రమ వర్గాలు మంత్రికి వివరించాయి. రుణ లభ్యత పెరిగేలా చూడాలి.. ‘తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు లభించేలా చూసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ప్రయోజనాలను కస్టమర్లకు వెంటనే బదలాయించేలా బ్యాంకులను కేంద్రం ఆదేశించాలంటూ కోరాము‘ అని వధేరా చెప్పారు. పాత, కాలుష్యకారకంగా మారుతున్న వాహనాలను రీప్లేస్ చేసేందుకు ప్రోత్సాహకాలతో కూడిన స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెడితే కొత్త వాహనాలకు డిమాండ్ పెరగగలదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వధేరా చెప్పారు. -
10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమలో మందగమనం మరింత కాలం కొనసాగితే 10 లక్షల పైచిలుకు ఉద్యోగాలకు కోత పడే ముప్పు పొంచి ఉందని ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను పెంచే దిశగా జీఎస్టీ రేటు తగ్గింపు తదితర చర్యలతో ఆటోమొబైల్ రంగం కోలుకునేందుకు తోడ్పాటు అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గత పది నెలలుగా అమ్మకాలు క్షీణిస్తూనే ఉండటంతో ఆటోమొబైల్ పరిశ్రమ సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోందని పేర్కొంది. ‘గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని విభాగాల వాహనాల విక్రయాలు చాలా నెలలుగా పడిపోతున్నాయి. దీంతో పరికరాల తయారీ విభాగంపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. వాహనాల రంగంపైనే పరికరాల తయారీ విభాగం కూడా ఆధారపడి ఉంటుంది. వాహనాల తయారీ 15–20 శాతం పడిపోవడంతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సిబ్బందిని తొలగించక తప్పదు. కనీసం 10 లక్షల మంది పైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని అంచనా‘ అని ఏసీఎంఏ అధ్యక్షుడు రామ్ వెంకటరమణి పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్వాసనలు మొదలయ్యాయని చెప్పారు. పరికరాల తయారీ రంగంలో దాదాపు 70 శాతం మంది కాంట్రాక్టు వర్కర్లే ఉంటారని, డిమాండ్ లేకపోతే సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ స్థూల దేశీయోత్పత్తిలో 2.3 శాతం వాటాతో ఆటోమోటివ్ పరికరాల తయారీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ రేటు తగ్గించాలి.. డిమాండ్ లేకపోవడం, బీఎస్ సిక్స్ స్థాయి ఉద్గార ప్రమాణాల వాహనాల తయారీపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి రావడం, విద్యుత్ వాహనాల విధానంపై స్పష్టత కొరవడటం తదితర అంశాలు ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్‌కు ప్రశ్నార్థకంగా మారాయని రామ్ చెప్పారు. దీంతో భవిష్యత్ పెట్టుబడులన్నీ నిల్చిపోయాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిమాండ్‌కి ఎంతో కొంత ఊతమిచ్చేలా జీఎస్టీ రేటు తగ్గించాలని పేర్కొన్నారు. ఆటోమొబైల్, ఆటో పరికరాలన్నింటికీ ఒకే రకంగా 18 శాతం జీఎస్టీ రేటు పరిధిలోకే చేర్చాలని కోరారు. ప్రస్తుతం దాదాపు 70 శాతం ఆటో పరికరాలు 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోనే ఉన్నప్పటికీ.. మిగతా 30 శాతం మాత్రం గరిష్ట శ్లాబ్ అయిన 28 శాతం విభాగంలో ఉన్నాయి. పైగా వాహనాల పొడవు, ఇంజిన్ సామర్థ్యం తదితర అంశాలను బట్టి 28 శాతం జీఎస్టీకి అదనంగా 1–15 శాతం దాకా అదనపు సెస్సు భారం కూడా ఉంటోందని రామ్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విధానంపై కేంద్రం స్పష్టతనివ్వాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లే క్రమంలో నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాలు.. ఆటో పరిశ్రమను ఆందోళనకు గురి చేసేవిగా ఉన్నాయని ఏసీఎంఏ డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా చెప్పారు. 2018–19లో ఆటో పరికరాల వ్యాపార విభాగం 14.5 శాతం వృద్ధితో రూ. 3.95 లక్షల కోట్లుగా ఉందని తెలిపారు. చైనాకు అవకాశాలు ఇవ్వొద్దు స్వేచ్చా వాణిజ్యానికి సంబంధించిన ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సెప్)లో ఆటో పరికరాలను చేర్చకుండా ఉండటం మంచిదని మెహతా తెలిపారు. అలా చేస్తే భారత మార్కెట్లో చైనా దొడ్డిదారిన ప్రవేశించేందుకు అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. ఇప్పటికే చైనా నుంచే భారత్ అత్యధికంగా పరికరాలు దిగుమతి చేసుకుంటోందని మెహతా వివరించారు. 2018–19లో చైనా నుంచి దిగుమతులు 4.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని, మొత్తం ఆటోమోటివ్ పరికరాల దిగుమతుల్లో ఇది 27 శాతమని తెలిపారు. చైనాతో పాటు జపాన్, కొరియా వంటి దేశాలతో కూడా భారత వాణిజ్యం లోటులోనే ఉందని చెప్పారు. -
మేలోనూ కారు రివర్స్‌గేరు!
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం గతుకుల రోడ్డుపై ప్రయాణం కొనసాగిస్తోంది. అధిక ఫైనాన్స్ వ్యయం, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) తగ్గిపోవడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో మే నెలలో కూడా అమ్మకాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ రంగంలోని మార్కెట్ లీడర్లు విక్రయాలు సైతం 20 శాతానికి మించి దిగజారాయి. ఆయా కంపెనీలు తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గత నెలలో మారుతీ సుజుకీ ఇండియా మొత్తం అమ్మకాలు ఏకంగా 22 శాతం క్షీణించాయి. టాటా మోటార్స్ విక్రయాలు 26 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 3 శాతం తగ్గిపోయాయి. ఈ అంశంపై మాట్లాడిన మహీంద్రా ఆటోమోటివ్ విభాగ ప్రెసిడెంట్ రాజన్ వాదేరా.. ‘సాధారణంగా ఎన్నికలకు ముందు ఆటోమొబైల్ అమ్మకాలు తగ్గుతాయి. మరోవైపు హైబేస్ నంబర్, అధిక ఫైనాన్స్ వ్యయం ఉన్నందున గత నెలలో సేల్స్ భారీగానే తగ్గాయి’ అని వివరించారు. వాహనాలపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలి పరిశ్రమ డిమాండ్ న్యూఢిల్లీ: వాహన అమ్మకాల క్షీణతకు ముగింపు పలికేందుకు గాను అన్ని రకాల వాహనాలపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రస్తుతం వాహనాలపై 28 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ఈ సూచన చేయడం గమనార్హం. అలాగే, కాలుష్య నిరోధానికి గాను పాత వాహనాలను తుక్కుగా మార్చి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా కోరింది. బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక శాఖ అధికారులకు సియామ్ ఈ మేరకు తమ డిమాండ్లను వినిపించింది. జీఎస్టీ రేటును తగ్గించడం వల్ల వాహనాల ధరలు దిగొస్తాయని, దాంతో 11 నెలలుగా అమ్మకాలు మందగించిన పరిశ్రమలో డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొంది. దేశీయ తయారీని ప్రోత్సహించడంలో భాగంగా పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకునే వాణిజ్య వాహనాలపై కస్టమ్స్ డ్యూటీని ప్రస్తుత 25 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని కూడా సియామ్ కోరింది. -
డీజిల్ కార్లకు మారుతీ మంగళం!
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు మారుతీ సుజుకీ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏప్రిల్ నుంచి డీజిల్ వెర్షన్ కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బీఎస్6 ఉద్గార నియమావళికి అనుగుణం గా ఆటోమొబైల్ పరిశ్రమ మారుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ దేశీయ కార్ల విక్రయాల్లో డీజిల్ కార్ల వాటా 23 శాతం ఉంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం 4.63 లక్షల డీజిల్ వాహనాలను విక్రయిం చింది. కంపెనీ ఉత్పత్తి చేసే విటారా, బ్రెజా, ఎస్‌క్రాస్ వంటి కొన్ని మోడళ్లు కేవలం డీజిల్ వెర్షన్లో మాత్రమే లభిస్తాయి. స్విఫ్ట్, బాలెనో, సియాజ్, ఎర్టిగా లాంటి మోడళ్లు రెండు వెర్షన్లలోనూ లభిస్తా యి. కేవలం డీజిల్ కార్ల విక్రయాలే కాకుండా వచ్చే ఏప్రిల్ నుంచి కంపెనీ ఎల్సీవీ సూపర్ క్యారీ డీజిల్ వెర్షన్ విక్రయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు మారుతీ ప్రకటించింది. ఇకపై సూపర్‌క్యారీ కేవలం పెట్రో ల్, సీఎన్జీ వెర్షన్లలో మాత్రమే లభిస్తుంది. డీజిల్ వాహనాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘2020 ఏప్రిల్1 నుంచి మేము డీజిల్ కార్లను విక్రయించం’’అని మారుతీ చైర్మన్ ఆర్సీ భార్గవ స్పష్టం చేశారు. అయితే బీఎస్6 డీజిల్ కార్లకు డి మాండ్ బాగా పెరిగితే అప్పుడు అందుకు తగ్గ మో డల్ను తయారు చేస్తామని వివరించారు. భవిష్యత్‌లో డీజిల్ ఇంజన్లతో కూడిన కార్లను తయారు చే యాల్సి వస్తే 1500 లీటర్లకు పైబడిన డీజిల్ ఇం జన్లనే తయారు చేస్తామని భార్గవ చెప్పారు. చిన్న డీజిల్ కార్లు పెద్దగా లాభదాయకం కాదన్నారు. బీఎస్6 నిబంధనలతో మరింత ప్రియం యూరప్‌లో బీఎస్6 నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత డీజిల్ వాహనాల విక్రయాల్లో క్షీణత నమోదవుతోందని భార్గవ చెప్పారు. ఈ నిబంధనలతో కూడిన డీజిల్ వాహనాల ధర పెట్రోల్ వాహనాల ధరతో పోలిస్తే భారీగా పెరిగిందని, దీంతో వీటిపై కస్టమర్లు ఆసక్తి చూపడం లేదన్నారు. ఇండియాలో కస్టమర్లు ధరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని, అందువల్ల ఇకపై డీజిల్ ఇంజన్ వాహనాల విక్రయాలు ఇక్కడ కూడా క్షీణిస్తాయని అభిప్రాయపడ్డారు. డీజిల్ కార్లు కొనాలనుకునేవాళ్లు ఈ ఏడాది కొనడం మంచిదని, వచ్చే ఏడాది వీటి ధరలు భారీగా పెరగవచ్చని సూచించారు. ఇటీవలే కంపెనీ బీఎస్4 నిబంధనలకు అనుగుణమైన సియాజ్ సెడాన్ 1,500 లీటర్ల డీజిల్ ఇంజన్ వెర్షన్‌ను తయారు చేసింది. ఈ కారు ఇంజన్‌ను కంపెనీ సొంతంగా నిర్మించింది. ప్రస్తుతం కంపెనీ విక్రయించే డీజిల్ వాహనాల్లో ఇంజన్లను ఫియట్ సరఫరా చేస్తోంది. 2020 మార్చి చివరకు తమ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసే 16 మోడళ్ల పెట్రోల్ ఇంజన్లను బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. ఇప్పటికే ఆల్టో 800ను బీఎస్6 అనుగుణంగా పెట్రోల్ ఇంజన్‌తో ప్రవేశపెట్టామని తెలిపారు. ఇప్పటికిప్పుడు బలమైన హైబ్రిడ్ సాంకేతికతో తయారు చేసిన మోడళ్లను తీసుకువచ్చే ఆలోచన లేదని, భవిష్యత్‌లో వీటిపై ఫోకస్ చేస్తామని కంపెనీ సీఈఓ కెనిచి అయుకవా చెప్పారు. లాభంలో 4.6 శాతం క్షీణత మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ నికరలాభం 4.6 శాతం పతనమై 1,795.6 కోట్లకు చేరింది. 2017–18 చివరి త్రైమాసికంలో కంపెనీ రూ. 1882.1 కోట్ల లాభం నమోదు చేసింది. సమీక్షా కాలంలో కంపెనీ నికర విక్రయాలు రూ. 20,737.5 కోట్లకు చేరాయి. అంతకుముందేడాదితో పోలిస్తే ఈ మొత్తం స్వల్పంగా అధికం. క్యు4లో మొత్తం కార్ల విక్రయాలు స్వల్పంగా క్షీణించి 4,58,479 యూనిట్లకు చేరాయి. మొత్తం 2018–19 సంవత్సరానికి కంపెనీ నికరలాభం 2.9 శాతం పతనమై 7,500.6 కోట్లకు చేరింది. నికర విక్రయాలు 6.3 శాతం పెరిగి 83,026.5 కోట్లకు చేరాయి. వాల్యూం పరంగా విక్రయాలు 4.7 శాతం పెరిగి 18,62,449 యూనిట్లకు చేరాయి. ఇందులో 1,08,749 యూనిట్లను ఎగుమతి చేసినట్లు కంపెనీ తెలిపింది. మార్చి త్రైమాసికంలో కరెన్సీ రేట్లలో ఆటుపోట్లు, కమోడిటీ ధరల్లో పెరుగుదల, ప్రమోషన్ వ్యయాలు పెరగడం, రూపీ క్షీణత వంటివి ఫలితాలపై ప్రభావం చూపాయని కంపెనీ వివరించింది. తాము చేపట్టిన వ్యయ నియంత్రణా చర్యలు లాభాలు మరింత పతనం కాకుండా ఆదుకున్నట్లు తెలిపింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి కంపెనీ షేరుపై రూ. 80 డివిడెండ్‌ను మారుతీ ప్రకటించింది. గతేడాది రూ.4వేల కోట్ల మూలధన వ్యయాలు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 4,500 కోట్ల క్యాపెక్స్ ప్రణాళికలు తయారు చేశామని కంపెనీ తెలిపింది. ఈ నిధులను ఆర్అండ్డీ, కొత్త షోరూంలకోసం భూసమీకరణ, కొత్త ఉత్పత్తుల అభివృద్ధి తదితర అంశాలపై వెచ్చిస్తామని కంపెనీ సీఎఫ్ఓ అజిత్ సేథ్ చెప్పారు. కంపెనీ ఉత్పాదిత బాలెనో ధరను రూ. 15వేల మేర పెంచుతున్నట్లు మారుతీ ప్రకటించింది. ఆర్సీ భార్గవ -
2020కల్లా వాహన తయారీలో భారత్ మూడో స్థానానికి
ఫోర్డ్ మోటార్స్ అంచనా.. కోయంబత్తూరు: భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోందని ఫోర్డ్ మోటార్స్ తెలిపింది. దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ 2020 నాటికి 70 లక్షల వాహనాల తయారీ మార్క్‌ను చేరుకుంటుందని పేర్కొంది. దీంతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ దేశంగా (అమెరికా, చైనాల తర్వాత) ఆవిర్భవిస్తుందని తెలిపింది. భారత జీడీపీలో ఆటోమొబైల్ రంగం వాటా 7 శాతంగా ఉంటుందని ఫోర్డ్ మోటార్స్ ప్రెసిడెంట్ డేవిడ్ డూబెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆదివారం మాట్లాడారు. తాము మంచి ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నామని, మంచి వ్యాపారాభివృద్ధిని నమోదు చేస్తున్నామని అన్నారు.