న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు మారుతీ సుజుకీ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏప్రిల్ నుంచి డీజిల్ వెర్షన్ కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బీఎస్6 ఉద్గార నియమావళికి అనుగుణం గా ఆటోమొబైల్ పరిశ్రమ మారుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ దేశీయ కార్ల విక్రయాల్లో డీజిల్ కార్ల వాటా 23 శాతం ఉంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం 4.63 లక్షల డీజిల్ వాహనాలను విక్రయిం చింది. కంపెనీ ఉత్పత్తి చేసే విటారా, బ్రెజా, ఎస్‌క్రాస్ వంటి కొన్ని మోడళ్లు కేవలం డీజిల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తాయి. స్విఫ్ట్, బాలెనో, సియాజ్, ఎర్టిగా లాంటి మోడళ్లు రెండు వెర్షన్లలోనూ లభిస్తా యి.
కేవలం డీజిల్ కార్ల విక్రయాలే కాకుండా వచ్చే ఏప్రిల్ నుంచి కంపెనీ ఎల్‌సీవీ సూపర్ క్యారీ డీజిల్ వెర్షన్ విక్రయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు మారుతీ ప్రకటించింది. ఇకపై సూపర్‌క్యారీ కేవలం పెట్రో ల్, సీఎన్‌జీ వెర్షన్లలో మాత్రమే లభిస్తుంది. డీజిల్ వాహనాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘2020 ఏప్రిల్1 నుంచి మేము డీజిల్ కార్లను విక్రయించం’’అని మారుతీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ స్పష్టం చేశారు. అయితే బీఎస్6 డీజిల్ కార్లకు డి మాండ్ బాగా పెరిగితే అప్పుడు అందుకు తగ్గ మో డల్‌ను తయారు చేస్తామని వివరించారు. భవిష్యత్‌లో డీజిల్ ఇంజన్లతో కూడిన కార్లను తయారు చే యాల్సి వస్తే 1500 లీటర్లకు పైబడిన డీజిల్ ఇం జన్లనే తయారు చేస్తామని భార్గవ చెప్పారు. చిన్న డీజిల్ కార్లు పెద్దగా లాభదాయకం కాదన్నారు.
బీఎస్6 నిబంధనలతో మరింత ప్రియం
యూరప్‌లో బీఎస్6 నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత డీజిల్ వాహనాల విక్రయాల్లో క్షీణత నమోదవుతోందని భార్గవ చెప్పారు. ఈ నిబంధనలతో కూడిన డీజిల్ వాహనాల ధర పెట్రోల్ వాహనాల ధరతో పోలిస్తే భారీగా పెరిగిందని, దీంతో వీటిపై కస్టమర్లు ఆసక్తి చూపడం లేదన్నారు. ఇండియాలో కస్టమర్లు ధరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని, అందువల్ల ఇకపై డీజిల్ ఇంజన్ వాహనాల విక్రయాలు ఇక్కడ కూడా క్షీణిస్తాయని అభిప్రాయపడ్డారు. డీజిల్ కార్లు కొనాలనుకునేవాళ్లు ఈ ఏడాది కొనడం మంచిదని, వచ్చే ఏడాది వీటి ధరలు భారీగా పెరగవచ్చని సూచించారు.
ఇటీవలే కంపెనీ బీఎస్4 నిబంధనలకు అనుగుణమైన సియాజ్ సెడాన్ 1,500 లీటర్ల డీజిల్ ఇంజన్ వెర్షన్‌ను తయారు చేసింది. ఈ కారు ఇంజన్‌ను కంపెనీ సొంతంగా నిర్మించింది. ప్రస్తుతం కంపెనీ విక్రయించే డీజిల్ వాహనాల్లో ఇంజన్లను ఫియట్ సరఫరా చేస్తోంది. 2020 మార్చి చివరకు తమ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసే 16 మోడళ్ల పెట్రోల్ ఇంజన్లను బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. ఇప్పటికే ఆల్టో 800ను బీఎస్6 అనుగుణంగా పెట్రోల్ ఇంజన్‌తో ప్రవేశపెట్టామని తెలిపారు. ఇప్పటికిప్పుడు బలమైన హైబ్రిడ్ సాంకేతికతో తయారు చేసిన మోడళ్లను తీసుకువచ్చే ఆలోచన లేదని, భవిష్యత్‌లో వీటిపై ఫోకస్ చేస్తామని కంపెనీ సీఈఓ కెనిచి అయుకవా చెప్పారు.
లాభంలో 4.6 శాతం క్షీణత
మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ నికరలాభం 4.6 శాతం పతనమై 1,795.6 కోట్లకు చేరింది. 2017–18 చివరి త్రైమాసికంలో కంపెనీ రూ. 1882.1 కోట్ల లాభం నమోదు చేసింది. సమీక్షా కాలంలో కంపెనీ నికర విక్రయాలు రూ. 20,737.5 కోట్లకు చేరాయి. అంతకుముందేడాదితో పోలిస్తే ఈ మొత్తం స్వల్పంగా అధికం. క్యు4లో మొత్తం కార్ల విక్రయాలు స్వల్పంగా క్షీణించి 4,58,479 యూనిట్లకు చేరాయి. మొత్తం 2018–19 సంవత్సరానికి కంపెనీ నికరలాభం 2.9 శాతం పతనమై 7,500.6 కోట్లకు చేరింది. నికర విక్రయాలు 6.3 శాతం పెరిగి 83,026.5 కోట్లకు చేరాయి. వాల్యూం పరంగా విక్రయాలు 4.7 శాతం పెరిగి 18,62,449 యూనిట్లకు చేరాయి. ఇందులో 1,08,749 యూనిట్లను ఎగుమతి చేసినట్లు కంపెనీ తెలిపింది.
మార్చి త్రైమాసికంలో కరెన్సీ రేట్లలో ఆటుపోట్లు, కమోడిటీ ధరల్లో పెరుగుదల, ప్రమోషన్ వ్యయాలు పెరగడం, రూపీ క్షీణత వంటివి ఫలితాలపై ప్రభావం చూపాయని కంపెనీ వివరించింది. తాము చేపట్టిన వ్యయ నియంత్రణా చర్యలు లాభాలు మరింత పతనం కాకుండా ఆదుకున్నట్లు తెలిపింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి కంపెనీ షేరుపై రూ. 80 డివిడెండ్‌ను మారుతీ ప్రకటించింది. గతేడాది రూ.4వేల కోట్ల మూలధన వ్యయాలు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 4,500 కోట్ల క్యాపెక్స్ ప్రణాళికలు తయారు చేశామని కంపెనీ తెలిపింది. ఈ నిధులను ఆర్‌అండ్‌డీ, కొత్త షోరూంలకోసం భూసమీకరణ, కొత్త ఉత్పత్తుల అభివృద్ధి తదితర అంశాలపై వెచ్చిస్తామని కంపెనీ సీఎఫ్‌ఓ అజిత్ సేథ్ చెప్పారు. కంపెనీ ఉత్పాదిత బాలెనో ధరను రూ. 15వేల మేర పెంచుతున్నట్లు మారుతీ ప్రకటించింది.
ఆర్‌సీ భార్గవ
Comments
Please login to add a commentAdd a comment