న్యూఢిల్లీ: స్వావలంబన భారత్ లక్ష్య సాధనలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషించగలదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే చెప్పారు. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రూపంలో పరిశ్రమ ముందు చక్కని అవకాశం ఉందని, దీనికి మద్దతుగా నిలవాలని ఆయన సూచించారు. ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) నిర్వహించిన 3వ ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.
స్వావలంబన లక్ష్యాల విషయంలో ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి భారీగా పెరగాలని, ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులు ఎగుమతవ్వాలన్నది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వృద్ధి చెందడంలో డీలర్లు, విడిభాగాల తయారీ సంస్థలు, వాహనాల తయారీ సంస్థల పాత్ర కీలకంగా ఉంటుందని పాండే పేర్కొన్నారు. మరోవైపు, ఆటో రిటైల్ రంగం 45 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని, ప్రత్యక్ష–పరోక్ష పన్నులు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వానికి రూ. 95,000 కోట్లు కడుతోందని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ తెలిపారు.
ఈ నేపథ్యంలో దీనికి పరిశ్రమ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భారీగా పెట్టుబడులు అవసరమైన ఈ రంగంలోని సంస్థలు నిధులు సమీకరించుకునేందుకు దీనితో మరిన్ని అవకాశాలు లభించగలవని ఆయన పేర్కొన్నారు. అటు, విదేశీ ఆటోమొబైల్ సంస్థలు అర్ధాంతరంగా నిష్క్రమించడం వల్ల డీలర్లు నష్టపోకుండా తగు రక్షణాత్మక చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని గులాటీ విజ్ఞప్తి చేశారు.
తుక్కు సర్టిఫికేషన్ కేంద్రాలుగా డీలర్ వర్క్‌షాప్‌లు..
వాహనాల తుక్కు (స్క్రాపేజీ) విధానానికి సంబంధించి డీలర్ల వర్క్‌షాపులే తనిఖీ, సర్టిఫికేషన్ కేంద్రాలుగా వ్యవహరించేందుకు ప్రభుత్వం అనుమతించాలని ప్రభుత్వానికి ’సియామ్’ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా తనిఖీ కేంద్రాలను ప్రారంభించాలంటే చాలా సమయం పట్టేయవచ్చని, ఇవి అంత లాభసాటిగా కూడా ఉండకపోవచ్చని పేర్కొంది. ఎఫ్‌ఏడీఏ సదస్సులో పాల్గొన్న సందర్భంగా దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకావా ఈ విషయాలు తెలిపారు.
‘వాహనాలను పరీక్షించేందుకు అవసరమైన పరికరాలు, పెట్టుబడులు, నైపుణ్యాలు డీలర్ల దగ్గర ఎలాగూ ఉంటాయి కాబట్టి ప్రతిపాదిత విధానం ఉపయోగకరంగా ఉంటుంది. పైగా ఈ డీలర్‌షిప్‌లు చాలా మటుకు కస్టమర్లకు దగ్గర్లోనే ఉండటమనేది మరో సానుకూలాంశం‘ అని ఆయన వివరించారు. అటు, వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలకు నిర్దేశించిన 15–20 ఏళ్ల వ్యవధి చాలా సుదీర్ఘమైనదని, అంతకన్నా ముందుగానే టెస్ట్ నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.
చదవండి: ఫేస్‌బుక్‌లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్
Comments
Please login to add a commentAdd a comment