
ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం సబ్సిడీని తగ్గిస్తే ఆ భారం కస్టమర్లపై పడే అవకాశం ఉంది. అంటే ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తయారీ సంస్థలు పెంచే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక యాప్! రూపొందించిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం
ప్రస్తుతం ఫేమ్ (FAME) 2 పథకం కింద ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు 40 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ పథకం కొనసాగుతుందా లేదా అన్న దానిపై చాలా కాలంగా అనేక పుకార్లు ఉన్నాయి. వీటి ప్రభావం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టిందని, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలను పూర్తిగా నిలిపివేయనుందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే అధికారికంగా ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు.
అయితే తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీని నిర్ణయించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త ఫార్ములాను ప్రతిపాదించినట్లు ఫినాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంటోంది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం 40 శాతం ప్రకారం కిలోవాట్‌కు ఇస్తున్న రూ.15,000 సబ్సిడీ రూ.10,000లకు తగ్గించాలని మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది.
సబ్సిడీపై గరిష్ట పరిమితిని కూడా ప్రస్తుత 40 శాతం నుంచి ఎంఆర్‌పీలో 15 శాతానికి తగ్గించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు రూ.1.5 లక్షల ధర, 3.5 కిలోవాట్‌ల బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌పై ప్రస్తుతం రూ.52,500 సబ్సిడీ వస్తుంది. కొత్త ఫార్ములా ప్రకారం సబ్సిడీ రూ.22,500 లకు తగ్గిపోతుంది. ఫేమ్ 2 పథకం కింద వచ్చే ఏడాది నాటికి పది లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు మద్దతునిచ్చేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ వాహనాలపై సబ్సిడీ మాత్రం తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఇక నో వెయిటింగ్! స్పీడ్ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్