FAME II Subsidy Reduction To Hit Electric Two-Wheelers Sales In India - Sakshi
Sakshi News home page

భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్‌ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే..

Published Wed, May 24 2023 7:38 AM | Last Updated on Wed, May 24 2023 8:35 AM

fame 2 subsidy reduction to hit ev two wheeler sales in india - Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల సబ్సిడీని అకస్మాత్తుగా తగ్గించడం వల్ల అమ్మకాల్లో భారీ క్షీణతకు దారితీయవచ్చని సొసైటీ ఆఫ్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఎస్‌ఎంఈవీ) మంగళవారం తెలిపింది. దీని ప్రభావం దీర్ఘకాలం పరిశ్రమపై ఉంటుందని వివరించింది. అయితే ఈవీ పరిశ్రమ తనంతట తానుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ రంగంలోని స్టార్టప్‌ కంపెనీలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి.

2023 జూన్‌ 1 లేదా ఆ తర్వాత నమోదయ్యే ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలపై ఫేమ్‌–2 పథకం కింద సబ్సిడీని తగ్గించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మార్పులు చేస్తూ నోటిఫై చేసింది. దీని ప్రకారం కిలోవాట్‌ అవర్‌కు రూ.10,000 సబ్సిడీ ఉంటుంది. ప్రోత్సాహకాలపై పరిమితి ఎక్స్‌–ఫ్యాక్టరీ ధరలో ప్రస్తుతం ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. ప్రభుత్వ చర్యతో ముడి చమురు దిగుమతుల అధిక బిల్లులకు, చాలా భారతీయ నగరాల్లో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యానికి దారితీయవచ్చని సొసైటీ వివరించింది.  

సున్నితమైన ధర.. 
‘వాస్తవికత ఏమిటంటే భారతీయ మార్కెట్లో ధర సున్నితంగా ఉంటుంది. మొత్తం ఖర్చుకు వెనుకాడతారు. ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు సన్నద్ధంగా లేరు. పెట్రోలు ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రూ.1 లక్ష కంటే తక్కువ ధర కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ కోసం రూ.1.5 లక్షలకు పైగా ఖర్చు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి’ అని ఎస్‌ఎంఈవీ డైరెక్టర్‌ జనరల్‌ సోహిందర్‌ గిల్‌ తెలిపారు. మార్కెట్‌ వృద్ధి చెందే వరకు కస్టమర్‌కు సబ్సిడీలను కొనసాగించాలి. దేశంలో మొత్తం ద్విచక్ర వాహనాల్లో ప్రస్తుతం ఈవీల వాటా 4.9 శాతమే.

అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ ప్రకారం ఇది 20 శాతం చేరుకోవడానికి నిరంతర రాయితీలు అనువైనవి. అయితే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితమే దీని గురించి సూచనను ఇచ్చింది. నాలుగేళ్లలో 10 లక్షల యూనిట్ల అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోబోతున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని స్పష్టం చేసిందని గిల్‌ చెప్పారు. అకస్మాత్తుగా సబ్సిడీని నిలిపివేయడం, బడ్జెట్‌ను బాగా తగ్గించడం లేదా ఈ–త్రీవీలర్ల బడ్జెట్‌ నుండి కొంత ఖర్చు చేయని డబ్బును మళ్లించడం ద్వారా మిగిలిన సంవత్సరాన్ని ఎలాగైనా నిర్వహించడం మినహా మంత్రిత్వ శాఖకు మరో మార్గం లేదని అన్నారు.  

సమయం ఆసన్నమైంది.. 
సబ్సిడీని 15 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, డిమాండ్‌ ఉందని స్పష్టమైందని వోల్టప్‌ కో–ఫౌండర్‌ సిద్ధార్థ్‌ కాబ్రా తెలిపారు. సబ్సిడీ తగ్గింపు తక్షణ ప్రభావంతో ధరల పెరుగుదలతోపాటు అమ్మకాలు తగ్గుతాయి. అయితే ప్రభుత్వం ఒక విధంగా పరిశ్రమను స్వతంత్రంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. పరిశ్రమ, ప్రభుత్వం ఈ రంగానికి ఊతమిచ్చేలా నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడకుండా సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తులను రూపొందించడంలో సహాయపడే సమ్మిళిత మౌలిక సదుపాయాల అభివృద్ధి విధానాన్ని రూపొందించడానికి కృషి చేయాలి’ అని కాబ్రా పిలుపునిచ్చారు.

హోప్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కో–ఫౌండర్‌ నిఖిల్‌ భాటియా మాట్లాడుతూ ప్రభుత్వ చర్యకు మద్దతు ఇస్తూనే.. ‘ఈవీ పరిశ్రమ తనంతట తానుగా నిలబడటానికి ఇది సరైన సమయం. ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగం దీర్ఘకాలిక పురోగతి, జీవనోపాధికి మరింత ఆచరణాత్మక విధానాన్ని కలిగి ఉండాలి. రాయితీలను తొలగించడం అనేది ముందుకు సాగే చర్య. సబ్సిడీలపై ఆధారపడటం క్రమంగా తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన పరిశ్రమ అభివృద్ధి చెందడానికి సబ్సిడీలు ఇకపై అవసరం లేదు. ఫేమ్‌–2 సబ్సిడీని తగ్గించడం, తొలగించడం సరైన దిశలో స్వాగతించే దశ’ అని భాటియా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్‌ బైక్‌లు కొనేవారికి బ్యాడ్‌ న్యూస్‌.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement