acma
-
రూ.1,16,200 కోట్లకు వాహన విడిభాగాల విపణి
న్యూఢిల్లీ: వాహన విక్రయానంతర విడిభాగాల మార్కెట్ దేశీయంగా 2028 నాటికి రూ.1,16,200 కోట్లకు చేరుకుంటుందని ఒక నివేదిక వెల్లడించింది. వాహన విక్రయాల్లో భారీ వృద్ధి ఇందుకు కారణమని తెలిపింది. 2023లో ఇది రూ.83,000 కోట్లు ఉంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ భాగస్వామ్యంతో ఆటోమోటివ్ కంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) ఈ నివేదిక రూపొందించింది. ‘ప్రస్తుతం భారతీయ రోడ్లపై 34 కోట్ల వాహనాలు పరుగెడుతున్నాయి. ఈ సంఖ్య వచ్చే అయిదేళ్లలో ఏటా వార్షిక సగటు వృద్ధి 8 శాతం నమోదు కానుంది. 2028 నాటికి ద్విచక్ర వాహనాలు 25.7 కోట్ల నుంచి 36.5 కోట్లకు, ప్యాసింజర్ వాహనాలు 4.7 కోట్ల నుంచి 7.2 కోట్లకు చేరనున్నాయి. ప్రీ–ఓన్డ్ కార్ల విక్రయాల సగటు వృద్ధి 2027–28 నాటికి ఏటా 17.5 శాతం ఉంటుంది. వాణిజ్య వాహనాల సంఖ్య 1.3 కోట్ల నుంచి 1.9 కోట్లను తాకనుంది. ట్రాక్టర్లు 1.4 కోట్ల నుంచి 1.9 కోట్లకు చేరనున్నాయి. ఇక్కడి కంపెనీలకు టాప్–10 అంతర్జాతీయ మార్కెట్లకు రూ.2,90,500 కోట్ల విలువైన ఎగుమతి అవకాశాలు లభిస్తాయి. ఇంజన్, సస్పెన్షన్, బ్రేకింగ్, ట్రాన్స్మిషన్ పార్ట్స్, రబ్బర్ విడిభాగాలు, కూలింగ్ సిస్టమ్స్, ఫిల్టర్స్‌కు ప్రధానంగా డిమాండ్ ఉంటుంది’ అని నివేదిక వివరించింది. టైర్లు, లూబ్రికెంట్స్, కూలెంట్స్, బ్యాటరీలను నివేదికలో పొందుపర్చలేదు. -
అయిదేళ్లలో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆటో విడిభాగాల పరిశ్రమ తదనుగుణంగా సామరŠాధ్యలను పెంచుకోవడంపై, టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో 6.5 –7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆటో విడిభాగాల పరిశ్రమ ఆదాయం 12.6 శాతం పెరిగి రూ. 2.98 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఏడాదీ ఇదే ధోరణి కొనసాగవచ్చని, రెండంకెల స్థాయిలో అమ్మకాలు ఉండగలవని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడి ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘పండుగ సీజన్లో వివిధ సెగ్మెంట్లలో గణనీయంగా అమ్మకాలు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆటో విడిభాగాల రంగం మరింత మెరుగ్గా రాణించగలదని ఆశాభావంతో ఉన్నాము‘ అని ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ ప్రెసిడెంట్ శ్రద్ధా సూరి మార్వా తెలిపారు. దేశ, విదేశ కస్టమర్ల అవసరాలను తీర్చే విధంగా సామర్ధ్యాలను పెంచుకుంటున్నట్లు ఆమె చెప్పారు. గత అయిదేళ్లలో సుమారు 3.5–4 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ చేయగా.. రాబోయే అయిదేళ్లలో 6.5–7 బిలియన్ డాలర్లు వెచి్చంచనున్నట్లు వివరించారు. 875 పైచిలుకు సంస్థలకు ఏసీఎంఏలో సభ్యత్వం ఉంది. సంఘటిత ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరులో వీటికి 90 శాతం పైగా వాటా ఉంటుంది. స్థిరంగా ఎగుమతులు.. వాహన విక్రయాలు, ఎగుమతులు స్థిరమైన పనితీరు కనపరుస్తున్నాయని ఏసీఎంఏ డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా తెలిపారు. వాహన పరిశ్రమలోని అన్ని సెగ్మెంట్లకు ఆటో విడిభాగాల సరఫరా నిలకడగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆటో విడిభాగాల ఎగుమతులు 2.7 శాతం పెరిగి 10.4 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 3.6 శాతం పెరిగి 10.6 బిలియన్ డాలర్లకు చేరాయని వివరించారు. దిగుమతుల్లో ఆసియా వాటా 63 శాతంగా ఉండగా, యూరప్ (27 శాతం), ఉత్తర అమెరికా (9 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. దిగుమతులను తగ్గించుకునేందుకు, ప్రభుత్వ తోడ్పాటుతో దేశీయంగా తయారీని పెంచేందుకు పరిశ్రమ గట్టిగా కృషి చేస్తోందని మెహతా వివరించారు. మార్వా, మెహతా చెప్పిన మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో ఎగుమతులకు సంబంధించి చెరి 33 శాతం వాటాతో ఉత్తర అమెరికా, యూరప్ అతి పెద్ద మార్కెట్లుగా కొనసాగాయి. ► ఇదే వ్యవధిలో దేశీయంగా ఉత్పాదనల తయారీ సంస్థలకు (ఓఈఎం) విడిభాగాల అమ్మకాలు 13.9 శాతం పెరిగి రూ. 2.54 లక్షల కోట్లకు చేరాయి. ► భారీ, శక్తిమంతమైన వాహనాలపై ఆసక్తి పెరుగుతుండటం .. ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరు వృద్ధికి దోహదపడుతోంది. ఆఫ్టర్‌మార్కెట్ సెగ్మెంట్ 7.5 శాతం పెరిగి రూ. 45,158 కోట్లకు చేరింది. ► ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్ వృద్ధి కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే ఈసారి ఈవీల విడిభాగాల విక్రయాలకు సంబంధించిన ఆదాయం గణనీయంగా పెరిగింది. -
రిపేరు హక్కు ఉద్యమంలో భాగంగా ఏసీఎంఏ..
న్యూఢిల్లీ: వాహనాలను వినియోగదారులు ఎవరిదగ్గరైనా మరమ్మతు చేయించుకునే హక్కును సాధించుకునేందుకు అంతర్జాతీయంగా సాగుతున్న ఉద్యమానికి తాము కూడా మద్దతునిస్తున్నట్లు దేశీ ఆటో విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ వెల్లడించింది. వివరాల్లోకి వెడితే.. వైర్లెస్ విధానంలో కనెక్టెడ్‌గా ఉంటున్న వాహనాల డేటా అంతా కూడా వాటి తయారీ సంస్థలకు చేరుతోంది. దీంతో వాటికి ఏమైనా రిపేర్లు వస్తే బైట వేరే వారి దగ్గర మరమ్మతు చేయించుకోనివ్వకుండా కంపెనీలు నిరోధించేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. ఫలితంగా వినియోగదారులు తాము కోరుకున్న చోట రిపేరు చేయించుకునే హక్కులకు భంగం కలుగుతోంది. తప్పనిసరిగా కంపెనీనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే రిపేర్ హక్కుల ఉద్యమం తెరపైకి వచ్చింది. వారంటీ వ్యవధి ముగిసిపోయిన వాహనాలకు వచ్చే మరమ్మతుల్లో 70 శాతం భాగాన్ని స్వతంత్ర రిపేర్ షాపులే చేస్తున్నాయి. కొనుగోలు అనంతర సేవలకు సంబంధించిన ఆఫ్టర్‌మార్కెట్ విభాగం దేశీయంగా 10.1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వినియోగదారులు కోరుకుంటున్న రిపేర్ హక్కులకు మద్దతునిస్తున్న ఇతర అంతర్జాతీయ సంస్థలతో పాటు తామూ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ఏసీఎంఏ తెలిపింది. రైట్ టు రిపేర్ కింద దేశీయంగానూ చట్టం తీసుకొస్తే భారత్‌లో ఆఫ్టర్‌మార్కెట్ విభాగం మరింతగా విస్తరించగలదని పేర్కొంది. అంతర్జాతీయంగా అమెరికాలో ఈ ఉద్యమం మొదలైంది. -
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జూమ్..
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరగనున్నాయి. 2030 నాటికి మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 50-70 శాతం వరకూ ఉండనుంది. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏసీఎంఏ సదస్సు సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు. ఈ నివేదిక ప్రకారం ప్యాసింజర్, భారీ వాణిజ్య వాహనాలతో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటమనేది ఎలక్ట్రిక్ ద్వి, త్రిచక్ర వాహనాల విషయంలో ఆకర్షణీయ అంశంగా ఉండనుంది. దేశీయంగా ప్యాసింజర్, భారీ వాణిజ్య వాహనాల విభాగంలో విద్యుదీకరణ నెమ్మదిగా ఉండనుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లతో (ఐసీఈ) నడిచే వాహనాల ఆధిపత్యమే కొనసాగనుంది. 2030 నాటికి కొత్త వాహనాల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల వాటా 10-15 శాతం, విద్యుత్ వాణిజ్య వాహనాల వాటా 5-10 శాతంగా ఉండనుంది. (బిలియనీర్ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?) నివేదిక ప్రకారం వచ్చే దశాబ్దకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడమనేది వాహనాల పరిశ్రమ దిశను మార్చేయనుంది. యూరప్, చైనా మార్కెట్లు ఈ మార్పునకు సారథ్యం వహించనుండగా, మిగతా ప్రపంచ దేశాలు వాటిని అనుసరించనున్నాయి. ఈ దశాబ్దం మధ్య నాటికి భారత్, చైనాలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గరిష్ట స్థాయికి పుంజుకోనున్నాయి. సమీప కాలంలో సరఫరాపరమైన అంతరాయాలు ఎదురైనప్పటికీ వాహనాల పరిశ్రమకు దీర్ఘకాలికంగా అవకాశాలు అత్యంత ఆశావహంగానే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పరిశ్రమ ముఖచిత్రం మారుతున్న నేపథ్యంలో దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ సాంప్రదాయ మార్కెట్లకే పరిమితం కాకుండా కొత్త మార్కెట్లకు కూడా ఎగుమతులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. (Swiggy, Zepto: లేట్ నైట్ అయినా సరే.. చిటికెలో డెలివరీ!) -
వాహన అమ్మకాల జోరు: టాప్ గేర్‌లో విడిభాగాల పరిశ్రమ
న్యూఢిల్లీ:వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరం కూడా రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి సాధించ వచ్చని అంచనా వేస్తోంది. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ ఈ విషయం తెలిపారు. ‘సంకేతాలన్నీ అదే దిశలో (రెండంకెల స్థాయి వృద్ధి) కనిపిస్తున్నాయి. డిమాండ్ బాగుంది. తయారీ కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయి. మహమ్మారి, లాకవుట్లు, అంతర్జాతీయంగా మందగమనం నెలకొనడం వంటి మన చేతుల్లో లేని సవాళ్లు తలెత్తితే తప్ప సరైన దిశలోనే పరిశ్రమ సాగుతోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఏసీఎంఏ ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ టర్నోవరు 2020-21తో పోలిస్తే 23 శాతం పెరిగి రూ. 4.2 లక్షల కోట్లకు చేరింది. డిమాండ్ పుంజుకోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు కొంత తగ్గడం వంటి అంశాల కారణంగా ప్యాసింజర్ వాహనాల తయారీ 20 శాతం, వాణిజ్య వాహనాల ఉత్పత్తి 30 శాతం పెరిగాయి. ఆటో విడిభాగాల ఎగుమతులు 43 శాతం పెరిగి రూ. 1.41 లక్షల కోట్లకు, దిగుమతులు 33 శాతం పెరిగి రూ. 1.36 లక్షల కోట్లకు చేరాయి. ఏసీఎంఏలో 850 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. సంఘటిత పరిశ్రమ టర్నోవరులో వీటి వాటా 90 శాతం పైగా ఉంటుంది. కొత్త వాహనాల ఊతం.. కొత్తగా ప్రవేశపెడుతున్న వాహనాల మోడల్స్ .. ఈ పండుగ సీజన్లో అమ్మకాలకు ఊతంగా నిలవగలవని కపూర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఆశావహంగా ఉండటం ఈ ఆర్థిక సంవత్సరమూ కొనసాగవచ్చని, 2022–23లో పరిశ్రమ ఆరోగ్యకరమైన పనితీరు కనపర్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే, బీమా వ్యయాలు .. ఇంధనం ధరలు .. రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోవడం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గడం వంటి అంశాలు పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం ఈ అంశాలపై సత్వరం దృష్టి సారించాలని కపూర్ కోరారు. అమ్మకాల పరిమాణం రీత్యా పరిశ్రమ కరోనా పూర్వ స్థాయికి తిరిగి చేరుకుందని చెప్పారు. కొత్త ప్లాట్‌ఫాంలు ఆవిష్కరణ, ద్విచక్ర వాహనాలు.. వాణిజ్య వాహనాల అమ్మకాలు పుంజుకుంటే తదుపరి దశ వృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. స్థానికీకరణపై ఆటో పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతుండటం, ప్రభుత్వం ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముల్లాంటివి భారత్‌ను హై–ఎండ్ ఆటో–విడిభాగాలకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ కేంద్రంగా మార్చగలవని కపూర్ తెలిపారు. ఎలక్ట్రిక్ దిశగా పరిశ్రమ టూవీలర్లు, త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పుంజుకుంటున్న కొద్దీ విడిభాగాల పరిశ్రమ కూడా గణనీయంగా మార్పులకు లోనవుతోందని కపూర్ పేర్కొన్నారు. ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో దేశీయంగా విడిభాగాల తయారీ సంస్థలు వృద్ధి చెందడానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో వాహనాల తయారీ సంస్థలకు (ఓఈఎం) ఎలక్ట్రిక్ విడిభాగాల సరఫరా చూస్తే.. మొత్తం దేశీయ మార్కెట్లో చేసిన విక్రయాల్లో కేవలం ఒక్క శాతంగానే (రూ. 3,520 కోట్లు) ఉన్నట్లు కపూర్ వివరించారు. ఈ విభాగంలో అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక పెట్టుబడులు పెట్టడం తిరిగి మొదలైతే.. ఈ రంగంలో నియామకాలు కూడా పెరుగుతాయని కపూర్ చెప్పారు. -
దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వండి
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వాలని ఆటో విడిభాగాల పరిశ్రమకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే సూచించారు. క్షేత్రస్థాయిలో స్థానికీకరణపై దృష్టి పెట్టాలని.. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. అలాగే సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిప్పించడంపైనా ఇన్వెస్ట్ చేయాలని తెలిపారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల అసోసియేషన్ ఏసీఎంఏ 61వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు పేర్కొన్నారు. ‘‘స్థానికంగా తయారీకి ప్రాధాన్యం లభించాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశ్యం. పరిశ్రమ కూడా స్థానికీకరణ ప్రక్రియపై కసరత్తు చేస్తోందని నాకు తెలుసు. సియామ్ (వాహనాల తయారీ సంస్థల సమాఖ్య), ఏసీఎంఏ స్థానికీకరణ మార్గదర్శ ప్రణాళికను కూడా రూపొందించాయి. దాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని పరిశ్రమను కోరుతున్నాను’’ అని ఆయన తెలిపారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఆర్అండ్డీ కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. ఆటో విడిభాగాల పరిశ్రమకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం వాటా ఉందని, 50 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 60 శాతం ఆటో విడిభాగాల ఎగుమతులు ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకు వెడుతున్నాయని తెలిపారు. వచ్చే అయిదేళ్లలో 2025–26 నాటికి ఎగుమతులను 30 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో దేశీ పరిశ్రమ వాటా 3 శాతానికి చేరగలదని వివరించారు. అలాగే 2025 నాటికి ఆటో విడిభాగాల రంగంలో ఉద్యోగాల సంఖ్య 70 లక్షలకు చేరగలదన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆటోమోటివ్ ఎగుమతులు 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, 1.3 లక్షల కోట్ల డాలర్ల అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌కు 1.2 శాతం వాటా ఉంది. ఏసీఎంఏలో 800 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. వీటికి సంఘటిత ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరులో 85 శాతం పైగా వాటా ఉంది. ఎలాంటి టెక్నాలజీలనైనా స్థానికంగా వినియోగంలోకి తెచ్చేందుకు తగినంత సమయం లభించేలా దీర్ఘకాలికమైన, స్థిరమైన మార్గదర్శ ప్రణాళిక అవసరమని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ అభిప్రాయపడ్డారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: కాంత్ దేశీ ఆటోమొబైల్, విడిభాగాల రంగాలు చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటం నుంచి పూర్తిగా బైటికి రావాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సూచించారు. ఆటో విడిభాగాలు మొదలైన వాటన్నింటినీ దేశీయంగా తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఫేమ్ 2 పథకం కింద ఎంపికైన తొమ్మిది నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత నాలుగు చక్రాల వాహనాలకు (కార్లు మొదలైన వాటికి) కూడా స్కీమును వర్తింపచేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. 2030 నాటికి కార్లన్నీ ఎలక్ట్రిక్: నిస్సాన్ వాహన తయారీ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహన విభాగం కారణంగా పరిశ్రమలో సమూల మార్పులు వస్తాయని కంపెనీ సీవోవో అశ్వని గుప్తా అన్నారు. 2030 నాటికి కంపెనీ కార్లన్నీ ఎలక్ట్రిక్ ఆప్షన్స్‌తో ఉంటాయని వెల్లడించారు. ‘భారత వాహన పరిశ్రమ ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. అయిదారేళ్లలో మూడవ స్థానానికి చేరడం ఖాయం. దేశంలో 1,000 మంది జనాభాకు 20 కార్లు మాత్రమే ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఎలా చేజిక్కించుకోవాలన్నదే పెద్ద సవాల్’ అని అన్నారు. -
వాహనాల డిమాండ్ పెరిగింది, ఆటో మొబైల్ రంగం పుంజుకుంది
న్యూఢిల్లీ: దేశీయ ఆటో పరిశ్రమ భవిష్యత్తు ఆశాజనకంగా మారింది. ముడి సరుకుల ధరల పెరుగుదల, లాజిసిక్ట్ సవాళ్ల నేపథ్యంలోను దేశీయ ఆటో పరిశ్రమ క్రమంగా కోలుకుంటుందని ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) తెలిపింది. ఆర్ధిక వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవటం, వాహనాల డిమాండ్ పెరగడంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో పరిశ్రమ పనితీరు ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేసింది. కోవిడ్ థర్డ్ వేవ్‌పై ఆధారపడి పరిశ్రమ పనితీరు ఆధారపడి ఉంటుందని తెలిపింది. గత ఫైనాన్షియల్ ఇయర్లో పరిశ్రమ టర్నోవర్‌లో 3 శాతం క్షీణతతో రూ.3.40 లక్షల కోట్లకు చేరిందని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ తెలిపారు. సెమీకండక్టర్ల లభ్యత, ముడిసరుకుల ధరల వృద్ధి, లాజిస్టిక్స్ ఇబ్బందులు, కంటైనర్ల అధిక ధరలు వంటివి పరిశ్రమ రికవరీకి అడ్డంకులుగా మారాయని చెప్పారు. వివిధ సవాళ్ల కారణంగా నిలిచిపోయిన పెట్టుబడులు పరిశ్రమ వృద్ధితో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఆటో పరిశ్రమ బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాలను కోల్పోయిందని.. ఇది ఇండస్ట్రీ వృద్ధిని చూసినప్పుడు 2018–19లో మొత్తం క్యాపెక్స్‌గా ఉండేదని ఆయన తెలిపారు. పరిశ్రమ వ్యయాల తగ్గింపు, స్థానికీకరణ చర్యలపై దృష్టిపెడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఆటోమోటివ్ పరిశ్రమలో 60–70 శాతం సామర్థ్య వినియోగం ఉన్పప్పటికీ ఉద్యోగుల పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. తక్కువ దిగుమతి సుంకాలు కోరుకుతున్న టెస్లా.. స్థానిక తయారీపై దృష్టి సారిస్తే ఏసీఎంఏ మద్దతు ఇస్తుందని చెప్పారు. హర్యానాలో స్థానికులకు 75 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఉండటంతో పరిశ్రమపై ప్రభావం చూపించిందని.. ఇలాంటి నిర్ణయాలు పోటీతత్వాన్ని తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
దేశీ విడిభాగాలకే ప్రాధాన్యమివ్వాలి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీ సంస్థలు దేశీయంగా తయారైన విడిభాగాల తయారీ, కొనుగోళ్లకు మరింతగా ప్రాధాన్యమివ్వాలని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఆటో విడిభాగాల దిగుమతులను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం 70 శాతంగా ఉన్న విడిభాగాల లోకలైజేషన్‌ను .. 100 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. లేని పక్షంలో దిగుమతి చేసుకునే విడిభాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని వ్యాఖ్యానించారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘వాహనాలు, ఆటో విడిభాగాల తయారీదారులు స్థానిక పరికరాల కొనుగోళ్లను గరిష్ట స్థాయిలో.. 100 శాతం దాకా పెంచుకోవాలని కోరుతున్నా. ఇలాంటివన్నీ తయారు చేసేందుకు అవసరమైన సామర్థ్యాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా నినాదానికి దేశీ ఆటో పరిశ్రమ మద్దతుగా నిలిచేందుకు ఇదే సరైన తరుణం‘ అని ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీకి తోడ్పాటు కావాలి.. ఎలక్ట్రానిక్ విడిభాగాలు .. ముఖ్యంగా సెమీకండక్టర్లను స్థానికంగా తయారు చేసేందుకు ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించాలని భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సొసైటీ సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకావా కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ రెండంకెల వృద్ధి సాధించగలని అంచనా వేస్తున్నట్లు ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ తెలిపారు. -
లక్షకు పైగా ఉద్యోగాలు పోయాయ్
సాక్షి, ముంబై: దేశీయ ఆటో పరిశ్రమం సంక్షోభం, ఇతర సెగ్మెంట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఆటోరంగ ఉత్పత్తి 13 శాతం క్షీణతను నమోదు చేసింది. డిమాండ్ తగ్గడం, ఆర్థికమందగనం కారణంగా పలు సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తి ప్లాంట్లను తాత్కాలికంగా మూసేశాయి. దీంతో ఆటో రంగంలోనూ ఉద్వాసనలకు తెర లేచింది. అంతేకాదు ఈ ప్రభావంతో ఆటో స్పేర్స్‌లో ఈ ఏడాది జూలై నాటికి 1 లక్ష మంది తమ తాత్కాలిక ఉద్యోగాలు కోల్పోయారని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) శుక్రవారం తెలిపింది. ఊహించనంత సుదీర్ఘమైన మందగమనం వాహన పరిశ్రమను దెబ్బతీస్తోందని, అమ్మకాలు బాగా తగ్గాయని, ఇది ఇతర సెగ్మెంట్లను దెబ్బతీస్తోదని అసోసియషన్ ప్రెసిడెంట్ దీపక్ జైన్ చెప్పారు. 2013-14 తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులేర్పడ్డాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆటో ఉత్పత్తి తగ్గడంతో విడిభాగాల పరిశ్రమ సామర్థ్య వినియోగం 50 శాతం పడిపోయినట్లు తెలిపింది. గతంలో ఇది గరిష్టంగా 80 శాతం నమోదయిందన్నారు. భారతదేశపు 57 బిలియన్ డాలర్ల ఆటోమోటివ్ కాంపోనెంట్ పరిశ్రమ, దేశ జిడిపిలో 2.3 శాతం వాటాను కలిగిఉంది. అలాగే 5 మిలియన్లకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఆటో కంపోనెంట్ ఇండస్ట్రీ టర్నోవర్ గత ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ కాలంలో రూ.1.99 లక్షల కోట్లుగా ఉంటే, ఈ ఏడాది ఇదే కాలంలో 10.1 శాతం తగ్గి రూ.1.79 లక్షల కోట్లుగా ఉందని అసోసియేషన్ పేర్కొంది. 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నిలిచిపోయినట్లు పేర్కొంది. అయితే ఎగుమతులు 2.7శాతం పెరిగి రూ.51,397 వేల కోట్లకు (7.5 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయని ఏసీఎంఏ తెలిపింది. -
10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమలో మందగమనం మరింత కాలం కొనసాగితే 10 లక్షల పైచిలుకు ఉద్యోగాలకు కోత పడే ముప్పు పొంచి ఉందని ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను పెంచే దిశగా జీఎస్టీ రేటు తగ్గింపు తదితర చర్యలతో ఆటోమొబైల్ రంగం కోలుకునేందుకు తోడ్పాటు అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గత పది నెలలుగా అమ్మకాలు క్షీణిస్తూనే ఉండటంతో ఆటోమొబైల్ పరిశ్రమ సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోందని పేర్కొంది. ‘గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని విభాగాల వాహనాల విక్రయాలు చాలా నెలలుగా పడిపోతున్నాయి. దీంతో పరికరాల తయారీ విభాగంపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. వాహనాల రంగంపైనే పరికరాల తయారీ విభాగం కూడా ఆధారపడి ఉంటుంది. వాహనాల తయారీ 15–20 శాతం పడిపోవడంతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సిబ్బందిని తొలగించక తప్పదు. కనీసం 10 లక్షల మంది పైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని అంచనా‘ అని ఏసీఎంఏ అధ్యక్షుడు రామ్ వెంకటరమణి పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్వాసనలు మొదలయ్యాయని చెప్పారు. పరికరాల తయారీ రంగంలో దాదాపు 70 శాతం మంది కాంట్రాక్టు వర్కర్లే ఉంటారని, డిమాండ్ లేకపోతే సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ స్థూల దేశీయోత్పత్తిలో 2.3 శాతం వాటాతో ఆటోమోటివ్ పరికరాల తయారీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ రేటు తగ్గించాలి.. డిమాండ్ లేకపోవడం, బీఎస్ సిక్స్ స్థాయి ఉద్గార ప్రమాణాల వాహనాల తయారీపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి రావడం, విద్యుత్ వాహనాల విధానంపై స్పష్టత కొరవడటం తదితర అంశాలు ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్‌కు ప్రశ్నార్థకంగా మారాయని రామ్ చెప్పారు. దీంతో భవిష్యత్ పెట్టుబడులన్నీ నిల్చిపోయాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిమాండ్‌కి ఎంతో కొంత ఊతమిచ్చేలా జీఎస్టీ రేటు తగ్గించాలని పేర్కొన్నారు. ఆటోమొబైల్, ఆటో పరికరాలన్నింటికీ ఒకే రకంగా 18 శాతం జీఎస్టీ రేటు పరిధిలోకే చేర్చాలని కోరారు. ప్రస్తుతం దాదాపు 70 శాతం ఆటో పరికరాలు 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోనే ఉన్నప్పటికీ.. మిగతా 30 శాతం మాత్రం గరిష్ట శ్లాబ్ అయిన 28 శాతం విభాగంలో ఉన్నాయి. పైగా వాహనాల పొడవు, ఇంజిన్ సామర్థ్యం తదితర అంశాలను బట్టి 28 శాతం జీఎస్టీకి అదనంగా 1–15 శాతం దాకా అదనపు సెస్సు భారం కూడా ఉంటోందని రామ్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విధానంపై కేంద్రం స్పష్టతనివ్వాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లే క్రమంలో నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాలు.. ఆటో పరిశ్రమను ఆందోళనకు గురి చేసేవిగా ఉన్నాయని ఏసీఎంఏ డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా చెప్పారు. 2018–19లో ఆటో పరికరాల వ్యాపార విభాగం 14.5 శాతం వృద్ధితో రూ. 3.95 లక్షల కోట్లుగా ఉందని తెలిపారు. చైనాకు అవకాశాలు ఇవ్వొద్దు స్వేచ్చా వాణిజ్యానికి సంబంధించిన ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సెప్)లో ఆటో పరికరాలను చేర్చకుండా ఉండటం మంచిదని మెహతా తెలిపారు. అలా చేస్తే భారత మార్కెట్లో చైనా దొడ్డిదారిన ప్రవేశించేందుకు అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. ఇప్పటికే చైనా నుంచే భారత్ అత్యధికంగా పరికరాలు దిగుమతి చేసుకుంటోందని మెహతా వివరించారు. 2018–19లో చైనా నుంచి దిగుమతులు 4.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని, మొత్తం ఆటోమోటివ్ పరికరాల దిగుమతుల్లో ఇది 27 శాతమని తెలిపారు. చైనాతో పాటు జపాన్, కొరియా వంటి దేశాలతో కూడా భారత వాణిజ్యం లోటులోనే ఉందని చెప్పారు. -
ఆటో ఎక్స్ పో... సందర్శకుల తాకిడి
మొదటి రోజు 80 వేల మంది గ్రేటర్ నోయిడా: ఆటో ఎక్స్పోను శుక్రవారం 80 వేల మంది సందర్శించారు. ఈ ఆటో షోకు శుక్రవారం నుంచి మంగళవారం(ఈ నెల 9) వరకూ ప్రజలను అనుమతిస్తారు. ఇక్కడి ఇండియా ఎక్స్పో మార్ట్‌లో జరుగుతున్న ఈ ఆటో షోను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్), ఆటోమోటివ్ కాంపొనెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్(ఏసీఎంఏ), కాన్ఫెడరేషన్ ఆప్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత వాహన మార్కెట్లోకి రానున్న తాజా, ఉత్తమ వాహనాలను చూడటానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని సియామ్ పేర్కొంది. సూపర్ బైక్‌ల సెక్షన్‌ను చూడ్డానికి జనం బాగా వచ్చారని నిర్వాహకులు వెల్లడించారు. పురాతన వాహనాలతో కూడిన వింటేజ్ కార్ పెవిలియన్ కూడా పలువురిని ఆకర్షించింది. వీధి నాటకాలు, తోలు బొమ్మలాటల ద్వారా రోడ్డు భద్రతపై సందర్శకులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఆటో ఎక్స్‌పోలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్, హోండా కార్స్, ఆడి తదితర కంపెనీలు వాహనాలను ప్రదర్శిస్తున్నాయి. -
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఆటో ఎక్స్పో-2016 ప్రారంభం
ముంబై: ఆటో ఎక్స్పో-2016 ప్రదర్శన ఫిబ్రవరి 5న ప్రారంభం కానుంది. గతంతో పోలిస్తే ఈసారి దీనికి భారీ సంఖ్యలో సందర్శకులు రావచ్చని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. ఐదు రోజులపాటు ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడా లోని ఇండియా ఎక్స్పో మార్ట్, ప్రగతి మైదాన్‌లో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్పో కార్యక్రమాన్ని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్(సియామ్), ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2014లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్పో కార్యక్రమానికి సగటున 1.25 లక్షల మంది వచ్చారు. దీంతో ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆటో ఎక్స్పో కార్యక్రమంగా అవతరించింది. 1.13 లక్షల సందర్శకులతో షాంఘై ఆటో ఎక్స్పో దీని తర్వాతి స్థానంలో నిలిచింది. త్వ రలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్పోను 6 లక్షల మంది సందర్శించవచ్చని సియామ్ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ అంచనా వేశారు. గత కార్యక్రమంలో ఉత్పన్నమైన అవాంతరాలు అధిగమిస్తూ, మెరుగైన సేవలను అందించడానికి అన్ని వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు.