ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 11 శాతం వృద్ధి
ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశీయంగా ఆటోమోటివ్ విడిభాగాల పరిశ్రమ 11 శాతం వృద్ధి చెందింది. రూ. 3.32 లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో పరిశ్రమ రూ. 2.98 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) ప్రెసిడెంట్ శ్రద్ధా సూరి మార్వా ఈ విషయం తెలిపారు.
‘ఎగుమతులకు సంబంధించి భౌగోళిక, రాజకీయ సవాళ్లు నెలకొన్నప్పటికీ వివిధ విభాగాలవ్యాప్తంగా వాహన విక్రయాలు కరోనా పూర్వ స్థాయికి చేరిన నేపథ్యంలో విడిభాగాల పరిశ్రమ కూడా వృద్ధి చెందింది.‘అని ఆమె తెలిపారు. పండుగ సీజన్‌లో కూడా అమ్మకాలు గణనీయంగా నమోదయ్యాయని వివరించారు. అయితే, ఆర్థిక సంవత్సరంలో గత ఎనిమిది నెలల ధోరణి చూస్తే టూవీలర్ల వృద్ధి ఆశావహంగానే ఉన్నప్పటికీ, ప్యాసింజర్.. కమర్షియల్ వాహనాల అమ్మకాలు ఒక మోస్తరుగానే నమోదైనట్లు పేర్కొన్నారు.
అటు ఎగుమతుల విషయానికొస్తే భౌగోళిక సవాళ్ల కారణంగా డెలివరీ సమయం, రవాణా వ్యయాలు మళ్లీ పెరిగాయని మార్వా వివరించారు. టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడం, స్థానికంగా తయారీ కార్యకలాపాలను విస్తరించడంపై పరిశ్రమ గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తోందని చెప్పారు. ఏసీఎంఏ ప్రకారం .. సమీక్షాకాలంలో ఎగుమతులు 7 శాతం పెరిగి 11.1 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 4 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు చేరాయి. 150 మిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. ఆఫ్టర్‌మార్కెట్ విభాగం కూడా 5 శాతం వృద్ధి చెంది రూ. 47,416 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment