automotive industry
-
ఆటో విడిభాగాల పరిశ్రమ రూ. 3.32 లక్షల కోట్లకు అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశీయంగా ఆటోమోటివ్ విడిభాగాల పరిశ్రమ 11 శాతం వృద్ధి చెందింది. రూ. 3.32 లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో పరిశ్రమ రూ. 2.98 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) ప్రెసిడెంట్ శ్రద్ధా సూరి మార్వా ఈ విషయం తెలిపారు. ‘ఎగుమతులకు సంబంధించి భౌగోళిక, రాజకీయ సవాళ్లు నెలకొన్నప్పటికీ వివిధ విభాగాలవ్యాప్తంగా వాహన విక్రయాలు కరోనా పూర్వ స్థాయికి చేరిన నేపథ్యంలో విడిభాగాల పరిశ్రమ కూడా వృద్ధి చెందింది.‘అని ఆమె తెలిపారు. పండుగ సీజన్లో కూడా అమ్మకాలు గణనీయంగా నమోదయ్యాయని వివరించారు. అయితే, ఆర్థిక సంవత్సరంలో గత ఎనిమిది నెలల ధోరణి చూస్తే టూవీలర్ల వృద్ధి ఆశావహంగానే ఉన్నప్పటికీ, ప్యాసింజర్.. కమర్షియల్ వాహనాల అమ్మకాలు ఒక మోస్తరుగానే నమోదైనట్లు పేర్కొన్నారు. అటు ఎగుమతుల విషయానికొస్తే భౌగోళిక సవాళ్ల కారణంగా డెలివరీ సమయం, రవాణా వ్యయాలు మళ్లీ పెరిగాయని మార్వా వివరించారు. టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడం, స్థానికంగా తయారీ కార్యకలాపాలను విస్తరించడంపై పరిశ్రమ గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తోందని చెప్పారు. ఏసీఎంఏ ప్రకారం .. సమీక్షాకాలంలో ఎగుమతులు 7 శాతం పెరిగి 11.1 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 4 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు చేరాయి. 150 మిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. ఆఫ్టర్‌మార్కెట్ విభాగం కూడా 5 శాతం వృద్ధి చెంది రూ. 47,416 కోట్లకు చేరింది. -
త్వరలో 7,000 మందికి జాబ్ కట్! ఎక్కడంటే..
ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ రంగంలో సేవలందిస్తున్న బాష్ కంపెనీ తన ఉద్యోగులకు తగ్గించబోతున్నట్లు సంకేతాలిచ్చింది. జర్మనీలోని తన ప్లాంట్‌లో పని చేస్తున్న దాదాపు 7,000 మంది ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించనున్నట్లు జెక్పోస్పోలిటా నివేదించింది.జెక్పోస్పోలిటా నివేదికలోని వివరాల ప్రకారం..బాష్ సీఈఓ స్టీఫెన్ హర్తంగ్ మాట్లాడుతూ..‘ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆటోమోటివ్ సేవలందిస్తున్న బాష్ కంపెనీ ఉద్యోగులను తగ్గించే పనిలో నిమగ్నమైంది. జర్మనీ ప్లాంట్‌లోని దాదాపు 7,000 మంది సిబ్బందికి ఉద్వాసన కల్పించనుంది. ప్రధానంగా ఆటోమోటివ్ సప్లై సెక్టార్లో, టూల్స్ డివిజన్, గృహోపకరణాల విభాగంలో పనిచేసే వారు ఈ నిర్ణయం వల్ల త్వరలో ప్రభావం చెందవచ్చు’ అని చెప్పారు.విభిన్న రంగాల్లో సిబ్బంది సర్దుబాటు‘కంపెనీ 2023లో దాదాపు 98 బిలియన్ డాలర్ల(రూ.8.18 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సంవత్సరం అమ్మకాలపై రాబడి అధికంగా 4 శాతంగా ఉంటుందని అంచనా వేశాం. 2026 నాటికి ఇది ఏడు శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే 2024లో కంపెనీ అంచనాలను చేరుకోకపోవచ్చు. ప్రస్తుతానికి మా సిబ్బందిని విభిన్న విభాగాల్లో మరింత సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాను’ అని చెప్పారు.ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!రూ.66 వేలకోట్లతో కొనుగోలుబాష్ కంపెనీ ఉద్యోగులను తగ్గించాలని భావిస్తున్నప్పటికీ ఇతర కంపెనీల కొనుగోలుకు ఆసక్తిగా ఉందని నివేదిక ద్వారా తెలిసింది. బాష్ సంస్థ ఐరిష్ కంపెనీ జాన్సన్ కంట్రోల్స్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలుగా ఉండబోతున్న ఈ డీల్ విలువ ఏకంగా ఎనిమిది బిలియన్ డాలర్లు(రూ.66 వేలకోట్లు)గా ఉంది. హీట్ పంప్, ఎయిర్ కండిషనింగ్ పరిశ్రమలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ కొనుగోలు ఎంతో ఉపయోగపడుతుందని నివేదిక తెలిపింది. -
మహీంద్రా కొత్త ప్లాంటు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ప్లాంటు ఏర్పాటు యోచనలో ఉంది. ఇందుకోసం కంపెనీ మహారాష్ట్రలోని చకన్‌కు సమీపంలో స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఎఫ్ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేస్తారు. చకన్, పుణే, నాసిక్ ప్లాంట్ల వార్షిక తయారీ సామర్థ్యం 8 లక్షల యూనిట్లు. ఎన్ఎఫ్ఏ మోడళ్ల కోసం మరింత సామర్థ్యం అవసరం అవుతుంది. ఎన్ఎఫ్ఏ ఆర్కిటెక్చర్ సుమారు 12 మోడళ్లను తయారు చేసే అవకాశం ఉంది. కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా తయారైన మోడళ్ల అమ్మకాలు ఏటా 3–5 లక్షల యూనిట్లు ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది. కాగా, కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకున్నట్టయితే ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో తొలిసారిగా 5 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అందుకుంటుంది. మహీంద్రా మార్కెట్ వాటా రెండంకెలకు చేరుకోవచ్చు. 2024–25లో ఎస్‌యూవీల టర్నోవర్ రూ.75,000 కోట్లు దాటనుంది. 2023–24లో కంపెనీ ఎస్‌యూవీల తయారీలో పరిమాణం పరంగా భారత్‌లో రెండవ స్థానంలో, ఆదాయం పరంగా తొలి స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4.59 లక్షల యూనిట్లను విక్రయించింది. ఆటోమోటివ్ బిజినెస్ కోసం రూ.27,000 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ప్రకటించింది. -
వాహన పరిశ్రమ @ రూ. 20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ టర్నోవర్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కోట్ల మార్కును దాటిందని వాహన తయారీదారుల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం వస్తు, సేవల పన్నుల్లో (జీఎస్టీ) 14–15 శాతం వాటా ఆటో పరిశ్రమదే ఉంటోందని ఆయన చెప్పారు. అలాగే దేశీయంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయంగా ఉపాధి కలి్పస్తోందని ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 64వ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ వాటా 6.8 శాతంగా ఉండగా ఇది మరింత పెరగగలదని వివరించారు. అంతర్జాతీయంగా భారతీయ ఆటో రంగం పరపతి పెరిగిందని అగర్వాల్ చెప్పారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఉత్పత్తి చేయగలిగే 50 క్రిటికల్ విడిభాగాలను పరిశ్రమ గుర్తించిందని ఆయన వివరించారు. 100 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం: కేంద్ర మంత్రి గోయల్ భారతీయ వాహన సంస్థలు 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏసీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. ఇందులో భాగంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, స్థానికంగా ఉత్పత్తిని మరింతగా పెంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వాహన ఎగుమతులు 21.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పరిశ్రమలకు ఉపయోగపడేలా ప్రభుత్వం 20 స్మార్ట్ ఇండస్ట్రియల్ నగరాలను అభివృద్ధి చేస్తోందని, వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ టౌన్íÙప్ల రూపంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి చెప్పారు. మరోవైపు, లోకలైజేషన్‌ను పెంచేందుకు సియామ్, ఏసీఎంఏ స్వచ్ఛందంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
సాహోరే.. టాప్ స్పీడ్ స్టార్స్!
‘ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దేన్ నాలెడ్జ్’ అంటూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ‘ఊహాశక్తి’కి ఉండే అపారమైన శక్తి ఏమిటో చెప్పకనే చెప్పారు. ఈ ఇద్దరు మిత్రులకు ఊహాశక్తితో పాటు సాంకేతిక నైపుణ్యశక్తి కూడా ఉంది. ఈ రెండు శక్తులను సమన్వయం చేసుకుంటూ కాలేజీ రోజుల నుంచి చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తున్నారు. ఆ ప్యాషన్ వారిని ఎంటర్ప్రెన్యూర్లుగా మార్చి బైక్ మార్కెట్లోకి అడుగు పెట్టేలా చేసింది. ఈవీ స్టార్టప్ ‘అల్ట్రావయోలెట్’తో స్పీడ్‌గా దూసుకుపోతున్నారు...2006లో... బెంగళూరులోని బీఎంఎస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నారాయణ్ సుబ్రమణ్యం, నీరజ్ రాజ్‌మోహన్‌లు ఐఐటీ, మద్రాస్ నిర్వహించిన పోటీలో ఎయిర్–ప్రొపెల్డ్ వాటర్ క్రాఫ్ట్ రూపొందించి ‘బెస్ట్ డిజైన్’ అవార్డ్ గెలుచుకున్నారు. ఈ పోటీలో దేశవ్యాప్తంగా ఎన్నో ఐఐటీ టీమ్‌లు పాల్గొన్నాయి. కట్ చేస్తే... ఈ ఇద్దరు ఎలక్ట్రిక్ సూపర్ బైక్ స్టార్టప్ ‘అల్ట్రావయోలెట్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నారాయణ్, నీరజ్‌లకు స్కూలు రోజుల నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోట్స్ అంటే ఇష్టం. కాలేజీలో చేరే నాటికి ఆ ఇష్టం మరోస్థాయికి చేరింది. అన్నిరకాల ఎయిర్ క్రాఫ్ట్‌లు, రోబోట్స్,హైడ్రోప్లెయిన్స్, ఎలక్ట్రిక్ సబ్మెరైన్లు తయారుచేసేవారు. దేశవ్యాప్తంగా ఎన్నో పోటీల్లో పాల్గొనేవారు. సూపర్‌బైక్ తయారు చేయాలనేది వారి కల. కాలేజీ చదువు పూర్తయిన తరువాత ఇద్దరి దారులు వేరయ్యాయి. పై చదువుల కోసం నీరజ్ కాలిఫోర్నియా, నారాయణ్ స్వీడన్ వెళ్లారు. ఆ తరువాత టాప్ ఆటోమోటివ్ కంపెనీలలో పనిచేశారు. అయితే ఇద్దరిలోనూ ఏదో అసంతృప్తి ఉండేది. వారు అనేకసార్లు మాట్లాడుకున్న తరువాత ‘ఏదైనా సాధించాలి’ అనే నిర్ణయానికి వచ్చారు. అలా బెంగళూరు కేంద్రంగా ఈవీ స్టార్టప్ ‘అల్ట్రావయోలెట్’కు శ్రీకారం చుట్టారు. ఆటోమోటివ్, కన్జ్యూమర్ టెక్, ఏరో స్పేస్ నిపుణులతో గట్టి బృందాన్ని తయారుచేసుకున్నారు. ఈ మిత్రద్వయం మోటర్ఫీల్డ్కు కొత్త కాబట్టి వారి టీమ్‌లో చేరడానికి తటపటాయించేవారు. అయితే కాస్త ఆలస్యంగానైనా ప్రతిభావంతులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. అందరిలాగే తమ స్టార్టప్‌కు కరోన కష్టాలు మొదలయ్యాయి. తమ ఫస్ట్ ఆల్–ఎలక్ట్రిక్ పెర్ఫార్మెన్స్ బైక్ ఎఫ్ 77 మోడల్ తయారీని నిలిపివేయాల్సి వచ్చింది. పరిస్థితి మెరుగుపడుతుందనుకుంటున్న సమయంలో ‘ఎఫ్77’ను రీవ్యాంప్ చేశారు. ‘భిన్నమైన సంస్కృతులు, అభిరుచులు ఉన్న మనలాంటి దేశంలో ఈవీలతో మెప్పించడం అనేది పెద్ద సవాలు. ఈ టెక్నాలజీ గురించి చాలామంది అపోహలతో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి మైండ్‌సెట్‌ను మార్చాలనుకున్నాం. ఈవీలో మాకు సాధ్యమైన కొత్త ఫీచర్లు తీసుకువచ్చాం. మా అల్ట్రావయోలెట్‌కు ఏవియేషన్, ఏరోస్పేస్ సెక్టార్లు స్ఫూర్తి. మాకు కొత్త ఆవిష్కరణలు అంటే ఆసక్తి’ అంటున్నాడు ‘అల్ట్రావయోలెట్’ కో–ఫౌండర్, సీయివో నారాయణ్. ఇక ఇద్దరి అభిరుచుల విషయానికి వస్తే...నీరజ్ పుస్తకాల పురుగు. పుస్తకాలు ఎక్కువగా చదవడం ద్వారా తనకు కొత్త ఐడియాలు వస్తాయి అంటాడు. ఇక నారాయణ్‌కు ‘క్రియేటివిటీ అండ్ ఫిట్నెస్’ ఇష్టమైన సబ్జెక్ట్. అయితే టెక్నికల్ స్కిల్స్ విషయంలో మాత్రం ఇద్దరికీ సమ ప్రతిభ ఉంది. నారాయణ్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్‌లో, రాజ్‌మోహన్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్‌లో ఎక్స్పర్ట్. ‘మేము అద్భుతాన్ని సృష్టించాలనుకున్నాం. అనుకోవడానికైతే ఎన్నైనా అనుకోవచ్చు. ఆచరణలో మాత్రం రకరకాల సవాళ్లు ఎదురొస్తుంటాయి. వాటిని తట్టుకొని నిలబడడమే అసలు సిసలు సవాలు. అలాంటి సవాలును అధిగమించి మా కలను నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది’ అంటున్నాడు ‘అల్ట్రావయోలెట్’ ఫౌండర్లలో ఒకరైన నీరజ్. (చదవండి: చీట్ ఆఫ్ ది డే! దొంగ డీల్స్!) -
మార్కెట్లో దూసుకుపోతున్న భారత్: ఈ నంబర్ ప్లేట్ల గురించి తెలుసా?
జపాన్ను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమోటివ్ మార్కెట్‌గా అవతరించింది. దేశీయంగా వివిధ విభాగాలలో వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో అమెరికా, చైనా తరువాత భారత్ ప్రముఖంగా నిల్తుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని వాహనాల రక రకాల నెంబర్ ప్లేట్స్, ఎందుకు ఉపయోగిస్తారు? తెలుసుకుందాం! సాధారణంగా వాహనాలపై డిఫరెంట్ కలర్స్ గల నెంబర్ ప్లేట్స్ మనం చూస్తూ ఉంటాం. పలు రంగలుల్లో, ముఖ్యంగా గ్రీన్ కలర్లో ఉండే నెంబర్ ప్లేట్లను ఎపుడైనా చూశారా? తెలుగు, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగుల నెంబర్ ప్లేట్లు భారతదేశంలో ఉపయోగిస్తారు? అలాగే ప్రతి వాహనం ఒక ప్రత్యేక గుర్తింపుతో ఉంటుంది. ప్లేట్‌పై లాటిన్ అక్షరాలు , అరబిక్ నెంబర్లు బొమ్మల కలయికతో ఉంటాయి. ఎక్కువగా వైట్ నెంబర్ ప్లేట్స్ పై బ్లాక్ లెటర్స్, పసుపు రంగు బోర్డు పై నల్ల అక్షరాలు లెటర్స్ మాత్రమే చూస్తూ ఉంటాం కానీ ఇంకా కొన్ని రకాల నెంబర్ ప్లేట్లు కూడా ఉన్నాయి. తెల్లని నంబర్ ప్లేట్ ఇది భారతదేశంలో కనిపించే అత్యంత సాధారణ లైసెన్స్ ప్లేట్ రకం. రిజిస్ట్రేషన్ వివరాలు తెలుపు , నలుపు రంగులో ముద్రించబడతాయి. ఈ రకమైన రిజిస్ట్రేషన్ ప్లేట్ ప్రైవేట్ లేదా వాణిజ్యేతర వాహనాలపై కనిపిస్తుంది. అద్దెకు తీసుకోవడం లేదా సరుకు రవాణా వంటి వాణిజ్య ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించలేరు. పసుపు నంబర్ ప్లేట్ తేలికపాటి మోటారు వాహనాలకు ఇవి వర్తిస్తాయి. ఈ వాహనాలు ప్రైవేట్ వాహనాల కంటే భిన్నమైన పన్ను ప్లేట్స్ కలిగి ఉంటాయి. ఇంకా, అటువంటి వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా కమర్షియల్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. రెడ్ నంబర్ ప్లేట్ తాత్కాలికి రిజిస్ట్రేషన్ ప్లేట్. తెలుపు అక్షరాలతో ఎరుపు నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ వివరాలు టెంపరరీని సూచిస్తుంది. RTO రిజిస్ట్రేషన్ ద్వారా శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందే వరకు భారతదేశంలో రెడ్ నంబర్ ప్లేట్ ఉంటుంది. అయితే, రెడ్ నంబర్ ప్లేట్ ఒక నెల మాత్రమే చెల్లుబాటు అవుతుంది. చాలా రాష్ట్రాలు ఇలాంటి వాహనాలను తమ రోడ్లపైకి అనుమతించవు. ఆకుపచ్చ నంబర్ ప్లేట్ మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV)లకు బాగా ఆదరణ పెరుగుతోంది. ఈవీలకు కేటాయించే నెంబర్ ప్లేట్ గ్రీన్లోఉంటుంది. అందుకే దేశంలో గ్రీన్ నంబర్ ప్లేట్లు పెరుగుతున్నాయి. తెలుపు అక్షరాలతో ఉన్న అన్ని EVలు ప్రైవేట్ వాహనాలకు వర్తిస్తాయి. అయితే పసుపు అక్షరాలు ఉన్నవి కమర్షియల్ EVలకు ప్రత్యేకం. బ్లూ నంబర్ ప్లేట్ విదేశీ డిప్లొమేట్స్ వారు ఉపయోగించే వాహనాలకు వైట్ లెటర్స్‌తో బ్లూ నెంబర్ ప్లేట్స్ ను అందజేస్తారు. ఇటువంటి నంబర్ ప్లేట్లు ప్రధానంగా మూడు కోడ్లలో దేనినైనా కలిగి ఉంటాయి- CC (కాన్సులర్ కార్ప్స్), UN (యునైటెడ్ నేషన్స్), లేదా CD (కార్ప్స్ డిప్లొమాటిక్). రాష్ట్ర కోడ్‌ను ప్రదర్శించడానికి బదులుగా, ఈ నంబర్ ప్లేట్లు దౌత్యవేత్తకు సంబంధించిన దేశ కోడ్‌ను తెలుపుతాయి. పైకి సూచించే బాణంతో నంబర్ ప్లేట్ ఇటువంటి నంబర్ ప్లేట్లు ప్రత్యేకంగా సైనిక ప్రయోజనాల కోసం వాడతారు. రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద నమోదవుతాయి. మొదటి లేదా రెండవ అక్షరం తర్వాత పైకి చూపే బాణాన్ని బ్రాడ్ బాణం అంటారు. బాణం తర్వాత వచ్చే అంకెలు వాహనం కొనుగోలు చేసిన సంవత్సరాన్ని సూచిస్తాయి. తదుపరిది బేస్ కోడ్, దాని తర్వాత క్రమ సంఖ్య. సీరియల్ నంబర్ తర్వాత వచ్చే చివరి అక్షరం వాహనం తరగతిని సూచిస్తుంది. మిలిటరీ వెహికల్ నంబర్ ప్లేట్ భారతదేశ అశోకా చిహ్నంతో కూడిన నంబర్ ప్లేట్లు భారత రాష్ట్రపతి లేదా రాష్ట్రాల గవర్నర్లకు మాత్రమే ప్రత్యేకం. బ్లాక్ నంబర్ ప్లేట్ పసుపు అక్షరాలతో నలుపు రంగు నంబర్ ప్లేట్ సాధారణంగా విలాసవంతమైన హోటల్‌కు సంబంధించి లగ్జరీ కార్లకు కేటాయిస్తారు. అలాంటి వాహనాలను డ్రైవర్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండనవసరం లేకుండానే వాణిజ్య వాహనాలుగా పరిగణిస్తారు. భారత్ సిరీస్ వివిధ రాష్ట్ర కోడ్లతో పాటు, ఒక సాధారణ పౌరుడు తన వాహనం కోసం 'BH' లేదా భారత్ సిరీస్ లైసెన్స్ ప్లేట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ రంగ ఉద్యోగులు, అలాగే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో కార్యాలయాలు ఉన్న సంస్థల ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా BH సిరీస్ నంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. BH-సిరీస్-వాహనం-రిజిస్ట్రేషన్ వాహనం యజమాని కొత్త రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మకాం మార్చినప్పుడు, వాహనాన్ని తిరిగి నమోదు చేయడంలో ఉన్న ఇబ్బందులను తొలగించడం ద్వారా అంతర్-రాష్ట్ర చలనశీలతను సులభతరం చేయడానికి ఈ నంబర్ ప్లేట్ తీసుకొచ్చారు. -
మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్
పుణె: ఆటోమోటివ్ తయారీ రంగంలో మహిళా సిబ్బందిని పెంచే దిశగా పినకిల్ ఇండస్ట్రీస్ కొత్తగా ‘ఎవల్యూషనారీ’ పేరిట వినూత్న ప్రయోగం చేపట్టింది. కేవలం మహిళలను మాత్రమే నియమించుకునేందుకు ఫిబ్రవరి 23, 24న మధ్యప్రదేశ్ పిఠంపూర్‌లోని తమ ప్లాంటులో రిక్రూట్మెంట్ నిర్వహించనుంది. ఆసక్తి గల మహిళా అభ్యర్ధులు httpr:// pinnac eindurtrier. com/ evo utionari& campaifn/లో లేదా పినకిల్ ఇండస్ట్రీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో నమోదు చేసుకోవచ్చని లేదా నేరుగా వాకిన్ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని సంస్థ తెలిపింది. కెరియర్లో విరామం తీసుకున్నప్పటికీ అర్హత కలిగిన మహిళా ఇంజినీర్లు, నిపుణులు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ప్రెసిడెంట్ అరిహంత్ మెహతా తెలిపారు. మెకానికల్, ఎలక్ట్రికల్, రోబోటిక్స్ తదితర విభాగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉన్న ఇంజినీర్లతో పాటు ఆర్అండ్డీ, ఆపరేషన్స్, స్టోర్స్ తదితర విభాగాల్లోనూ నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. ఆటోమోటివ్ సీటింగ్, ఇంటిరీయర్స్, రైల్వే సీటింగ్ మొదలైన విభాగాల్లో పినాకిల్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
వాహన విడిభాగాల పరిశ్రమ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన విడిభాగాల తయారీ రంగంలో భారత జోరు కొనసాగుతోంది. 2022 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో పరిశ్రమ 34.8 శాతం వృద్ధితో రూ.2.65 లక్షల కోట్లు నమోదు చేసింది. దేశీయంగా డిమాండ్.. ముఖ్యంగా ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహన విభాగం నుంచి ఆర్డర్లు వెల్లువెత్తడం ఈ స్థాయి వృద్ధికి కారణమని ఆటోమోటివ్ కంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అసోసియేషన్ ప్రకారం.. పండుగల సీజన్ ద్విచక్ర వాహనాలకు చాలా సానుకూలంగా ఉంది. గతంలో మాదిరిగానే టూ వీలర్ల విభాగం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుంది. సెమీకండక్టర్ల లభ్యత, ముడి పదార్ధాల వ్యయాలు అధికంగా ఉండడం, కంటైనర్ల కొరత వంటి సరఫరా సంబంధ సమస్యలు నియంత్రణలోకి రావడంతో ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో వృద్ధికి సాయపడింది. పరిశ్రమ ఆదాయంలో ఎలక్ట్రికల్ వాహన విభాగం వాటా 1 శాతంగా ఉంది. వాహన విక్రయానంత రం జరిగే విడిభాగాల కొనుగోళ్ల పరిమాణం 8% అధికమై రూ.42 వేల కోట్లు నమోదు చేసింది. ప్యాసింజర్ వాహనాలదే.. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో వాహన తయారీ సంస్థలకు రూ.2.37 లక్షల కోట్ల విలువైన విడిభాగాలు సరఫరా అయ్యాయి. ఇందులో 47 శాతం వాటా ప్యాసింజర్ వాహనాలదే. గతేడాది ఇదే కాలంలో ఈ వాటా 38 శాతం నమోదైంది. ఎస్‌యూవీల వైపు డిమాండ్ అధికం కావడంతో విడిభాగాల విలువ పెరిగింది. పరిశ్రమ ఆదాయంలో ద్విచక్ర వాహనాల విడిభాగాల వాటా 21 శాతం నుంచి 18 శాతానికి వచ్చి చేరింది. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఎగుమతులు 8.6 శాతం దూసుకెళ్లి రూ.83,607 కోట్లు నమోదయ్యాయి. దిగుమతులు 17.2 శాతం పెరిగి దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఎగుమతుల్లో ఉత్తర అమెరికా వాటా 12 శాతం పెరిగి ఏకంగా 33 శాతం ఉంది. యూరప్ 30, ఆసియా 26 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో విడిభాగాల పరిశ్రమ రూ.5,794 కోట్ల వాణిజ్య మిగులుతో ముగిసింది. 2022–23లో ఎగుమతులు, దిగుమతులు సరసమైన సమతుల్యతతో తటస్థంగా మారాయి. -
ప్రతీ ముగ్గురిలో ఒకరి ఓటు వీటికే
న్యూఢిల్లీ: భారత్‌లో రవాణా పరంగా వినియోగ ధోరణులు మారిపోతున్నట్టు డెలాయిట్ గ్లోబల్ ఆటోమోటివ్ కన్జూమర్ స్టడీ 2022 తెలిపింది. మరింత మంది ఎలక్ట్రికల్ (ఈవీ), హైబ్రిడ్ (ఒకటికంటే ఎక్కువ ఇంధనాలతో పనిచేసేవి) వాహనాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది. తన అధ్యయనంలో భాగంగా వాహనదారుల అభిరుచులు, ఆసక్తులు, ఇష్టాలను ఈ సంస్థ తెలుసుకుని ఒక నివేదిక విడుదల చేసింది. పర్యావరణ అనుకూల వాహనాలపై ప్రభుత్వం దృష్టి సారించడం ఇందుకు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. నివేదికలోని అంశాలు.. ► భారత్‌లో 59 శాతం మంది వినియోగదారులు వాతావరణ మార్పులు, కాలుష్యం స్థాయి, డీజిల్ వాహనాలు విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ► ఇంధన వ్యయాలు తక్కువగా ఉండడం, పర్యావరణ పట్ల స్పృహ, వాహనం నడిపే విషయంలో మెరుగైన అనుభవం తదితర అంశాలు ఈవీల పట్ల ఆసక్తికి కారణాలు. ► బ్యాటరీ స్వాపింగ్ (బ్యాటరీ మార్పిడి), చార్జింగ్ సదుపాయాలపై బడ్జెట్లో దృష్టి సారించడం అన్నది పర్యావరణ అనుకూల వాహన వినియోగాని మద్దతునివ్వడమే. ►69 శాతం మంది ప్రీఓన్డ్ (అప్పటికే మరొకరు వినియోగించిన) వాహనాల పట్ల ఆసక్తిగా ఉన్నారు. ► ఈవీలను సబ్స్క్రిప్షన్ విధానంలో తీసుకునేందుకు 70 శాతం మంది ఆసక్తితో ఉన్నారు. వృద్ధి కొత్త పుంతలు ‘‘కస్టమర్ల అవసరాలు, అద్భుతమైన ఆవిష్కరణలతో భారత ఆటోమోటివ్ పరిశ్రమ కొత్త తరం వృద్ధిని చూడబోతోంది. వినియోగదారులు ప్రత్యామ్నాయ పవర్ ట్రెయిన్ ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు మా అధ్యయనంలో తెలిసింది. ఇది ఈవీ వృద్ధికి మద్దతుగా నిలుస్తుంది’’ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రాజీవ్‌సింగ్ తెలిపారు. -
పాత కార్లలో యూత్ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొన్నేళ్ల క్రితం వరకు కొత్త కారు కావాలంటే షోరూంకు వెళ్లి కొన్ని గంటల్లోనే నచ్చిన వాహనంతో రోడ్డుపై దూసుకుపోయేవారు. కొన్ని మోడళ్లకే కొద్ది రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాహన రంగంలో పరిస్థితులు మారిపోయాయి. ఏ మోడల్ కారు కావాలన్నా తప్పనిసరిగా కొన్ని వారాలు, నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి. దీనికంతటికీ కారణం సెమికండక్టర్ల కొరత. మరోవైపు ముడి సరుకు వ్యయాలు భా రం కావడంతో వాహనాల ధరలను తయారీ కం పెనీలు ఎప్పుడూ లేని విధంగా క్రమం తప్పకుం డా పెంచుతూ పోతున్నాయి. దీంతో పాత కార్లకు డిమాండ్ అనూహ్యంగా అధికమైంది. అయితే ప్రీ–ఓన్డ్ కార్లను కొనేందుకు నవతరం ముందంజలో ఉన్నారని ఆన్లైన్ యూజ్డ్ కార్ల మార్కెట్‌ప్లేస్ కంపెనీ కార్స్24 నివేదిక చెబుతోంది. కొనుగోలుదార్లదే మార్కెట్.. పరిశ్రమలో అవ్యవస్థీకృత రంగానిదే 95 శాతం వాటా. రూ.2 లక్షల పెట్టుబడితో ఔత్సాహికులు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కొనుగోలుదార్లు వాహనం ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షిస్తున్నారు. కండీషన్నుబట్టి ధర నిర్ణయం అవుతోంది. పైగా కారు ఎక్కడ కొన్నా బ్యాంకులు రుణం ఇవ్వడం కలిసి వస్తోంది. వాహనం ఒకట్రెండేళ్లు వాడి 10,000 కిలోమీటర్లలోపు తిరిగితే యజమాని చెప్పిందే ధర. అదే రెండేళ్లు దాటితే కొనుగోలుదారు చెప్పిన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఉంది. అయిదేళ్లలోపు వాడిన కార్లకే అత్యధికులు మొగ్గు చూపుతున్నారని వసంత్ మోటార్స్ ఎండీ కొమ్మారెడ్డి సందీప్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం కొనుగోలుదార్లదే మార్కెట్ అని ఆయన అన్నారు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోళ్లకు సై.. పాత కార్ల కొనుగోలుదార్లలో యువత వాటా ఏకంగా 80 శాతం ఉంది. యాప్, వెబ్ ఆధారిత వేదికలు వృద్ధి చెందేందుకు వీరు దోహదం చేస్తున్నారు. వాహన ధరలు పెరుగుతుండడం, మహమ్మారి కారణంగా వచ్చిన జీవనశైలి మార్పులు, ఆన్లైన్ కంపెనీల దూకుడు.. వెరళి డిజిటల్ వేదికల జోరుకు కారణం అవుతున్నాయి. యువ కస్టమర్లలో పురుషులదే పైచేయి. మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక కార్ల విషయానికి వస్తే హ్యాచ్బ్యాక్స్ వైపు మొగ్గు చూపుతున్నవారి సంఖ్య ఏకంగా 43% ఉంది. ఎస్‌యూవీలకు 26% మంది సై అంటున్నారు. పెట్రోల్ వాహనాలకే అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. యూజ్డ్ కార్ ఏ స్థితిలో ఉందన్నదే కొనుగోలుదార్లకు కీలక అంశం. ఇదీ దేశీయ మార్కెట్.. భారత్‌లో 2020–21లో 38 లక్షల పాత కార్లు చేతులుమారాయి. ఇందులో 5–7 ఏళ్లు వాడిన వాహనాల వాటా 31 శాతం, 8–10 ఏళ్లవి 29 శాతం ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 15 శాతం పెరగనుంది. ఏటా 12–14 శాతం వృద్ధితో 2025–26 నాటికి ఈ సంఖ్య 70 లక్షల యూనిట్ల పైచిలుకు నమోదు కానుందని నివేదికలు చెబుతున్నాయి. చవకగా ఉండి అధిక మైలేజీ ఇచ్చే కార్ల కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్లు 27.11 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనినిబట్టి పాత కార్లకు ఉన్న డిమాండ్ అర్థం అవుతోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ 20–30 శాతం దూసుకెళ్లింది. ముఖ్యంగా దక్షిణాదిన పాత కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కోవిడ్ కారణంగా వ్యక్తిగతంగా వాహనం ఉండాలన్న భావన ప్రజల్లో బలపడుతోంది. -
మారుతి నుంచి కొత్తగా డిగ్రీ కోర్సు.. టాటా సహకారం
కార్ల అమ్మకాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్న మారుతి సుజూకి మరో అడుగు ముందుకు వేసింది. భవిష్యత్తులో తమ సంస్థకు అవసరమైన మానవ వనరులను అభివృద్ధి చేసే పనిపై ఫోకస్ పెట్టింది. ఆటోమోటివ్ రిటైల్ మార్కెట్ రీసెర్చ్ అంచనాల ప్రకారం దేశంలో ప్రతీ వెయ్యి మందికి కేవలం 36 కార్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి కోవిడ్ సంక్షోభం పూర్తిగా ముగిసి ఆర్థిక పరిస్థితి గాడిన పడితే కార్ల అమ్మకాలు ఊపందుకుంటాయని మార్కెట్ అనాలిసిస్టులు చెబుతున్నారు. దీంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అవసరమైన రీతిలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్పై మారుతి దృష్టి సారించింది. అందులో భాగంగా రిటైల్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆటోమోటివ్ రిటైల్ కోర్సును ప్రవేశ పెడుతోంది. మూడేళ్ల కోర్సు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి మూడేళ్ల డిగ్రీ కోర్సును అందివ్వాలని మారుతి నిర్ణయించింది. ఈ కోర్సులో పూర్తిగా ఆటోమైబైల్ పరిశ్రమకు సంబంధించిన అంశాలనే సిలబస్‌లో పొందు పరచనుంది. మొదటి ఏడాది కేవలం తరగతి కోర్సుగా మిగిలిన రెండేళ్లు మారుతి ఆథరైజ్డ్ డీలర్షిప్ యూనిట్లలో ప్రాక్టికల్ తరగతులు నిర్వహిస్తారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా ఈ కోర్సుని డిజైన్ చేసింది. టాటా సహకారంతో మారుతి సంస్థ అందిస్తోన్న మూడేళ్ల కొత్త కోర్సును మొదటగా టాటా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ - స్కూల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ (టీఐఎస్ఎస్-ఎస్వీఈ) ముంబై క్యాంపస్‌లో ప్రవేశపెడుతున్నారు. ఈ కోర్సుకు సంబంధించిన తొలి బ్యాచ్‌కి 2021 అక్టోబరు నుంచి క్లాసులు ప్రారంభం అవనుంది. కోర్సు పూర్తైన తర్వాత విద్యార్థుల యోగ్యతను బట్టి మారుతి లేదా ఇతర సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. జపాన్ తరహా స్కిల్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో రిటైల్ సెక్టార్లో స్కిల్డ్ వర్కర్లు లభించడం లేదని, అందుకే ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని రుతి సుజూకి ఇండియా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మనోజ్ అగర్వాల్ తెలిపారు. ఈ కోర్సులో జపాన్ తరహా వర్క్ కల్చర్, సాఫ్ట్ స్కిల్స్‌ని మన యూత్‌లో డెవలప్ చేయడం మా లక్ష్యమని ఆయన వివరించారు. చదవండి : ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి కేంద్రం తీపికబురు! -
ఆటో పీఎల్ఐ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ ఆధారిత వాహనాలు (ముందస్తు అనుమతి కలిగిన), అన్ని రకాల ఆటో విడిభాగాల తయారీపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ పథకం) అందుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఆటోమొబైల్ రంగానికి రూ.25,938 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇందుకు సంబంధించి పీఎల్ఐ పథకం కింద రాయితీలు కలి్పంచే నోటిఫికేషన్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం జారీ చేసింది. సైనిక వినియోగానికి సంబంధించిన వాహనాలకూ ఈ పథకం కింద ప్రయోజనాలు లభించనున్నాయి. సీకేడీ/ఎస్కేడీ కిట్లు, ద్విచక్ర, త్రిచక్ర, ప్యాసింజర్, వాణిజ్య, ట్రాక్టర్ల అగ్రిగేట్స్ సబ్సిడీలకు అర్హతగా నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆటోమొబైల్ కంపెనీలతోపాటు.. కొత్త నాన్ ఆటోమోటివ్ పెట్టుబడి సంస్థలూ పథకం కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. ఛాంపియన్ ఓఈఎం, కాంపోనెంట్ చాంఫియన్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే రెండు భాగాల కింద ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఒక గ్రూపు పరిధిలోని కంపెనీలకు మొత్తం ప్రోత్సాహకాల్లో 25 శాతానికి మించకుండా (అంటే రూ.6,485 కోట్లకు మించకుండా) ప్రోత్సాహకాలు లభిస్తాయి. చాంపియన్ ఓఈఎం పథకం కింద విక్రయాలు కనీసం రూ.125 కోట్లుగాను, కాంపోనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద విక్రయాలు కనీసం రూ.25 కోట్లుగాను ఉండాలని ఈ నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది. -
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సెడాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ రంగంలో ఉన్న టాటా మోటార్స్.. ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ సెడాన్‌ను రెండు ట్రిమ్స్, నాలుగు వేరియంట్లలో ఆవిష్కరించింది. ట్రిమ్నుబట్టి 21.5, 16.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డి్రస్టిబ్యూషన్తో ఏబీఎస్ వంటి ఏర్పాటు ఉంది. ఎక్స్‌ప్రెస్–టి 165 మోడల్ ఒకసారి చార్జ్ చేస్తే 165 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఎక్స్‌ప్రెస్–టి 213 మోడల్ 213 కిలోమీటర్లు పరుగెడుతుందని వివరించింది. ధర వేరియంట్‌నుబట్టి ఫేమ్–2 సబ్సిడీ పోను రూ. 9.54 లక్షల నుంచి రూ.10.64 లక్షల వరకు ఉంది. ప్రయాణికుల రవాణా, కార్పొరేట్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఎక్స్‌ప్రెస్–టి రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. -
ఎలక్ట్రిక్‌లోనూ దూసుకెళ్తాం: మారుతీ
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ ఎదుర్కొంటున్న సెమికండక్టర్ల కొరత సమస్య తాత్కాలికమేనని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ అన్నారు. వచ్చే ఏడాది ఇది సమసిపోతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. కంపెనీపై కొరత ప్రభావం స్వల్పమేనని వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా వాటాదారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలోకి ప్రవేశిస్తాం. ధర విషయంలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చినప్పుడు, అలాగే కంపెనీ నష్టపోకుండా ఉన్నప్పుడే ఎంట్రీ ఇస్తాం. సంప్రదాయ కార్ల పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నాం. ఈవీ రంగంలోనూ తొలి స్థానంలో నిలవాలన్నదే మా ధ్యేయం’ అని ఆయన చెప్పారు. -
వాహన తయారీకి తాత్కాలిక బ్రేక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన పరిశ్రమకూ కోవిడ్–19 దెబ్బ పడింది. తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు వైరస్ బారిన పడడం, లాక్డౌన్లతో షోరూంలు మూతపడడం ఈ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరతతో స్టీల్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఇది కాస్తా స్టీల్‌ను ముడి పదార్థంగా వాడే ఆటో విడిభాగాల తయారీ కంపెనీలకు సమస్యగా పరిణమించింది. ఏప్రిల్‌లో స్టీల్ వినియోగం 26 శాతం తగ్గిందంటే పరిస్థితికి అద్దంపడుతోంది. ఇంకేముంది వాహన తయారీ సంస్థలు తాత్కాలికంగా తయారీ ప్లాంట్లను మూసివేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు తయారీని తగ్గించివేస్తున్నాయి. మహారాష్ట్రలో గత నెల తొలి వారంలో లాక్డౌన్ ప్రకటించగానే వాహన పరిశ్రమపై ఒత్తిడి పెరిగింది. క్రమంగా ఇతర రాష్ట్రాలూ లాక్డౌన్లు విధించడంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కష్టాలు చుట్టుముట్టాయి. ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు తయారీ సంస్థలు తెలిపాయి. అయితే షట్‌డౌన్ కాలంలో వార్షిక నిర్వహణ చేపట్టనున్నట్టు కంపెనీలు వెల్లడించాయి. ఒకదాని వెంట ఒకటి.. వాహన తయారీ సంస్థలు ఒకదాని వెంట ఒకటి తాత్కాలికంగా ఉత్పత్తికి విరామం ప్రకటిస్తున్నాయి. మే 1 నుంచి 9 రోజులపాటు హరియాణాలో రెండు, గుజరాత్లో ఒక ప్లాంటును మూసివేస్తున్నట్టు భారత్‌లో ప్యాసింజర్ వెహికల్స్ రంగంలో అగ్రశ్రేణి సంస్థ మారుతి సుజుకీ గత నెల ప్రకటించింది. అయితే వైరస్ ఉధృతి నేపథ్యంలో మే 16 వరకు షట్‌డౌన్ పొడిగిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. వార్షిక నిర్వహణలో భాగంగా జూన్‌లో నాలుగు రోజులపాటు చేపట్టాల్సిన తాత్కాలిక షట్‌డౌన్‌ను మే నెలకు మార్చినట్టు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. తెలంగాణలోని జహీరాబాద్‌తోపాటు చకన్, నాసిక్, కండివాలీ, హరిద్వార్‌లో సంస్థకు తయారీ కేంద్రాలున్నాయి. ఎంజీ మోటార్స్ ఏప్రిల్ 29 నుంచి వారంపాటు గుజరాత్‌లోని హలోల్ ప్లాంటును తాత్కాలికంగా మూసివేసింది. మే 10 నుంచి ఆరు రోజులపాటు చెన్నై ప్లాంటులో తయారీని నిలిపివేస్తున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఏటా ఈ కేంద్రంలో 7.5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం కంపెనీకి ఉంది. ఈ ఫ్యాక్టరీ నుంచి 88 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. హోండా కార్స్ ఇండియా రాజస్తాన్ తయారీ కేంద్రాన్ని మే 7 నుంచి 18 వరకు తాత్కాలికంగా మూసివేసింది. ఏడాదికి ఈ ఫ్యాక్టరీలో 1.8 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. కర్ణాటకలోని రెండు ప్లాంట్లలో ఏప్రిల్ 26 నుంచి మే 14 వరకు మెయింటెనెన్స్ షట్‌డౌన్ చేపట్టనున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ వెల్లడించింది. ఉత్పత్తిని తగ్గించడంతోపాటు మే నెల కార్యకలాపాలను 7–15 రోజులకే పరిమితం చేయనున్నట్టు అశోక్ లేలాండ్ తెలిపింది. టూ వీలర్స్ రంగంలోనూ.. సెకండ్ వేవ్ ముంచుకొచ్చిన కారణంగా టూ వీలర్ షోరూంల వద్ద నిల్వలు పేరుకుపోయినట్టు సమాచారం. కంపెనీని బట్టి 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ద్విచక్ర వాహన తయారీ రంగంలో భారత్‌లో అగ్రశేణి సంస్థ హీరో మోటోకార్ప్ మే 16 వరకు తాత్కాలికంగా తయారీని నిలిపివేసింది. గత నెల చివరి నుంచి కంపెనీ తన ప్లాంట్లలో షట్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తోంది. వీటిలో చిత్తూరు ప్లాంటుతోపాటు హరియాణా, ఉత్తరాఖండ్, రాజస్తాన్, గుజరాత్‌లోని ఆరు కేంద్రాలు ఉన్నాయి. నీమ్రానాలోని గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌తోపాటు ఆర్అండ్డీ ఫెసిలిటీ తలుపులు మూసుకున్నాయి. కంపెనీకి 90 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. రెండవ అతిపెద్ద సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ సైతం ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపేసింది. హరియాణా, రాజస్తాన్, కర్ణాటక, గుజరాత్ ప్లాంట్లలో మే 1 నుంచి మొదలైన షట్‌డౌన్ 15 వరకు కొనసాగనుంది. మే 15 నుంచి రెండు వారాలు తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ ప్లాంట్లలో తయారీకి తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నట్టు యమహా ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ మే 13–16 మధ్య చెన్నైలోని రెండు ప్లాంట్లలో కార్యకలాపాలు ఆపివేస్తున్నట్టు వెల్లడించింది. -
కొత్త ఏడాదిలో రయ్రయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత వాహన పరిశ్రమ 2021–22లో బలమైన వృద్ధి నమోదు చేయనుందని నోమురా రిసర్చ్ ఇన్స్టిట్యూట్ కన్సల్టింగ్, సొల్యూషన్స్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. కోవిడ్–19 కారణంగా ఎదుర్కొన్న తీవ్ర ప్రభావం నుంచి ఈ రంగం కోలుకుంటుందని.. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు తోడవడంతో పరిశ్రమ సానుకూలంగా ఉంటుందని వివరించింది. అయితే వ్యక్తిగత వాహనాల అమ్మకాలు 2018–19 స్థాయికి చేరుకునేది 2022–23లోనే అని స్పష్టం చేసింది. అలాగే ద్విచక్ర వాహనాలకు మరో ఏడాది (2023–24) పట్టొచ్చని నోమురా ప్రతినిధి ఆశిమ్ శర్మ తెలిపారు. కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడంతో కొంత ధరల పెరుగుదలకు అవకాశం ఉండడమూ ఇందుకు కారణమని అన్నారు. సియామ్ లెక్కల ప్రకారం.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. 2019–20లో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 17.88 శాతం తగ్గి 27,73,575 యూనిట్లుగా ఉంది. ద్విచక్ర వాహనాలు 17.76 శాతం తగ్గి 1,74,17,616 యూనిట్లు నమోదైంది. 2018–19లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2.7 శాతం వృద్ధి చెంది 33,77,389 యూనిట్ల స్థాయికి చేరాయి. 2017–18లో ఇది 32,88,581 యూనిట్లుగా ఉంది. 2018–19లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 4.86 శాతం అధికమై 2,11,81,390 యూనిట్లకు చేరుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇది 2,02,00,117 యూనిట్లు నమోదైంది. కొత్త కంపెనీల రాకతో..: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ మెరుగ్గా ఉంటాయని నోమురా వెల్లడించింది. ప్రధానంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఉంటుందని తెలిపింది. కొత్త కంపెనీల రాకతో ఈ విభాగం సానుకూలంగా ఉంటుందని వివరించింది. ఈవీ విడిభాగాల విషయానికి వస్తే.. సాంకేతిక భాగస్వామ్యంతో సెల్ స్థాయి తయారీ భారత్‌లో ప్రారంభం అయింది. లిథియం టైటానియం ఆక్సైడ్ (ఎల్‌టీవో) బ్యాటరీల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంపై కంపెనీలు దృష్టిసారించాయి. ఎల్‌టీవో బ్యాటరీలతో త్వరితగతిన చార్జింగ్ పూర్తి అవుతుంది. 10 వేల సార్లకుపైగా చార్జీ చేయవచ్చు. ఎగుమతి అవకాశాలు.. మోటార్స్, కంట్రోలర్స్ సైతం భారత్‌లో తయారవుతున్నాయి. స్థానిక ఉత్పత్తిదార్లతోపాటు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో విడిభాగాల తయారీలోకి కొత్తవారు ప్రవేశిస్తున్నారు. విడిభాగాలు, బ్యాటరీల తయారీలో ఉన్న దేశీయ వాహన కంపెనీలకు ఎగుమతి అవకాశాలూ పెరగనున్నాయి. వీటి నిరంతర సరఫరా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ప్రత్యామ్నాయ వనరులను కనుగొనే పనిలో ఉన్నాయని నివేదిక గుర్తు చేసింది. -
పుంజుకుంటున్న వాహన రంగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో కుదేలైన వాహన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కోవిడ్‌తో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వాహనాల కొనుగోళ్లు సగానికి సగం పడిపోయాయి. అన్‌లాక్ అమల్లోకి వచ్చాక రెండో త్రైమాసికంలో వాహనాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనాలే మిన్న అని ప్రజలు భావించడంతో మోటార్‌సైకిళ్లు, కార్ల కొనుగోళ్లు రెండో త్రైమాసికంలో బాగా పెరిగాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు)లో రవాణా రంగం ద్వారా రూ.781 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా లాక్‌డౌన్‌తో కేవలం రూ.367 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే.. సగానికి సగం వాహనాల కొనుగోళ్లు పడిపోయాయి. దీంతో ఆదాయం కూడా అదే స్థాయిలో తగ్గిపోయింది. రెండో త్రైమాసికంలో (జూలై నుంచి సెప్టెంబర్ వరకు) రవాణా రంగం ద్వారా రూ.728 కోట్లు రావాల్సి ఉండగా రూ.694 కోట్ల ఆదాయం వచ్చింది. తొలి త్రైమాసికంలో 50 శాతం తిరోగమనంలో ఉండగా రెండో త్రైమాసికంలో తిరోగమనం 30 శాతానికే పరిమితమైంది. ఇక నుంచి ఊపందుకుంటుంది తొలి త్రైమాసికంలో రవాణా రంగం ద్వారా సగానికిపైగా ఆదాయం పడిపోయినప్పటికీ రెండో త్రైమాసికంలో ఆదాయం సాధారణ స్థాయికి వచ్చింది. మిగతా రెండు త్రైమాసికాల్లో అనుకున్న మేరకు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాం. రెండో త్రైమాసికంలో వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు బాగా పెరిగాయి. పండుగల సీజన్ నేపథ్యంలో మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ -
వాహన అమ్మకాలు రివర్స్‌గేర్‌లోనే..
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం రివర్స్‌గేర్‌లోనే పయనిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏకంగా 89% తగ్గుదల నమోదైంది. గతేడాది మే నెల్లో 1,25,552 యూనిట్లను విక్రయించిన ఈ సంస్థ గతనెల్లో 13,888 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. ఇదే విధంగా మిగిలిన కార్ల తయారీ కంపెనీలు కూడా విక్రయాల్లో భారీ తగ్గుదలను ప్రకటించాయి. మరోవైపు ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్ మే నెల అమ్మకాలు 83% శాతం తగ్గిపోగా.. వాణిజ్య వాహన రంగానికి చెందిన అశోక్ లేలాండ్ సైతం 90% క్షీణతను నమోదుచేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఏప్రిల్‌లో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగిన కారణంగా ఆ నెల్లో దాదాపు అన్ని సంస్థలు సున్నా సేల్స్‌ను ప్రకటించడం తెలిసిందే. -
20 లక్షల కోట్లకు వాహన పరిశ్రమ: గడ్కారి
న్యూఢిల్లీ: దేశీ వాహన పరిశ్రమ టర్నోవర్ వచ్చే పదేళ్లలో దాదాపు నాలుగు రెట్లు పెరిగి రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి అంచనా వేశారు. వాహన కంపెనీలు నాణ్యత విషయంలో రాజీపడకుండా, కొత్త ఆవిష్కరణలకు, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇలాంటి చర్యల ద్వారానే ఎగుమతులు పెరుగుతాయన్నారు. ఉపాధి కల్పనకు ఎగుమతుల పెరుగుదల ఆవశ్యకమన్నారు. ఆయన ఇక్కడ జరిగిన ఆటోమొబైల్ కాంపొనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) వార్షిక సమావేశంలో మాట్లాడారు. ‘ప్రస్తుతం వాహన పరిశ్రమ రూ.4.5 లక్షల కోట్లుగా ఉంది. వచ్చే పదేళ్లలో దీన్ని రూ.20 లక్షల కోట్లకు తీసుకెళ్తాం. ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదిగే సత్తా మన పరిశ్రమకు ఉంది’ అని వివరించారు. ముంబై పోర్ట్ ట్రస్ట్ నుంచి గతేడాది 1,58,000 వాహనాల ఎగుమతి జరిగిందని, ఈ ఏడాది వీటి సంఖ్య 2 లక్షల వరకు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దేశంలో జల రవాణాను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. -
చెన్నై వాహన పరిశ్రమ కుదేలు
భారీ వర్షాలతో ప్లాంట్లను మూసేసిన పలు కంపెనీలు చెన్నై: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై ఆటోమొబైల్ కంపెనీలు నెల కాలవ్యవధిలో రెండవసారి ప్లాంట్లను మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చెన్నైలో ప్లాంట్లను కలిగి ఉన్న ఫోర్డ్, నిస్సాన్, టీవీఎస్, హ్యుందాయ్, రెనో-నిస్సాన్, అశోక్ లే లాండ్ వంటి కంపెనీల్లో కొన్ని ఇప్పటికే వాటి ప్లాంట్లను మూసివేశాయి. ఫోర్డ్ కంపెనీ తన 3.4 లక్షల ఇంజిన్ల, 2 లక్షల వార్షిక వాహన ఉత్పత్తి సామర్థాన్ని కలిగిన ప్లాంటును ఇప్పటికే మూసివేసింది. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల వల్ల చాలా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయని, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని చెన్నైలోని తమ అసెంబ్లింగ్, ఇంజిన్ ప్లాంటులో ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని ఫోర్డ్ కంపెనీ బుధవారం వెల్లడించింది.పరిస్థితులను పరిశీలిస్తున్నామని, అవి మెరుగుపడ్డాకాకార్యకలాపాలను పునఃప్రారంభిస్తామని తెలిపింది. వర్షం ప్రభావం తమ ప్లాంట్లు, కార్యాలయాలు, ఉద్యోగులు, లాజిస్టిక్స్, సప్లై చైన్స్ విభాగాలపై పడిందని రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది. దీని వల్ల తిరువోత్తుయుర్, ఒరగాడం ప్రాంతాల్లోని ప్లాంట్లను డిసెంబర్ 1 నుంచి మూసివేశామని రాయల్ ఎన్ఫీల్డ్ అధికార ప్రతినిధి తెలిపారు. హ్యుందాయ్, ఫోర్డ్, రెనో కంపెనీలుబుధవారం వాటి కార్యాలయాలను, ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేశాయి. చెన్నై పెట్రో రిఫైనరీ మూసివేత... అలాగే వర్షం వల్ల ఒర గాడంలోని తన ప్లాంటులో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అపోలో టైర్స్ తెలిపింది. ఉత్పత్తి నష్టం దాదాపుగా 450 మిలియన్ టన్నులుగా ఉండొచ్చని అంచనా వేసింది. వర్షం దెబ్బతో చెన్నై పెట్రోలియం కార్ప్ 10.5 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగిన తన మనాలి చమురు రిఫైనరీని మూసివేసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఐటీ కంపెనీలు కూడా వాటి కార్యాలయాలను మూసివేశాయి. వాహన విక్రయాలు తగ్గొచ్చు! వర్షం కారణంగా రానున్న కాలంలో చెన్నై ఆధారిత వాహన కంపెనీల విక్రయాలు తగ్గే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘గత మూడు వారాల నుంచి కురుస్తున్న వర్షాలు.. ఆటో కంపెనీల ఉత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి’ అని టీవీఎస్ మోటార్స్ తెలిపింది. ఈ వ ర్షాల కారణంగా తమ విక్రయాలు 15,000 యూని ట్లు తగ్గాయని భావిస్తోంది. ఇతర వాహన కంపెనీలతో సహా ప్రస్తుత వర్షాల ప్రభావం టీవీఎస్ మోటార్స్ దేశీ విక్రయాలపై, ఎగుమతులపై కచ్చితంగా ఉంటుందని డెస్టిమోనీ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ సుదీప్ తెలిపారు. హ్యుందాయ్ కంపెనీపై అధిక ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. చెన్నైలో ప్లాంట్లను కలిగిన రాయల్ ఎన్ఫీల్డ్, హ్యుందాయ్, రెనో, ఫోర్డ్ వంటి ఆటో కంపెనీల ఉత్పత్తి సామర్థ్యంపై వర్షపు ప్రభావం ప్రతికూలంగా ఉంటుందని నోమురా పేర్కొంది.